History

తెలంగాణలో బౌద్ధం ఆనవాళ్లు -మలయశ్రీ

బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రేశరుడు. ఆరాధనీయుడు. ఆ మహనీయుని ధర్మప్రబోధం బౌద్ధం- దేశ విదేశాల్లో వ్యాపించింది. జనులకు నైతిక జీవనాన్ని ప్రసాదించుటతోపాటు గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని వ్యాప్తి చేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తన పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956నుంచి పునర్వికాస దశ పొందుతున్నది.
బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యం.
అందుకు ఆధారాలు-
1. అశ్మక దేశ (మహాజనపదం) గోదావరి నదీ తీర (ద్వీప) కపిత్ధ వన నివాసి ‘బావరి’ ముని శిష్యులు 16 గురు, గురుని కోరికగా మగధకు వెళ్లి బుద్ధునితో సంభాషించి బౌద్ధులుగా మారి వచ్చి తమ గురువు బావరికి బౌద్ధ దీక్ష ఇచ్చిన కథ బౌద్ధ సుత్త పిటిక ‘సుత్త నిపాత-పారాయణ వగ్గ’లో ఉంది. అది క్రీ.పూ 6వ శతాబ్ది సంగతి. బావరి నాడు నివసించిన ప్రదేశం ‘బావన కుర్తి’ నేటి ‘బాదనకుర్తి’. (ఈ ఊహ ఠాకూర్ రాజా రాంసింగ్‌గారిది. ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించి బాదవకుర్తి బావరి నివాస ప్రదేశమని నిర్ణయించింది నేను-2001. ఇది నా ‘కొండన్న కథ’లో ఉంది. బావరి విషయం ‘బుద్ధ బోధ’ పేరుతో మిసిమిలో వ్యాసం రాసిన, ‘తెలంగాణా సర్వస్వం’లోనూ నా ‘బావరి’ వ్యాసముంది. బుద్ధ-బావరి శిష్య చర్చను ‘బుద్ధ బోధ’ గేయకావ్యంగా ముద్రించిన-2010. ‘నిజమైన బౌద్ధం 2007 వ్యాసముంది)
2. ఆంధ్ర నటులు బింబిసారుని (మగథ-రాజధాని రాజుగృహ) సమక్షాన బుద్ధ జీవితం ‘మహాబోధి’ నాటకాన్ని ప్రదర్శించినట్టు ‘లలిత విస్తర’ గాథ పేర్కొంది. ఆంధ్రుల రాజధాని కరీంనగర్-కోటి లింగాల. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు.
3. బుద్ధుని శిష్యుడు మహా కాత్యాయనుడు అశ్మక రాజుకు బౌద్ధ ధర్మ దీక్ష ఇచ్చినట్టు ‘విమానవత్తు’లో ఉంది. అశ్మక రాజధాని పోతలినగరం-బోధన్ నిజామాబాద్. (పోతలి మొదటి తీర్ధంకరుడైన రిషభనాధుని రెండవ కుమారుడు బాహుబలికి రాజధాని. 24వ తీర్ధంకరుడు బుద్ధుని కాలపు వర్ధమాన మహావీరుడు. అంటే అశ్మక పోతలి అంతకు పూర్వపుదన్నమాట.
4. బుద్ధుని శిష్యుడు కొండన తెలుగు వ్యక్తి.
5. సెరివణిజు జాతకం ‘తెలివాగ’ నది దాటితే వచ్చే ఆంధ్ర నగరిని పేర్కొంది. తెలివాగ ఒరిస్సాలోని మహానదికి ఉపనది. కాని, దాని తీరంలో ఆంధ్రనగరం లేదు. అది ఓడ్రదేశం. తెలివాక-తెలివాగ, వాహ, అంటే తెల్లని ప్రవాహం-పాలేరు వలె. అది ఏ నదికైనా వాడవచ్చు. గోదావరిని తెలిగాహ-తెలివహ అనీ అనిరేమో నాడు. ఆ నది దక్షిణ తీర ప్రాచీన పట్టణం- కోటినగరం కోటిలింగాల-కరీంనగర్. కోట లింగాల తర్వాతి పేరు ఇప్పటి కోటి లింగాల. బౌద్ధ స్థూపాలు హిందువులకు శివలింగాలే. ఈ కోటి లింగాలలో దొరికిన ఆంధ్ర రాజుల (గోబధ, కంవాయ సిరి, నారన, సామగోప)నాణాలు భారతదేశంలోనే మొదటివి. శాతవాహనుల తొలిరాజధాని (చిముక) ఇదే క్రీస్తు తర్వాతనే కోస్తాంధ్రకు వారి వ్యాప్తి-్ధరణి కోట. కోటిలింగాల కొండాపురం తర్వాత ప్రతిష్ఠానం వారి రాజధాని. మగధను కూడా జయించి కొన్నాళ్లు పాలించి, కాలం కలిసిరాక వెనుతిరిగి స్థిరపడింది ధరణికోట-అమరావతిలో క్రీస్తు తర్వాత ఆచార్య మొదటి నాగార్జునునిది క్రీశ ఒకటవ శతాబ్ది. రెండు నాగార్జునుడు రెండవ శతాబ్ది. అమరావతి స్థూప ప్రాకారం ఇతని కాలపు నిర్మాణమే యజ్ఞశ్రీ శాతకర్ణికి ‘సుహృల్లేఖ’, కావ్యం రచించింది ఇతడే. ఈ ఇద్దరు బౌద్ధాచార్యులు నాగార్జున కొండ-విజయపురి నివాసులే.
తెలంగాణలో జిల్లాలవారీగా బౌద్ధ కేంద్రాలు- ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. మిగతా జిల్లాల వివరాలు ఇవి.
నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ- నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- న్యాలకొండపల్లి, అశ్వరావుపేట, కాపవరం.
ఇటు కొండలున్నా గుహా విహారాలు లేవు. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. వీటిలో కొన్ని నగరాలు మిగిలినవి స్తూప-చైత్యాలు. పై వాటిలో బాదనకుర్తిని కూడా చేర్చవచ్చు.
విశేషాంశాలు
కొటిలింగాల స్తూపం. ఇటీవల వెలువడిన చైత్య సూపం అమరావతి స్తూపం కన్నా పూర్వపువి. ఈ అభిప్రాయాన్ని బి.ఎన్.శాస్ర్తీ ఒప్పుకున్నారు. ధూళి కట్ట స్థూపమూ అంతే. ఇవి రెండూ కోట నగరాలు. కోటి లింగాలలో శాత వాసనులకు, పూర్వాంధ్ర రాజుల నాణాలు దొరికినై. కోటి లింగాల, ధూళికట్ట, కొండాపూర్ శాతవాహన చక్రవర్తుల పట్టణాలు. నాగార్జున కొండ మలి శాతవాహనుల కాలంలో, 3వ శతాబ్ది ఇక్ష్వాకుల కాలంలో అభివృద్ధి చెందింది.
గోదావరి తీర బౌద్ధ స్థావరాలు ధీరవాద బౌద్ధానివి, కృష్ణానది ప్రాంతానివి మహాయాన బౌద్ధ కేంధ్రాలు అనేది విశేషాంశం.కరీంనగర్ జిల్లా కప్పారావుపేట మునుల కొండకు, మంధని అడవి సోమనపల్లి గుహాలయాలున్నా మొదటిది జైనులది, రెండవది శైవులది.
న్యాలకొండపల్లిలో బుద్ధుని లోహప్రతిమ లభించింది. ఫణిగిరి విలువై న శిల్పాల స్తూపవిహారం. అది మహాయాన కేంద్రం మీర్జాపురం స్తూపం చిన్నదైనా దానిలో ధాతుపేటిక  దొరికింది.
పాశిగాం-పాయసి గ్రామం అయి ఉంటుందేమో. ఇదే దిజ్నాశుని నివాసం అని డా.వి.వి.కృష్ణశాస్ర్తీ అభిప్రాయం.
ధూళికట్ట నాగముచిలింద స్తూపం. ఆచార్య 2వ నాగార్జునుడు ప్రజ్ఞాపారమత గ్రంథాన్ని పొందినది ఒకానొక నాగరాజునుంచే. నాగార్జునుని జన్మస్థలం వేదలి. అది కృష్ణా జిల్లా యాజులి కావచ్చునని చరిత్రకారుల ఊహ. కాని ధూళికట్టకు సమీపంలోనే వెల్ది అనే పురాతన గ్రామం ఉంది. వేదరికి వెల్ది దగ్గరి పదం.
సాహిత్యాధారాలు
పాల్కురికి సోమనాధ బసవ పురాణంలో శైవేతర మతాల నిందలో బౌద్ధం పేరుకూడా ఉంది. ఎంతో కొంత వ్యాప్తిలో లేనిదే ఆ పేరు ఫ్రసక్తి ఉండదుకదా. కల్యాణి చాళుక్యుల కాలపు బెక్కండి మల్లారెడ్డి ఇక్కడి మతాలను పేర్కొంటు బౌద్ధాన్ని కూడా స్మరించారు.
కాకతి మొదటి రుద్రుని మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్‌లోని నగరూప త్రికూటాలయ శాసనంలోతాను బుద్ధదేవుని మందిరం నిర్మించినట్టు చెప్పాడు. అయితే అతని అభిమానం గౌతమ బుద్ధుడు విష్ణుమూర్తి దశావతార బుద్ధుడనే.
రామప్ప దేవాలయ గర్భగుడి గోడ వెనుక భాగాన ఒక బౌద్ధ సాధు శిల్పముంది.
రంగనాధ రామాయణ కర్త గోన బుద్ధారెడ్డివరంగల్- నర్సంపేట వద్ద ‘బుద్ధారం’ ఊరుంది. ఇవి తెలంగాణలో బౌద్ధ మత వ్యాప్తికి నిదర్శనాలు.
14 అక్టోబర్ 1956న డా. బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకారంతోనే భారతదేశంలో బౌద్ధానికి పునర్వికాస దశ. కానీ తెలంగాణలో ‘నవ దీక్షిత బౌద్ధులు’ తక్కువ. హైదరాబాద్‌లో కొందరు బౌద్ధులున్నా వాళ్లు కోస్తావాళ్లే. ఆదిలాబాద్ జిల్లాలో కొంతవరకు నవబౌద్ధం ప్రభావముంది. ఇటీవల 5,6 ఏండ్లనుంచి ఇటు బౌద్ధ సంఘాలు ఏర్పడుతున్నవి.
రచయిత ఫోన్ నంబరు : 

9866546220

from Blogger http://bit.ly/2gVSqaZ
via IFTTT

Advertisements
Standard

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s