Telugu

భారతి : ఐఐటి ఫ్రొఫెసర్ రూపోందించిన సరికొత్త భారతీయ భాష

మన దేశంలో మాట్లాడే భాషలు 1600.. అధికార భాషలు 22.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష. కనీసం ఊర్ల పేర్లు తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా ఆయా ప్రాంతీయ భాషా లిపుల్లో లిఖించి వుంటే కొత్తగా వెళ్లిన వారు పడే గందరగోళం అంతాయింతా కాదు. దీని నుంచి గట్టెక్కేందుకే మద్రాస్ ఐఐటీ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వడ్డాది శ్రీనివాస చక్రవర్తి ‘భారతి’ పేరుతో సరికొత్త లిపిని కనుక్కున్నారు. ఎందరి సమస్యకో పరిష్కార మార్గం కోసం ప్రయత్నించిన ఆయన మన ఆం«ద్రుడే. ‘భారతి లిపి వల్ల కలిగే లాభాలేంటి? ఇందులోని సాధ్యాసాధ్యాలేంటి? దీని అమలు వల్ల కలిగే నష్టాలేంటి?’ వంటి అనేక ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలే ఈ ముఖాముఖి..
– మీ గురించి చెప్పండి?
మాది విశాఖపట్టణం. అమ్మ వడ్డాది శేషమ్మ, నాన్న రమణారావు. నాన్న ప్రభుత్వ వైద్యుడిగా పని చేసి రిటైరయ్యారు. మేమిద్దరం పిల్లలం. తమ్ముడు శైలేంద్ర కూడా డాక్టరే. నాన్న వైద్య రీత్యా పలు ఊళ్లు తిరగాల్సి రావడంతో నా ప్రాథమిక విద్య కూడా ఆయనతో పాటు ఊళ్లు తిరిగింది. 10వ తరగతి, ఇంటర్మీడియేట్ విజయవాడలో పూర్తి చేశాను. మద్రాస్ ఐఐటీలో బీ.టెక్ చేసి, యూఎస్‌లో ‘న్యూరల్ నెట్‌వర్క్స్’ అనే అంశంపై పీహెచ్‌డీ చేశాను. అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి, తరువాత 2000లో మద్రాస్ ఐఐటీకి వచ్చాను. బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను. నా శ్రీమతి ఇందిర చిన్నపిల్లల వైద్యురాలు. ఇక్కడే స్వంతంగా క్లినిక్ నడుపుతోంది. నా ఏకైక కుమార్తె ద్యుతి పదవ తరగతి చదువుతోంది.
-మీ వంశంలో ఎవరైనా భాషా పండితులు గానీ, సాహితీవేత్తలు గానీ వున్నారా?
ఎవ్వరూ లేరు. మా తాతయ్య కూడా ఆర్ఎంపీ డాక్టరే.
-‘భారతి’ లిపి రూపొందించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
భారతీయ భాషలను కంప్యూటర్‌లో టైప్ చేయడం కష్టం. అదే ఇంగ్లీష్ అయితే చాలా సులభం. అందుకే తమిళం, మలయాళం, తెలుగు తదితర భాషల్ని కంప్యూటర్‌లో సంక్షిప్తం చేస్తున్నాం. ఆంగ్లంలో వున్న 26 అక్షరాలను తెలుగులో 10 వేల అక్షరాలుగా రాయవచ్చు. జె.ఫాకేసన్ అనే వ్యక్తి ఆంగ్ల అక్షరాలను కూడా సంక్షిప్తం చేశాడు. అంటే ఆంగ్ల ‘ఎ’ అక్షరానికి మధ్యలో అడ్డగీత అవసరం లేదని చెప్పాడు. అలా ఆంగ్ల అక్షరాల్లో చాలా వాటిని రూపొందించాడు. దానికి ‘గ్రాఫిటియన్’ అని పేరు. అదే నాకు స్ఫూర్తి.
దేశం మొత్తమ్మీద 1600 భాషలు మాట్లాడుతున్నట్లు అంచనా. మన దేశంలో 22 అధికార భాషలున్నాయి. దేశంలోని వివిధ పాఠశాలలన్నీ కలిపి 58 రకాల భాషల్ని బోధిస్తున్నాయి. 87 భాషల్లో దినపత్రికలు వెలువడుతున్నాయి. అయితే ఉర్దూతో కలిపి పదింటిని ప్రధాన లిపులుగా గుర్తించడం జరిగింది. అయితే ఉర్దూ శైలి వేరు. మిగిలిన తొమ్మిది భాషల్లో అ-ఆ, ఇ-ఈ వంటివన్నీ వుంటాయి. మన భాషలకు తర్కబద్ధమైన విశ్వాసం వుంది. తెలుగులో అచ్చులు ముందు, హల్లులు తరువాత వుంటాయి. కానీ ఆంగ్లంలో అలా కాదు. ‘ఎ’ ఎందుకు ముందు వుంటుందో, ‘జడ్’ చివరన ఎందుకుండాల్సి వచ్చిందో ఎవ్వరూ చెప్పలేరు.
ఇక అ-ఆ, ఇ-ఈ వంటి అక్షరాలను చూస్తే దీర్ఘంతో కూడుకున్న ఒకే అక్షరమని ఎవ్వరూ చెప్పలేరు. అందువల్ల వాటిని నేర్చుకోవడం కష్టం. అదే ‘అ’ మీద ఏదో ఒక అక్షరం చేరిస్తే ‘ఆ’ వచ్చేలా వుందనుకోండి, అది నేర్చుకోవడం సులభం. అలాగే గుణింతంలో కూడా. ఉదాహరణకు క గుణితం తీసుకుందాం. క, కా, కి. కీ… అక్షరాలున్నాయనుకుందాం. క అక్షరానికి పైనో, పక్కనో ఒక చుక్క, లేదా ఒక గీత పెడితే దీర్ఘం వచ్చిందనుకోండి. అది నేర్చుకోవడం సులభం, గుర్తు పట్టడమూ సులభమే అవుతుంది. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ‘భారతి’ లిపిని రూపొందించడం జరిగింది.
– ఈ లిపిని ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు?
నిజం చెప్పాలంటే ‘భారతి’ లిపిని అరగంటలో నేర్చుకోవచ్చు.
– ఈ లిపిని భారత్‌లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమిటి?
ముందే చెప్పినట్లు మన దేశంలో ఎన్నో భాషలున్నాయి, ఎన్నో లిపులు వున్నాయి. వీటన్నింటినీ నేర్చుకోవడం చాలా కష్టం. ఒకరు రాసేది మరొకరికి అర్థం కాదు. అందుకే కామన్ లిపి అనేది చాలా ముఖ్యం. అది వుంటే ఎవ్వరికీ కష్టముండదు. ఉదాహరణకు రైల్వేను తీసుకుందాం. రైళ్లపై హిందీ, ఇంగ్లీషు, ఏదో ఒక ప్రాంతీయ భాషతో కలిపి మొత్తం మూడు భాషల్లో రాస్తారు. అదే భారతిని ప్రవేశపెడితే, దేశమంతా, ఆంగ్లంతో పాటు రెండు భాషలే రాయవచ్చు. ఇది అందరికీ అర్థమవుతుంది. అంటే పని సులభం. డబ్బు ఖర్చు తక్కువ.
– కానీ మీరు రూపొందించిన ‘భారతి’ లిపిని ప్రవేశపెడితే దేశంలో వున్న లిపులు కనుమరుగైపోతాయి కదా?
లేదే! ఎలా…
– భారతి లిపిని దేశవ్యాప్తం చేస్తే, దానితో పాటు ఆంగ్ల భాష కూడా వుంటే, ఇక ప్రాంతీయ భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?
భాష వేరు, లిపి వేరు. భావాన్ని వ్యక్తీకరించేది భాష. దానిని రూపంలో పెట్టేది లిపి. అలాంటప్పుడు ప్రాంతీయ లిపులు దెబ్బతినే అవకాశం లేదు.
– మనం మాట్లాడే భాషను లిఖితరూపం చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎవ్వరైనా ఆ భాషను ఎలా నేర్చుకుంటారు?
రాయాల్సిన అవసరం లేనప్పుడు, ఆ భాషను నేర్చుకోవాల్సిన అవసరమేముందని ఈ స్పీడ్ యుగపు సగటు మానవుడు ఆలోచిస్తాడు నిజమే. ఇప్పటికిప్పుడు కాకపోయినా, కొన్ని తరాల తరువాత అయినా మన పూర్వీకుల నుంచి వచ్చిన భాషల లిపి కనుమరుగు కాక తప్పదు కదా! అయితే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం వుండవచ్చు. కానీ లిపి కన్నా భాష ముఖ్యమని నేను భావిస్తాను. మీరు లిపి గురించి ఆలోచిస్తున్నారు తప్ప, ప్రాంతీయ భాషలకు ముంచుకొస్తున్న ముప్పును గురించి ఆలోచించడం లేదు. ఇప్పటికే అన్ని ప్రభుత్వాలు ఆంగ్ల మాధ్యమాన్ని జనంపై ప్రవేశపెడుతున్నాయి. జనం కూడా మాతృభాషల్ని వదిలేసి ఆంగ్లంవైపు పరుగులు పెడుతున్నారు. తమ మాతృభాష మాధ్యమంలో చదివేవారే కరువైపోతున్నారు. దాని వల్లా ముప్పే కదా. అదే కామన్ లిపి భారతిని ప్రవేశపెడితే ఈ నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు. భాషలో సంస్కరణలు అవసరం. లిపి పెద్ద సమస్య కాదు. లిపి కన్నా భాష ముఖ్యమని నా ఉద్దేశం.
– దీనికి ‘భారతి’ అని పేరెందుకు పెట్టారు?
భారతదేశానికి చెందినది కాబట్టి, భారతదేశంలో వినియోగానికి అనువుగా వుండేలా రూపొందించినది కాబట్టి దీనికి ‘భారతి’ అని పేరు పెట్టాను.
– ఈ లిపిని రూపొందించడానికి ఎన్నాళ్లు పట్టింది?
నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా వేరే ప్రాజెక్టు కోసం పని ప్రారంభించినప్పుడు తలెత్తిన సమస్యలే, ఈ సరికొత్త లిపి రూపకల్పనకు ఊపిరి పోశాయి. దాంతో తొమ్మిది ప్రధాన భాషల్లోని అక్షరాలను స్టడీ చేశాను. అన్ని భాషల వారు సులభంగా నేర్చుకునేందుకు అనువుగా దీనిని రూపొందించాను. ప్రస్తుతం ఈ లిపి చేతితో రాసేందుకు అనువుగా వుంది. కంప్యూటర్‌లో ఫాంట్ రూపకల్పన కోసం ప్రయత్నిస్తున్నాం.
– ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష వుంది. ఆయా భాషల అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా తమిళులకు తమ భాష అంటే వీరాభిమానం. అలాంటప్పుడు మీరు రూపొందించిన ‘భారతి’ పట్ల వ్యతిరేకత రాదా?
వస్తోంది. ఇప్పటికే ఈ విషయం తెలిసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రాచీన దేవనాగర లిపి వాడితే సరిపోతుంది, మళ్లీ కొత్త లిపి ఎందుకంటూ ప్రశ్నలు సంధిస్తూనే వున్నారు. ప్రధానమైన తొమ్మిది భాషల్లో ఒక్కో దానిలో ఒక్కో అక్షరం లేదు. కానీ నేను రూపొందించిన భాషలో అవసరమైన అన్ని అక్షరాలను వాడాను. అవసరం లేని వాటిని తీసేశాను. ఈ భాష వద్దని రాజకీయ నేతలనుకుంటే నేనేం చేయలేను. మంచి కోసమే దీనిని రూపొందించాను. అమలు చేయాల్సింది నేతలే కదా!
– భారతిలో ఎన్ని అక్షరాలున్నాయి?
తెలుగులో వున్నన్ని అక్షరాలే భారతిలోనూ వున్నాయి. గతంలో అచ్చులో ‘లు’, ‘లూ’ వాడేవారు. ఇప్పుడు ఎలాగూ వాడడం లేదు. భారతిలో వాటిని తొలగించాను. అదే విధంగా ఙ, ఞ, క్ష లను కూడా తీసేశాను. భారతిలో వాటి అవసరం లేదు.
-ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ వుంది?
ఐఐటీ మద్రాస్ లాంగ్వేజ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు నిపుణులు భారతిని పరిశీలించారు. అనంతరం కేంద్రప్రభుత్వానికి పంపించాం. ప్రొవిజనల్ పేటెంట్ వచ్చింది. పూర్తిస్థాయి పేటెంట్ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం కూడా భాషాభివృద్ధి కోసం చేపట్టే వినూత్న ప్రయోగాలను ప్రోత్సహిస్తోంది.
– దీనిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు?
ప్రభుత్వం గట్టిగా తలచుకుంటేనే అమలు సాధ్యం. అప్పుడే ఈ లిపి ప్రజల్లోకి వెళ్తుంది. త్వరలోనే భారతి లిపిని ఐఐటీ మద్రాస్ వెబ్‌సైట్‌లో పెట్టబోతున్నాను. అంతేగాక విరామ సమయంలో పాఠశాలలకు వెళ్లి ఈ భాషపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తాను.
– ఎవరికి వారు లిపిని రూపొందించుకుంటూ పోతే.. ఎలా?
బహుశా అభిజిత్ చటర్జీ అనే సైంటిస్ట్ అనుకుంటా, ‘శివ’ అనే స్క్రిప్ట్‌ను రూపొందించారు. అది సహజంగా వుండదు. అంటే డిజిటల్‌లో ‘8’ వుంటుంది కదా! ఒక్కో లైను పోతే ఒక్కో అక్షరం మనకు కనిపిస్తుంది. అదే శివ స్క్రిప్ట్. అది కంప్యూటర్‌లో సాధ్యం. కానీ రాయడానికి కుదరదు. దానికి బయట అంతగా ఆదరణ లేకపోయింది. కాని భారతిని సులభమార్గంలో, దేశవాసులందరికీ ఉపయోగకరంగా వుండేలా రూపొందించాను. ప్రజల ఆదరణ వుంటేనే కదా, ఏదైనా సాధ్యం. ఈ లిపికి మంచి ఆదరణ వుంటుందనే భావిస్తున్నా.
Advertisements
Standard

One thought on “భారతి : ఐఐటి ఫ్రొఫెసర్ రూపోందించిన సరికొత్త భారతీయ భాష

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s