సమాచారం

మేమంతా ఇంతే మిత్రమా, సగటు భారతీయులం మరి

మేమంతే మరి దారుణంగా విసిగిపోయివున్నాం, ప్రజాస్వామ్య మని గొప్పగా చెప్పుకుని గర్వంగా తలెత్తుకోవలసిన చోట ఎన్నికల సమయంలో ప్రవహించే నోట్ల కట్టలు ముందురాత్రి మందుతో పాటు కిసుక్కున నవ్వి మా వెన్నెముకనే అవహేళన చేస్తూ ఐదేళ్లు తలదించుకునేలా చేస్తుంటే. ఈ డబ్బు జాడ్యాన్ని ఎవరన్నా తొలగించకపోతారా, ఈ విషవృక్షాన్ని వేళ్ళతో సహా పీకేయ లేకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నాం. ప్రజాస్వామ్యా చక్రానికి ఇరుసుగా ఇంధనంగా రంగునోట్లు కాకుండా మనోభీష్టాలు పనిచేసేరోజు రాకపోతుందా అని ఎదురుచూస్తాం.
‘శ్రమకు మరో రూపమే డబ్బు’ అనేదే నిజమైతే వళ్ళుకందని వాళ్ళ దగ్గర కుప్పలుగా పడిపోతున్న లెక్కలు చూపక చీకట్లో మగ్గిపోతున్న సంపదకు వెలుతురు సోకకపోతుందా అని కళ్ళలో వత్తులేసుకుని మరీ చూస్తుంటాం. ఆయనెవరో జూలియన్ అసాంజే వికీలీక్స్ తో ముందుకొచ్చినా అతని గొంతుపై మరింకేదో బలమైన చెయ్యి నొక్కిపెట్టినా ఇంకా బ్రహ్మాంఢం బద్దలవకపోతుందా అని ఎదురుచూస్తూనే వున్నాం. పాపాల ఇనప్పెట్ట చిట్టా బట్టబయలు కాకపోతుందాం నెత్తిన బరువు కొంతైనా తగ్గకపోతుందా అని వేచి చూస్తేనే వుంటాం. పావలాకీ విలువుంటుందని నమ్మే మాకు హవాలా ప్రవాహమై దేశపు శ్రమ అడ్డదారిన కొట్టుకుపోతుంటే అడ్డుకట్టవేసే నాధుడికోసం, నిజమై! కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే చూస్తూనే వుంటాం.
మేమింతే రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన నోట్లు నిజమైన కావని ఫేక్కున నవ్వుతాయేమో నని గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటాం. మేమింతే ఎవరన్నా అసలు ఈ నకిలీలే లేకుండా ఏరేస్తారేమోనని అమాయకంగా ఆశపడుతూనే వుంటాం. మేమింతే శత్రుదేశాలు పదునుపెట్టి విసిరే నకిలీనోట్ల రాకెట్లు జీవితాలను ఢీకొట్టక ముందే అడ్డుగా నాయకుడు తన గుండెబలాన్ని కోటగోడలా కట్టకపోతాడా అని పిచ్చివాళ్లమై పలవరిస్తుంటాం. మేమింతే ప్రతివాడినీ ప్రశ్నలతో పలకరిస్తుంటాం. మేమంతా ఇంతే సోషలమీడియాలలో పొటమరిస్తుంటాం. మేమింతే నిజంగా అచ్చంగా మేమింతా ఇంతే ఇంతే మాదంతా ఈ చింతే వింతే.
జ్వరం తగ్గేందుకు పత్యం అవసరమంటే తప్పకుండా చేస్తాం. దేవుడి దర్శనానికి వరుసల్లో రమ్మంటే వస్తాం. మా వాటాలను అడ్డదారిలో బొక్కేందుకు ఇది పస్తునాటకమని తెలిస్తే పైత్యాలను వదిలించేందుకు పిడికిళ్ళు తప్పకుండా బిగిస్తాం. అప్పటివరకూ ఈ చీకటి తుఫాను వేళలో మాపై ముసురుతున్న యుద్ధమేఘాలను తొలగించే అర్జున పాల్గున పార్ధ కిరీటివి నువ్వే నని నమ్ముతాం. ఆ వెలుతురు దారివైపు ఒక్కో అడుగూ వేస్తూ క్యూలైను ఎంతపొడవున్నా విసుక్కోకుండా నడుస్తూనే వుంటాం. వగలమారి జాలి కన్నీళ్ళ బురదను దాటుకుంటూ, మేకవన్నె పులుల మే మే లను దాటుకుంటూ, మాకోసమే నంటూ తమ లాభాన్ని తూకం వేసుకునే బంగారు కడియపు పులి పక్కగా మా లైను కదులుతున్నా సరే వెలుతురు కనిపిస్తుందనుకున్న దిశగా ఒక్కో అడుగూ ఓపికగా వేస్తూనే వుంటాం.
అబద్దపు ఆక్రోశాన్ని వెళ్లబోసే ప్రేలాపనల మాయతెరలు ఏది నిజమో కనబడనివ్వవు. అయినా పర్లేదు ఈ వగలమారి కన్నీరు తాగి బ్రతకలేం కదా. మేమింతే వెలుతురు వైపే ఆశ చావకుండా అడుగులేస్తాం. నిజం మిత్రమా కనీసం ఈ మాత్రం దిశను చూపించిన వాడే లేప్పుడు మా పాలిట ఈ వెంపలి చెట్టే మహా వృక్షం. కానీ ఏదైనా ఒకరోజు నువ్వే అబద్దమని తెలిస్తే అవి వెలుతురు నీళ్ళు కాదు మోసపు ఎండమావులని తెలిస్తే మాత్రం మొత్తంగా మా గుండెలు కొట్టుకోవడం ఆగిపోతుంది. అప్పుడసలు అడుగెయ్యాలంటేనే భయమేస్తుంది. ఆసాంతం మరింకెవరినీ నమ్మే సత్తువ మొత్తంగా చచ్చిపోతుంది.
అప్పటిదాగా అడుగేస్తూనే వుంటాం. ఎందుకంటే అంధకారంలో కూర్చోవడంకంటే అగాధంలో పడిపోవడం మరీ దారుణం. మేమింతే ప్రేమిస్తే ప్రాణమిస్తాం. మంచి కొంచెమైనా చేస్తే చరిత్ర సైతం మర్చిపోనంత ఎత్తున వాడ్ని నిలబెడతాం. పాతవెన్నో తప్పులున్నా పర్లేదు పాతరేస్తాం. ఒక్కడైనా కావాలి, ఆ ఒక్కడెవరో రావాలి అంటూ పలవరించే మా కలవరింతలను నిజంచేసేది నిజంగా నువ్వేనా, ఇన్నేళ్ళ వెన్నుపోట్లతో మా నీడను సైతం మాదేనని నమ్మలేనంత బెదురిపోయివున్నాం. ఇదంతా అబద్దమని చెప్పేవు సుమా. అప్పటిదాకా
మేమింతే రేపటి మా బిడ్డల భవిష్యత్తుకు వెలుతురులద్దే రంగుల కోసం వెతుకుతుంటాం.
మేమింతే చీకటి తోకకు నిప్పుపెట్టే హనుమంతుడి కోసం కలలుగంటాం.
మేమింతే ఫలితపు దిశ అనిపిస్తే పక్కాగా అటువైపుగా ఒక్కటన్నా అడుగువేస్తాం.
మేమింతే … మేమింతే… మేమింతే… మేమంతా ఇంతే. ఇంతింతే.

http://bit.ly/2g7tV5T

from Blogger http://bit.ly/2fhlJ5q
via IFTTT

Standard
సమీక్ష, Facebook embed

బ్లాకుబలి : పెద్దనోట్లను రద్దు చేస్తే ప్రజలు నిజంగానే బాగుపడతారా?

పెద్దనోట్ల రద్దు బాహుబలిలో ఒక సీన్ ని గుర్తుకు తెస్తోంది. యుధ్దంలో కాలకేయుడు అమాయకులైన ప్రజల్ని రక్షణ కవచాల్లాగా ముందు వరుసలో నిలబెడతాడు. భల్లాలదేవుడు శత్రువులను శిక్షించడం కోసం అమాయకులైన ప్రజలను కూడా చంపుకుంటూ వెళతాడు. బాహుబలిమాత్రం వారి కాళ్లమీదకు బరువులతో చుట్టుకునే తాళ్ళను విసిరి వాళ్ళకు ఇబ్బంది లేకుండా వెనకున్న శత్రుసేనలమీదకు లంఘించే వ్యూహరచన చేస్తారు.
అనిల్ బోకిల్ ‘‘అర్ధక్రాంతి’’ (http://bit.ly/2eWq7Xo) లాంటి అమూల్య పరిశోధనల్లో తేలిన అంశాన్ని అమల్లో పెట్టడం. అసలు బడాబాబులకు నష్టం కలిగించే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే నేతలు రేపెప్పుడో కమ్యునిష్టు పార్టీల వంటివి పరిపాలనలోకి వస్తేనో, జెపి లాంటివారు పగ్గాలు తీసుకుంటేనో జరుగొచ్చేమో అని ఎదురుచూసాం. మన్మోహన్ లాంటి ఆర్ధికవేత్త మౌనంగా తన పబ్బం గడిపేసుకుని రబ్బరు స్టాంపులోదిగిపోయాడు. మనం సోషట్ నెట్ వర్క్ లలోనూ, సినిమల్లోనూ నల్లధనం అవినీతి అంటూ వాపోతూనే వున్నాం. మరిప్పుడు ఒక అడుగు ముందుకు పడింది. అవును నాక్కూడా ఎప్పటిలా పోల్చుకుంటూ రద్దు తర్వాత కొంత ఇబ్బందిగానే వుంది. కానీ మొత్తం దేశానికి ఉపయోగపడే ఒక పెద్ద ప్రయోజనం కోసం చిన్న చిన్న కష్టాలకు సైతం బావురుమనేట్లయితే, ఇక ఎవరో వచ్చి మార్చాలని ఏదో దేశం మారిపోవాలనీ కోరుకోవడం ఎందుకు? నత్తగుల్లలా మొత్తం డొల్ల అయ్యేంత వరకూ ఎప్పటికప్పుడూ సౌకర్యపు కన్నాల్లో దాక్కుంటూ వుంటే సరిపోతుంది.

ఇప్పటివరకూ చూసిన దానివల్ల ఆయన మోడీ కావచ్చూ మరేదయినా కావచ్చు మనకు మాత్రం రాజకీయనాయకులు స్వార్ధ ప్రయోజనాలు తప్ప అందరికోసం మంచి చేస్తారనే ఊహకూడా లేదు. వాళ్లంటే విలన్లు అంతే. ఇందులోనూ ముందు రంద్రాలే వెతకటం ప్రారంభిస్తున్నాం. కానివ్వండి ఒకరో ఇద్దరో ముందే తెలుసుకున్నారా? ఎక్కడో ఒకటో రెండో చోట్ల ఈయన గారి స్వంతి పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు దారి ఏర్పడిందా? పోనీ ప్రతిపక్షం బొరియల్లో పాపంలో పేరుకుపోయిన నల్లకొవ్వును కరిగించాలనే ఇదంతా చేసాడా? ఏదయినా దాని ఫలితం ఎవరికందుతోందో చూడరా?
దేశం మీద యుద్దం చేయడమంటే ఆయుధాలు వెయ్యడం కాదు. ఆర్ధికంగా నిర్వీర్యం చేయాలన్న కుట్రతో నిపుణులు సైతం పట్టుకోలేనంత పకడ్భందీగా చేసిన దొంగనోట్లను కుప్పలు కుప్పలుగా పంపుతున్నారు. లక్షకి ముప్ఫై వేలు, అరవై వేలంటూ వ్యాపారంగా మొదలేసేంత ముదిరిపోయిన జబ్బుని చూసి తిట్టుకుంటూనే వున్నాంకదా. ఎన్నికలంటే కంటెయినర్ల నిండా పెద్దనోట్లు అర్ధాంతరంగా గుమ్మరించడం మామూలు విషయమని చప్పరించేస్తూనే వున్నాం కదా. ఎలక్ట్రానిక్ మనీ అంటూ, ప్లాస్టిక్ కరెన్సీ అంటూ తెల్లవారు ఝూమున వేకువ కలలను పలవరిస్తూనే వున్నాం కదా. ఆయనెందుకు చేసాడో, ఏ పార్టీ, ఏరంగూ నాకనవసరం కానీ చేసిన పని నిజంగా చాలా చాలా చాలా గొప్పదని లైన్లలో నిల్చున్న ఇప్పుడు అర్ధం కాకపోయినా, లైను గా జరిగే మార్పులను గమనించే ఓపిక వుంటే తప్పకుండా తెలుస్తుంది. మనకే ఇంత ఒత్తిడి వుంటే అన్ని రకాలుగా శక్తివంతుల మెడలు వంచేందుకు న్యాయాన్ని భుజాన వేసుకుని నిలబడ్డ ఆ ఒంటరికి మరెంత ఒత్తిడి ఉండి వుండాలి. అవసరమైతే నేను నిలువునా కాలిపోడానికి సిద్దం అన్న మాటలో ఆర్ద్రత కంటే నాటకమే కనిపిస్తుందంటే అది మన తప్పకాదు మనల్నిలా తయారుచేసిన వాతావరణానిదే ఆ తప్పు. దేన్నీ నమ్మలేని తనంతో నిలువునా నింపేసింది. అద్దంలో మీ బొమ్మే అచ్చంగా మంచి పనులు చేయడం మొదలేసినా అర్రర్రే ఇదేదో టెక్నిక్ లా వుందే అనుకునే అనుమాన బలహీనతలోనికి మనసు దిగజారిపోయింద. మిగిలున్న ఆశలను బ్రతికించాలంటే దేశానికి కొంచెం నమ్మకమిద్దాం. కనీసం నిలబడటానికి సిద్దమవుతున్న ఒక్క వెన్నెముక కనిపిస్తే అర్ధాంతరపు అక్షేపణలూ, ఆధారం లేని అనుమానాలతో పడదోయకుండా కొంచెం భరోసా నిద్దాం. ఏమో గుర్రం ఎగరా వచ్చు. ప్రపంచంలో పనిచేసే సామర్ధ్యం అధికంగా వున్న యువత ఎక్కువగా వున్న దశలో ముందింది భారతదేశం. ఈ సమయంలో నల్లడబ్బు, అవినీతి లాంటి ప్రధాన మైన రోగాలు దగ్గరికి రాకపోతే, అమెరికానూ, చైనాను మనం ఉదాహరణగా చూడాల్సిన అవసరం లేదు. సహజవనరులూ, అనుకూల వాతావరణంతో అన్నిరంగాల్లోనూ మనమే ప్రపంచం మొత్తానికీ ఒక ఉదాహరణగా ముందువరుసలో వుండే రోజే రావచ్చు. దానికి వేలమైళ్ళ ప్రయాణం వుందని మళ్ళీ పెదవి విరిసినా పర్లేదు కానీ దానికోసం పడే ఒక్క అడుగునూ మాటల తూటాలతో గాయం చేయకండి చాలు.

భల్లాల దేవుడికి సాధ్యం కానట్లు అనిపిస్తే అది అసాద్యమైపోదు. మరికొంచెం ఆలోచించి అడుగేస్తే అటు ప్రజలను కాపాడుకుంటూనే శత్రువుపై దెబ్బతీసే అవకాశం దొరుకుతుంది.

http://bit.ly/2fOGNNW

from Blogger http://bit.ly/2fR4zup
via IFTTT

Standard