History

అలంపురం ఆలయాల కథలు

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె ప్రాణత్యాగం చేసింది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది.

ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావింపబడినది. (సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరం లు దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా భావింపబడినాయి).

జోగులాంబ (ఐదవ శక్తిపీఠం) అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. – ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ – కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగ’, ‘భద్ర’ నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా అభివర్ణిస్తూ ఉంటారు.

ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.పాతకాలం నాటి జోగులాంబ గుడి 14 వ శతాబ్దంలో బహమని సుల్తాన్ల దాడిలో శిధిలమయినది. కాగా, అమ్మవారి విగ్రహాన్ని మరియు అమ్మవారి శక్తులయిన చండి మరియు ముండి విగ్రహాలను బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలో 2005 వరకు భద్రపరిచి ఉంచారు. ప్రస్తుతము శిథిలం కావించబడిన ప్రదేశంలోనే తిరిగి అమ్మవారి గుడిని పునర్నిర్మించారు. క్రొత్త గుడి చాల చక్కగా, అందంగా నిర్మించారు. అమ్మవారి గుడి చుట్టూ ఒక నీటి కోనేరు కట్టారు. ఆ గ్రామస్తులు చెప్పేదాని ప్రకారం జోగులాంబ అమ్మవారు చాలా ఉగ్రమయిన శక్తి స్వరూపిణి. కాబట్టి ఆ కోనేరు ఆమెను శాంత పరుస్తూంటుంది.
అలంపురం జోగులాంబ విగ్రహం చాలా విచిత్రం గా ఉంటుంది. ఈమె కుర్చోని ఉంటుంది. తలలో చాలా జుట్టు ఉంటుంది. ఆ జుట్టులో బల్లి, తేలు, గబ్బిలం మరియు మనిషి పుఱ్ఱె ఉంటాయి.

నవబ్రహ్మ దేవాలయములు

నవబ్రహ్మ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు.

తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనేవి ఆ తొమ్మిది దేవాలయములు.వీటిలో బాల బ్రహ్మ పెద్దది, ఇక్కడి శాసనాల ఆధారంగా దీనిని క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా గుర్తించినారు.

తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలాలలో ఉన్నది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు! దీనియందు ఆరు, ఏడవ శతాబ్దాలకు చెందిన తెలుగు శాసనాలు కలవు.
స్వర్గ బ్రహ్మ దేవాలయం అలంపూర్ నందలి దేవాయలములలో సుందరమైనదిగా చెప్పబడుతున్నది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందులో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలు కలవు.
పద్మ బ్రహ్మ దేవాలయం. ఇది కూడా పాక్షికంగా శిథిలమైపోయినది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం కలదు.
విశ్వబ్రహ్మ దేవాలయం చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారతాలనుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కినారు.

ఆలయాల పట్టణం

పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి . 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో కలవు. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

పురావస్తు ప్రదర్శనశాల

ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉన్నది. దీనిని 1952 లో ఏర్పాటుచేశారు. ఇందులో క్రీ.శ.6 వ శతాబ్దము నుంచి క్రీ.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి.

సప్త మాతృకలు

ప్రాచీన కాలంనాటి ఇటువంటి ఆలయాలను దర్శించినప్పుడు, సప్త మాతృకల ప్రతిమలను మలచడంలో వాళ్లు తీసుకున్న శ్రద్ధాసక్తులు స్పష్టమవుతాయి. ఒకే వరుసలో పద్మాసనంలో కూర్చున్నట్లుగా కనిపించే ఈ సప్త మాతృకలు ఆనాటి శిల్పకళా వైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి

బ్రహ్మణి’ … ‘మహేశ్వరీ ‘ … ‘కౌమారి’ … ‘వైష్ణవి’ … ‘వారాహి’ … ‘ఇంద్రాణి’ … ‘చాముండి’ దేవతలను సప్త మాతృకలు అంటారు.

దేవీ పురాణం … బ్రహ్మవైవర్త పురాణం … స్కంద పురాణం … సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి.

పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో, వాడిని సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అంధకాసురుడితో రుద్రుడు పోరాడుతూ వుండగా ఆ రాక్షసుడి నుంచి చిందిన రక్త బిందువులు రాక్షసులుగా మారేవి. విషయాన్ని గ్రహించిన శివుడు … మహేశ్వరిని రంగంలోకి దింపాడు. ‘వృషభ’ వాహనంపై ఆమె యుద్ధభూమిలోకి ప్రవేశించింది.

దాంతో బ్రహ్మ పంపిన బ్రహ్మణి ‘హంస’ వాహనంపై … విష్ణుమూర్తి పంపిన వైష్ణవి ‘గరుడ’ వాహనం పై … కుమార స్వామి పంపిన కౌమారీ ‘నెమలి’ వాహనం పై … వరాహమూర్తి పంపిన వారాహి ‘మహిష’ వాహనం పై … ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ‘ఐరావతం’ పై … యముడు పంపిన చాముండి ‘శవ’ వాహనం పై యుద్ధభూమికి చేరుకున్నాయి. ఈ శక్తి స్వరూపాల సాయంతో అంధకాసురుడిని శివుడు సంహరించాడు.

కూడలి సంగమేశ్వరాలయం

మరోకటి కూడలి సంగమేశ్వరాలయం ఇది 1980 కి పూర్వం కృష్ణా తుంగభద్రల సంగమప్రాంతమైన కూడలిలో వుండేది.

తుంగభద్రానది కృష్ణతో కలిసే కూడలి లేక కూడవల్లిలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని, శిలాలయాలకు మరింత కొత్త సొబగులను రంగరించి నిర్మించారు. పదడుగుల ఎత్తైన వేదిక పై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణా? అన్నట్లు నిర్మించారు. వేదికపైన ఆలయ ద్వారం పక్కగా శంఖనిధి, పద్మనిధి, విగ్రహాలు, గంగ, యమున, అర్ధనారీశ్వర , హరిహర, గజలక్ష్మి, అష్ట దిక్పాలకుల విగ్రహాలే కాక, ఎన్నో లతలను, హంసలను చెక్కారు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ అవస్థలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిలం అశ్చర్యాన్ని గొల్పుతుంది.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ప్రాజెక్టు ముంపుప్రాంతంలో వున్నందున. మొత్తం ఆలయాన్ని అలంపురానికి తరలించి పునర్నిర్మించారు. ఒక కట్టడం మొత్తాన్నీ అవే ఆధారాలతో నిర్మించటం దేశంలో ఇది తొలిసారి. ప్రపంచంలో ఇది రెండవది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులలో రెండవ పులకేశీ సమయంలో నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి అంచనాకు వచ్చారు కానీ ఇది 5200 ఏళ్ళకు పూర్వపు గుడి అని ద్వాపర యుగంలో ధర్మరాజు నింబదారు శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పౌరాణికంగా నమ్ముతారు.ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి, లింగాల కోసం భీముడిని కాశికి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉన్నది
ఇక్కడ అపురూపమైన శిల్ప సంపదా దేవతా విగ్రహాలూ వున్నాయి.కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కాని వరద సమయాల్లో ఆలయంలోనికి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్రానది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం ఉండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవ గ్రహాల ఆలయాల సముదాయాన్ని నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణం వల్ల కర్నూలుకు ఆ పేరు వచ్చిందని చెప్పే ఒక ఆసక్తికరమైన కథ ఒకటి వుంది.

ఆలయ నిర్మాణాలకవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలంచే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారి కొక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలు గా మారింది.

శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర, అలంపుర ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా….. పురావస్తు శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని , పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవ గ్రహాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాధ గట్టు పై కట్టారు. కాని ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నంది కొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు. త్రివేణి సంగమ శిల్పం మాతం హైదరాబాదు లోని పురావస్తు శాఖ వారి ప్రదర్శన శాలలో ఉన్నది. ఇది పబ్లిక్ గార్డెన్ లో ఉన్నది. నివృత్తి సంగమేశ్వరాలయం అలాగే నీటిలోనే మునిగి ఉన్నది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.

మొలక సీమ వైపు ‘నివృత్తి సంగమం’ కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని’ నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనదీ సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు.ప్రజల పాపా ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం.

నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు.

from Blogger http://bit.ly/Mi5kw0
via IFTTT

Advertisements
Standard

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s