Mattivellu

గుండె చప్పుళ్ళు మట్టివేళ్లు – నియోగి

తన అనుభవాలను, తనవారి అనుభవాలు, విన్నవి, కన్నవి అన్నీ కవికాలపు విషయాలే. నిశ్శబ్దంలోనో, స్థబ్ధతలోనూ మునిగి పోతే కవి కాలేడు. కవి కావడానికి హృదయాంతర లోకాల్లో ఒక అలజడి కావాలి. ఆలోచనా పరిధి విస్తరించాలి. అక్షరాల కూర్పు తెలిసి వుండాలి. అవన్నీ నిండుగా వున్నప్పుడు తాను చెప్పదలచుకున్నదేమిటో అర్థమౌతుంది. అలా కానప్పుడు కవి రాసిన దాంట్లో ఏముందో తెలియక, అర్థం కాక ఆ యెక్క కవిత వ్యర్ధంగా మిగిలి పోతుంది. అయితే కొందరు తమ ఆనందం కోసం ఏవేవో రాసుకుంటారు. అది కేవలం వారికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల ఎవరూ ఏ రసానందాన్ని పొందలేరు. కానీ ఇక్కడ కట్టా శ్రీనివాస్ అందించిన మట్టివేళ్ళలో కొన్ని కవితలు మనకు సంబంధించినవేననిపిస్తుంది. కొన్ని సమాజపు రుగ్మతల్ని ఎత్తి చూపిస్తాయి. ఇలా ీ కవితా సంపుటి లోని కవితలన్నింటిలోను అనుకున్న దాన్ని ఖచ్చితంగా చెప్పగలిగాడు కట్టా శ్రీనివాస్.

‘‘నేనెలా మారాలి? ’’ అనే కవితలో
సరదాగా సిన్మాకెళదాం అంటావు/ పాడు పర్సుముక్కును పైకిలేపి/ నాలుక కనపడేలా వెవ్వెవ్వె అంటే/ ఉక్రోషంతో/ నీవ్వోండిన కూరలో/ ఉల్లిపాయెందుకు వేసావని/ కొత్తగా కొన్న గాజు కూజా/ పగులగొట్టి పార్కులో కెల్తా / సిగరెట్లతో…
ఇది లేమిలో వున్నపుడు ఏమీ చేయలేక భార్యపై అసహనం ప్రదర్శించడాన్ని చూసిస్తాడు.
ఇందులోనే మరోచోట
తలుపుతీస్తూ కళ్ళతోనన్నా ఈసడిస్తావని నే సిద్దమైతే / తప్పు చేసిన తనంతో/ నేలను చూసే కంట్లో నీళ్ళతో నీవు/ పాత రిజర్వాయరులా భళ్ళున / పగిలే గుండెనుంచి/ నీ కాళ్ళైనా తనివితీరా / కడగాలనుకుంటా…
అంటాడు.
ఇందులో చేసిన తప్పుకు పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇటువంటివి మధ్యతరగతి కుటుంబాల్లో సహజం. దాన్ని చెప్పడంలో కట్లా శ్రీనివాస్ కి మధ్య తరగతి జీవుల జీవనం సంపూర్ణంగా తెలుసని మనకు తెలుస్తుంది.
అలాగే ‘‘నవ్వే నక్షత్రాలు’’ అనే కవితా ఖండికలో ఋతువులు తప్పిపోయాయి/ కాంక్రీటు అరణ్యంలో/ లోహ విహంగాల పరుగులకు భయపడి / ఎరువుల తిండి వికటించి / నకిలీ వైద్యంతో నలిగి పోయి / దిక్కు తోచక వెబ్ సైట్ల బైట్లకి గురైనట్లున్నాయి. అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఈ కవితా సంపుటిలో 67 కవితలున్నాయి. అవి వేటికవే ప్రత్యేకత కల్గి చదివించే విధంగా వున్నాయి. మొదటి ప్రయత్నంలోనే కట్టా శ్రీనివాస్ ఒక మంచి పుస్తకంతో ముందుకు రావడం అభినందనీయం.

పేజీలు : 105 వెల : 90రూపాయిలు
ప్రతులు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం.

Standard
Mattivellu

మట్టివేళ్లూ – మా శ్రీనివాసరావూ – ( సమీక్ష) – కాశి రాజు


“ఒక మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిదైతే ,ఒక మంచి మిత్రుడు మంచి పుస్తకం వంటివాడే “ ఈ వాక్యాలు మిత్రుడు మట్టివేళ్లు శ్రీనివాసరావు కోసమే ! మాది అంతర్జాల ప్రేమ , మా ప్రేమ పరాకాష్టకు చేరి స్నేహమైన సందర్భం లో కలిశాం మేము. తన మాటల్లోని ప్రత్యేకత మెల్లగా పెనవేసుకుంది నన్ను , నాకే కాదు ఆ మాటలు అందరికీ ప్రత్యేకతను పరిచయం చేస్తాయి. అంతటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం అతనిది. తను ఇటీవల రాసిన మట్టివేళ్లు బహుశా పూర్తిగా ఈ సమాజంలో పాతుకుపోవాలనే ఆశతో మొదలిపెట్టు ఉంటాడు.అది చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి , మానవీయత, నాయకత్వ లక్షణాలే కాదు , ఆవేశాలు,పరకాయ ప్రవేశాలు,సందేహాలు, సందేశాలు కూడా కనిపిస్తాయి , కాలాతీత గమనం కవితలో 


పలకరింపులు లేనంతనే
పరిచయాలు ఆగిపోవు
జ్ఞాపకాలు లేకపోతేనే
ఆవికాస్తా ముగింపుకొస్తాయని
”సున్నితమైన పరిశీలన మనముందుంచుతారు , చిరునవ్వుల బాణాలు విసిరి శత్రుత్వాన్ని హత్యచేసి హంతకుడై కనిపిస్తాడు “హత్య” కవితలో

తెగిన దారాన్ని
పగిలిన అద్దాన్ని
అతికిద్దామని
మాటల మైనం ఎంత పూసినా
ఆవేశపు శకలాలు
వైవిద్యపు ఆవిర్లు చిమ్మితే
మైనం, కాలం వృదా,వృదా
అంటూ ప్రయోజనంలేని “ప్రయాస” దండగని చెబుతాడు.

ఒకరి గురించి ఒకరు అంచనా వేయడం అంత సులువుకాదు, ఎవరిని ఎంత చదివినా కొంత మిగిలే ఉంటారేమీ అని ఆయన అభిప్రాయం , పూర్తిగా తెలుసుకోవడం ఎవరివల్లా కాదుగానీ తెలిసిన మట్టుకు వెల్లడి చేయమంటాడు,కొలతలకొక పరికరం ఉంటే కుదిరితే తెచ్చుకో అంటాడు,కానీ ఒక్కమాట నాక్కూడా చెప్పు అంటాడు . ఎప్పుడో జరిగే హానిని ఏమాత్రం నివారించలేనపుడు అప్పటివరకూ ఉన్న అనాయాచిత హాయిని ఆందోళనతో ఆహూతవ్వడమెండుకు ? ప్రయత్నం మాన్పించే ఆందోళనకంటే అమాయకత్వమే కొంత మేలని తన “దూరదృష్టి “ కవితని మన దగ్గరుంచుతాడు .మనుసులపై పెంచుకున్న అభిమానాన్ని మనసు పొరల్లోంచి తవ్వి తీసి ముందుపరుస్తాడాయన.

ఆయనెవరో కనీసం కరచాలనం చేసెరగను
తన కవిత్వాన్ని ఏ కొంచెమో
తెలిసీ తిలియని నాలుకతో చప్పరించి ఉంటా

పచ్చని అక్షరాల శరీరంతో , ఎర్రటి సంతకాల ముక్కున్న వాత్సల్యపు చిలుక పలకరిస్తే పులకించిపోయానని , గౌరవనీయులైన తాతగారూ మిమ్మల్నొకసారి చూసి ఉంటే ఎంతబాగుండునో అని ఇస్మాయిల్ గారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు . అలాగే భూమిపుత్రుడి బతుకునీ, ఆ బతుకు బలైన తీరుని ప్రభుత్వాసాయం చేరక,
మల్లోకసారి ఆత్మహత్య చేసుకునే అవకాశమూ లేదు
చేసుకోకుండా సొంతోల్లని ఆపే శక్తీ లేదు
ఛీ……… పాడు బతుక్కి
చచ్చిసైతం సుఖం లేదు
“ అంటూ జీవం లేని రైతుగా మనకు కనిపిస్తాడు .
సమాక్య ప్రభుత్వమంత శక్యతతో చరించాలంటే
సమరధికి తగుస్థానం ఇవ్వాల్సిందే
అతిరధులమనుకునే వారంతా
అర్దరతులైతే సమర్ధులౌతారని
గ్రహించాల్సిందే మరి
“.
ఇంట్లోకి ఓ టి.వి.కొందాం
విడివిడిగా రెండు రిమోట్లు అమ్ముతారేమో కనుక్కోవాలి మరి “ అంటూ అర్దనారీశ్వరతత్వాన్ని ఆకలింఫు చేసుకున్న అన్యోన్యత కవితా మనకు కనిపిస్తుంది .అది కూడా చాలదన్నట్లు పరకాయ ప్రవేశం చేసి చూపిస్తాడు

కుండలోని ఎదురుచూపుల్ని
కంచం లోకి వడ్డిస్తే
కాలైనా కడుక్కోకుండా
కన్నీళ్లను జుర్రుకునే
తాగుబోతు బర్తని ,వాడి కార్యాచరణని కళ్ళముందుంచుతాడు.దిండు మడతల్లో దాచుకున్న మొహంలో పక్కకు తిరిగి పడుకున్న నా నడుంమడతల గుండా రోకలిబండ పురుగులు నాలోపలికి పాకుతుంటాయి
రోకలిబండ పెదాల పురుగొకటి మెడవంపులో మరీ మరీ గుచ్చుకుంటూ ఉంటుంద
ని ఒక ఆవేదనను అందరికీ అర్దమయ్యేటట్టు వ్యక్తపరుస్తాడు .ఈ రచయితదెంత పరిశీలనంటే నాకో గమనింపు ఉంది , వేళ్ళెప్పుడూ నేలలోనే ఉండాలని
“ఆదారమేకాదు , ఆహారమూ అక్కడే
” అని తన మట్టి వెళ్ళు కవితలో అంటాడు పనియే దైవమని ఎంతమంది చదివి ఉంటాం , ఆ సామెతను ఎన్ని విదాలుగా చెప్పడో కర్మణ్యేవాధికారాస్తే మాఫలేసు కధాచనా కవితలో చూడొచ్చు.

మిత్రపొత్తం,చీకటిల్లు , కాలం చెల్లిన పాటలు , పండిత చర్చ , ఇలా ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నదే అవన్నీ కవితలే అని ఆయనో లేక నేనో చెప్పను.కానీ ప్రతీ సందర్భంలోనూ ఏదో ఒక అంశాన్ని పంచుకోవాలనేది ఆయన ఆతృత. అది మట్టివేళ్ళు(కట్టా వేళ్ళు) చదివితే కచ్చితంగా అర్దమవుతుంది . పుస్తకం గురించో రచయిత గురించో రాశానని కాదుగానీ నాకో అభి ప్రాయం ఉంది అది నేను పంచుకుందామని నా ఆశ

“ప్రతీ వ్యక్తీ ఒక పుస్తకం , ప్రతీ పుస్తకం ఒక వ్యక్తే “ అందుకే వ్యక్తినీ, పుస్తకాన్ని చదవాలి వీలయితే చదివించాలి
– –కాశీరాజు (9701075118)

మట్టివేళ్లు
కవి :కట్టా శ్రీనివాస్ (9885133969)
ముఖచిత్రం: సుధాకార్ 
అంతర చిత్రాలు: పల్లం పిచ్చయ్య 
పేజీలు:105
ధర:90

  • Katta Srinivas కాశీ నీ ఆత్మీయత కట్టిపడేసింది. పుస్తకాన్ని అచ్చొత్తుకున్నాక వచ్చే పురిటి వైరాగ్యాలను పటాపంచలు చేసేలా. ఒక ఆలోచన వదిలితే ఎక్కడైన కనీసం ఒక్క వత్తి వెలుగుతుంది ఏదో రోజు ఆ వెలుతురు నీక్కూడా దారిచూపిస్తుంది. అనేది నిజమేనేమో అనిపించింది. నేను పట్టించుకున్నానని అక్షరాలతో చెప్పటం మరింత సంతోషం కలిగించింది. ధాంక్యూ వెరీ మచ్ కాశీ..
    ఆత్మీయ పరామర్శకు అభివందనం..
  • Kavi Yakoob Very good poetry appreciation Kasi Raju!
  • Padma Sreeram పుస్తకం వ్రాయడం ఒక తపస్సైతే…. ఆ తపః ఫలమిలాంటి స్పందనలని … సమాజానికి కవులెంత అవసరమో…ఒక నిక్కచ్చి..నిఖార్సైన చదువరీ అంతే అవసరమని అవగతమైన క్షణమిది…కాశీరాజ్ జీ….నమో నమః…
  • Jyothirmayi Malla నువ్వు రాసిన మాటలు చవుతూంటే ఎంతతొందరగా కట్టా తమ్ముడి మట్టివేళ్ళు పుస్తకం చదివేద్దామా అనిపించింది కాశీ! గొప్ప శీర్షికతో చక్కటి కవిత్వాన్ని అందించిన కట్టా తమ్ముడికీ, అందమైన అభిప్రాయాన్నందించిన నీకూ అభినందనలు
  • Kranthi Srinivasa Rao కాశీ …నీవు వచనం అదరగొడుతున్నావు ….మట్టివేళ్ళ …మజా మొత్తం విప్పిచూపావు …బాగారాసావు …సారం పిండావు …నేనూ చదివాను కానీ నీలా విశ్లేషించలేను …..ధన్యవాదాలు

Standard
Uncategorized

ఎందుకోసం ఇవన్నీ ???

పార్కుకో, పనిలేని చోటుకో వెళ్ళటంలో
నీకున్న సంతోషమేంటని అడిగాడో పెద్దన్నయ్య.
ఆలోచనలను ఊయలలూపుకుంటూ ప్రయాణిస్తున్న ఒకరోజు

టిక్కెట్టుకి డబ్బుల్ని,
మిగుల్చుకున్న సమయాన్ని తగలేసి
రికామీగా తిరిగొస్తే నీకేమోస్తుందని
తనడగలేదు నాకే అనువాదమయ్యింది.

ఓ క్షణం మౌనం తర్వాత నోరిప్పాను.
రోజంతటి పరుగులతో
మనసులో పేనుకున్న ఒత్తిడి చెత్తతో
మత్తుగా జోగుతున్న నా కళ్లు.
శుభ్రమైన విశాల ప్రాంగణంలో
మెత్తగా విచ్చుకుంటాయి.

కంటిచూపు దూరాలలోకి
వెలుతురులా ప్రసరిస్తుందేమో అనుకునే లోగానే.
ఆ ఖాళీతనం ఆలస్యం చేయకుండా లోపలికి ప్రవహించి నిండుకుంటుంది.
ఒక్కసారి లోపల స్కాన్ చేసుకుని
వ్యర్ధాలను డీబగ్ చేసేస్తుంది.

నాలోపలికి నేను చూసుకునే ఖాళీనేర్పరుస్తుంది.
నాతోనేను ప్రవహించే అవకాశమిస్తుంది.
కళ్ళెటు చూస్తున్నాయో మర్చిపోయి
లోపటి చీకట్లోకి వెలుగులా చూస్తున్నప్పుడు
శరీరం తేలికవుతున్న సంగతికూడా స్పృహలోకి రానంతగా
నిశ్చేష్టుడినవుతుంటాను.

ఇదంతా చేస్తున్నది పార్కో ప్రకృతో నాకైతే తెలీదుకానీ
ఆ మాత్రకు బానిసయ్యే వెళుతున్నానని
చెప్పేసాను అడిగిన ప్రశ్నకు సమాధానంగా…

అంతకంటే నాముందు ప్రశ్నను
తను ఉటంకించాడు.
కవిత్వమూ అదే చేస్తోందని
కాంతిలా తనే వెంటాడుతోందని
తనకే కాదు మరోక్కరికైనా వెలుగోదారి చూపిస్తే చాలని
ముక్తాయించాడు.
నిజమేనేమో అందుకే తనునాకు అన్నయ్య..

http://www.facebook.com/groups/kavisangamam/permalink/488492864536804/

Standard
telugu poetry

శుభ్రశీలి

అతడొక్క ఈల వేస్తే
వీధిలోని ఆడోళ్ళంతా ఒక్కనిమిషం ఆగరు.
మూలనున్నదంతా స(పో)గేసుకుని
మూకుమ్మడిగా చుట్టుముడతారు.

బ్యుటీషియన్ కోర్సేం చెయ్యలేదు కానీ
బ్యూటిఫికేషన్ లో మాత్రం ముందుంటాడు.

తత్వం తెలుసోలేదో
జీవనవ్యర్ధాలనెపుడూ
దూరానుంచమనే సత్యాన్ని
ఆచరించి చూపెడుతుంటాడు.

మనం వొంపినింపుతున్న మురికిగుండా
అతని బావాలేవీ బయటికి కనిపించవు.
అయినా బతుకెంత భారమో చెప్తున్నట్లు
తనబండి లాగుతుంటాడు.

.

Standard
telugu poetry

ఇష్ట సమయాలు

చల్లని సాయంత్రం
తాత్వికుడైన ఓ కవి సాన్నిహిత్యంలో
గొంతులోగుండా గుండెల్లోకి
ప్రవహించే తేనీరు
వెచ్చబరుస్తోందనుకున్నాను.

కానీ మెదడులో
జ్వలిస్తున్న ఆలోచనల
వేడి చేసే పనే అది అని
తెలిసేందుకు కొంత సమయం పట్టింది.

ఎప్పుడో కొన్ని సమయాలు దొరుకుతుంటాయి.
మాటల చితుకులు పేర్చుకుంటూ
వెలుతురుని పంచుకునేలా.

ఎక్కడో కొన్ని మనసులు దొరుకుతాయి.
బావాల ఊటలు పరచుకుంటూ
వరదలా చుట్లుముట్టేందుకు.

మరో సారి అదే రోజు
తిరిగొస్తుందా అనే
ఎదురు చూపుతో గడిపేస్తుంటాను.
నాకు నచ్చిన సాయంత్రం కాబట్టి.

Standard
Haiku

హైకూ – చిన్న పరిచయం – భాస్కర్ కొండారెడ్డి


————————————————
హైకు అనేది జపాన్ దేశపు,సాంప్రదాయ కవిత్వంలో ఒక భాగం,.
వీటికి ఆధారంగా నిలిచింది, జెన్ (ధ్యాన)బౌద్ధం.
హైకూలలో మూడు పాదాలు (కిరు,కైరేజి,కిగో) వుంటాయి,

కిగో అంటే ఋతువునో,కాలాన్నో సూచించడం,.మిగతావి రెండు దృశ్యాలనో,అనుభూతులనో కలిపేవి,
అక్షరాల (ఒంజి)పరిమితి 17,. (5-7-5)
జెన్ బౌద్దం ప్రకారం మనిషిలో వుండే చిత్తలక్షణాలు 17,అందుకే విస్తీర్ణం అంతవరకే పరిమితం.
కేవలం ప్రకృతి వర్ణన మాత్రమే వుండాలి, వర్తమానంలోనే చెప్పాలి,. అలంకారాలు, ఆడంబరమైన
భాషకు చోటులేదు,కవి తన అభిప్రాయాన్ని చొప్పించకూడదు,ఇది కేవలం ఒక దృశ్యాన్ని పాఠకుడి ముందు వుంచాలి,ఇలా చాలా నియమాలతో వుంటుంది,సాంప్రదాయ హైకు,.
నిజానికిది చాలా సులభంగా కనిపించే కష్టమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు,.
fu-ru-i-ke ya (5)
ka-wa-zu to-bi-ko-mu (7)
mi-zu no o-to (5)

పాత తటాకం,
ఒక కప్ప దూకింది,
నీటి శబ్ధాలు.( నా అనువాదం)
ఇది హైకూలకు ఆద్యుడుగా భావించబడే బషో (1644-1694) రాసిన హైకూ.

తెలుగులో మొట్టమొదటి సారి హైకూలను రాసిన కవిగా గాలి నాసర్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు,
17 అక్షరాల నియమం పాటించిన కవి బహుశా ఈయనోక్కరే,
వారి హైకు ఒకటి, వీరి సంకలనం దొరకలేదు,
ఎండుకొమ్మపై,
ఒంటరిగా ఓ కాకి,
శిశిర సంధ్య,.

అమెరికాలో హైకూలు 1950నుంచి విస్తృతమైన ప్రచారంలో వున్నాయి,కానీ అక్కడ అక్షరనియమం పాటించబడటం లేదు,.కొంత మంది కవులు ఒక్క పాదంలో, రెండుపాదాలలో కూడా హైకూలు రాస్తున్నారిప్పుడు,.గోపి గారి మాటలలో చెప్పాలంటే,హైకూస్నాప్ షాట్ లాగా, ఫోటోగ్రాఫిక్ గా వుంటుంది,.సగటు శ్రోతకు దీనిలో కదలక కనిపించదని ,పాఠకుడు కవితో పాటు సమభావకుడు అయినప్పుడు మాత్రమే హైకు ప్రకాశవంతమపుతుందని ,ఇవి తాత్వికత, ప్రకృతితో తాదాత్మ్యం లాంటి మౌనవస్తువులకు సరిపోతుంతని ,ఆయన భావించారు,.. అందుకేనేమో నానీల బాట పట్టారు,. .ఇస్మాయిల్ గారి తెలుగు హైకూలను ప్రతిభావంతంగా రాశారు, వారి హైకూలు కొన్ని,.

**కొలను లోకి రాయి విసిరారెవరో*
అలలు ఇ౦కా వ్యాపిస్తూనే ఉన్నాయి
రాయేదీ…

ఎవరికోస౦ వర్షిస్తాయి మేఘాలు
పిల్లల కోస౦ కాకపోతే
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళకోసమా?

ము౦దు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరి౦చి౦ది చీకటి.
————————————————
పెన్నా శివరామకృష్ణ గారి హైకూలు కొన్ని,…

సాయంత్రం వానజల్లు
చీకటిని దిగబెట్టి
వెళ్లిపోయింది,.

పక్షి నోటిలో
గడ్డి పరకలు
ఇల్లు మారుతున్నదేమో.,.

సుడిగాలి,
కొమ్మను ఊపుతున్నాని,
పిట్ట గర్విస్తుంది,.
————————
బివివి ప్రసాద్ గారి హైకూలు కొన్ని,…..

చేయి పట్టుకొంది నిద్రలో
పాప కలలోకి
ఎలా వెళ్ళను

పిట్టలు కూస్తున్నాయి
గాలి నిండా
రంగుల శబ్దాలు

దూరంగా దీపం
దానిని కాపాడుతూ
అంతులేని చీకటి
——————————-
తెలుగులో ఈ మధ్యకాలందాకా వచ్చిన హైకూ సంకలనాల వివరాలు కొన్ని,.
రహస్య ద్వారం ( పెన్నా శివరామకృష్ణ,1991)
కప్పల నిశ్శబ్థం (ఇస్మాయిల్,1997)
దృశ్యాదృశ్యం (బివివి ప్రసాద్1995)
హైకూ(బివివి ప్రసాద్1997)
పూలు రాలాయి(బివివి ప్రసాద్1999)
హైకూ చిత్రాలు (సూర్యభాస్కర్,1997)
ఆకాశదీపాలు ( లలితానంద్,1997)
సీతాకోక చిలకలు(శిరీషా,1997)
చినుకుల చిత్రాలు( పెన్నా శివరామకృష్ణ,2000)
ఇంకా చాలానే వచ్చినట్లున్నాయి,..
—————————–
నాకు అర్థమైన కొన్ని విషయాలివి,..మరంత సమాచారం వుంటే అందివ్వండి, ఎవరైనా…..


Standard
Uncategorized

నిప్పులేని పొగ

కాలిపోయి నెమ్మదిగా గాలిలో కలిసిపోతూవుంటుంది.
అది ఒంటరితనమో, ఆరోగ్యమో, ఆయుష్షో తెలీదుకానీ.
ఆదమరచిన ఓ క్షణాన చురుక్కుమనిపిస్తుంది.
వేలిచివర్లనో, ఆలోచనల కొసల్నో తెతీదు.
చిల్లులు పెడుతుంది. చిల్లర తాగేస్తుంది.
ఏమో వద్దను కున్నవి కొన్ని తెస్తుంది.
కావాలని దాచుకున్న మరికొన్నింటిని ఆవిరి చేసేస్తుంది.
రెండో కొసలో దేహనికి లోపలగా కాలేది ఒంటరితనమేనా…????

Standard
telugu poetry

మూడు డజన్ల ముచ్చట

ఇంధనమో, కందెనలో లేనిదే
కాలం ఇరుసు కదలని రోజుల్లో..
కలకాలపు కాలానికి
కలికాలపు కాలానికి

కలల రంగులద్దాలని
మెరుపు హంగులివ్వాలని
అదనుకోసం ఎదురు చూసే అల్పసంతోషాలు.

చిల్లర వ్యాపారానికై
చెల్లని పనులు చేస్తూ వస్తున్న
అల్లరి భూతాలోకవైపు .
నల్లధనాన్ని నెమరేసుకుంటూ
బల్లక్రింది బురదనుంచీ
చేతులు బయటకు తీయని
వింత పశువులోక వైపూ

కంచెలే చేనును మేస్తుంటే
పురుగు మందులు జనం గొంతుల్లో
దిగుతున్న రోజుల్లో

అంకెల గారడీలకు మురిసిపోతూ
రంగుల కలలు కనే
మన మూడు డజన్ల సంతోషాలని
ఆరు కాలాల పాటు నిలబెట్టుకోవాలని ఆశిద్దాం

♥ 12 – 12 – 12
12:12:12

http://www.facebook.com/groups/kavisangamam/permalink/481483488571075/

Standard