story

‘మంచి’ నీళ్ళు

పదోతరగతికి ప్రీఫైనల్ పరిక్షలు జరుగుతున్నాయి. పిబ్రవరి నెలే కానీ ఎండలు బాగానే ముదిరాయి. పైగా మూడు సెక్షన్లని కలిపి ఒకదగ్గర కూర్చోబెట్టాలంటే క్లాస్ రూమ్ ఏదీ చాలదు. అందుకే మీటింగ్ హాల్ ని ఆశ్రయించాం. కాకపోతే అదేమో రేకులతో కప్పిన పాత భవనం. ఎండవేడి మరీ తెలుస్తుంది. పిల్లలకు నీళ్లు ఎన్నితాగినా దాహం తీరటం లేదు. సరే అని వాళ్ళకి సరిపడేలా రెండు కూల్ క్యాన్లలో వాటర్ వేయించాను. ఇక పిల్లల ఖుషీ చూడాలి. ఎంత చిన్న సంబరాన్నైనా గుండెల్నిండా నింపుకోవడం పిల్లలకే సాధ్యం అవుతుందేమో. చాలా మంది పిల్లలు థాంక్స్ కూడ చెప్పారు. అయితే దీనివెనక నేను వాళ్ళకే థాంక్స్ చెప్పేంతగా రుణపడ్డ విషయాలు చాలా వున్నాయి. అదంతా వాళ్లకి చెప్పలేదు అర్ధం అవ్వడానికింకా సమయం పడుతుందేమో నన్న అనుమానంతో.
ఆ రోజు సాయంత్రం పదోతరగతి వాళ్ళకి నా సబ్జెక్టులో ఈవెనింగ్ క్లాసుంది. మూడు సెక్షన్ల పిల్లల్ని చెట్టుక్రింద కూర్చోబెట్టుకుని ఎప్పట్లాగానే ఏదో పాఠం చెప్తున్నాను. ఇంతలో నఫీషా అనే ఒకమ్మాయి హటాత్తుగా లేచి తన క్లాస్ వైపు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మామూలుగా అయితే అడిగే వెళ్ళటం అలవాటు కానీ ఏదైనా తప్పనిసరి అవసరం వుంటే అనుమతుల హడావిడేం లేదు వెళ్ళొచ్చని వాళ్ళకి అలవాటు చేసివుండటంతో, మిగతావాళ్ళేం పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే పాపం ఏమైనా ఇబ్బందొచ్చిందేమోనని నాదొక కన్ను అటువైపు గమనిస్తూనే వుంది. అలా వెళ్ళిన ఆ అమ్మాయి ఒక వాటర్ బాటిల్ తో హడావిడిగా నా దగ్గరకొచ్చి తాగండి సర్ అంటూ ఇచ్చింది. ‘‘ ఎందుకురా మంచినీళ్ళు తెచ్చావ్’’ ఆశ్చర్యంగా అడిగాను. మీరు చాలా సేపట్నుంచి మాట్లాడుతున్నందుకేమో చాలా సార్లు దగ్గొచ్చింది కదా సర్ కొంచెం నీళ్ళుతాగితే సర్దుకంటుంది. ఆ అమ్మాయి సింపుల్ గా చెప్పినా, నాకెందుకో కళ్ళలో నీళ్లు తిరిగాయి. మనం ఈ పిల్లలకు ఏమిస్తున్నాం? ఇంత ఇష్టాన్ని పెంచుకున్నారు. నేను తిరిగి ఏమివ్వగలను. మరేం మాట్లాడకుండా నీళ్ళుతాగి, థాంక్స్ చెప్పి పాఠం కంటిన్యూ చేసాను కానీ మనసులో ఆ సంఘటన అలా తిరుగుతూనే వుంది.
అంతేనా ఉదయం రాగానే టిఫిన్ తిన్నారా సర్ అని అప్పుడే అంతదూరం నుంచి ఎలా రాగలిగారు అంటూ పలకరించే పిల్లలందరి ప్రేమకీ నేను పడ్డ సంబరంతో పోల్చుకుంటే వాళ్ళవల్లనే వచ్చే జీతం నుంచి ఇలా ఖర్చుపెట్టేది చాలా చాలా తక్కువే కదా. గవర్నమెంటు స్కూలు పిల్లలంటే ఫారంలో పెరిగే కోళ్లలాగా తెల్లగా పద్దతిగా ఒకే గదిలో గడగడలాడుతూ వున్నట్లు కనపడక పోవొచ్చుకాక. నాటుకోళ్ళమాదిరి స్వేచ్చగా గంతులేస్తున్నట్లు కనబడొచ్చుగాక. కానీ వీళ్ళ పిలుపులో పలకరింపులో పనుల్లో ఏదో జీవం కనబడుతూ వుంటుంది నాకు. రామాంజనేయ సాయి వాళ్లనాన్న చనిపోయిన దుఃఖంలోనూ ఫోన్ చేయటం. అమ్మనాన్నలను పోగొట్టుకున్న స్పందన నిబ్బరంగా పరిక్షలకోసం ప్రిపేర్ అవుతూ వుండటం మాత్రమే కాదు. పూటగడవని ఇళ్ళనుంచి విధికి ఎదురీదుతూ వస్తున్న మొదటి తరం చదువుల జెనరేషన్ మా దగ్గరే రూపుదిద్దుకుంటోంది. ఒక బ్యాచ్ వెళ్ళిపోతున్నప్పుడు ఏదో వెలితి దాంతో పాటే సంతోషం. మరోబ్యాచ్ సిద్దమవుతూనే వుంటుంది. జీవితంలాగానే వ్యవస్థకూడా ఒక ప్రవాహం కదా. 
 ఈ ప్రవాహంలో నీళ్ళే ఒడ్డుకు రుణపడ్డాయా? ఒడ్డే నీళ్ళకు బాకీ పడిందా? నేనిప్పటికీ ఇదిమిధ్దంగా తేల్చుకోలేకపోతున్నాను.

from Blogger http://bit.ly/2lGk1O5
via IFTTT

Standard