గజల్, ప్రక్రియ

తెలుగులో గజల్ సాహిత్యం

గజల్ ఉర్దూ కవితాసాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ మరియు కవితా రూపం.

గజల్ అనగా ‘స్త్రీ సంభాషణ’, ‘స్త్రీల సంభాషణ’. ‘స్త్రీ సౌందర్యాన్ని’ వర్ణించడానికి గజల్ వాడే వారు. గజల్ అనే పదం ‘గజాల్’ ‘గజాల’ నుండి ఆవిర్భవించింది (మూలం టర్కీ భాష), అర్థం ‘జింక’, ‘జింక కనులు గల’, ‘మృగనయని’.
పర్షియన్లు ఖసీదా ద్వారా దీన్ని వాడుకలోకి తెచ్చారు.10 వ శతాబ్దంలోఇరాన్ లో గజల్ ఆవిర్భావం జరిగినది.12 వ శతాబ్దంలోముస్లిం రాజుల ప్రాబల్యంలో,మొగలులు ఇరానీయుల ఆచారవ్యవహారాలతో పాటు గజల్ ను ఇరాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేశారు.అమిర్ ఖుస్రో ఉత్తరభారతంలో గజల్ ను ప్రారంభించాడని చెబుతారు కాని,నిజానికి గజల్ దక్కనులోనే మొదలయింది.
గజల్లు పర్షియన్ భాషలో జలాలుద్దీన్ మొహమ్మద్ రూమి (13వ శతాబ్దం), హాఫిజ్ (14 వ శతాబ్దం) మరియు తుర్కీ కవి ఫుజూలి, భారత కవులు మిర్జా గాలిబ్ (1797-1869), ముహమ్మద్ ఇక్బాల్ (1877-1938) ఇరువురూ పారశీ మరియు ఉర్దూ భాషలలో గజల్ రచించారు.
గజల్ లో కనీసం 5 షేర్ లు లేదా అషార్ లు వుంటాయి. 7, 9, 11… అషార్ లూ వుండవచ్చు. ప్రతి షేర్ లో రెండు మిస్రా లు వుంటాయి.

ప్రతి మిస్రా ఛందస్సు గల్గి వుంటుంది.

గజల్ లో మొదటి షేర్ ను మత్ లా, ఆఖరి షేర్ ను మఖ్ తా అంటారు.

మఖ్ తా లో కవి తన తఖల్లుస్ (కలం పేరు) ను ఉపయోగిస్తాడు.

కొంచెం ఉర్దూ ఉంటేగానీ గజళ్ళ ఆనవాళ్ళు తెలియవు
భావం సర్దుకుంటేగానీ ఈ సవ్వళ్ళ రవళ్ళు తెలియవు

 ఈ గజల్ సాహిత్యం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది. అమీర్ ఖుస్రూ 13వ శతాబ్దంలో ఈ ప్రక్రియని భారత దేశానికి పరిచయం చేశాడని విజ్ఞుల నమ్మకం. ప్రవేశ పెట్టింది ఉత్తర భారతంలోనైనా, గజల్ బాగా అభివృద్ధిచెందినది దక్షిణ భారతంలోనే. మొదటిరోజుల్లో దీనికి ఆదరణ దక్షిణంలో ఎక్కువ లభించినా, ఈ నాడు మళ్ళీ ఉత్తర భారత దేశం లోనే బాగా ప్రాచుర్యంలో ఉంది. 
తొలుత నజ్మ్ లు రచించిన హాలీ, ఇక్బాల్ చేత నిరసింపడి, అభ్యుదయ మార్గోన్ముఖులచే బహిష్కరించబడి, కొంత గౌరవాన్ని కోల్పోయినా గజల్ ఉర్దూ సాహిత్యంలో ఈ నాటికీ నిలదొక్కుకుని, అప్పటిలాగే ఎప్పటికీ ప్రముఖ పాత్రనే వహిస్తోంది. గజల్ ఒక శృంగార రసాత్మక అసలు సిసలైన భావకవిత. అటు ఛందస్సులోగానీ, ఇటు భావ ప్రకటనా విధానంలో గాని పద్య (లేక శ్లోక) రచనా శైలికి సరిపడనిది. కానీ నేడు విరివిగా వ్యాప్తిచెందుతున్న భావ కవితలకి చాలా దగ్గిరైనది. కొంత వరకు మాత్రాఛందస్సును వాడుకుంటూ, కాఫియా, అంత్యప్రాసల వంటి నియమాలను పాటిస్తూ, సాఫీగా సాగిపోయేది ఈ ప్రక్రియ. గజల్ లో ముఖ్యంగా ఉండేవి.
1) రస రంజకమైన అనుభూతులు,
2) ప్రతిభా వుత్పత్తులు

శృంగార రసానికి మానవ జీవితంలో ఒక నైసర్గిక ప్రాధన్యత కలదని మానవ స్వభావవేత్తలందరూ ఎరిగిన విషయమే. అందుకే సాహిత్యం నుంచి శృంగారాన్ని ఎంత బహిష్కరించినా ఆ బహిష్కరణలు చిరకాల సాఫల్యాన్ని పొందలేకపోయాయి. శృంగారానిని అదుపులో ఉంచవచ్చు, కొంత సంస్కరించవచ్చు కాని బహిష్కరించడం వీలుకాదు. ఎందుకంటే శృంగారహీన జీవనము ఒక జీవనము కాదు. అది ఒక Hypocrisy అవుతుంది. దాన్ని తప్పుగా భావించే వ్యక్తి కూడా నిజాన్ని కప్పిపెట్ట ప్రయత్నించే అత్మవంచకుడే. అందుకే గజళ్ళ పురోగతిని ఎవరూ ఆపలేకపోయారు. ఉర్దూ సాహిత్యంలో ఎన్ని మార్పులు వచ్చినా, గజళ్ళు వాటి శృంగార ధోరణి మారలేదు. ఎందరు దాన్ని వదిలినా, మరిందరు ఆరాధించసాగారు.
కాలానుగుణ్యంగా ఎందరో ఆధునిక కవులు సామాజికభావాలను కలుపుకుంటూ గజల్ సరణిలో సరళిలో మార్పులు తెచ్చినా శృంగార ప్రధాన్యత పెరిగిందే కానీ తగ్గలేదు. జనాదరణపొందిన ఈ గజళ్ళ ఇతివృత్తంలో అందుచేత గత 200 వందల ఏళ్ళలో మౌలికమైన మార్పులేవీ రాలేదనే చెప్పుకోవచ్చు. అభ్యర్తికానుభూతి ప్రధానమైన ఈ కవితా స్రవంతిలో భావప్రకటనను మెరగుపర్చి మెరుగులు దిద్దే అవకాశం ఎంతోవుంది.
శృంగారాన్ని ప్రధానాంశంగా గ్రహించగలిగితే ప్రేయసితోనూ, సాఖీతోనూ, దేవునితోను, స్వగతముతోను, ప్రపంచముతోను పలువిధముల ముచ్చటించుకోవచ్చు. పరిపూర్ణమైన దృష్టితో, అర్థగౌరము కలిగిన వాక్పటిమతో, ఛందోబద్దమైన నియమాలతో, అసమాన్య కల్పనాచాతుర్యంతో కూడిన ఈ గజళ్ళకు సకల వచన, కవితా, పద్య సాంప్రదాలను మించి రాణించగల సత్తావుంది. ఇటు ఛందోబద్ధమై అటు భావకవియై, నడిచే ఈ ప్రకృతికి సాటిలేదు. 
శృంగార ప్రాధాన్యతను సంతరించుకుంది కాబట్టి, అనుభూతులను, సత్యాలను స్పష్టముగా వ్యక్తీకరించడం అనువుగావుండదు కాబట్టి, కొంత అస్పష్టత, వ్యంగ్యము, రహస్యము, వుండకతీరదు. ఆ ముసుగే గజళ్ళకి ఒక నూతన మేలిముసుగై భావసౌందర్యాన్ని ఆపాదించింది. వ్యంగ్యానికి పునాది కవి అంతరంగికానుభూతికాని భాహ్యానుభూతి కాకూడదు. కవి యొక్క అంతరంగికానుభూతులకు, భావోద్వేగానికి, కల్పనాశక్తికి అవినాభావసంబంధముండుట వలన భావప్రపంచానికి వాస్తవికానికి భేదం నశిస్తుంది. అనుభవించేవానిలోను, భావనికీ ఐక్యత సిద్దిస్తుంది. అంతా సోహం!

ప్రతిభాశలుడైనప్పటికీ ‘దాగ్ ‘ రచించిన గజళ్ళు భాహ్యానుభూతులు జాగృతం కావించినందున అవి అంత ఆధ్యాత్మిక అర్థాన్ని స్పృశించలేకపోయాయి అని దాశరధివంటి విద్వాంశులు పేర్కొన్నారు. అలాగే తెలుగులో అనేకమంది పండితులు సినారే, రెంటాల, తటవర్తి రాజా, మున్నగువారు ఎన్నో గజళ్ళను వ్రాసినా ఛందోపరంగా భావపరంగా ప్రశంశనీయమైనా, వారి ఇతివృత్తాంశం శృంగార అంతరంగిక అనుభూతులవి కాకపోవడంచేత తెలుగులో గజళ్ళకు తగినంత ఆదరణ లభించలేదేమో అని భావించవచ్చు. తెలుగువారు శృంగారాన్ని స్ప్రుశించరు అన్నవారివాదన తెలుగు సినిమాలు చూస్తే నమ్మబుద్దికావు. దాశరధి సరియైన ఇతివృత్తాన్ని ఎంచుక్కున్నా, గజళ్ళకు సంబందించిన ఛందస్సు అంటే కాఫియా రదీఫ్ వంటివి వాడకుండా తేటగీతి, ఆటవెలది వంటు అచ్చతెలుగు చందాన్నివాడి గజళ్ళకు కొంత దూరంగానే నిలిచారు. కానీ పద్యంలో సరికొత్త భాణీని సాధించారు. అందుచేత ఇప్పుడు తెలుగులో గజళ్ళ ప్రాముఖ్యత పెంచాలి అంటే మొట్టమొదట ఉర్దూ సంప్రదాయానికి చందస్సులోనూ, భావుకతలోనూ, శృంగారపరంగానూ దగ్గిరగా రావాలి. భాహ్యప్రపంచం కవి భావనాప్రపంచంలో ఐక్యమవ్వాలి. 

హకీకీ, మజాజీ:

ఫారసీ ఉర్దూలలో గజళ్ళలో విప్రభల శృంగారానికే ప్రాధాన్యతనిచ్చారు. శృంగారరసాన్ని వారు ‘హకీకీ ‘అనీ ‘మజాజీ’ అని రెండు తరగతులుగా విభజించారు. మజాజి అంటే సామాన్య లౌకిక ప్రేయసీప్రియుల ప్రేమ.హకీకీ అంటే పారలౌకిక ప్రేమ. అంటే ఉదాహరణకి విరహతాపం అనుభవించేవాడికి, దైవప్రసన్న కోరువాడికీ పెద్ద తేడా ఏమీ వుండదు. హకీకీ అనుభూతి వారికి సంభందించినది. ప్రేయసినే నిజంగా పూజించేవాని గజళ్ళు ఈ కోవలోకే వస్తాయి. ఖాజామీర్వుద్దర్, బర్వేలి వంటి కవులు ఈ కోవకు చెందారు.
కాని సర్వసాధారణంగా లభించే గజళ్ళు అన్నీ మజాజీ కి చెందినవే. వారి ప్రేయసి మేలిముసుగులోని సౌందర్యవతే, వారు తాగేది గోస్తనీ రసమే. మధుబాల, మదుపాన, మదుశాలను దాటి వారు పోరు. కానీ ఉచ్చశ్రేణి కవులు హకీకీ మజాజీలను కలుపుకు వ్యంగ్య ద్వందార్థాలతో రచిస్తారు. ఆటు పారలౌకిక ప్రేమను మేళవించిన సామాన్య శృంగారాన్ని అందజేస్తారు. రెండు అర్థాలకూ ధామమై యదాత్తభావలను వ్యక్తీకరించి సత్చితానంద రూపులై వెలుగొందుతారు.
వీరి రచనల్లో చమన్, సాఖీ, వంటి పదాలు ఉత్ప్రేక్షా సామాగ్రి ఐతే, మధుశాల మధువులు వంటి పదాలు ముఖ్యాంగములుగా ఉపకరిస్తాయట. బేవఫా, జాలిం, సితంగర్ వంటి పదాలు గుణప్రాతిపదికలైతే, గుల్, సరోకద్ వంటి పదాలు సౌందర్యప్రాతిపదకాలవుతాయి. దేవుని ఆటంకములు కల్గించువాడని ఆతడిని నిందించడం, అలాగే ప్రేయసి దయావిహీనురాలైవుండటం గజల్కి పునాదులవుతాయి. ఈ పునాదే ఆతడి మనాదై, వ్యంగ్యభావాలు, ఛలోక్తులకు ఉగాదవుతుంది. ఒకప్పుడు వారిని నిందిస్తాడు, ఒకప్పుడు తనను తాను నిందించుకుంటాడు, మరొకప్పుడు వ్యంగ్యంగా వారిని మెచ్చుకుంటాడు. అలాగే హృదయవేదన దైవదత్తమైన వరంగా భావించి సంతృప్తి పడతాడు. గజల్ వ్రాయాలంటే ఈ అనుభూతులు స్వానుభవాలు కాకుంటే అందులో ఆర్ద్రత కరువవుతుంది. అందుకే చాలా మంది కవులు ఈ ప్రయత్నంలో విఫలులవుతారు.

ఈ శృంగార భావాలన్ని పూర్వము ఇతర కవులచే లిఖింపబడినవే అయినా, గజళ్ళు కొత్త కవి కొత్త భావోధ్వేగాలను ప్రకటిస్తూ, కొత్త పదజాలం సంతరించుకూంటూ మళ్ళీ విన్నూత్నంగా సాగిపోతాయి (ఎన్ని తెలుగు సినిమాలు చూచినా అన్నీ ప్రేమ కథలే. ప్రేక్షకులు తరతరాలుగా ఇంకా వాటిని చూస్తూనేవున్నారు, వుంటారు). అందుచేత ఇందులో ఇది పాతభావమేగా అని పెదవి విర్చడం అమర్యాదే కాదు, అజ్ఞానం అవుతుంది కూడా.
కానీ గాలిబ్ వంటి మహాకవులు, పూర్వ కవుల భావాలను ఉపయోగించకుండా శృంగారజీవితము, విరహమునందున్న కొత్తపోకడలను అనుసరించి ఉదహరించాడు. అతడు ఇతరుల రచనలనసలే చదువలేదని కూడా ప్రతీతి. మహాకవులు భాషాపరిజ్ఞానం సాధించిన తరువాత ఇతరుల రచనలు ఎక్కువగా చదవకూడదన్న ఆతడివాదంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అప్పుడుగానీ కవిలోని సహజ సౌందర్యం వెలువడదు. ఎక్కువగా చదివితే పూర్వ రచయితల INFLUENCE మనమీద ఎక్కువగా కనిపించి సహజత్వంలోపిస్తుంది. 

గజళ్ళను తెలుగులో వ్రాయడనికి చాలా ఇబ్బందులున్నాయి. ఉదాహరణకు గాలిబ్ గజల్ ని దాశరధి గారు తన శైలిలో తర్జుమా చేస్తూ అంటే ఒక తేటగీతిలో ఇలా అన్నారు

ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట ఎంతో దుష్కరము లెమ్ము

ఇది ముందు చెప్పినట్లుగా గాలిబ్ మహాశయుడు చేసిన ద్వందార్ధ ప్రక్రియ. అటు, సామజిక పరంగానూ, ఇటు ఆధ్యాత్మిక పరంగానూ, అలాగే శృంగార పరంగాను వర్తించే షేర్ ఇది. కాని ఈ తర్జుమా మాత్రం ఎంతో అద్భుతంగా చేసి, అంత్యప్రాసలను సమకూర్చినా కూడా, అది ఒక గజల్ కానేకాదు. ఆ చందస్సులోకి ఇది ఇమడదు. దిన్నీ భావభంగం కలుగకుండా అతికొద్ది మార్పులతో గజల్గా రూపొందించాలంటే ఇలా చెప్పచ్చు, 

ప్రతిది సులభముగా కాదు సాధ్యంబు లెమ్ము
నరుడు నరుడౌట ఎంతో దుష్కరంబు లెమ్ము

కానీ ఇది పద్యమవ్వదు; ఒక గజల్ చందస్సుకు సరిపోతుంది. ఇందులో గొప్పతనమేమిటంటే, గాలిబ్ ఈ గజల్ తో ఒక సామాజిక విషయాన్ని తన గజల్ లో చర్చింటమేకాక, ఒక శృంగార భావాన్ని కూడా వ్యంగ్యంగా ప్రస్తావించాడు. అలాగే గజల్ ఛందోనిర్మాణ సూత్రాలను పాటించాడు. అందుకే గాలిబ్ ని ఒక మహా కవిగా ఈనాడు మనం తలుచుకుంటాము.

Click here to Listen Dr C Narayana Reddy (ghazals)

TELUGU GAZAL BY SRI ADDEPALLI RAMMOHAN RAO IN HIS OWN VOICE
Standard

4 thoughts on “తెలుగులో గజల్ సాహిత్యం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s