History
మహిళ కాళ్ళవద్ద దేన్నో గుంచుతున్న మర్కటాన్ని చూడొచ్చు

బహుశా చాలామందికి తెలిసిన విషయాలే అయ్యుంటాయి. కానీ ఆశ్చర్యంగా అనిపించినవి కొన్ని పంచుకుందాం అనిపిస్తోంది.

1) 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా వుంటుంది. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. 

2) శిల్పాలనుంచి ఏం తెలుస్తుంది అనుకుంటాం కానీ, ప్రధాన ఆలయానికి ఇరుపక్కలా వున్న శివతాండవం 60 చిత్రాల వరుసలను అర్ధం చేసుకుంటూ నశించి పోయిందనుకుంటున్న నాట్య విధానాన్ని నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతి పేరుతో పునం రూప కల్పనచేసారు. 

3) ఇక్కడి నంది విగ్రహం స్పష్టంగా ” reef knot ” రెండువైపులా కనిపిస్తుంది. తాళ్ళని ఉపయోగకరంగా శాస్త్రీయంగా ముడివేయడం, మెలికలు వేయడం ఎప్పటినుంచో వాడుకలో వుందనే విషయాన్ని 800 సంవత్సారాల క్రితం నిర్మించిన ఈ ఆలయ శిల్పి స్పష్టం చెక్కి చూపించి నిరూపించినట్లయ్యింది. బహుశా ఇటువంటి ఆధారాలే లేకపోతే ఇవ్వన్నీ ఏ ఎంగిలీసు పద్దతులనుంచో అరువు తెచ్చుకున్నాం అటుండే వాళ్ళేమో.

ఇదే నందికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లు అచ్చంగా చూస్తుంటుంది. అలాగే ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. దాని శరీరం నునుపు, అలంకరించిన ఆభరణాలలోని నిశితత్వం స్పష్టంగా గమనించవచ్చు.

4) ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యిందట అయినా ఇప్పటికీ చాలా దృఢంగా కనిపిస్తోంది. 

5) శిల్పకళ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. హైహీల్స్ అప్పుడే వాడినట్లు చూపుతున్న శిల్పం ఒకటయితే, మహిళ యుద్దానికి వెళ్ళి వచ్చినట్లు ఆమె కాలి ముల్లుని ఒక పురుషుడు తొలగిస్తున్నట్లు చూపిన శిల్పం, అంటే జండర్ వల్ల కాకుండా చేసే పనిలో చొరవ వల్ల గౌరవం దక్కుతోందని అప్పుడే చెప్పినట్లయ్యింది. 
ముగ్గురు నాట్య కత్తెలకు కేవలం నాలుగు కాళ్లతోనే చెక్కేయటం, సంగీతాన్ని పలికించే రాతి నిర్మాణం (మేం తాకి చూసి ఆశ్చర్య పడ్డాం) స్థంభాలలోని సన్నని చెక్కుళ్ళ మధ్య దారం ఆడించేంత రంద్రాలను సుతారంగా ఏర్పాటు చేసారు. ఆలయం చుట్టూతా, స్థంభాలలోనూ కాకుండా రూఫ్ లో సైతం ఎన్నో పౌరాణిక చారిత్రక గాథలను చెప్పే వరుస శిల్పాలున్నాయి. వాటిని ఒక్కొక్కటి తీసుకుని వాటి అలంకరణ నేపద్యం, భంగిమలకు భాష్యం, సందర్భశిల్పాలలోని కథలు, చర్చించిన శాస్త్రీయ కళాత్మక అంశాలను పేర్చుకుంటూ వెళ్లే పనికి ఎవరన్నా పూనుకుంటే అదే పెద్ద పుస్తకం అయ్యేలాగా వుంది.

6) జాయప సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో కనిపిస్తుంటుందట, త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్నిచేసేంతలా ఫోటోలు లాంటి ఆధునిక ప్రక్రియలు లేని ఆ రోజుల్లోనే చెక్కారు.

7) ఇక్కడ వాడిన ఇటుకల గురించి కూడా ప్రత్యేకంగా చెపుతారు. అవికేవలం మట్టి కాకుండా ఏనుగు లద్దెతో మరికొన్ని పదార్ధాలు కలిపి తయారు చేసారట దాంతో గట్టితనం తగ్గకుండానే తేలికగా వుండే లక్షణాన్ని కలిగివుంటాయట. ఎంత తేలిక అంటే ఆ ఇటుకను నీటిలో వేస్తే తేలేంతగా.

8) దగ్గరలోనే కోట గుళ్ళు, రామప్ప చెరుపు, లక్నవరం వగైరా వున్నాయి.

9) ఒక ప్పుడు దాడులూ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఈ ఆలయసంపద ఇప్పుడు నిర్లక్ష్యపు దాడికి గురవుతోంది. నంబర్లు వేసి పీకేసిన భాగాలు చిందరవందరగా పడేసి వున్నాయి. ఎటువంటి ప్రత్యేక భద్రత ఆదరణ లేదు. మరింత శిధిలమయ్యే పరిస్థితులను నివారించి వాటికి భద్రత కల్పించే పనులు లేవు. కనీసం శాసనాలను శిల్ప సంపదను డిజిటైజ్ చేసి అధికారికంగా అందుబాటులోకి వుంచిన ధాఖలాలు లేవు.

ఈ రోజు పర్యటనలో తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

http://bit.ly/1e7kX4i

from Blogger http://bit.ly/1e7kX4k
via IFTTT

Advertisements
Standard

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s