ప్రక్రియ, రెక్కలు

రెక్కల‘లో తాత్వికత – పెన్నా శివరామకృష్ణ

వ్యాసకర్త, మరియు ‘చినుకు’ సౌజన్యంతో

Standard
ప్రక్రియ, రెక్కలు

లఘు కవితా ప్రక్రియ ‘‘ రెక్కలు ’’

రెక్కలు ఆరుపాదాల ప్రక్రియ.
దీనికి ఎలాంటి నియమం లేదు గాని మొదటి నాలుగు పాదాల తర్వాత ఒక ఎడం,
దాని తర్వాత రెండు పాదాలువస్తాయి.
అంటే పంక్తులను రెండు భాగాలుగా విడగొట్టడం జరిగింది.

దు:ఖాన్ని ఉపశమింపజేసే తాత్వికమైన ఓదార్పు

రెక్కలు కవిత ఆరు పాదాల్లో ఉంటుంది. మొదట నాలుగు పాదాలు రాసి, చిన్న గ్యాప్‌ ఇచ్చి మిగతా రెండుపాదాల్ని రాస్తుంటారు. ఈ ఎడం పాఠకుని ఊహకు పదునుపెట్టేదిగా వుంటుంది. రెక్కలు కవిత రెండు భాగాలుగా ఉంటుందన్నమాట! పై నాలుగు పాదాలు పక్షి శరీరంగాను, మిగతా రెండూ పక్షి రెక్కలుగాను భావిస్తూ దీనికి ‘రెక్కలు’ అనే పేరుపెట్టారనుకోవచ్చు. ఈ రెండు పంక్తులు రెక్కలై ఎగరనిదే సందేశం పూర్తికాదు.  వీటి గురించి ప్రముఖ విమర్శకుడు డా అద్దేపల్లి రామమోహనరావు వ్యాఖ్యానిస్తూ ‘పైనాలుగు పాదాలు ఒక జీవితానుభవాన్ని గూర్చి చెబితే, చివరి రెండు పాదాలు ఆ అనుభవం ద్వారా కవి చెప్పదలచిన తత్త్వం గూర్చి చెపె్తై. జీవితానుభవం నుంచి ఉపరితలానికి వెళ్ళి ఆలోచిస్తేనే తత్త్వం విశదమౌతుంది. రెక్కలతో, ఆకాశంపైకి ఎగిరితేనే చలనం ఉన్నతమౌతుంది అన్నారు. ‘‘స్పష్టమైన లక్ష్యం, లక్షణం రెక్కల్ని ప్రతిభావంతం చేశాయి. రెక్కలు అంటే పైకి ఎగరడానికి ఉపకరించేవి అని అర్థం.’’అని పేర్కొన్నారు.

“రెక్కలు’ను నూతన కవితా ప్రక్రియగా చేసి అందించిన వారు ఆనాటి పైగంబరకవి యం.కె.సుగమ్‌బాబు. కేవలం తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోకీ ఈ కవితలు అనువాదం పొందాయి. సుగమ్‌ బాబు రాసిన కొన్ని ఎంపికచేసిన రెక్కలు కవితల్ని డేవిడ్‌ షూల్‌ మ్యాన్‌, ఆవులమంద మోహన్‌ ఆంగ్లంలోకి అనువదించగా, డా నోముల సత్యనారాయణ సంపాదకత్వంలో అది  2008లో ప్రచురితమైంది. తర్వాత కాలంలో శ్రీనివాస గౌడ్‌ ‘వెలుతురు వెలయాలు’, పద్మకళ ‘దృష్టి’, పెద్దూరి వెంకటదాసు, ధూర్జటి, షరీష్‌భాయ్‌ ముగ్గురూ కలిపి ‘త్రివేణి రెక్కల శతకం’ (2011), మల్లవరపు చిన్నయ్య ‘ఆమని’- ఇంకా చాలా మంది రెక్కలు కవితా సంపుటాల్ని ప్రచురిస్తున్నారు. రెక్కలు కవిత్వాన్ని పత్రికలు కూడా విరివిగానే ఆదరిస్తున్నాయి. 

పి.శ్రీనివాసగౌడ్‌, రంగనాథ్‌, కేతవరపు రాజ్యశ్రీ, ద్యావరి నరేంద్రరెడ్డి ఇత్యాది కవులు “రెక్కలు’ప్రక్రియలో రచనలు చేస్తున్నారు.దాదాపు ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యి సుమారు దశాబ్దకాలంలోనే  60 కి పైగా రెక్కల సంపుటాలొచ్చాయట.

సీస’ కవిత్వ ప్రక్రియకు, ‘రెక్కలు’కు గల పోలిక

ప్రాచీన చందోబద్ద రచనల్లో సీసపద్యానిది పత్యేకమైన స్థానం దానిలో  సీసం తర్వాత ముగింపులో ఆటవెలది కానీ, తేటగీతి గానీ చెప్పాలి. అదే పద్దతిలో రెక్కలు ప్రక్రియలో చివరి భాగం వుంటోందని విశ్లేషకులు పేర్కొన్నారు.

నాలుగు భాగాలుగా ఉన్నా, ఇది హైకూ, నానీల మాదిరిగా కాకుండా సిలబల్స్‌ లేదా అక్షర నియతికంటే పాదాలు, పదాల నియమానికి కట్టుబడినట్లుంది. ఒకటి నుండి మూడు పదాల వరకూ ఒక్కో పాదంలో పాటిస్తున్నారు. ఎక్కవమంది చివరి రెండు పాదాల్లో చివరి పాదాన్ని ఒకే పదంతో ముగించడం కనిపిస్తుంది. అలాగే మరో నియమం- ఎక్కువ మంది ఆరు పాదాల్నీ ఒకటి రెండు పదాలతోనే కవిత్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల సంక్షిప్తతతో పాటు, కవితకి సూటిదనం వస్తుంది.

సుగమ్‌బాబు గారి  అంతర్యానం రెక్కల సంపుటిలోని తొలి రెక్కను పరిశీలించి దాని లక్ష్య, లక్షణాలను తెలుసుకుందాం-

ఆదికవి ఆక్రందనే
తొలిశ్లోకం
అలా ఉపశమించింది
ఆక్రోశం-

దు:ఖ పరిహారం
కవిత్వం!

సాహిత్య ప్రపంచంలో అత్యంత సుపరిచితమైనది ఆదికవి వాల్మీకి శ్లోకం.

”మానిషాద ప్రతిష్టాం త్వమగమ: శాశ్వతీ సమా:
యత్క్రౌంచ మిధునాధేక మవధీ: కామమెహితమ్‌”

అంటే ఈ రెక్కలో వాల్మీకి అధిక్షేప శ్లోకం ద్వారా జరిగిన అన్యాయం ఉపశమించింది అన్నభావం వ్యక్తమైంది. దు:ఖ నివారణ మార్గం కవిత్వం అనేది ఒక తత్వంగా చెప్పబడింది.

కొన్ని విమర్శలు, సమాధానాలు

వచనానికి నిభందనలని జోడించి ప్రక్రియగా పేర్కొనడం వల్ల అదనపుప్రయోజనం ఏమి వుంటుందని, ఆధునిక ఛందోబందనాలను కవిత్వానికి తొడగటం కంటే మినికవితలను అలాగే వుండనివ్వొచ్చుకదా అనే కొందరు సాహితీవిమర్శకుల వాదన వున్నప్పటికీ ఒకపద్దతి ఎంచుకుని రాయడం వల్ల తొలినడకలకు చేదోడుగా వుంటుందనేది వివిధ నూతన ప్రక్రియలను అభిమానిస్తున్నవారి సమాధానం.. ప్రక్రియ ఏదైనప్పటికీ కవిత్వాన్ని వదలకుంటే పాఠకుల మనసులని తప్పకుండా రంజింపజేస్తుంది.

ప్రత్యేక ధన్యవాదాలు

►  డాక్టర్ ధార్ల వెంకటేశ్వరరావు గారి సూర్య దినపత్రికలోని వ్యాసం : 
జీవన తాత్త్వికతను ఎగరేసే రెక్కలు !
ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం
ఆరోగ్యకరమైన పోటిలో నానీలు-రెక్కలు (ఆంధ్రప్రభ)

Standard
ప్రక్రియ, వివరణ

రూమి లయాత్మక తాత్విక కవిత్వం

మౌలానా జలాలుద్దీన్ బాల్ఖి రూమి మహమ్మదీయ నాగరికత యొక్క గొప్ప ఆధ్యాత్మికవాది మరియు గొప్ప తాత్విక కవి. ఆఫ్గనిస్థాన్లో అతను మౌలానా గా,ఇరాన్లో అతను మౌలావి గా ప్రసిద్ధుడు. 2007 లో యునెస్కో లో జరిగిన రూమీ 800వ జయంతి వేడుకలలో రూమీ ఆశలు, ఆశయాల గురించి అధ్యయనం చేస్తున్నఅనేకమందికి ఉత్సాహాన్ని ఇవ్వటం ద్వారా మానవుని మదిలో శాంతికాముకతని ధృడతరం చేయాలని భావించారు. నిజానికి ప్రస్తుత తాలీబాన్ సంస్కృతితో ప్రపంచానికి తుపాకీ మొనలా తయారైన ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ గా పిలుస్తున్న ప్రాంతంలో బాక్ట్రియా లోని బల్ఖ్ ప్రాంతంలో రూమీ పుట్టారని సాంప్రదాయక చరిత్ర చెపుతోంది. తజికిస్థాన్ లోని వఖ్ష్ ప్రాంతంలో జన్మించాడనే మరో వాదమూ వుంది. కానీ ఈయన బైజాంటియన్ సామ్రాజ్యంలోని రోమన్ ప్రాంతమైన రూమ్ లో తన జీవితకాలం ఎక్కువగా గడిపాడు కాబట్టి ఇతనికి రూమి అనే పేరు వచ్చింది. విశ్వనరులను ఈ ప్రాంతం వారని కట్టడి చేయగలమా ?

భగవంతునికై క్రైస్తవులలో,శిలువపైన వెతికాను.
కానీ ఆయన నాకు కనబడలేదు.
నేను విగ్రహారాధన చేసే పురాతన దేవాలయాలలోకి వెళ్ళాను.
అక్కడా ఆయన నాకు కనబడలేదు.
నేను హిరాలో ఉన్న పర్వత గుహలలోకి,ఖాందహార్ వరకూ వెళ్ళాను.
కాని నాకు ఆయన అక్కడా కనబడలేదు.

ముందుంచబడిన ఒక పనిపై నేను కాకసస్ పర్వతాలపైకి కూడా వెళ్ళాను. అక్కడ అంకాలు నివశించడం మాత్రమే చూశాను.
అప్పుడు నా అన్వేషణని యువ వృద్ధుల మకాము అయిన కాబా వైపు మళ్ళించాను.
అక్కడా దేవుడు లేడు.
తత్వం వైపు మళ్ళి ఇబిన్ సినా ని ఆయన గురించి అడిగాను.
అతని పరిధిలో అక్కడా లేడు.
మహమ్మదు ప్రవక్త యొక్క’ రెండు ధనువుల దూరంలో ఉన్న దివ్యమైన అనుభూతి’ గురించి విని ఆయన కచేరికి వెళ్ళాను.
అక్కడకూడా ఆయన ఆచూకీ లభించలేదు.


చివరికి నేను నా హృదయంలొకి తొంగి చూశాను.
ఆయన అక్కడ కనిపించాడు. ఇంకెక్కడా లేడు.


అని చెపుతారాయన ఆరాధనలలోనో, ప్రదేశాలలోనో కాదు నీలోపలే వున్నాడు భగవంతుడు నీకు నిజంగా చూడటం వస్తే అని చెప్పినందునే ఆయన విశ్వనరుడయ్యాడు. మహమ్మదీయ కవులలో ఆంగ్లములో తర్జుమా చేయబడిన కవులు ఇద్దరు ప్రసిద్ధులు. వారు జిబ్రాన్ మఱియు జలాలుద్దీన్ రూమి (Rumi).

న్యాయవేత్త, ధార్మికపండితుడు, సూఫీతత్త్వాన్ని అవసోసన పట్టినవాడూ సుల్తానుల్ ఉలామా అనే బిరుదు సంపాదించుకున్న “బహావుద్దీన్ వలద్” రూమీకి తండ్రి. తల్లిపేరు మూమినా ఖాతూన్ సెప్టెంబరు 30 1207 న ఈయన జన్మించారు. మౌలానా జలాలుద్దీన్ ముహమ్మద్ బాల్ఖీ అనేది అసలు పేరు అయినప్పటికీ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ పేరుతో ప్రసిధ్దులు. ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు పుట్టిన ఈయన జీవిత విశేషాలను 1318 – 1353 ల మధ్య కాలంలో షంసుద్దీన్ అహ్మద్ అఫ్‌లాకి రచించినమనాఖిబుల్ ఆరిఫీన్ ద్వారా ప్రపంచానికి తెలిసాయి. అలాగే రూమీకి అత్యంత ప్రాణ స్నేహితుడు “షమ్స్ తబ్రేజ్”. వీరిద్దరూ దశాబ్దకాలం పైగా కాలాన్ని కవిత్వంతోనూ, జ్ఞానాన్నీ పంచుకోవడంతోనూ గడిపారు. తబ్రేజ్ రచించిన దీవాన్ ఎ షమ్స్ ఎ తబ్రేజీ అనే గ్రంధంలో కవిత్వం సంగీత నృత్యశైలి భరితంగా వుంటుంది. ఈ దశ తర్వాత రూమీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తిరిగాడు. షామ్ అను కలిసాడు. తాత్వికతను ప్రేమనూ నింపుకున్న కవిత్వాన్ని రాసాడు.

 ఈయన వ్రాసిన 26000 ద్విపదలతో నున్న మథ్నావి(మస్నావి) ఇస్లామీయ సాహిత్యములో కొరానుకు తరువాత అత్యున్నత గ్రంథముగా పరిగణిస్తారు. 40000 పైగా ప్రాపంచిక, దివ్వ ప్రేమను ఉద్భోదించే కవితలను రచించారని చెపుతారు.
వెలిగించటానికి సిద్దంచేసిన
ఓ దీపముంది నీ హృదయంలో.
నింపేందుకు సిద్దంగా
శూన్యముంది నీ ఆత్మలో
నీకూ తెలుస్తూంది కదూ!

ఈశ్వరునితో నీ వియోగం
నీకు అర్ధమౌతూంది కదూ!
నిను నింపటానికి అతనిని ఆహ్వానించు.
అగ్నిని కౌగిలించుకో.

ప్రేమ తనంత తానే వస్తుందనీ
దానికై నీ తపన పాఠశాలల్లో నేర్పరనీ
గుర్తుచేసుకో.

రూమి – పాషనేట్ పోయమ్స్ ఆఫ్ రూమి” నుండి

రూమి 17 డిసెంబరు 1273 లో కోన్యాలో మరనించాడు.అతని పార్థివ శరీరాన్ని,అతని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు.ఆ స్థలంపై ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు.దానిపేరు,యెసిల్ తుర్బెలేదా పచ్చని గుమ్మటం. ఈనాడు అదే మెవ్లానా పురవస్తుప్రదర్శనశాల. అతని సమాధిపై వ్రాయబడిన మాటలు:

‘‘ మనం మరణించిన తరువాత మన సమాధిని భూమిలో కాక జనుల గుండెలలో చూసుకోవాలి’’


Standard
ఆటవెలది, ప్రక్రియ

ఆటవెలది

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె దాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు !

చిన్నప్పుడు బహుశా రెండవ తరగతి తెలుగు పుస్తకంలో కావచ్చు ఈ పద్యం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను. ఆ పేజీలో ఒక నెమలీక కూడా దాచి దానికి తాటి లేత ఆకుల చివరి రెల్లును మేతగా వేసి, ఈ ఇంక ఇంకా పెరుగుతుందని సంతోష పడటం గుర్తుంది.

తర్వాత మరికొన్ని విషయాలు ఇదే పద్యం గురించి తెలిసాయి. దీని రచయిత పదకవితా పితామహుడు,  “సంకీరత్నాచార్యుడు”, “పంచమాగమ సార్వభౌముడు”, “ద్రవిడాగమ సార్వభౌముడు” తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) అయిన తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 – ఫిబ్రవరి 23, 1503), వారట, నిజానికి ‘‘ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు’’ మకుటం తో ఆయన ఒక శతకాన్ని రాసారని చెపుతారు.చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు – ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడని చెపుతారు.  సారస్వతం మీద మనకున్న శ్రద్దలేని తనానికి నిదర్శనంగా ఆయన రాసిన అమూల్యమైన రచనలనెన్నింటినో కొల్పోయాం అందులో ఇదికూడా ఒకటి. 


ఇక ఈ వర్ణనను ఆధారంగా చేసుకుని అప్పట్లో పిల్లలకు చేసే వస్త్ర దారణగురించి, దాని వెనకున్న సాంస్క్రుతిక నేపద్యం గురించి ఒక అంచనాకు రావచ్చు అది మరోక కోణం. మనకు వెండి మొలతాళ్ళు కొంతవరకూ తెలుసు స్థితిమంతులు బంగారు మొలతాళ్ళు పట్టు దట్టీ తొడిగారట.( దట్టీ = 
A sash, belt, girdle, cestus round the waist. నడికట్టు, కాసెకోక, నడుముకు కట్టుకునే వస్త్రము. ) తాయతులు తెలుసు మరి సందె తాయతులు అనే విశేషమేమిటో అవి కట్టారట, మువ్వలతో అదిన్నూ సరి మువ్వలతో ఘల్లు ఘల్లున మోగే గజ్జలు కట్టారట అటువంటి చిన్నరి కృష్ణుడిని కొలుస్తాను అని చెపుతున్నారీయన.

ఇక పోతే పద్య చందస్సు ఆట వెలది, జాతి పద్యరీతికి పెట్టుకున్న పేరు ఇదయినప్పటికీ మరో అర్ధంలో  ఆటవెలది అంటే స్త్రీ అని నర్తకి,వెలపడతి,దేవదాసి,ఆటకత్తె, వేశ్య మొదలైన అర్ధాలుకూడా వున్నాయి. ఎందుకలా పేరు పెట్టారో కానీ పద్యం మాత్రం అందమైనది. 


ఆటవెలది కున్న ఈ నానార్ధాన్ని దృష్టిలోపెట్టుకునే ఒక చమత్కారం చెపుతుంటారు. సీస పద్యం తర్వాత ఆటవెలది కానీ తేట గీతి కానీ తప్పని సరిగా చెప్పాలంటారు అందుకే సరసులు దీనిని వ్యవహారికంగా అన్వయం చేసి ‘‘ సీసా తర్వాత ఆటవెలది వుండాలోయ్’’ అని అంటుంటారు.

 ఆటవెలది చందస్సుని విస్త్రుతంగా వాడుకుని సామాజిక దోషాలను కడిగి పారేసిన వాడు మన వేమన. అందుకేనేమో హైదరాబాద్ ట్యాంకుబండు పైనున్న వేమన విగ్రహం క్రింద ఆయన పరిచయ వాక్యాలను ఈ విధంగా రాసారు. ఆటవెలది ని ఈటె గా విసరిన దిట్ట. చాందస భావాలకు తొలి అడ్డు కట్ట.” ఆయన ఆటవెలది లో దిట్ట. సూటిగా సరళంగా ఆయన రాసినటు వంటి వాటిని పోలిన  ఆటవెలదులు మనం ఎ గ్రంధం లోనూ చూచి ఉండము బహుశా చూడలేమేమో కూడా. ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఇదే ఆటవెలది చందస్సును ఉపయోగించి రాసినవే.

చంధస్సు ఎలా వుంటుందో చూద్దామా.

ఆటవెలది ఎలా వుంటుందో ఆటవెలది లోనే చెప్పాలంటే ఇలావుంటుందని సూత్రాన్ని చమత్కార సహితంగా చెప్పారు.
ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.


 • ఇందు నాలుగు పాదములుంటాయి.
 • 1, 3 పాదాలు మెదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
 • 2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి.
 • ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
 • ప్రాసయతి చెల్లును
 • ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.
  పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను ప్రాసయతి అందురు. 
 • ఉదాహరణకు  “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.

ఆటవెలది ఒక విధముగా చూస్తే అర్ధసమ వృత్తమువంటిది.  సరిపాదాలు ఒక విధముగా, బేసి పాదాలు మఱొక విధముగా  ఉంటుంది.  ఆటవెలది, తేటగీతి లాటి పద్యాలను అంశగణాలతో రాయాలి. (గణాలు మూడు విధాలు – అక్షర గణాలు, మాత్రా గణాలు, అంశ లేక ఉప గణాలు ) 

కొన్ని ఉదాహరణలు

1. వార్తయందె జగము వర్తిల్లుచున్నది
యదియు లేని నాఁడ యఖిల జనులు 
నంధకారమగ్ను లగుదురు గావున 
వార్త నిర్వహింపవలయుఁ బతికి.

(ప్రపంచం వార్త మీదే నడుస్తున్నది. అది లేకుంటే ప్రజలు అంధకారంలో మునిగినట్లే. కాబట్టి ప్రభువు వార్తను బాగా నడపాలి.)

2. నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు

నుండు నెక్కటికి మహోత్తరునకు

నిఖిల కారణునకు, నిష్కారణునకు న

మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

3. అనువుగానిచోట అధికులమనరాదు

కొంచెముండుటెల్ల కొదువగాదు

కొండ అద్దమందు కొంచెమై యుండదా

విశ్వదాభిరామ వినురవేమ.

4. నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

Standard
ప్రక్రియ

సీస పద్యం.

మనం పాట లాగా పాడుకోవడానికి బాగా వీలుండే పద్యం సీసమే! పూర్వం పౌరాణిక నాటకాలలో, ఇలాంటి సీసాలు ఎక్కువ గా ఉండేవి. ఇంకా రాయడం సులువు. మళ్ళీ, ఇంటి పేర్లు, పేర్లు కష్టమైన గురు లఘువులు ఉన్నవి, అన్నీ ఇందులో సులభంగా ఇమిడి పొయ్యే పద్యం ఇది. బాగా ప్రాక్టీసు చేసుకుంటే అన్ని విధాల ఉపయోగ పడుతుంది. ఇది కూడా ఇంద్ర, సూర్య గణాలు లతో ఉండేదే కాబట్టి, ఆటవెలది, తేట గీతి లాగ ఆడుకుంటూ పాడుకుంటూ రాసెయ్యొచ్చు.

సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (క్రీ.శ.850 సం) లో చూశారు. అంతకు ముందే ఎన్నో సవంత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. అయితే మనకు తెలిసింది మాత్రం 1160 సంవత్సరాల క్రితం. ఈ పద్యం చాల వరకూ శిధిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఇచ్చారు. చూద్దాము.

“శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
……………………………..కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి…………….
………………..విభవ గౌరవేంద్ర..

ఈ పద్యం లో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే “గునుగు సీసం” కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా.
ఉదాహరణ 1:

కలుగడే నాపాలి కలిమి సందేహింప
గలిమిలేములు లేక కలుగువాడు;
నా కడ్డపడ రాడె నలి న సాధువులచే
బడిన సాధుల కడ్దపడెడువాడు
చూడడే నా పాటు జూపుల జూడక
చూచువారల గృపజూచువాడు;
లీలతో నా మొఱాలింపడే మొఱగుల
మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు;

లక్షణములు

క.
నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !

పాదముల సంఖ్య = 4
ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.
ప్రతి పాదంలోనూ 6 ఇంద్ర గణాలు, + 2 సూర్య గణాలు కలిపి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి.
ఈ పద్యాలు పెద్దవి కావడం చేత ప్రతి పాదాన్నీ రెండు భాగాలుగా చూపుతారు.
ఈ నాలుగు పాదాలకూ చివర ఆటవెలది కానీ, తేటగీతి గానీ ఉండవలెను, ఇది తప్పనిసరి.
ఒకటో పాదం …. ఇంద్ర – ఇంద్ర – ఇంద్ర – ఇంద్ర – పెద్ద పాదం.
రెండో పాదం.. ఇంద్ర – ఇంద్ర – సూర్య – సూర్య- చిన్న పాదం.
మూడు నాలుగూ… ఐదూ ఆరూ… ఏడు ఎనిమిదీ.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.

యతి

యతి
1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ,
5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ మైత్రి కుదరాలి.
ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
ప్రాసయతి ఉండ వచ్చు.

అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు – అంటే ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే).
ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
ప్రాస

ప్రాస నియమం లేదు.

ఉదాహరణ 2:

వరధర్మకామార్థ వర్జితకాములై
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతి బోందుదురు? చేరి కాంక్షించువారి క
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?
రానందవార్ది మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియు గోరక
భద్రచరిత్రంబు బాడుచుందు?

ఉదాహరణ 3:

సీసపద్యం ఎట్లా ఉండాలనేది ఒక ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్పబడింది.

ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు
పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు

Standard
ప్రక్రియ

ప్రాస

ఒక పద్యం లోని ప్రతి పాదం లోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాస అంటే కవిత్వానికి ఉపయోగించే వ్యాకరణ విశేషము. అంటే పాదాల చివరి పదాలలో కొంత సారూప్యము ఉండుట.
మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ విధంగా ఉంటుందో తక్కిన పాదాలన్నింటిలో రెండవ అక్షరం ఆ విధంగానే ఉండాలి. దీనినే 
ప్రాస మైత్రి అంటారు.

 • ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును.
 • ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
 • ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
 • ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
 • ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.


 • వృత్తాలలో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, తరలము, మత్తకోకిల వంటి రీతులలో ప్రాస నియమము పాటించవలెను.
 • జాతులలో కందము మరియు తరువోజ పద్యాలలో ప్రాస నియమము ఉంది. ద్విపదలో ప్రాసనియమము ఉన్ననూ, ఈ నియమాన్ని పాటించని ద్విపదని మంజరీ ద్విపద అంటారు.
 • ఆటవెలది, తేటగీతి, సీసము వంటి ఉపజాతి పద్యాలలో ప్రాస నియమము లేదు. కానీ వీటిలో, ప్రాసయతి చెల్లును.

ప్రాసభేదాలు


 1. అర్థబిందు సమప్రాసం
 2. పూర్ణబిందు సమప్రాసం
 3. ఖండాఖండ ప్రాసం
 4. సంయుతాక్షర ప్రాసం
 5. సంయుతాసంయుత ప్రాసం
 6. రేఫయుత ప్రాసం
 7. లఘుద్విత్వ ప్రాసం
 8. వికల్ప ప్రాసం
 9. ఉభయ ప్రాసం
 10. అనునాసిక ప్రాసం
 11. ప్రాసమైత్రి ప్రాసం
 12. ప్రాసవైరం
 13. స్వవర్గజ ప్రాసం
 14. ఋప్రాసం
 15. లఘుయకార ప్రాసం
 16. అభేద ప్రాసం
 17. సంధిగత ప్రాసం

Standard
ప్రక్రియ

యతి-ప్రాస నియమాలు –- పుల్లెల శ్యామసుందర్

తెలుగు పద్యానికి వన్నె తెచ్చేవి యతి, ప్రాస, ప్రాస యతి, అనుప్రాస, అంత్యప్రాస, మున్నగునవి. వీటికి అనేక ప్రమాణాలూ, నిబంధనలూ ఉన్నాయి. పద్యం అలవాటు తప్పడం వల్ల మనం చాలామటుకు కొన్ని తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. తప్పులు చేయడం తప్పుగాదుగానీ, వాటిని సరిదిద్దుకూంటూ నేర్చుకోకపోవడం తప్పేకావచ్చని కొందరి వాదన. మరికొందరు, భాషా పరివర్తనతో పాటూ, ఛందస్సుకూడా పరివర్తన చెందాలి, పాత సూత్రాలు కవిత్వానికి ప్రతిబంధకాలు, అవి భావవ్యక్తీకరణకు తోడ్పడాలికాని భావప్రతిషిద్దాలు కాకూడదు అంటారు. ఏది ఏమైనా సూత్రాలను పాటించుతూ, భావాన్ని పలికించగలిగితే అందులో ఉండే అందమే వేరు. అలా పలికించగలిగే శక్తి, ఆసక్తి ఉన్నవారికి ఉపకరణాత్మకంగా ఉండటానికి కొన్ని నియమాలను పొందుపఱచే ప్రయత్నమిది.

యతిప్రాసలు పద్యానికి అందాన్నిస్తాయి. ఈ మధ్యన పద్యం హృద్యం లోవచ్చిన కొన్ని పూరణలలో యతిప్రాసలు అక్కడక్కడా తప్పాయి. పద్య రచనకు సహకరిస్తుందని నాకు తెలసిన నియమాలను క్రింద ఇస్తున్నాను. యతినియమాలలో ముఖ్యమైనవి మాత్రమే క్రింద వ్రాయటం జరిగింది.
కం.//సద్యతులవి లేకున్నను

పద్యము బాగుండదసలు వదలక ఛంధో

విద్యను నేర్చిన తప్పక

హృద్యముగా యతులు కుదురు, ఇకపై మనకున్

ప్రాస నియమములు:

 • ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును.
 • ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
 • ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
 • ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
 • ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.

యతి నియమములు:


(1) ఈ క్రింది వర్ణసమూహములలో ప్రతి వర్ణమునకు మిగిలిన వాటితో యతి చెల్లును
 • అ, ఆ, ఐ, ఔ, హ, య, అం
 • ఇ, ఈ, ఎ, ఏ, ఋ
 • ఉ, ఊ, ఒ, ఓ
 • క, ఖ, గ, ఘ, క్ష
 • చ, చ, జ, ఝ, శ, ష, స
 • ట, ఠ, డ, ఢ
 • త, థ, ద, ధ
 • ప, ఫ, బ, భ, వ
 • న, ణ
 • ర, ఱ, ల, ళ
 • పు, ఫు, బు, భు, ము

(2) కఖగఘఙ్, చచజఝఞ్, టఠడఢణ, తథదధన, పఫబభమ లను వర్గములందురు. ప్రతివర్గములోను చివర ఉన్న అనునాసికమునకు,ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి పూర్ణ బిందు పూర్వకములైతే యతి చెల్లును. ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన “న” కు “కంద” లోని “ద” కు యతి చెల్లును. ఉచ్చారణ పరంగా “కంద” ని “కన్ద” లా పలుకవచ్చు. అందువలన “న్ద”లోని “న”తో యతి కుదురును.

(3) అటులనే, “మ” కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురును.

(4) యతి స్థానమున గాని యతి మైత్రి స్థానమున గాని సంయుక్తా క్షరమున్నచో అందులో ఏ ఒక్క అక్షరానికి యతి చెల్లినా సరిపోతుంది. ఉదాహరణకు, యతి స్థానములో “క్ష్మ” ఉన్న, అందులోని, “క”, “ష”, “మ” లలో ఏ అక్షరమునకైనా యతి కుదర్చ వచ్చును.

(5)ఋకారముతో నున్న హల్లులకు యతి కుదురును. ఉదాహరణకు, “ద” కు “గ” యతిమైత్రి లేకున్ననూ, “దృ” కు “గృ” కు యతి కుదురును.

(6) హల్లులకు యతి కుదుర్చునపుడు, హల్లుకి దానిపైనున్న అచ్చుకి కూడా యతి మైత్రి పాటించవలెను. ఉదాహరణకు, “తు” కు “ఒ” కు యతి చెల్లదు. “తు”(త+ఉ) లో ఉన్న “త” కు కూడా యతి కుదర్చవలెను.

ప్రాసయతి నియమములు:

పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను “ప్రాసయతి” అందురు. తేటగీతి, ఆటవెలది, సీసము మొదలగు పద్యములలో “ప్రాసయతి” వాడవచ్చు. ఉదాహరణకు, “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.
ఈ ప్రమాణాలే కాకుండా, యతిప్రాసలకు ఇంకా ఎన్నో నిబంధనలు ఉన్నాయి. కానీ సామన్యంగా అవసరమైనవి మాత్రమే ఈ వ్యాసంలో ఇప్పుడు చర్చించడం జరిగింది. ముందు ముందు మరిన్ని విషయాలు తరువాయి వ్యాసాలలో పరిశీలిద్దాం.
మూలం : సుజన రంజని
Standard