ఆటవెలది, ప్రక్రియ

ఆటవెలది

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె దాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు !

చిన్నప్పుడు బహుశా రెండవ తరగతి తెలుగు పుస్తకంలో కావచ్చు ఈ పద్యం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. ఆ పేజీలో ఒక నెమలీక కూడా దాచి దానికి తాటి లేత ఆకుల చివరి రెల్లును మేతగా వేసి, ఈ ఇంక ఇంకా పెరుగుతుందని సంతోష పడటం గుర్తుంది.

తర్వాత మరికొన్ని విషయాలు ఇదే పద్యం గురించి తెలిసాయి. దీని రచయిత పదకవితా పితామహుడు,  “సంకీరత్నాచార్యుడు”, “పంచమాగమ సార్వభౌముడు”, “ద్రవిడాగమ సార్వభౌముడు” తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) అయిన తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 – ఫిబ్రవరి 23, 1503), వారట, నిజానికి ‘‘ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు’’ మకుటం తో ఆయన ఒక శతకాన్ని రాసారని చెపుతారు.చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు – ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడని చెపుతారు.  సారస్వతం మీద మనకున్న శ్రద్దలేని తనానికి నిదర్శనంగా ఆయన రాసిన అమూల్యమైన రచనలనెన్నింటినో కొల్పోయాం అందులో ఇదికూడా ఒకటి. 


ఇక ఈ వర్ణనను ఆధారంగా చేసుకుని అప్పట్లో పిల్లలకు చేసే వస్త్ర దారణగురించి, దాని వెనకున్న సాంస్క్రుతిక నేపద్యం గురించి ఒక అంచనాకు రావచ్చు అది మరోక కోణం. మనకు వెండి మొలతాళ్ళు కొంతవరకూ తెలుసు స్థితిమంతులు బంగారు మొలతాళ్ళు పట్టు దట్టీ తొడిగారట.( దట్టీ = 
A sash, belt, girdle, cestus round the waist. నడికట్టు, కాసెకోక, నడుముకు కట్టుకునే వస్త్రము. ) తాయతులు తెలుసు మరి సందె తాయతులు అనే విశేషమేమిటో అవి కట్టారట, మువ్వలతో అదిన్నూ సరి మువ్వలతో ఘల్లు ఘల్లున మోగే గజ్జలు కట్టారట అటువంటి చిన్నరి కృష్ణుడిని కొలుస్తాను అని చెపుతున్నారీయన.

ఇక పోతే పద్య చందస్సు ఆట వెలది, జాతి పద్యరీతికి పెట్టుకున్న పేరు ఇదయినప్పటికీ మరో అర్ధంలో  ఆటవెలది అంటే స్త్రీ అని నర్తకి,వెలపడతి,దేవదాసి,ఆటకత్తె, వేశ్య మొదలైన అర్ధాలుకూడా వున్నాయి. ఎందుకలా పేరు పెట్టారో కానీ పద్యం మాత్రం అందమైనది. 


ఆటవెలది కున్న ఈ నానార్ధాన్ని దృష్టిలోపెట్టుకునే ఒక చమత్కారం చెపుతుంటారు. సీస పద్యం తర్వాత ఆటవెలది కానీ తేట గీతి కానీ తప్పని సరిగా చెప్పాలంటారు అందుకే సరసులు దీనిని వ్యవహారికంగా అన్వయం చేసి ‘‘ సీసా తర్వాత ఆటవెలది వుండాలోయ్’’ అని అంటుంటారు.

 ఆటవెలది చందస్సుని విస్త్రుతంగా వాడుకుని సామాజిక దోషాలను కడిగి పారేసిన వాడు మన వేమన. అందుకేనేమో హైదరాబాద్ ట్యాంకుబండు పైనున్న వేమన విగ్రహం క్రింద ఆయన పరిచయ వాక్యాలను ఈ విధంగా రాసారు. ఆటవెలది ని ఈటె గా విసరిన దిట్ట. చాందస భావాలకు తొలి అడ్డు కట్ట.” ఆయన ఆటవెలది లో దిట్ట. సూటిగా సరళంగా ఆయన రాసినటు వంటి వాటిని పోలిన  ఆటవెలదులు మనం ఎ గ్రంధం లోనూ చూచి ఉండము బహుశా చూడలేమేమో కూడా. ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఇదే ఆటవెలది చందస్సును ఉపయోగించి రాసినవే.

చంధస్సు ఎలా వుంటుందో చూద్దామా.

ఆటవెలది ఎలా వుంటుందో ఆటవెలది లోనే చెప్పాలంటే ఇలావుంటుందని సూత్రాన్ని చమత్కార సహితంగా చెప్పారు.
ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.


  • ఇందు నాలుగు పాదములుంటాయి.
  • 1, 3 పాదాలు మెదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
  • 2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి.
  • ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
  • ప్రాసయతి చెల్లును
  • ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.
    పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను ప్రాసయతి అందురు. 
  • ఉదాహరణకు  “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.

ఆటవెలది ఒక విధముగా చూస్తే అర్ధసమ వృత్తమువంటిది.  సరిపాదాలు ఒక విధముగా, బేసి పాదాలు మఱొక విధముగా  ఉంటుంది.  ఆటవెలది, తేటగీతి లాటి పద్యాలను అంశగణాలతో రాయాలి. (గణాలు మూడు విధాలు – అక్షర గణాలు, మాత్రా గణాలు, అంశ లేక ఉప గణాలు ) 

కొన్ని ఉదాహరణలు

1. వార్తయందె జగము వర్తిల్లుచున్నది
యదియు లేని నాఁడ యఖిల జనులు 
నంధకారమగ్ను లగుదురు గావున 
వార్త నిర్వహింపవలయుఁ బతికి.

(ప్రపంచం వార్త మీదే నడుస్తున్నది. అది లేకుంటే ప్రజలు అంధకారంలో మునిగినట్లే. కాబట్టి ప్రభువు వార్తను బాగా నడపాలి.)

2. నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు

నుండు నెక్కటికి మహోత్తరునకు

నిఖిల కారణునకు, నిష్కారణునకు న

మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

3. అనువుగానిచోట అధికులమనరాదు

కొంచెముండుటెల్ల కొదువగాదు

కొండ అద్దమందు కొంచెమై యుండదా

విశ్వదాభిరామ వినురవేమ.

4. నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

Standard

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s