సమీక్ష, telugu poetry

కవిసంగమం ఈనాటికవిత-47 కట్టా శ్రీనివాస్ ‘ఎరుక’ పై – మల్లావజ్జల నారాయణ శర్మ గారి విశ్లేషణ

Narayana Sharma Mallavajjala
విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం అందుకే కాబోలు.
జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా.వీటినే శైశవ,బాల్య,యవ్వన,కౌమార్య,దాంపత్య ,గార్హస్త్య,వార్ధక్య దశలుగా చెప్పారు.ఇవన్నీ ఒకటిగా సాగుతున్నట్టేగాని వీటన్నిటికీ కొనసాగింపు లేనట్టుగా అనిపిస్తుంది.దానికి కారణం గతం ఙ్ఞాపకంలా మిగలటం.శ్రీనివాస్ ఇలాంటి “ఎరుక”నే కవితా వాక్యాలుగా ప్రకటిస్తున్నారు.
ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.
“నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను.”
“దారం ఉనికి తెలియనంత వరకూ
ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది.”
“రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్
ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి”
ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.
“నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.
నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను.
చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,
నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు.”
ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్ మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్రదర్శించడం ద్వారా రాబోయే బాధ దుఃఖాలను అహం పసిగడుతుంది.”చిన్నారి బుగ్గలు పుణికి నప్పుడల్లా/నాఙ్ఞాపకలతోనే నాకు వణుకు.” ఈవాక్యంలో ఆ తత్వం కనిపిస్తుంది.
అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.

కవిసంగమం ఈనాటి కవిత 

ఎరుక కవిత్వం

Standard
telugu poetry

ఎరుక

నాకు ముందు నేనున్నాను.

నా తర్వాతా నేనుంటాను.

దారం ఉనికి తెలియనంత వరకూ

ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది.

రెండో ఇన్నింగ్స్

సెకండ్ లైఫ్

ద్విదానో, బహుదానో

అవిచ్ఛిన్న విచ్ఛిత్తి

ఆత్మల ఉనికి కాదు.

జీవ ప్రవాహం గురించే అంటున్నాను.

నేను కానీ నేను

అనాదిగా ప్రవహించి నాదాక వచ్చాక.

నాదనుకునే నేను

నడక ప్రారంభించాను.

నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.

నాగుండా ప్రవహించిన వాళ్ళిని తెలుసుకుంటాను.

చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,

నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు.

► 21-09-2013

Standard
సమాచారం

కలవరపెడుతున్న కచ్చాతీవు – డా॥గోపరాజు నారాయణరావు

చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయన్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (లంక)లలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో డ్రాగన్ కదలికలు సుస్పష్టం.  భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి.
 

‘భారతదేశమంటే కేంద్ర సర్కారు సొంత జాగీరని కాంగ్రెస్ అనుకుంటున్నదా?’ ఈ సెప్టెంబర్ 2న రాజ్యసభలో అన్నా డీఎంకే సభ్యుడు వి.మైత్రేయన్ వేసిన ప్రశ్న ఇది. 1962 ముందు అక్సాయ్‌చిన్, నీఫా సరిహద్దుల గురించి పార్లమెంటు చర్చించినప్పుడు సరిగ్గా ఇలాంటి ప్రశ్నకే నెహ్రూ సమాధానం చెప్పవలసివచ్చింది. గడ్డిపోచ కూడా మొల వని ప్రదేశం గురించి ఎందుకు బెంగ? అం టూ మహావీర్ త్యాగీని ప్రథమ ప్రధాని దబాయించారు. తరువాత చైనాతో యుద్ధం జరి గింది. ఈ కాలంలో వచ్చిన మార్పు ప్రమాదకరమైనది. గడ్డిపోచలు మొలవకపోవచ్చు. కానీ తుపాకి గిడ్డంగులు అలాంటి చోట వెలి సే ముప్పు ఉంది. అన్నా డీఎంకే సభ్యుడు వేసిన ప్రశ్న- నిర్మానుష్యంగా ఉండే దీవిలో పొంచి ఉన్న విపత్తు గురించినది. ఇప్పుడు ఆ విపత్తు గురించి తమిళ ఎంపీలూ, పార్టీలే కాదు, దేశం మొత్తం ప్రశ్నించుకోవాలి.
 
భారత్, శ్రీలంక మధ్య సరిహద్దు జలాలలో ఉన్న కచ్చాతీవు 285 ఎకరాల చిన్న దీవి. ఈ రెండు దేశాల మధ్య సముద్రాన్ని మూడు సెక్టార్లుగా విభజిస్తారు. ఇందులో రామేశ్వరం (భారత్); తలైమన్నార్ (శ్రీలంక)- ఆడమ్స్ బ్రిడ్జ్ వరకు ఉండే సెక్టార్‌ను పాక్ జలసంధి అంటారు. కచ్చాతీవు ఇందులోదే. ఈ సెక్టార్ రామేశ్వరానికి ఈశాన్యంగా 11 నాటికల్ మైళ్ల దూరంలోను, తలైమన్నార్‌కు ఆగ్నేయంగా 18 నాటికల్ మైళ్ల దూరంలోను ఉంది. ఈ దీవిలో వందేళ్ల నాటి సెయింట్ ఆంథోనీ కేథలిక్ చర్చి తప్ప జనసంచారం ఉండదు. 1974 లో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, సిరి మావో బండారు నాయకే మధ్య, రెండేళ్ల తరువాత రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగిన చర్చల మేరకు (కరుణానిధి హయాంలో) కచ్చాతీవును శ్రీలంకకు ధారాదత్తం చేసినట్టు కేంద్రం చెబుతోంది.
 
 కానీ 1974 నాటి ఒప్పందం ‘సగం అచ్చయిన రూపాయి నోటు’ వంటిదని వ్యాఖ్యానిస్తారు. ఎందుకం టే, ఆ అప్పగింతను పార్లమెంటు ఆమోదిం చాలి. అది జరగలేదు. తాజాగా కచ్చాతీవును భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు రాజకీయ పార్టీలు కోరుతున్నా యి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జూన్, 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు ఒప్పందాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కూడా ఆమె కోరారు. ఈ అంశం మీద కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కచ్చాతీవును తిరిగి స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని పేర్కొన్నది. దీనితో తమిళ పార్టీలకూ కేంద్రానికీ మధ్య ఘర్షణ అనివార్యమైంది.
 
 కచ్చాతీవు భారత యూనియన్‌లోనిదేనని కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. రామనాథపుర రాజవంశం ఏలిన ఎనిమిది దీవుల లో ఇదొకటి. అక్కడ చేపల వేటకీ, ముత్యాల వెలికితీతకీ ఆ వంశీయులే అబ్దుల్ మరికర్‌కు ఏడు వందల రూపాయలకు లీజుకు ఇచ్చారనీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఆ వంశీకుడు రాజకుమారన్ సేతుపతి ఇటీవలే చెప్పారు. ఈ పత్రాలను కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిందని కరుణానిధి కూడా జయకు సలహా ఇచ్చారు. కచ్చాతీవు శ్రీలంకదేనని 2010 ఆగస్టులో నాటి విదేశాంగ మం త్రి ఎస్‌ఎం కృష్ణ ప్రకటించారు. ఒకసారి ధారాదత్తం చేస్తే ఇక మనది కాదనీ, అక్కడకు వెళ్లే తమిళ జాలర్లకు రక్షణ కల్పించలేమనీ కూడా వెల్లడించారు. అదే సమయంలో భారత్ ఏ భూభాగాన్నీ ఎవరికీ అప్పగించలేదనీ, ఏ భూభాగం మీదా సార్వభౌమాధికారాన్ని వదులుకోలేదనీ తాజాగా కేంద్రం పేర్కొనడం విశేషం. శ్రీలంక కూడా ఘర్షణ వైఖరికే మొగ్గుతోంది. 1974 ఒప్పందం చెల్లదని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదని 2010 లోనే ఆ దేశం తమిళనాడు ప్రభుత్వానికి నోటీ సు ఇచ్చింది. ఇక, ఎల్‌టీటీఈ సమస్య దరి మిలా శ్రీలంక ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పుతో కచ్చాతీవులో తమిళజాలర్లు ప్రవే శం ప్రాణాంతకంగా మారిపోయింది. 1974 ఒప్పందం ప్రకారం ఇక్కడ భారతీయ జాలర్లు వేటాడవచ్చు. వలలు ఎండబెట్టుకోవచ్చు. ఈ అంశం మీదనే తమిళ పార్టీలతో పాటు బీజేపీ, సీపీఐ కూడా గళమెత్తాయి.
 
 కచ్చాతీవులో విజృంభిస్తున్న భారత వ్యతిరేక పవనాల గురించి కేంద్రం ఎందుకు కినుక వహిస్తున్నదో అర్థం కాదు. ఈ గొడవ మొదలైన తరువాత సెప్టెంబర్ 10న కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ సహాయ మంత్రి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ మరీ చిత్రమైన ప్రకటన చేశారు. ఢిల్లీలోని ప్రగతీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన విధంగానే కచ్చాతీవులో వాణి జ్య ప్రదర్శన నిర్వహించడం సాధ్యంకాగలదే మో శ్రీలంక ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెన్నైలో ప్రకటించారు.
 
 కేంద్రానికి కచ్చాతీవు లో వాస్తవ పరిస్థితులు తెలియవని తమిళ మేధావులు, ఆందోళనకారులు విమర్శిస్తున్న ది ఇందుకే. శ్రీలంక అజమాయిషీ ఆరంభమ య్యాక కచ్చాతీవును పవిత్రదీవి (చర్చి వల్ల) గా ప్రకటించింది. కానీ ఆ పుణ్యభూమిని భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చింది. చైనా అల్లుకుంటూ వస్తున్న ‘ముత్యాలదండ’ (పెర్ల్ గార్లెండ్) వ్యూహం మేరకు ఇప్పటికే కెదర్ (పాక్), హింగ్ హి (మయ న్మార్), మాల్దీవులు, అంబన్‌థొట్టా (లంక)ల లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు కచ్చాతీవులో డ్రాగన్ కదలికలు సుస్పష్టం. ఏటా ఆంథోనీ చర్చిలో జరిగే 3 రోజుల ఉత్సవాలకు మన రెండు దేశాల మత గురువులు, క్రైస్తవు లు హాజరవుతారు. భారతీయ క్రైస్తవులు చెప్పిన సమాచారం ప్రకారం కచ్చాతీవులో చైనా సేనల గుడారాలు ఉన్నాయి. భారత్ జాలర్లను వెంటాడి చంపుతున్న గస్తీ నౌకలలో చైనా సైనికులు కనిపిస్తున్నారు.
 
 కచ్చాతీవులో వేటాడే హక్కు తమిళ జాల ర్లకు ఉండాలని జయ కోరడం సబబే. కానీ అంతకుమించి కేంద్రం నిర్వహించాల్సిన గురుతర బాధ్యత కూడా ఉందని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. సుప్రీం నిర్ణయం తరువాత ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.ఇది  సాక్షి దినపత్రిక లో 18-09-2013 న ప్రచురింపబడిన వ్యాసం

Standard
సమాచారం

తెలంగాణా యాది మరవని రోజు

నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. భూస్వాముల అరాచకత్వం… నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ తెలంగాణా జనం ఏకమై కదం తొక్కారు. నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమ తిప్పకుండా తెగువ చూపారు. రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ప్రజల ఆకాంక్షకు ఆయుధాలుగా నిలిచాయి.

నిజామనగ ఎంతరా … వాడి తహతెంతరా…
అంతగలసి తంతె మల్ల వాడి అంతులేదురా…….

నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ……
హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. (కాళోజి)

రజాకారుల దుశ్చర్యలకు ఎదురొడ్డి సాగించిన ఆనాటి సాయుధ పోరాటానికి నిజాం నవాబు తలవంచక తప్పలేదు. హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు. నైజాం ప్రాంతం అనటం ఇప్పటికీ పరిపాటే.

వందల ఎకరాలను తన ఆధీనంలో ఉంచుకుని జనాన్ని నరకయాతన పెడుతున్న భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన నాటి ఉద్యమం… చివరికి సాయుధ పోరాటంగా మారింది. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని అణగదొక్కాలని నిజాము ప్రయత్నించాడు.. దీంతో సాయుద పోరాటం చిలికిచిలికి గాలివానగా మారింది. 1946లో రజాకార్లకు వ్యతిరేకంగా ఆరంభమైన నాటి ఉద్యమం… హైదరాబాద్ విమోచనమే లక్ష్యంతో ముందుకు సాగింది.రెండేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమంలో రజాకార్ల చేతిలో నాలుగున్నర వేల మంది పోరాట యోధులు నేలకొరిగారు. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలూ కీలక పాత్ర పోషించారు. 1947 సెప్టెంబర్ 11 న ఈ ఉద్యమం సాయుద పోరాటంగా మారింది. భారత ప్రభుత్వానికి, నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. 1948 సెప్టెంబర్ 13 న భారత సైన్యం రంగంలోకి దిగింది. ఓ వైపు సాయుధ పోరాటం… మరో వైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో (ఆపరేషన్ పోలో) చేసేదేమీ లేక అప్పటి నిజాం ప్రభువు చేతులెత్తేశాడు. అప్పటివరకు నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతం… నాలుగంటే నాలుగు రోజుల్లోనే భారతదేశంలో విలీనం అయిపోయింది.

ఇలా హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి.

►1930: మెదక్ జిల్లా జోగిపేటలో మొదటి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ జరిగింది.
►1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావం. (జూలై)
►1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం (సెప్టెంబర్).
►1938: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం గీతాలాపన.
►1944: దొడ్డి కొమరయ్య హత్యతో సాయుధ పోరాటం ప్రారంభం.
►1946: నల్గొండ జిల్లాలో నిజాం మిలటరీ దాడి ప్రారంభం.
►1947, డిసెంబరు 4: నిజాంపై నారాయణరావు పవార్ బాంబుదాడి.
►1946 ఆగష్టు 11: వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో బత్తిని మొగులయ్య గౌడ్ హత్య.
►1948 ఆగష్టు 21: పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు దారుణంగా కాల్చిచంపారు.
►1948 సెప్టెంబర్ 13 భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
►1948 సెప్టెంబర్ 17: నిజాం లొంగుబాటు.
……………………………………………………………………………………….
►1948 సెప్టెంబర్ 18: నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం.
……………………………………………………………………………………….

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard
Personalities

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

►1928లో కర్నూలు జిల్లా నంద్యాల లో జరిగిన ఆంధ్ర మహాసభలో రాయలసీమ కు ఈ పేరును సూచించి ఖరారు చేసారు. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని దత్తమండలం/సీడెడ్ (Ceded) అని పిలిచేవారు. నైజాంఆంధ్రసీడెడ్ ప్రాంతాలు అనేది ఇప్పటికీ సినమా ఇండస్ట్రీలో మార్కెటింగ్ సందర్భంగా వాడేమాటనే.

► 1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి ‘దత్తమండలం’ (సీడెడ్) అనేవారు.

►దత్తమండలానికి రాయలసీమ అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించాడని, గాడిచర్ల హరిసర్వోత్తమరావు సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర శ్రీ సర్వోత్తమజీవితంలో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసారు. నాడు జరిగిన సభలో గాడిచర్ల,చిలుకూరు నారాయణ రావు చేసిన సూచనను ప్రతిపాదించారు. అప్పటికే రాయలసీమ పదం పరివ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపిందట.

1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునరుద్ధరించి ఉంటాడని కొందరి వాదన.

రాయల సీమ విశేషాలను వేంపల్లి గంగాధర్ గారి పుస్తకం హిరణ్య రాజ్యంలో ఇక్కడ నుంచి చూడండి.

► 1883 సెప్టెంబర్ 14 న కర్నూలు లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు. వారి పూర్వీకులు వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాధమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్ధికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో1906 లో మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత రాజమండ్రి లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907 లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతావందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

► 1908 లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు విపరీతబుద్ధి (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.

► 1927 సంవత్సరంలోనే నంద్యాల నియోజక వర్గం నుంచి మద్రాసు శాసన మండలికి ఎన్నికైన గాడిచర్ల హరి సర్వోత్తమరావు నంద్యాల మొట్టమొదటి ఎమ్మెల్సీగా నిలిచారు.

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard