Uncategorized

పేరులేని కవిత

ఎవడ్రా అదిచార్మినార్ మొదట్లో మతోన్మాదాన్ని
మందుపాతరలా మార్చి గుడికడతానంది.

ఏ నా కుమారుడు
ఫేసుపుస్తకంలో నొరువిప్పితే గొంతునొక్కుతానని కూసింది.

చలికి గడగడలాడుతున్న వేళళ్ళో కూడా
మాటల చలిమంటలతో రక్తాన్ని మరిగిస్తున్నవాడెవడు.

దశాబ్దాలు దాటినా అన్నముద్దముట్టకుండా
ఓ ఆడకూతురు నోరుకట్టుకునే వుంటే
సాయుధబలగాల కవాతుల్ని మానాల మీదుగా చేయిస్తున్నదెవడు.

జనాల మెడలో వెర్రివాళ్లనే బోర్డుతగిలించి
తాయిలాల బిచ్చమేస్తున్న పిచ్చినాకొడుకెవడురా.

దేశమంటే కుక్కలు చింపిన విస్తరని చిత్రిస్తున్నదెవడు.
పెద్దల సభలో పిచ్చమాటలతో జుట్లు పీక్కుంటున్న వాడినిలా లాక్కురా.

దేహమంటే బ్లడ్డు కాదోయ్ దేహమంటే డబ్బులోయ్ అన్న బడుద్దాయిలింతమందెలా బయటతిరుగుతున్నారు.
దేహమంతా ముళ్ళుదింపి అందమైన కలలు కనమనే కంకాళమెక్కడినుండి దిగిందిక్కడికి.

పనిలో కందెనగా ధనాన్ని వాడుతున్న వెధవలకు గులాంగిరీ చేస్తున్నదెవడు.
మదిలో కందిరీగ చిత్తకార్తె రాగాలతో ఆమ్లాన్ని అందుకుని తిరుగుతున్న మందబుద్దుడెవడు.

ఎవడురా వాడెవడురా..
ప్రతిచోటా పిచ్చిమొక్కలా తనని పాతుకుని. చెత్తకుప్పలా పెరుగుతున్నవాడెవడురా.
ఎవడురా వాడెవడురా.
చెత్తకుప్పలో కాగితంలా లెక్కలేకుండా తిరుగుతూ వీధులన్నీ ఖరాబుచేస్తోందెవడురా.

ప్లాస్టిక్ బూతాన్ని వదిలి తన దగ్గరి శ్మశానాన్ని అంతటా విస్తరిస్తూ వికృతంగా నవ్వేదెవడురా
ముందుపళ్లు రాలగొట్టినా ముందుగా తయారు చేసిన రికార్డులు దాచిందెవడురా.

ఎవడు వాడెవడు
అవును అదినువ్వా లేక నేనేనా.
నిద్రలో లేచే అలవాటులా సమాజంలో తిరగాడేది ఇలాగేననే మగతలో
నీకే తెలియని నీ ఆత్మ తిరుగాడుతోందా. అదే నిజమని బలంగా రాసుకుంటోందా.
ఎవడ్రా వాడెవడ్రా దీన్నసలు మార్చనేలేం అన్నవాడెవడురా?

మాడ్ మై సన్
మీ డాడీ వాళ్ళడాడీలకు లేని దురద నీకెందుకురా ?
ధీఫ్ మై సన్స్ దేశం మొత్తం తిరుగాడుతుంటే
ఏవేవో ఉటోపియాలను దాచేందుకు బీరువాలను వెతుకుతున్నది మాత్రం నేనేనా.
అవును అది నేనూ నువ్వు కూడానా.
గుండెల్లో దాచిన మంట, నలుగురిలో చితుకులు పేర్చి మండిద్దాం రా.
అరే నిన్నేరా …
నాలాగే గొంతు నొక్కుకుని పెన్నుసరిచేసుకుంటున్న నిన్నే
నేను స్పేహ హస్తం చాసి పిలుస్తోంది.
కొవ్వు, కొలెస్టరాలే కాకుండా గుండెల్లో కొంచెం దమ్ముకూడా వుందా.
అయితే రా..
లేచిరా

*26-11-2012

http://www.facebook.com/groups/kavisangamam/permalink/474981649221259/

Standard
Mattivellu

మట్టివేళ్ళు-మన కట్టా (పుస్తక సమీక్ష) – నందకిషోర్

తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాదిపరిమళించే మనసుంటే తోటి మనుషులు సీతాకోకలై పక్కన చేరుతారనుకుంటా.నిన్న కట్టా శ్రీనివాస్‌ని చూస్తే అదే అనిపించింది. నా మట్టివేళ్ళు అక్కడే ఉన్నాయని,పుస్తకాన్ని అక్కడే ఆవిష్కరించుకుంటానని పట్టుబడ్తే ముందు కాస్త నవ్వుకున్నాంగాని అక్కడికెళ్ళాకే తెలిసింది అతని వేళ్ళు ఆ మట్టిలో ఎంత లోతుగా పాతుకున్నాయో.

సభలో మట్టివేళ్ళ గురించి నన్ను మాట్లాడమంటే మూడే ముక్కలు మాట్లాడాను.నిజం. అర్ధంకాని వచనాల్ని పేర్చి abstract అని చెప్పుకు తిరిగేవాడైతే బహుశా అంత సుళువుగా
చెప్పలేకపోయేవాన్నేమో. కవి గురించి కూడా ఎక్కువగా చెప్పలేదు.. కానీ,రెండూ- ఒకసారి ప్రయత్నిస్తాను.
తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాది.ఊహాతీత ఇమేజరీతో ఇబ్బందిపెట్టడు.ఇబ్బందిపడడు.titleకి సరిపడేలా చెప్పాలంటే మట్టిపరిమళం గుండెల్లోనే దాచుకుని,పచ్చటి చెట్టుగా ఎదుగుతూ వచ్చినవాడు కట్టా.నువ్వొక పచ్చని చెట్టువైతే–తర్వాతేం జరుగుతుందో మనకి తెలిసిందే.. 🙂 సరదాగా గుర్తుచేస్తున్నాగాని,నిజమదే.బహుశా ఆ నిబద్దత,నిగర్విగా ఉండగల జ్ఞానమే అతని శాఖా బాహువుల్లోకి అన్ని పిట్టలు వచ్చేలా చేస్కుంది. ఈ చెట్టుకి ఉన్న మరో అదృష్టమేమంటే ఇతడు కాంతిని ఆవహించుకోగలడు.ఆవాహన అని ఎందుకంటున్నా అంటే నీడల్లో పెరుగుతున్నప్పుడు, తిరుగుతున్నపుడు కూడా తన జీవనానికి సరిపడా కాంతిని భాధ్యతగా సంపాదించుకోగల శక్తి అతని స్వంతం.
తన 67 కవితల సంకలనంలో చాలా విషయాల్నే స్పృశించాడు కట్టా..
స్నేహం,సమాజం,దాంపత్యం,దారిద్ర్యం,థెరిస్సా,ఇస్మాయిల్…అన్నింటిని వృత్త బిందువులనుకుంటే, వాటి కేంద్రం మాత్రం అన్నిట్లో సమాంతరంగా పరావర్తనమైన మనిషితనం. ఆ ఒక్కటి వ్యక్తిగాను,కవిగాను అతడెప్పుడు మరిచిపోనందుకు అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.అతని కవిత్వంలో శైలి,శిల్పాల గురించి వ్యాఖ్యానించడానికి సరిపడా సాహిత్యానుభవం నాకు లేదు.నాల్గో,ఐదో పుస్తకాలు తప్ప ఏమి చదవనందుకు అర్హత ప్రశ్నార్ధకమే.కానీ ఆలోచన్నో,ఆస్వాదన్నో ఏదో ఒకదాన్నైనా తృప్తిచెందించే విషయ సమాహారమే అవసరమైన సాహిత్యమనుకునే నాకు, అతని ప్రయత్నం చూసి సంతోషమనిపించింది.
ఇకపోతే- తర్కశాస్త్ర పరిచయంవల్లనో,గట్టిగా శబ్దించే పదాలమీద ఇష్టంవల్లనో తెలీదుగాని,అరుదుగానే అయినా అక్కడక్కడా ఒకటో రెండో సంస్కృత పదాలు దొర్లడం..తను ఈ మధ్య రాసినవి ఇంకా బాగున్నాయని చెపుతున్నా ఫిక్స్ అయిపోయిన పేజిల సంఖ్యలో మార్పులు చేయకపోవడం కట్టాపై నాకున్న కంప్లైంట్స్.సామాజికతని సబ్జెక్ట్‌గా చేసుకున్నవాటిలో మాత్రం వ్యక్తిగా కట్టా ఏంటో తెలుసు కాబట్టి ఫస్ట్ పర్సన్లో చెప్పకపోవడం ప్రాధామ్యంగా తోచలేదు. మనమెలా ఉంటున్నామనేదే తన ప్రశ్నల ఆంతర్యంగా అర్ధంచేస్కుంటే సబబుగా ఉంటుంది.సో ఆ విషయంలో నో కంప్లైంట్స్. అపరిచితుడు,చంద్రముఖి తన పదాల్లోకి వచ్చెళ్ళిపోచడం బోనస్సేనేమో.. 🙂
మనుషులం దీవులమంటు,మనల్ని మనమే ఆవిష్కరించుకోవాలంటు మొదలైన సంకలనం మనం చెయ్యాల్సింది పనే పనే పనే అనే ముగింపు వాక్యాల్తో,(నాలాగ నిద్రపోయేవాళ్ళకి కొంచెం కోపం తెప్పిస్తూ) అయిపోతుంది.”ఇంకా- చిర్నవ్వుతో ఇద్దరు శత్రువులు తమ శత్రువునెలా చంపారో,కిరీటం పెద్దదైతే తలకేమవుతుందో,సరళాలు పరుషాలెలా అవుతాయో” ఇత్యాది గమ్మత్తులన్ని బుక్ చేతికొచ్చాక చదివేయండి..
చివరగా ఒక్క మాట.అక్కడి సాహితీమితృలందరు అతన్ని గుర్తుంచుకున్న కారణాలు,స్పందించిన తీరు చూస్తే చాలా ముచ్చటేసింది.అందులో కేవలం సాహిత్య ప్రియత్వమే లేదు.అభిమానం,ప్రేమ అక్కడ నిశ్శబ్ధంగా ప్రవహించాయ్. బహుశా వ్యక్తీకరించడం కంటే వ్యక్తిత్వానికున్న శక్తి గొప్పదనుకుంటా!

Standard
Uncategorized

మట్టివేళ్ళు కవిత్వం కినిగే లో అందుబాటులో వుంది

మట్టివేళ్ళు On Kinige

యుద్ధాల మధ్య అస్తిత్వవేదనకి సున్నితత్వమూ, గరుకుదనమూ వొక్కలాగానే వుంటాయి. అందులోంచి పుట్టే కవిత్వవాక్యాలు ఎంత సున్నితంగా వుంటాయో, అంత గరుకుగానూ వుంటాయి. అనుభవం కన్నా పెద్ద యుద్ధరంగం లేదు. వాస్తవంలో రోజూవారీ జీవితం వొక ప్రపంచ యుద్ధమే. ప్రతీ వ్యక్తి ప్రపంచంతో తనదయిన యుద్ధం చెయ్యాల్సిందే. శ్రీనివాస్ ఈ సంపుటిలో చూపిస్తున్నవి నిజంగా కొన్ని Snapshots. అందులోంచి మనకు మనమే కనిపిస్తాం ఏదో వొక రూపంగా.
వాస్తవికతని ఎలాంటి ముసుగులూ లేకుండా వాస్తవికతగా చూసే దృష్టి శ్రీనివాస్‌కి వుందని ఇందులోని ప్రతి కవితా మనకి చెబ్తుంది. ఇప్పుడు తెలుగు సాహిత్యం, ప్రధానంగా కవిత్వం వున్న స్థితిలో ఇది ఆరోగ్యకరమైన విషయం. తెలుగు కవులు ఏదో వొక మూసవాద ఉరవడిలో కొట్టుకుపోతూ వాస్తవికతకి దూరమవుతున్నారు. వాదాల పాక్షికత్వంలోని ఉద్వేగం వాళ్ళ వ్యక్తిత్వాల్ని మింగేస్తోంది. శ్రీనివాస్ అలాంటి ప్రమాదంలో లేడు. తనేమిటో, ఈ కవిత్వం పటం మీద తనెక్కడున్నాడో వొక ఎరుకతో శ్రీనివాస్ రాస్తున్నాడు. అలాగే వాస్తవికతని తొందరపడి బేరీజు వెయ్యాలన్న ఆరాటం అతనికి లేదు. శ్రీనివాస్ వ్యక్తిత్వంలో వొక్ నెమ్మదితనం, వొక ప్రశాంతత వున్నాయి. అవి ఇప్పటి కవిలోకంలో నిజంగా అరుదే!
– అఫ్సర్


Standard
Uncategorized

ప్రేమగీతం పాడలనుంది

మృదువైన మనిద్దరి ప్రేమఎదిగేందుకు దోహదమవుతుంది.
మతిచెదిరి ముదిరిన ఏకపక్ష కాంక్షాపూరిత వ్యామోహపు ప్రేమ(?)
విద్వంసకారకమై దశదికలూ వికలశకలాలుగా చేసి విహరిస్తుంది.

నాతోనీవూ నీతో నేనూ అనుకుంటే తోడూ నీడ
నాకే నీవు నాకే నేనూ అనుకుంటూ వింత పీడ

నచ్చిన దానిని పెంచుకుంటూ నచ్చకుంటే తొలగుతుంటే పయనం.
నచ్చితే ఆక్రమణకై దేనినైనా అతిక్రమిస్తూ
నచ్చకుంటే ప్రతిదాన్నీ పరిహరించాలనుకుంటే హననం.

పువ్వులు పదిలంగా పొదువుకునే వేళ
ఆమ్లాన్ని విదిలించి బెదిరిస్తున్న హేళ
చర్చల నావాలలో తీరాలను చేరుకోలేక
రచ్చకెక్కిన వాదాలతో ప్రాణాలను మునకేయిస్తున్న వేళ
లొగొంతుకలో పాడుతున్న ఈ పాట నిజంగా నీ మనసులో ప్రతిధ్వనిస్తుందో లేదో.

Standard
Uncategorized

ఫోటోకు కొన్ని ఫెంటోలు

మొట్లెక్కలేని భావితరం
పొట్టగడవని తనం
…………………………….
ఆకలిఅరిస్తే నిద్రేనయం.
ఇక లేస్తామో లేదో మరో భయం.
………………………………
భాదని చీకటి లాగేస్తోంది.
అమ్మో లేస్తే ఆకలి తాగేస్తుంది.
…………………………….
వెలుగుల వేళలో
ఆకలి తీరని చీకటి జోల ,
………………………………
పట్టుపరుపులొద్దు
పట్టెడన్నం చాలు.
……………………………..

చీకటి మూలల్లో మౌనంగా కరుగుతున్న బాల్యం.
……………………………….

**** క్షమించు*****
అమ్మనౌతా, నాన్ననీ నేనౌతా
అన్నాన్నే కాలేకపోయానురా చిన్నా.

………………………………
లోకమంతా నాకై లేకున్నా
నీకు మాత్రం నేనున్నానురా చిన్నా.……………………………………………….

Standard