Telugu

ఇలా ఎవరిఫోటోని వాళ్ళే తీసుకుంటే దానిపేరు ‘‘ selfie ’’ అట
self-portrait అనేదానికి సంక్షిప్తరూపం.
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 2013 కు గానూ ఈ సంవత్సరపు పదం ( word of the year) గా ఎన్నికయ్యింది. ఈ పదాన్ని మొదటిగా ABC అనే ఒక ఫోరంలో సెప్టెంబర్ 2002 లో వాడారట. మత్తులో తన పెదవిని కొరుక్కున్నానని చూపించేదుకు దాన్ని ఫోటోగా తీసుకుని ఫోరంలో ఇలా పోస్టు చేసారట…..

“Um, drunk at a mates 21st, I tripped ofer [sic] and landed lip first (with front teeth coming a very close second) on a set of steps, I had a hole about 1cm long right through my bottom lip. And sorry about the focus, it was a selfie.”

కొత్త పదాన్ని వాడిన ఆస్ట్రేలియన్ కి పెదవి తెగటమేమో కానీ దేశం ఈ పదాన్ని చూసుకుని మేము కనిపెట్టిందే అని మురిసిపోతోంది. కుట్లతో వున్న అతగాడి పెదవి ఫోటో కూడా అతని మొహంకంటే ప్రముఖంగా ప్రచారంలో హల్ చల్ చేస్తోందట.

అవునుకదా ఎవరూ కనిపెట్టకపోతే భాషెలా పుడుతుంది?
జంగమయ్యా వేసుకో రెండు వీరతాళ్ళు  (ఇక్కడ పెదవిని కుట్టే తాళ్ళు, కొత్త పదాలను విప్పే తాళ్ళు కావచ్చు)

మరి దీన్ని తెలుగులో ఏమందాం?

స్వీచి (స్వీయ చిత్రణ) లాగా మరింత మంచి పేర్లుంటే సూచిస్తారేంటి?

Standard
telugu poetry

అనిర్వచితాలు

చప్పట్లని ఫోటో తీద్దామనుకున్నాను
కలిసివిడిపోతున్న చేతులు తప్ప
చూపించేదేమీలేక ఓడిపోయాను.

భక్తిని బొమ్మగీద్దామనుకున్నాను
భంగిమలను కొలుచుకోవడం తప్ప
బయటకు తేగలిగిందేమీ లేదు.

అమ్మప్రేమను విందామని చెవులు రిక్కించాను
పూల మృదుత్వాన్ని అనుభవించాలని గ్రంధాలన్నీ వెతికాను.
వెలుతురు వాసనలను తెలుసుకోవాలని పరికరాలను కోరాను.
అలసిపోవడం తప్ప తెలుసుకున్నదేం లేదు.

ఆఖరుకి కవిత్వాన్నయినా నిర్వచిద్దామనుకుంటే
పదాలకూ, శబ్దాలకూ అందకుండా
మనసుపై కదలాడే అనుభూతి చినుకుని
అచ్చంగా అంటుకోలేకపోతున్నాను.

ఇంద్రియాలకందని జ్ఞానమేదో
అనుభూతి రంగుల్ని వెదజల్లటం
చాలక నాడుల్ని వాడకుండానే
కదలాడే క్రమాలు స్పర్శిస్తూ వెళ్ళటం
టింపానం ప్రకంపించకుండానే
తరంగాలు మ్రోగుతూ వెలగటం
మాటలుగా చెప్పలేక అశక్తుడనవుతూనే వుంటాను.

అయినా పట్టువదలని విక్రమార్కుడు
అక్షరాన్ని భుజంపై వేసుకుని మౌనంగా నడుస్తూనే వుంటాడు.
తీరా అదేదో అర్ధం అయినా
భాషను సాధనంగా చేసుకుని చెప్పాలని చూస్తే
అనుభూతి వేయివ్రక్కలవుతుందనే ఎరుకను కూడా మదిలో మోస్తూ.

22-11-2013

Standard
సమాచారం

మేల్ కొలుపు : మగవాళ్ళ దినోత్సవం

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో – 2012 అధికారిక నివేదిక ప్రకారం  వివాహితులైన పురుషులలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 63,343 ఇది వివాహితులైన స్త్రీల ఆత్మహత్యలు (31,921) కంటే రెట్టింపుగా వుంది. వేరుపడిన పురుషులలో 2043 మంది ఆత్మహత్యలకు  పాల్పడ్డారట మహిళలలో ఈ సంఖ్య 1240 గావుంది. తమ కుటుంబంలోని కలహాల వల్ల జీవితాలను చాలించిన మగవాళ్ళ సంఖ్య 7541 గా వుంది. ఇలా వత్తిడికి లోనవుతున్న వర్గంలో మగవాళ్లు కూడా వున్నారు గమనించండంటూ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మరీ ‘మేల్’ తలపెట్టాలని కోరుతున్నారు. వృత్తి పరమైన వత్తిడులూ, కుటుంబం తాలూకూ భాద్యతలతో పాటూ ఈ మధ్య సమాజమూ, మీడియా దృష్టిలో దోపిడీ వర్గంలాంటి కోణం లోకి నెట్టివేయబడటమూ జరుగుతోందనేది కూడా వీరి ప్రధాన వాదన మార్చి 8 అంతర్జాతియ మహిళాదినోత్సవం సంతోషమే. మరి మగాళ్ళకు మీకెందుకు దినోత్సవం అంటూ మహిళా సంఘాలు విరుచుకుపడాల్సిన అవసరం ఏమిటనేదీ ప్రశ్నే?


ఇదేమీ ఒక్క దేశపు సమస్య కాదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
 (International Men’s Day) ప్రతి సంవత్సరం నవంబరు 19 తేదీన జరుగుతోంది. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ మరియు టొబాగో లో 1999 లో ప్రారంభించబడినది. బాలుర పురుషుల ఆరోగ్యం పై శ్రధ్దపెంచడం. జెండర్ రిలేషన్స్ ని మెరుగుపరచడం. ఆదర్శవంతమైన రోల్ మోడల్ గా వున్న మగవాళ్ళను ముందుకు తీసుకురావడం తద్వారా కూడా వ్యక్తులలో అలముకుంటున్న చీకటి ప్రవృత్తులను తగ్గించేందుకు ప్రయత్నించడం. దోషాలను ఆపదిస్తూ ఏర్పడుతున్న, ఏర్పడిన ప్రతికూల వివక్షనుండీ నిజాల కోణాన్ని చూపించడం.లాంటి ప్రధాన లక్ష్యాలను దృష్టిలో వుంచికుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవస్థలోని ఏదో స్వార్ధపూరిత అస్తవ్యస్థత అన్నివైపులా తినేయాలని చూస్తున్నప్పుడు. కనీసం బాధ పడేవాళ్ళన్నా ఆ విషయాన్ని గమనించాలి. మగాడంటే మృగాడే ననే నేటి మారిపోయిన పరిస్థితులలో మీడియా సైతం వార్తాంశంగా తీసుకునేందుకు జంకుతున్నట్లుంది. నిజానికి అమ్మా, నాన్నా ఇద్దరూ సక్రమంగా వుంటేనే కుటుంబం సంతోషంగా వుంటుంది. సమాజం నడిచేందుకు కూడా స్ర్తీ,పురుషులిద్దరూ సమానంగానే కావాలి. 


(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard
Videos

‘రీయూనియన్’ గూగుల్ యూట్యూబ్ విడియో : మంచి విషయం తో ప్రభంజనం

గూగుల్ తన మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే చేసి వుండొచ్చుగాక కానీ ఈ ‘‘రీయూనియన్’’ విడియో నిడివి చాలా చిన్నది. కేవలం మూడున్నర నిమిషాలు మూడుగంటల సినిమాకంటే పెద్దవిషయాన్ని చెప్పినట్లు అనిపిస్తుంది. మనసున్న ప్రతిఒక్కరికండ్లలో నీళ్ళు సుడులు తిరిగి పెల్లుబికేలా చేసేసింది.
1947 లో భారత్ పాకిస్థాన్ లు విడిపోయిన తర్వాత వేర్వేరుగా ఇండియాలో, ఒకరూ పాకిస్థాన్ లో ఒకరు స్థిరపడిపోయిన ఇద్దరు మిత్రులు కలయిన దీనిలో ప్రధానాంశం. అడ్రసులు వెతుక్కోవటం, రూట్ మాప్ చూడటం, వేర్వేరు ప్రాంతాల వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం లాంటి విషయాలలో గూగుల్ ఇప్పుడు ఎంతలా ప్రధానాంశం అయ్యిందో అండర్ కరెంట్ గా చూపించటం ముఖ్యంశమే అయినప్పటికీ.విడియో చూస్తున్నంత సేపు అది గూగుల్ కోసం యాడ్ లా కాకుండా మామూలు విషయమే అన్నట్లు నడుస్తుంది.

ఇక కథాంశానికి వస్తే….

మిస్టర్ మొహ్రా ముసలి తనం లో తన చిన్నప్పటి పాత జ్ఞాపకాలను మనవరాలు సుమన్ తో పంచుకుంటాడు.తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు యూసఫ్ గురించి చెపుతాడు.  పార్క్ గేటు ముందు గాలిపటాలను ఎగరేస్తూ ఆడుకునే వాళ్ళమని, తర్వాత యూసఫ్ వాళ్ళ స్వీట్ షాప్ లో జఝరియా స్వీట్ (ఇది కూడా భలే ఎన్నుకున్నారు, భారతీయ పద్దతిలో తయారు చేసే పాకిస్థానీ తీపి) తినే వాళ్ళమని చెప్పిన ఆధారాలు షాప్ అడ్రస్ ను గూగుల్ పట్టిస్తాయి. మొహ్రా 60వ పుట్టిన రోజు (లాజికల్ గా ఇది తప్పు ఎందుకో మీకు సులభంగానే తెలిసిపోతుంది) బహుమతిగా ఆ ఇద్దరు స్నేహితులనూ కలపాలనుకుంటుంది. సుమన్.
గుగుల్ సహాయంతో అడ్రస్, కాంటాక్ట్ వివరాలు కనుక్కుని ఫోన్ చేసి మాట్లాడుతుంది.( ఇక్కడ కూడా గూగుల్ చాట్ లాంటిది వాడి అతి కమర్షియలైజ్ చేయకుండా సహజంగా ఏంచేస్తామో అదే చూపగలగటం కూడా గూగుల్ గొప్పతనమే). యూసఫ్ మనవడు ఆన్ లైన్ టికెట్ బుక్ చేసి, ఢిల్లి వాతావరణం ఎలావుంటుందో గూగుల్ లో చెక్ చేసుకుని వస్తారు.
చివరికి ిఇంటి తలుపు కొట్టి ముందునిల్చున్న వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడే ననే విషయం తెలుసుకున్న విస్మయంలోంచి వచ్చిన ఆనందం. ఆ ఇద్దరు పెద్దవాళ్ళను కలపగలిగామన్న సంతృప్తినిండిన గర్వంతో సుమన్ కళ్ళు చెమ్మగిల్లటం ఖచ్చితంగా ప్రేక్షకులను కదిలిస్తుంది.
ఏమో ఇలా నన్నా పెద్దవాళ్ళ కోరికలకూ, జ్ఞాపకాలకూ విలువ వుంటుందనే స్పృహ పెరుగుతుందనే, యూట్యూబ్ లో ఈ విడియోను చూస్తున్న మిలియన్ల మిత్రుల సాక్షిగా అనపిస్తోంది.

ఎవరన్నారు మంచికి ఆకట్లుకునే స్వభావం లేదని……

This isn’t the first time Google has used a heart-wrenching story from the subcontinent to advertise its products. You may remember the true story of an Australian man adopted from India who used Google Maps to reconnect with his birth family.

ఇటువంటి చక్కటి విడియో తయారు చేయటం యూట్యూబ్ కు ఇదే మొదటి సారి కాదు గతంలో మనసుని మెలిపెట్టే ఖండాంతర కథనం ఒకటి గతంలో తయారు చేసిన విషయం గుర్తుండే వుంటుంది. భారత దేశం నుంచి దత్తత వెళ్ళిన ఆస్ట్రేలియన్ గూగుల్ మేప్ ల సహాయంతో తిరిగి తన పుట్టిన గడ్డకు చేరుకోవడం అనే కధాశం ఇది. అలాగే అది కూడా అంతే కేవలం మూడు నిమిషాల మూడు సెకన్ల విడియో అంటే ిఇప్పటి విడియో కంటే 30 సెకన్లు తక్కువ.

Standard
Videos

దాడులను శాస్త్రీయపద్దతిలో నియంత్రించలేమా?

కేవలం కడుపుమంటతోనో, ఆవేశంతోనే దూసుకొచ్చే మామూలు జనం తాలూకూ సెగలు కావచ్చు,
వారిలో కొంతమంది కావాలని చేరిన విద్వంసకారులున్న గుంపులు కూడా అయ్యి వుండవచ్చు.
ఏమాత్రం శిక్షణలేని పద్దతులు తెలియని గుంపులను ఎదుర్కొనేందుకు మన దళాలకు వున్న శిక్షణ ఎలాంటింది.
బషీర్ బాగ్ లాంటి, ముదిగొండలాంటి ఘటనలు జరిగినపుడు, ప్రభుత్వ దళాలు కూడా అనవసరమైన హడావిడికీ గందరగోళానికీ గుంపులతో సమానంగా దూకుడుగా వ్యవహరించి నష్టాలను కలిగించుకోవటం చూస్తున్న మనకి.

ఈ కొరియన్ సైనిక దళాలు, ఒక పద్దతి ప్రకారం శాస్త్రీయంగా గుంపుని ఎదుర్కోవటం చూస్తే,
తుఫానులూ, భూకంపాలూ, సునామీలే విపత్తులు కావు. ముట్టడులూ, ప్రజాస్వామికమనే పేరుతో నడిచే ఆవేశాలూ ఒకరకమైన విపత్తులే వీటి నిర్వహణకు మన దళాలకు ముందస్తుగా ఇటువంటి శిక్షణా ఏర్పాట్లు చేసుకోలేని దశలో వున్నామా మనం.

మాస్ ప్రొటస్ట్ కంట్రోల్ విషయంలో కొరియన్ దళాలు ఎలా వ్యవహరించాయో తెలుసుకోవాలనుకుంటే ఈ విడియో చూడండి.

బయటినుండి దళం మొత్తాన్నీ మైక్ లో ఒక కంఠం నిర్దేశించటం.
ఒక క్రమంలో వ్యూహాత్మకంగా ముందుకు రావటం.
గుంపు చేసే బలప్రయోగానికీ వారి దూకుడుకూ అనుగుణంగా ఎత్తుగడలను మార్చడం.
దుందుడుకుగా వచ్చేవారినీ, ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఇతర పదార్ధాలను లంఘించి గుంపుమధ్యలోకి చేర్చి పక్కకి చేర్చి గుంపును సైకలాజికల్ గా బలహీనపరచటం.
ఎంత గందరగోళం జరుగుతున్నా ఒక ఉక్కు గోడలా వారి క్రమశిక్షణతో నిర్మాణాన్ని చెక్కచెదరకుండా నిలుపుకోవడం.
జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి విషయాలు చాలా అబ్బురం అనిపిస్తాయి.

మహా భారతంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చే వ్యూహం ‘‘పద్మవ్యూహం’’ పద్మం ఆకారంలో సైనిక నిర్మాణం చేసి శత్రువులను బంధించటం. అభిమన్యుడు దానిలో చిక్కుకున్న కథ చదువుకున్నాం.

ఈ మధ్య కాలంలో మెలూహా మృత్యంజయులులో కూడా అమిష్ ఇటువంటి ప్రక్రియలనే వివరిస్తాడు. NCC,స్కౌటింగ్ లాంటి శిక్షణలలో చెప్పే విషయాలు నిజజీవితంలో సమస్యలను ఎదుర్కునే దళాలకు ఇవ్వరా? ఏమో నాకా ప్రొఫెషనల్ డీలింగ్ సంఘటన ఎక్కడా గమనించినట్లు ఎరుకలో లేదు.

విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని, వ్యూహా శాస్త్రనిపుణులు వివరిస్తారు. సైన్యం తక్కువుగా ఉన్నప్పుడు ఎదుటి సైన్యం ఎక్కువుగా ఉన్నప్పుడు తమ తక్కువ సైన్యం ఎక్కువ సైన్యాన్ని గెలవడానికి వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్న ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి.

మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహాం, గరుడ వ్యూహాం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో కనిసిస్తున్నాయి. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆ పశువులు కానీ, ఆపక్షులు కానీ తమ శత్రువులతో ఎలా పొట్లాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు

చక్రవ్యూహం లో అభిమన్యుడు ప్రవేసించే చిత్రం రాతిపై శిల్పరూపంలో.

రోజువారీగా మహా భారత కథలో వర్ణించిన యుద్ధ విశేషాలు

వివిధ దినాలలో కురు పాండవ సేవలు పన్నిన వ్యూహాలిలా ఉన్నాయి.
యుద్ధం రోజు పాండవ వ్యూహం కౌరవ వ్యూహం విశేషాలు
1 వజ్ర వ్యూహం సర్వతోముఖ వ్యూహం కృష్ణుడు అర్జునునకు గీతోపదేశం చేశాడు. భీష్ముడు దావానలంలా విజృంభించాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతనిని కాస్త నిలునరించ గలిగారు. ఆరోజు పాండవులు చింతా క్రాంతులయ్యారు.
2 క్రౌంచ వ్యూహం త్రికూట వ్యూహం అర్జునుడు భీష్ముని తీవ్రంగా బాధించాడు. భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోల పరచాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోవడం భీష్మ ద్రోణులకు కూడా సాధ్యం కాలేదు.
3 అర్ధచంద్ర వ్యూహం గరుడ వ్యూహం భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావానలంలా దహించాడు.
4  ?  ? అభిమన్యుడు, భీముడు విజృంభించారు. తొమ్మండుగురు కౌరవ సోదరులు భీముని చేత హతులయ్యారు. ఘటోత్కచుని మాయాయుద్ధంతో కౌరవసేన కకావికలయ్యింది.
5 శ్యేన వ్యూహం మకర వ్యూహం పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. విజయం ఎటూ కాకుండా పోయింది. భూరిశ్రవుని చేత సాత్యకి కొడుకులు పదిమంది మరణించారు. అర్జునుడు పాతికవేల రధికులను నిర్జించాడు.
6 మకర వ్యూహం క్రౌంచ వ్యూహం భీముడు, పాండవుల కొడుకులు ఐదుగురూ కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించారు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు.
7 వజ్ర వ్యూహం మండల వ్యూహం కౌరవులలో భీష్ముడు, పాండవులలో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేశారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమేశాడు. సాత్యకి అలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు ధాటికి శ్రుతాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు.
8 శృంగాటక వ్యూహం కూర్మ వ్యూహం భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు అలంబసునిచేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగింది.
9  ? సర్వతోభద్ర వ్యూహం భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారియై భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపడం సాధ్యం కాదనుకొన్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్ధించారు. పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు
10  ?  ? భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరేవైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలువలేకపోయాడు. అర్జునుడి శరపరంపరకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు.
11 క్రౌంచ వ్యూహం శకట వ్యూహం కౌరవ సేనాపతిగా ద్రోణుడున్నాడు. కర్ణుడు మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డం పడ్డాడు. మరుసటిరోజు అర్జునుని రణరంగంనుండి దూరంగా తీసుకెళ్ళాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగం పన్నారు.
12 మండలార్ధ వ్యూహం గరుడ వ్యూహం సంశప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వచ్చారు. భగదత్తుని వైష్ణవాస్త్రం కృష్ణునివల్ల వ్యర్ధమయింది. అర్జునుడు భగదత్తుని వధించాడు. కర్ణార్జునులు తొలి ద్వంద్వయుద్ధం చేశారు. మరునాడు అర్జునుని ఇంకా దూరంగా తీసుకెళ్ళాలని, తిరిగి రానీయమని సంశప్తకులు మాట యిచ్చారు.
13 (సాధారణ వ్యూహం) పద్మ (చక్ర) వ్యూహం
(తమ్మి మొగ్గరము)
ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. పద్మ వ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. తక్కిన పాండవులను జయద్రధుడు వ్యూహ ద్వారంలో ఆపేశాడు. ఒంటరియైన అభిమన్యుడు ఏడుమార్లు తనను చుట్టుముట్టినవారిని మట్టి కరిపించారు. ఎనిమిదవ సారి అభిమన్యుని అన్నివైపులనుండి చుట్టుముట్టి వెనుకనుండి నిల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిన పూనాడు.
14  ? శకటవ్యూహం +
పద్మవ్యూహం +
సూచీవ్యూహం
ద్రోణుని వ్యూహ రచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందరినీ జయించి తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శ్రుతాయుధుడు, కృతవర్మాదులు, విందానువిందులు అర్జునునిచేత మరణించారు. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్మర్షణుడు, దుర్మధుడు, శత్రుంజయుడు వంటివారు భీమునిచేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిన నెరవేర్చుకొన్నాడు. రాత్రి పూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పెట్రేగిపోయాడు. అర్జునుని చంపడానికి దాచుకొన్న శక్తిని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతేర్చాడు.
15 ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు “అశ్వత్థామ” (అనే ఏనుగు) మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధృష్ష్టద్యుమ్నుడు ద్రోణుని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణార్జునుల శక్తియుక్తులవలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు.
16 అర్ధచంద్ర వ్యూహం మకర వ్యూహం అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోను, కర్ణుడు నకులునితోను, అర్జునుడు సుశర్మతోను ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడూ, కర్ణుడూ ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనునికి మాట యిచ్చాడు.
17 దుర్జయ వ్యూహం  ? దుర్యోధనుని ప్రార్ధననంగీకరించి కర్ణునికి సారధ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడి పరుష వ్యంగ్య వచనాలకు కర్ణుడు నొచ్చుకొన్నాడు. కర్ణుడూ, కర్ణుని కొడుకులూ చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాచేశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాసనుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం ప్రళయ సమానంగా సాగింది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రధం భూమిలో దిగబడినపుడు అర్జునుడు అంజలికం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు.
18 త్రిశూల వ్యూహం సర్వతోభద్ర వ్యూహం దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. యుధిష్ఠిరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధారసైన్యాన్ని ఊచకోత కోసేశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయారు. దుర్యోధనుడు పరిసరారణ్యాలకుపోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ధర్మరాజు వచ్చి మాటాడిన పరుషవాక్యాలతో దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధానికి సిద్ధుడయ్యాడు. భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి అక్కడవదిలేసి వెళ్ళారు. తరువాత అర్జునుని కపికేతనం, దివ్యాస్త్రాలు అదృశ్యమయ్యాయి. రధం భస్మమైపోయింది. అశ్వత్థామ సుయోధనుని కలిసి అపాండవం చేస్తానని మాట యిచ్చాడు. (తరువాతి కథ “సౌప్తిక పర్వం”లో ఉంది.)

Standard
సమాచారం

సదర్ పండుగ : ఏ సాంస్కృతిక మూలాలనుంచి వచ్చింది?

సదర్ ప్రదర్శనను ఆసక్తిగా చూస్తున్న జనం
ఏంటీ పండుగ?
సదర్ పండుగ ప్రధానంగా పశువులకు ఇంకా చెప్పాలంటే దున్నపోతులకు సంభందించినది.

ఎప్పుడు జరుగుతుంది?

ఇది దీపావళి మరుసటిరోజు 

సదర్ అంటే అర్ధం ఏమిటి? ఇది ఏ భాషా పదం?

సదర్(सादर ) అనే పదం హిందీ నిఘంటువు ప్రకారం ‘‘ RESPECTFULLY ’’ అనే అర్ధంలో ఉపయోగించారు. అంటే గౌరవసూచకంగా ప్రదర్శించడం, గౌరవించడం అనే అర్ధంలో వాడి వుంటారనుకోవచ్చా. 
सदृश होना {sadaRash hona} అంటే TAKE AFTER అనే అర్దం వుంది.
सादृश {sadaRash} అంటే వున్న AGREEMENT అనే అర్ధమూ
सादृश्य {sadaRashy} అంటే వున్న APPROXIMATION అనే లాంటి అర్ధం కూడా ఈ పండుగ విధానానికి దగ్గరగానే వున్నాయి. ముస్లింల పాలనలో వున్న తెలంగాణా ప్రాంతానికి సంభందించిన పండుగ పేరు వెనకున్న అర్ధం కాబట్టి హిందీ ఉర్దూ మాటల నుండి ప్రయత్నించటంలో తప్పులేదను కుంటాను. 

Etymology ప్రకారం పరిశీలిస్తే

Hindi లో వాడుకలో వున్న ఈ పదాలలో sar అనేది Persian మూలంలోని అర్ధాన్ని తీసుకుంటే head అని dar అంటే holder అని తెలుస్తుంది. ఈ ఉత్సవంలో ప్రధానంగా తలను ఒడుపుగా పట్టుకుని దున్నపోతును వెనుక రెండు కాళ్లపై నిలుచునే లా చేస్తారు కాబట్టి కూడా సదర్ అని వుంటారని అనుకోవచ్చు.

ఎవరు చేస్తారు?

యాదవులకు ఇది ప్రధాన పండుగ, తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా నిర్వహిస్తారు. తమ ఉనికికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహించుకుంటున్నామని యాదవులు తెలియజేస్తారు.

పూర్వ చరిత్ర ఏమిటి?గంగిరెద్దుల ఆటకు దగ్గరగా అనిపించే ఈ సదర్ ఉత్పవాన్నిపాతబస్తీలోని సైదాబాద్‌లో జరిగే యాదవ సదర్ వేడుకలను స్వయంగా నిజాం నవాబు స్వయంగా వీక్షించి ప్రోత్సహించేవారట. 

పండుగ సందర్భంగా ఏం చేస్తారు?

తమ దున్నపోతులను చూడ ముచ్చటగా సింగారించి… రాజదర్పంతో అలంకరిస్తారు. అలంకరణ కోసం మంచి

సదర్ ప్రదర్శనలో భాగంగా దున్నతో విన్యాసం

పువ్వుల దండలు వేస్తారు, కొమ్ములకు రంగులు వేస్తారు. శరీరంపై కూడా రంగులతో రకరకాలుగా అలంకరిస్తారు.సాంప్రదాయ సొబగులు అద్దుతారు. పూలదండలు, రంగులు, నెమలి ఈకలు, ఫించాలతో రమణీయంగా తయారు చేస్తారు. ఇలా అలంకరించిన దున్నపోతులను వీధులగుండా ఊరేగింపుగా తీసుకెళతారు. గుంపుల్లో రకరకాల వాయిద్యాలు వాయిస్తారు. ప్రధానంగా మంచి హుషారిచ్చే తీన్ మార్ దెబ్బలకు జనం చిందేస్తుంటారు. అంతే కాకుండా ఈ జంతువులతో విన్యాసాలు చేయిస్తారు. ప్రధానంగా వాటిని వెనుక కాళ్ళపై నిలబడేలా చేస్తారు. వాటి ముట్టె బాగంలో ఒడుపుగా పట్టుకోవడం ద్వారా ఈ విన్యాసాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఇలా చక్కటి విన్యాసాలు చేయించిన వారికి ప్రత్యేకంగా బహుమతులను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందుకాళ్ళను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ప్రధానం చేస్తారు. దీనినుంచి బలమైన, నాణ్యతగల మన్నికైన దున్నలను ప్రదర్శిస్తారన్నమాట

ఉపయోగం ఏమిటి?

యాదవుల ఐక్యతకు, అస్తత్వానికీ ప్రతీకగా ఈ పండుగను చెపుతారు. పశువుల ఎడల తమకున్న శ్రధ్దను, వాటి పెంపకంలో తాము తీసుకున్న జాగ్రత్తలను తెలియజేయటం ద్వారా పశుసంపద పెంపొందించుకోవాలనే ఉత్సాహాన్ని పెంపొదిస్తుందని అంటారు. అలాగే ఇది మత సామరస్యానికి కూడా ఒక ప్రతీక గా చెపుతారు. 


ఇబ్బందులేమిటి?

అయితే ఈ విన్యాసాల సందర్భంగా కొన్నిసార్లు దున్నపోతులు అదుపుతప్పటం, దానివల్ల దగ్తరలోని జనం గాయాల పాలవటం కొండొకచో వ్యక్తులు మరణించడం జరుగుతోంది. జంతువుల మూపుపై కెక్కి డాన్సులు కట్టడాన్ని కూడా జంతు ప్రేమికులు నిరసిస్తున్నారు. అయితే సదర్ పండుగ ‘‘ బుల్ ఫైట్’’ ‘‘జల్లికట్టు’’ లాగా జంతువులను కష్టపెట్టి ఆనందించే ఆట కాదని, శ్రధ్దతో వాటిని అలంకరించి గౌరవించి వాటి విన్యాసాలను, తాము అదుపు చేయగల సామర్ధాన్నీ చూపెట్టే ప్రక్రియ మాత్రమే నని సమాదానంగా అంటున్నారు.
Standard