Mattivellu

"స్ఠిమితత్వమే కట్టా శ్రీనివాస్ కవిత్వతత్వం" ~ రాజారామ్.టి

Mattivellu
COVER PAGE
” నేనొక నదిని
ప్రవహించే వరదని
ఫృధివి జీవన హృదిని
నిరంతరానువర్తన ఆవృతిని”

ని తన్ను తాను పరిచయం చేసుకొటున్న కవి కట్టా శ్రీనివాస్.”పాకే పురుగులాంటి జీవితం చుట్టూ, పొరలుపొరలుగా పేరుకుపోయిన ఉదాశేనపు గూడు,బద్దకంగా నిద్రపోయే లోపటిపొరల్లొంచి,నవ్వూ,ఏడుపూ ఏదీ స్వచ్ఛంగా బయటికి రాదు,జీవం రావాలంటే మళ్ళీ బాల్యంలోకో,గూళ్ళన్నీ బద్దలు కొట్టుకొంటూ భవిష్యత్తులోకో దూకాలి”-అనే జీవిత తాత్విక రహస్యాన్నీ చెప్పినవాడు కట్టా శ్రీనివాస్. “ఒక అర్థరాత్రి/నా కవితల్నీ నేనే చదువుకుంటూ/నా డైరీనీ నేనే పరిశీలిస్తూ అపరిపక్వతకు నవ్వుకుంటాను.”-అని కవిత్వపు లోతునూ అర్థమయ్యేటట్లుగా వ్యాఖ్యానం చేసిన కవి శ్రీనివాస్.
‘నాకో గమనింపు వుంది./వేళ్ళేప్పుడూ నేలలోనే వుండాలని/ఆధారమే కాదు,ఆహారమూ అక్కడిదేనని/నేల విడిచిన సాముకి నిలకడేమీ మిగలదని./మట్టి వేళ్ళు నాకెపుడూ చెబుతూనే వుంటాయి.”-అని అనుకొంటూ వొక తాత్విక రహస్యాన్ని విప్పి చెప్పిన కవి శ్రీనివాస్.

“మిత్రపొత్తం’ తెరచి “వెంటాడే బాల్యం” లోని ‘‘నవ్వే సీతకోక చిలుకలతోట”ను ఙ్ఞాపకానికి తెచ్చుకొని “నవ్వే నక్షత్రాలు” ఎన్నున్నాయో లెక్కిస్తూ, ఈ జన సమూహం ఈనాడొక “ద్వీప స్వమూహం” అని భావించుకొంటూ…’కాలం చెల్లిన పాటలు” పాడకుండా “నేనెలా మారాలి” అనే “ప్రశ్నోపనిషత్తు”ను ఎదుర్కొంటూ”వర్షం వెలిశాక’ ఓటమి నుంచి పాఠం” నేర్చుకోవడానికీ ‘ఇంకో ప్రయత్నం” చేస్తున్న స్థిమితత్వం కలిగిన మంచి కవి కట్టా శ్రీనివాస్.
“పుట్టలోని చెదలు” పుట్టొచ్చు గిట్టొచ్చు కానీ శ్రీనివాస్ కవిత్వం అనందాన్ని పుట్టిస్తుంది.ఈకవిత్వం పై “నెగెటివ్ వాయిస్”అసలు వినిపించదు.”మరోసారి” “ప్రయాస”పడి చదివితే ఈ కవిత్వపు “అంచులపై హర్మ్యాలపై”నిలబడితే ఒక అద్భుత అనుభూతితో పాటూ,ఒకఆలోచన”Xగ్రేసియో”గాపొందొచ్చు.కవుల”గుంపులో అతడొక చూపుడు వేలు”.అందుకేఅఫ్సర్ ఈ కవిని “వాస్తవికతని ఎలాంటి ముసుగులు లేకుండా వాస్తవికతగా చూసే దృష్టి గల స్థిమితత్వ కవిగా ఆలోచన చేశారు.చాల నెలలుగా శ్రీనివాస్ కవిత్వాన్ని చదువుతూ,రాయాలని ప్రయత్నించి విఫలమయి చివరకు ఈ కవిత్వంపై “పండిత చర్చ’ చేయడంకన్నా ఇది హృదిలో కురిపించే అనుభూతి “చిరుజల్లు’ను పరిచయం చేయాలనుకున్నా. 
ప్రపంచీకరణ కారణంగా మనిషి యాంత్రికమవ్వటమే కాదు వ్యాపారమయ్యాడు.అందుకే అతడు వొంటరి అయ్యాడు.పైగా సమూహంలో కూడా వొంటరయ్యాడు.కాబట్టే కట్టా శ్రీనివాస్ మనిషిని’ “ద్వీప సమూహం”అని అంటాడు.ద్వీపకల్పమైతే వొకవైపన్నా నేల స్పర్శ వుంటుంది.ద్వీప సమూహం అయినప్పుడు అన్ని వైపుల వ్యాపార సంబంధాల తడే.అది దుఃఖపు తడి కాదు శూన్యపు,ఏకాంతపు,వొంటరితనపు తడి.అందుకేనేమో కవి “నిన్ను నీవు ఆవిష్కరించుకోకుంటే/ ప్రపంచం తన నిశ్శబ్దంలో బహిష్కరిస్తుంది.ఎందుకంటే అసలే నీవొక దీవివి’అని మనిషికి హెచ్చరికను చేస్తాడు.”నలుగురిలో జతపడాలంటే పిల్లోడా మాటల వంతెన వాడాల్సిందేరా బుల్లోడా”-అని మనిషికీ,మనిషికి మధ్య మాటల వంతెన ఏర్పడాలని కవి కోరుకొంటాడు.తన కాలపు సినిమాలను వాచ్యం చేస్తూమనిషితనాన్నిపరోక్షఆవిష్కరణచేస్తాడు.మగధీర,చంద్రముఖి,సుడిగాడు,అపరిచితుడుమునగుచిత్రాలనుసమాజంలోని మనిషి పరంగా వ్యాఖ్యానిస్తాడు.అపరిచితుడు సినిమా లో హీరో రామంగా,రెమో గా,అపరిచితవ్యక్తిగావిడి విడి వేళ్ళలా ఒంటరిగా పొరాడితే ఏ ఫలితం వుండదు అని చెబుతూ,”వేళ్ళైనా విడి విడిగావదలకు/మడిచిపడితేనే/పిడికిలౌతుంది”అనితళుకులీనే వాక్యాల్లో చెబుతాడు.
తన కవిత్వంలో శ్రీనివాస్ ఏ సందర్భంలోనైనా దేన్ని గురించి మాట్లాడిన తనను గురించి,మనిషి గురించి స్పృశించకుండా వుండడు.”మట్టివేళ్ళు”-అనే కవితలో “విశాల బాహువులను చాపుకుంటూ ఆకాశంలోకి ఎదిగిన చెట్టు గురించి మాట్లాడుతూ మనిషి ఎంత ఎత్తు ఎదిగినా తనకు ఆధారమైన తాను నిలబడ్డ నేలను మరువరాదనే విషయాన్ని ,మనిషి ఎంత ఎత్తు ఎదిగినా తాను నిలబడ్డ నేలను విస్మరించారదనే దాన్ని చెబుతూ వేళ్ళు తనకు ఆధారాన్ని’ఆహారాన్ని అందించేవని గుర్తుకూ తెచ్చుకొంటూ,మనిషి కూడా నేల విడిచి సాము చేయ రాదని వొక జీవన వాస్తవాన్ని విప్పి చెబుతాడు.చాల మంది కవులు కళ్ళను వొక అలంకారంగా భాసింప చేయాలనుకున్నప్పుడు వాటిని తామర పూలతోనో,పద్మ దళంగానో పోలుస్తుంటారు.కానీ శ్రీనివాస్ “చెట్టు చూసేది నలు దిశల ప్రపంచాన్ని పత్రనేత్రాలతో”–అని కళ్ళను పోలుస్తూ వొక కొత్త కవి సమయాన్ని ప్రయోగించాడు.ముఖం ఆకర్షణీయంగా వుందనటం వొక సాంప్రదాయం.దీన్నే కవి “సుకుమార ఆకర్షణ పత్రాల ముఖంలో అని అంటాడు.వొక అద్బుత సాయంత్రాన్ని కోరిక రహితంగా మనలోకి వొంపుతాడు. 
పుస్తకం తన నేస్తం.ఈ భావాన్నే “మిత్రపొత్తం” అనే కవితకు ఊపిరి చేశాడు కవి.”పుస్తకాల అల్మెరా తెరిస్తే “ప్రపంచపు కిటికీ తీసినట్లే.’-ఇక పొత్తాన్ని తెరిస్తే ఓ ముద్దుల పురాతన తాత బుజ్జగింపులతో తల నిమిరినట్లే తోస్తుంది.”-ఇలాంటి వాక్యాలు పుస్తకపు గొప్ప దనాన్ని,అది అందిచ్చే అనుభూతిని ఊరిస్తాయి.ప్రియమైన స్నేహితుల స్నేహం దాచిన పుస్తకమంతా కమ్మని వాసనలు వస్తాయనే కవి భావన మనల్నీ పుస్తకాలవైపు మళ్ళిస్తుంది.”ఎండుతున్న మానెందుకు విలపిస్తోందని ‘రాలుతున్న పండుటాకును అడుగుతాడు కవి కాలం చెల్లిన పాటలు”-అనే కవితలో.చెట్టు వలే ఆకు గూడ మరణపు అంచుల్లోనే వుండేది.కవి అడిగిన ప్రశ్నలకు ఆ ఆకు అంతరంగంలోవుండే ఆలోచనల జవాబుల్నీ కవే ఆకు తరపున కవిత్వం చేశాడు.”మౌనాన్ని మరి కొంచెం అరువివ్వటమో/గతి తప్పిన ఙ్ఞాపకాల గతాన్ని/గంపలకొద్ది గుమ్మరించటమో తప్ప”-చేసేది ఏమి లేదని చెబుతూ చెట్టు బాగున్నప్పుడూ పిట్టకో పురుగుకో ఆశ్రమిచ్చి “అందరి బంధువులా సందడి”చేసిందని ఆ చెట్టుకు తన తనువే భారమైన విషాదాన్ని మోడైన తరువాత అది కోల్పోయిన చెట్టు తనాన్ని మనిషికి ఆపాదిస్తాడు శ్రీనివాస్. శ్రీనివాస్ కి అధిక్షేపంతో కూడిన వ్యంగ్యాన్నీ కవిత్వపుగా కొస మెరుపు చేయటం యిష్టంలా వుంది.నగరపు రోడ్డు మీది గుంటలు,మ్యాన్హోల్స్ మున్నగు వాటి వల్ల జరిగే ప్రమాదాల్ని చాల వ్యంగ్య చమత్కారంతో భాగవత,రామాయణ,భారతంలలోని సన్నివేశాల్ని గుర్తుకు తెస్తూ,వాటిని రూపకాలుగానో,ఉపమలుగానో చేస్తూ చెప్పిన కవిత”సమాంతర కందకాలు”.”లేవండిక/మరి మొద్దు నిద్ర..!/మొసలి పట్టిన ఏనుగు కోసం/చటాలున పరిగెత్తుకొచ్చిన ఆయన/స్వంత భార్య భూమిలోకి ఇంకిపోతుంటే/చేష్టలుడిగి చూసినట్లు”-ఈ వాక్యాల్లో కవి వాడిన వ్యంగ్య వైచిత్రి నగరం నీటి మడుగై పొరలుతున్నప్పుడు ప్రమాదపు మొసళ్ళ బారిన పడిన వాళ్ళని గురించి ఆలోచించని తత్వానికి,రాజ్య నిర్లిప్తతకు చురకలంటిస్తుంది.
శ్రీనివాస్ లోని స్థిమితత్వమే కవిత్వం చేయలనుకొన్న వస్తును ఎంతో గాఢతతో హృదిలోకి బట్వాడ చేసి అందుకు తగ్గ భావనను మేధలోకి వొంపి ఆ వస్తువుకు సరిపోయే రూపంలో పఠిత మదిలో వొదిగిపోయేటట్లుగా చేస్తున్నది ఈ సంపుటిలో.రేవ్ పార్టీలలో ఊగిసలాడిపోయి ఊపిర్లు సైతం కోల్పోతున్న యువతను చూడక తప్పని వైనాన్ని,ఆ యువతకి ప్రతీకగా గాలిపటాన్ని చూపి చెప్పిన కవిత’ రేవు కొచ్చిన జీవితాలు.'”భధ్రంగా పట్టుకొన్నా రెండు చేతుల కళ్ళు కప్పి కొట్టుకొచ్చినట్లుంది”అనే పంక్తుల్లో యువత ఆకాశంలో తలెత్తుకెగరాల్సిన రోజు ఇలా తెగిపడి చావు రేవులో తేలుతున్న విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు ఈ కవి.”అనుబంధ దారం జారిందంటే గాలివాటపు జీవితం ఏ దరి చేరదు”-అనే వొక వాస్తవాన్ని కవి బలంగా నిర్మిస్తాడు.”మట్టి వేళ్ళు”-అనే ఈ సంపుటి సారం అన్ని ఖండికల్లో ప్రవహించినా అర్తవంతమైన,వేగవంతమైన సమర్త ప్రవాహం మాత్రం కొన్ని కవితల్లో ఉరికురికీ వస్తుంది.
గమనం ఎప్పుడూ కాలానికీ అతీతమే.పదార్థం ఎప్పుడూ నశించదు ఒక రూపం లోంచి మరో రూపం లోకి అనువర్తితమవుతుందనే విషయాన్ని శక్తినిత్యత్వ సూత్రం చెబుతున్నా కవి “ఈ విశ్వంలో పదార్థాలు ఎంత మిగిలినా ఆలోచన లేకపోతే ప్రపంచం నశించిపోయినట్లే”అనే వొక తాత్వికానుభుతిని వ్యక్తం చేస్తాడు.కాలం మనం కట్టుకున్న గడియారాలను పీకి పారేస్తే నిలిచిపోదు అది గమిస్తూనే వుంటుంది.అయితే చలనం అనేది లేకపోతే కాలం చచ్చిపోతుందంటాడు కవి.చలనం అంటే మనిషిలో వుండే ఆలోచనల చలనం చైతన్య చలనం.పైన చెప్పిన రెండు అంశాలను కవి ఒక ముఖ్య మానవ సంబధాల అంశాన్ని బలపరచాటానికి కవిత్వంగా మార్చాడు.అదేమిటంటే “పలకరింపులు లేనంతనే/ పరిచయాలు ఆగిపోవు./ఙ్ఞాపకాలు లేకపోతేనే అవి కాస్తా ముగింపు కొస్తాయి”-ఈ అంశాన్ని పై రెండు అంశాలు పక్క పక్కన నిలబడి నిలబెడతాయి.ఇలా కవిత్వం నిర్మించటం వొక అపురూప శిల్పం.”కాలాతీత గమనం”-అనే కవిత కవి ఆలోచనా ప్రతిబింబం.
శ్రీనివాస్ రాసిన ‘హత్య’అనే కవిత చదవగానే గుర్తొచ్చింది తిక్కన మహాకవి రాసిన’పగయడగించుట యది లెస్స”అనే పద్యమే.ఈ’ హత్య’- అనే కవిత ప్రారంభం వొక ఉద్వేగానికీ పాఠకున్ని గురిచేస్తుంది.అట్లా ప్రారంభమయ్యే వాక్యాలు రాయటం అంత సులువేం కాదు.కవిత ముగింపు కూడా అంతే ఉద్వేగభరితమై మనసును వికశింప చేసే వొక పాఠం అవుతుంది.శత్రువు ఎదురైతే వాని గుండెల్లోకీ బలంగా దిగేటట్టు పదునైన మెత్తటి చిర్నవ్వు కత్తి విసిరితే,అతని వైపు నుంచి కూడా అదే ఆయుధం వచ్చి గుండెల్లోకి బలంగా దిగితే ఇద్దరి మధ్య శత్రుత్వం చంపేయబడుతుందంటాడు శ్రీనివాస్.ఇమ్దు లోని మాటల పొదుపు ఇతని అభివ్యక్తి నైపుణ్యాన్ని మరింత పెంచింది.పాఠకుల్నీ పగయడగించే దిశగా అడుగులు వేయిస్తుంది.
శ్రీనివాస్ లో వొక విలక్షణత వుంది.ఎంత ఆధునికుడైనా ప్రాచీన కావ్య సాంప్రదాయాలను పట్టుకున్న కవిగా అది ఆయన ప్రత్యేకతగా గుర్తించవచ్చు.పూర్వ కవులు ద్వర్థి కావ్యాలు రాశారు.పింగళి సూరన “రాఘవ పాండవీయం’-అనే ద్వర్థి కావ్యం రాశాడు.ఒకసారి చదివితే రాముని గురించి,రెండోమారు చదివితే పాండవుల గురించిన కథ స్ఫురించేటట్లూ ద్వర్థి కావ్యం చేస్తుంది.”ఫ్రీజర్”,”వర్షం వెలిశాక”,”నేషనల్ హైవే”-మున్నగు కవితల్లో ఈ ద్వర్థి కావ్య లక్షణం అన్వేషిస్తే అగుపిస్తుంది.’నేషనల్ హైవే”-కవితలో అది మనతో మాట్లాడుతుంది.కవి రోడ్డుకు మానవ ఆరోపణ చేశాడు.”ఇవి ఎన్నాళ్ళనుంచో పెంచుకున్న నా స్వీయ సౌందర్యాలు”-అని అది అనటంలో గత వైభవ స్మరణ గుర్తుకొచ్చి మార్గాలకిరుపక్కల గల చెట్లు కనిపిస్తాయి.వాటిని వెడల్పు చేసే నెపంతో తన స్వీయ అందాలను పతనం చేశారని ముందే ఎడంగా వుంచాలన్న బాధ్యతను పద్దతులను పాటించివుంటే “నేనీనాడు శిథిలదేహంతో అవనత వదన భారంతో”ఇలా దుఃఖిత నయ్యేదాన్ని కాదు కదా అని రహదారి విలపిస్తుంది.”నీ సొమ్మెమిపోయింది?దర్జగా పనికానిచ్చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు”అని నిష్టూరమాడి,”వికలమైన ప్రతి శకలాన్ని పేర్చి కూర్చుకోవలసింది నేనేగా”అనుకొంటూ ఎవరో చేసిన దానికీ బాధ్యత తానేవహించాల్సి వచ్చినందుకు తనను సమాధానపరుచుకొంటూ భవిష్యత్తులో తన భయాన్ని వ్యక్తపరుస్తుంది.ఇలా రహదారిని వర్ణించే వస్తువును చేసిన కవి దాని మానవ్త్వ ఆరొపణ చేసి ఇంకొక వస్తువు పాఠకుడికి దృశ్యమానం చేస్తాడు. “వర్షం వెలిశాక”-అనే కవితలో వర్షం ఆగిపోతున్న దశలోని ప్రకృతిని ఆవిష్కరించే స్థితిలోనే మానవ మనస్సులో చెదిరిన స్వప్నాల కల్లోలానంతర స్థితిని స్ఫురింపచేస్తాడు.”ఊగి ఊగి ఆగిన/మొరటు తూగుడు బల్లలా కురిసికురిసి వెలిసిన వర్షం./చూరు చివరనుండి ఒక్కొ చినుకు రాలుతోంది” ఈ వాక్యాల్లోని భావచిత్రం శ్రీనివాస్ ఊహ శక్తిని మన కళ్లముందు నిలబెడుతుంది.”ఫ్రీజర్” అనే కవితలో మరో శిల్పాన్ని ఈ కవి ప్రవేశపెట్టాడు.చిత్రబంధ కవితా రీతిని కూర్చాడు.”దిగటం”-అనే పదాన్ని ది అనే అక్షరం కింద వొకమెట్టుకింద మరొమెట్టులా గ,టం, అనే అక్షరాలను పేర్చి ఒక వైచిత్రిని ప్రదర్శించాడు.ఇవన్నీ సాహిత్య ప్రయోగాలే. స్త్రీ సహానుభూతితో స్త్రీ స్వరంలో వినిపించిన మంచి కవిత “ఒక ఫిరమోన్ కన్నీటి నవ్వు”.సజాతి జమ్తువులు తనతో జతకట్టే దానికి తమ శరీరాల నుంచి వొక రసాయానాన్ని విడుదల చేస్తాయి.దాన్నె ఫిరమోన్ అమ్టారు.కన్నీటీకీ దుఃఖం వుంటుంది కాని నవ్వు వుండదు.తనువు పుండై తాను మరొకరికి పండైన ఆమె కన్నీటి నవ్వుతో తనజాతి మనిషైన మగవ్య్క్తి వెదజల్లే దన ఫిరమోన్ తో కడుపు సంచి నింపుకొనే విషాద భీభత్సాన్ని “పదిలో సగం భర్తలున్న ద్రౌపదిలా నేను పతివ్రతనే సుమా!” అనే ఆమె హెచ్చరిక స్వరాన్ని వినిపిస్తాడు. చాల చిత్రమైన కవి శ్రీనివాస్.చదివిన చదువురీత్యా,ప్రవృత్తి రీత్యా ప్రయోగాలంటే మక్కువేమో?కవిత్వంలో గూడా ఒక ప్రయోగం చేశాడు.పరషాలను,సరళాలను ప్రయోగించి ఒక కవిత రాశాడు.క,చ,ట,త,ప అనే వాటిని ఒక్కదానిని ఒక శీర్షిక చేసి,ఒక్కొక్క దాని కింద కొన్ని కవితా పంక్తులు రాశాడు.అట్లాగే సరళాలైన గ,జ,డ,ద,బ ల కింద కూడ కొన్ని కవిత పంక్తులు రాశాడు.అయితే వీటిని వరుసగా చదివితే ప్రశాంత భావం స్ఫురించదు.క-కింద వున్న కవితా పంక్తులను,గ_కింద వున్నవాటితో కలిపి చదివితే సుందర భావార్థం ద్యోతకమవుతుంది అట్లాగే మిగిలినవి చదువుకోవాలి.ఇట్లాంటి వైచిత్రిని ఎవరు ఇటివలి కాలంలో ప్రదర్శించలేదు.ఆరుద్ర గారు చేశినట్లు అనిపిస్తోంది.వ్యాజ నింద వ్యాజ స్తుతితో కవిత్వం చాల మంది రాస్తూ వుంటారు.అట్లాగే శ్రీనివాస్ కూడా మదర్ తెరిస్సా ను నిందిస్తున్నట్లు కనిపించిన అందులో ఆమే మానవత్వ ప్రేమ రూపాన్ని అమ్మా ..ఎంత పని చేశావ్? -అనే కవితలోఅద్భుతంగా చెక్కాడు.
మీరైనా సెప్పండి-అనే కవిత కూడా స్త్రీ స్వరంలో చెప్పిన కవితే.”కడుపులో ఆకలి కండ్లలో నీళ్ళతో”-వున్న ఆమెకు చేస్తున్నది తప్పు అని తెలియని తనం కాకాపోయినా ఏ రీతి బతకాలో తెలియని స్థితిలో మీరైన సెప్పమని చేసిన విన్నపాగ్నిని శ్రీనివాస్ చాల గొప్పగా చిత్రించాడు.అట్లాగే సురా శోకం వొక మంచి కవిత.అతనికే తెలియని అతని శోకం అతని భార్య,పిల్లలపాలిట శాపం.”ఒక అర్థరాత్రి నా కవితలునేనే చదువుకొంటూ నా డైరీని నేనే పరిశీలిస్తూ ,అపరిపక్వతకు నవ్వుకుంటనన్నా”-అది అతని వినయమే తప్ప అపరిపక్వత కాదు.వొక కవి నుంచి ఇంకో కవి నేర్చుకోవాల్సింది ఎప్పుడూ వుంటుంది”-అన్న అఫ్సర్ మాటల్ని తిరిగి కవిసంగ మిత్ర కవులకు చెబుతు ఒక ఆలోచనాత్మక అద్భుత కావ్యాన్ని అందించినందుకు శ్రీనివాస్ ని అభినందిస్తున్నాను.
పుస్తక సమీక్ష
శ్రీ టి.రాజారామ్
Standard
Mattivellu

గుండె చప్పుళ్ళు మట్టివేళ్లు – నియోగి

తన అనుభవాలను, తనవారి అనుభవాలు, విన్నవి, కన్నవి అన్నీ కవికాలపు విషయాలే. నిశ్శబ్దంలోనో, స్థబ్ధతలోనూ మునిగి పోతే కవి కాలేడు. కవి కావడానికి హృదయాంతర లోకాల్లో ఒక అలజడి కావాలి. ఆలోచనా పరిధి విస్తరించాలి. అక్షరాల కూర్పు తెలిసి వుండాలి. అవన్నీ నిండుగా వున్నప్పుడు తాను చెప్పదలచుకున్నదేమిటో అర్థమౌతుంది. అలా కానప్పుడు కవి రాసిన దాంట్లో ఏముందో తెలియక, అర్థం కాక ఆ యెక్క కవిత వ్యర్ధంగా మిగిలి పోతుంది. అయితే కొందరు తమ ఆనందం కోసం ఏవేవో రాసుకుంటారు. అది కేవలం వారికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల ఎవరూ ఏ రసానందాన్ని పొందలేరు. కానీ ఇక్కడ కట్టా శ్రీనివాస్ అందించిన మట్టివేళ్ళలో కొన్ని కవితలు మనకు సంబంధించినవేననిపిస్తుంది. కొన్ని సమాజపు రుగ్మతల్ని ఎత్తి చూపిస్తాయి. ఇలా ీ కవితా సంపుటి లోని కవితలన్నింటిలోను అనుకున్న దాన్ని ఖచ్చితంగా చెప్పగలిగాడు కట్టా శ్రీనివాస్.

‘‘నేనెలా మారాలి? ’’ అనే కవితలో
సరదాగా సిన్మాకెళదాం అంటావు/ పాడు పర్సుముక్కును పైకిలేపి/ నాలుక కనపడేలా వెవ్వెవ్వె అంటే/ ఉక్రోషంతో/ నీవ్వోండిన కూరలో/ ఉల్లిపాయెందుకు వేసావని/ కొత్తగా కొన్న గాజు కూజా/ పగులగొట్టి పార్కులో కెల్తా / సిగరెట్లతో…
ఇది లేమిలో వున్నపుడు ఏమీ చేయలేక భార్యపై అసహనం ప్రదర్శించడాన్ని చూసిస్తాడు.
ఇందులోనే మరోచోట
తలుపుతీస్తూ కళ్ళతోనన్నా ఈసడిస్తావని నే సిద్దమైతే / తప్పు చేసిన తనంతో/ నేలను చూసే కంట్లో నీళ్ళతో నీవు/ పాత రిజర్వాయరులా భళ్ళున / పగిలే గుండెనుంచి/ నీ కాళ్ళైనా తనివితీరా / కడగాలనుకుంటా…
అంటాడు.
ఇందులో చేసిన తప్పుకు పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇటువంటివి మధ్యతరగతి కుటుంబాల్లో సహజం. దాన్ని చెప్పడంలో కట్లా శ్రీనివాస్ కి మధ్య తరగతి జీవుల జీవనం సంపూర్ణంగా తెలుసని మనకు తెలుస్తుంది.
అలాగే ‘‘నవ్వే నక్షత్రాలు’’ అనే కవితా ఖండికలో ఋతువులు తప్పిపోయాయి/ కాంక్రీటు అరణ్యంలో/ లోహ విహంగాల పరుగులకు భయపడి / ఎరువుల తిండి వికటించి / నకిలీ వైద్యంతో నలిగి పోయి / దిక్కు తోచక వెబ్ సైట్ల బైట్లకి గురైనట్లున్నాయి. అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఈ కవితా సంపుటిలో 67 కవితలున్నాయి. అవి వేటికవే ప్రత్యేకత కల్గి చదివించే విధంగా వున్నాయి. మొదటి ప్రయత్నంలోనే కట్టా శ్రీనివాస్ ఒక మంచి పుస్తకంతో ముందుకు రావడం అభినందనీయం.

పేజీలు : 105 వెల : 90రూపాయిలు
ప్రతులు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం.

Standard
Mattivellu

మట్టివేళ్లూ – మా శ్రీనివాసరావూ – ( సమీక్ష) – కాశి రాజు


“ఒక మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిదైతే ,ఒక మంచి మిత్రుడు మంచి పుస్తకం వంటివాడే “ ఈ వాక్యాలు మిత్రుడు మట్టివేళ్లు శ్రీనివాసరావు కోసమే ! మాది అంతర్జాల ప్రేమ , మా ప్రేమ పరాకాష్టకు చేరి స్నేహమైన సందర్భం లో కలిశాం మేము. తన మాటల్లోని ప్రత్యేకత మెల్లగా పెనవేసుకుంది నన్ను , నాకే కాదు ఆ మాటలు అందరికీ ప్రత్యేకతను పరిచయం చేస్తాయి. అంతటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం అతనిది. తను ఇటీవల రాసిన మట్టివేళ్లు బహుశా పూర్తిగా ఈ సమాజంలో పాతుకుపోవాలనే ఆశతో మొదలిపెట్టు ఉంటాడు.అది చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి , మానవీయత, నాయకత్వ లక్షణాలే కాదు , ఆవేశాలు,పరకాయ ప్రవేశాలు,సందేహాలు, సందేశాలు కూడా కనిపిస్తాయి , కాలాతీత గమనం కవితలో 


పలకరింపులు లేనంతనే
పరిచయాలు ఆగిపోవు
జ్ఞాపకాలు లేకపోతేనే
ఆవికాస్తా ముగింపుకొస్తాయని
”సున్నితమైన పరిశీలన మనముందుంచుతారు , చిరునవ్వుల బాణాలు విసిరి శత్రుత్వాన్ని హత్యచేసి హంతకుడై కనిపిస్తాడు “హత్య” కవితలో

తెగిన దారాన్ని
పగిలిన అద్దాన్ని
అతికిద్దామని
మాటల మైనం ఎంత పూసినా
ఆవేశపు శకలాలు
వైవిద్యపు ఆవిర్లు చిమ్మితే
మైనం, కాలం వృదా,వృదా
అంటూ ప్రయోజనంలేని “ప్రయాస” దండగని చెబుతాడు.

ఒకరి గురించి ఒకరు అంచనా వేయడం అంత సులువుకాదు, ఎవరిని ఎంత చదివినా కొంత మిగిలే ఉంటారేమీ అని ఆయన అభిప్రాయం , పూర్తిగా తెలుసుకోవడం ఎవరివల్లా కాదుగానీ తెలిసిన మట్టుకు వెల్లడి చేయమంటాడు,కొలతలకొక పరికరం ఉంటే కుదిరితే తెచ్చుకో అంటాడు,కానీ ఒక్కమాట నాక్కూడా చెప్పు అంటాడు . ఎప్పుడో జరిగే హానిని ఏమాత్రం నివారించలేనపుడు అప్పటివరకూ ఉన్న అనాయాచిత హాయిని ఆందోళనతో ఆహూతవ్వడమెండుకు ? ప్రయత్నం మాన్పించే ఆందోళనకంటే అమాయకత్వమే కొంత మేలని తన “దూరదృష్టి “ కవితని మన దగ్గరుంచుతాడు .మనుసులపై పెంచుకున్న అభిమానాన్ని మనసు పొరల్లోంచి తవ్వి తీసి ముందుపరుస్తాడాయన.

ఆయనెవరో కనీసం కరచాలనం చేసెరగను
తన కవిత్వాన్ని ఏ కొంచెమో
తెలిసీ తిలియని నాలుకతో చప్పరించి ఉంటా

పచ్చని అక్షరాల శరీరంతో , ఎర్రటి సంతకాల ముక్కున్న వాత్సల్యపు చిలుక పలకరిస్తే పులకించిపోయానని , గౌరవనీయులైన తాతగారూ మిమ్మల్నొకసారి చూసి ఉంటే ఎంతబాగుండునో అని ఇస్మాయిల్ గారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు . అలాగే భూమిపుత్రుడి బతుకునీ, ఆ బతుకు బలైన తీరుని ప్రభుత్వాసాయం చేరక,
మల్లోకసారి ఆత్మహత్య చేసుకునే అవకాశమూ లేదు
చేసుకోకుండా సొంతోల్లని ఆపే శక్తీ లేదు
ఛీ……… పాడు బతుక్కి
చచ్చిసైతం సుఖం లేదు
“ అంటూ జీవం లేని రైతుగా మనకు కనిపిస్తాడు .
సమాక్య ప్రభుత్వమంత శక్యతతో చరించాలంటే
సమరధికి తగుస్థానం ఇవ్వాల్సిందే
అతిరధులమనుకునే వారంతా
అర్దరతులైతే సమర్ధులౌతారని
గ్రహించాల్సిందే మరి
“.
ఇంట్లోకి ఓ టి.వి.కొందాం
విడివిడిగా రెండు రిమోట్లు అమ్ముతారేమో కనుక్కోవాలి మరి “ అంటూ అర్దనారీశ్వరతత్వాన్ని ఆకలింఫు చేసుకున్న అన్యోన్యత కవితా మనకు కనిపిస్తుంది .అది కూడా చాలదన్నట్లు పరకాయ ప్రవేశం చేసి చూపిస్తాడు

కుండలోని ఎదురుచూపుల్ని
కంచం లోకి వడ్డిస్తే
కాలైనా కడుక్కోకుండా
కన్నీళ్లను జుర్రుకునే
తాగుబోతు బర్తని ,వాడి కార్యాచరణని కళ్ళముందుంచుతాడు.దిండు మడతల్లో దాచుకున్న మొహంలో పక్కకు తిరిగి పడుకున్న నా నడుంమడతల గుండా రోకలిబండ పురుగులు నాలోపలికి పాకుతుంటాయి
రోకలిబండ పెదాల పురుగొకటి మెడవంపులో మరీ మరీ గుచ్చుకుంటూ ఉంటుంద
ని ఒక ఆవేదనను అందరికీ అర్దమయ్యేటట్టు వ్యక్తపరుస్తాడు .ఈ రచయితదెంత పరిశీలనంటే నాకో గమనింపు ఉంది , వేళ్ళెప్పుడూ నేలలోనే ఉండాలని
“ఆదారమేకాదు , ఆహారమూ అక్కడే
” అని తన మట్టి వెళ్ళు కవితలో అంటాడు పనియే దైవమని ఎంతమంది చదివి ఉంటాం , ఆ సామెతను ఎన్ని విదాలుగా చెప్పడో కర్మణ్యేవాధికారాస్తే మాఫలేసు కధాచనా కవితలో చూడొచ్చు.

మిత్రపొత్తం,చీకటిల్లు , కాలం చెల్లిన పాటలు , పండిత చర్చ , ఇలా ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నదే అవన్నీ కవితలే అని ఆయనో లేక నేనో చెప్పను.కానీ ప్రతీ సందర్భంలోనూ ఏదో ఒక అంశాన్ని పంచుకోవాలనేది ఆయన ఆతృత. అది మట్టివేళ్ళు(కట్టా వేళ్ళు) చదివితే కచ్చితంగా అర్దమవుతుంది . పుస్తకం గురించో రచయిత గురించో రాశానని కాదుగానీ నాకో అభి ప్రాయం ఉంది అది నేను పంచుకుందామని నా ఆశ

“ప్రతీ వ్యక్తీ ఒక పుస్తకం , ప్రతీ పుస్తకం ఒక వ్యక్తే “ అందుకే వ్యక్తినీ, పుస్తకాన్ని చదవాలి వీలయితే చదివించాలి
– –కాశీరాజు (9701075118)

మట్టివేళ్లు
కవి :కట్టా శ్రీనివాస్ (9885133969)
ముఖచిత్రం: సుధాకార్ 
అంతర చిత్రాలు: పల్లం పిచ్చయ్య 
పేజీలు:105
ధర:90

  • Katta Srinivas కాశీ నీ ఆత్మీయత కట్టిపడేసింది. పుస్తకాన్ని అచ్చొత్తుకున్నాక వచ్చే పురిటి వైరాగ్యాలను పటాపంచలు చేసేలా. ఒక ఆలోచన వదిలితే ఎక్కడైన కనీసం ఒక్క వత్తి వెలుగుతుంది ఏదో రోజు ఆ వెలుతురు నీక్కూడా దారిచూపిస్తుంది. అనేది నిజమేనేమో అనిపించింది. నేను పట్టించుకున్నానని అక్షరాలతో చెప్పటం మరింత సంతోషం కలిగించింది. ధాంక్యూ వెరీ మచ్ కాశీ..
    ఆత్మీయ పరామర్శకు అభివందనం..
  • Kavi Yakoob Very good poetry appreciation Kasi Raju!
  • Padma Sreeram పుస్తకం వ్రాయడం ఒక తపస్సైతే…. ఆ తపః ఫలమిలాంటి స్పందనలని … సమాజానికి కవులెంత అవసరమో…ఒక నిక్కచ్చి..నిఖార్సైన చదువరీ అంతే అవసరమని అవగతమైన క్షణమిది…కాశీరాజ్ జీ….నమో నమః…
  • Jyothirmayi Malla నువ్వు రాసిన మాటలు చవుతూంటే ఎంతతొందరగా కట్టా తమ్ముడి మట్టివేళ్ళు పుస్తకం చదివేద్దామా అనిపించింది కాశీ! గొప్ప శీర్షికతో చక్కటి కవిత్వాన్ని అందించిన కట్టా తమ్ముడికీ, అందమైన అభిప్రాయాన్నందించిన నీకూ అభినందనలు
  • Kranthi Srinivasa Rao కాశీ …నీవు వచనం అదరగొడుతున్నావు ….మట్టివేళ్ళ …మజా మొత్తం విప్పిచూపావు …బాగారాసావు …సారం పిండావు …నేనూ చదివాను కానీ నీలా విశ్లేషించలేను …..ధన్యవాదాలు

Standard
Mattivellu

మట్టివేళ్ళు-మన కట్టా (పుస్తక సమీక్ష) – నందకిషోర్

తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాదిపరిమళించే మనసుంటే తోటి మనుషులు సీతాకోకలై పక్కన చేరుతారనుకుంటా.నిన్న కట్టా శ్రీనివాస్‌ని చూస్తే అదే అనిపించింది. నా మట్టివేళ్ళు అక్కడే ఉన్నాయని,పుస్తకాన్ని అక్కడే ఆవిష్కరించుకుంటానని పట్టుబడ్తే ముందు కాస్త నవ్వుకున్నాంగాని అక్కడికెళ్ళాకే తెలిసింది అతని వేళ్ళు ఆ మట్టిలో ఎంత లోతుగా పాతుకున్నాయో.

సభలో మట్టివేళ్ళ గురించి నన్ను మాట్లాడమంటే మూడే ముక్కలు మాట్లాడాను.నిజం. అర్ధంకాని వచనాల్ని పేర్చి abstract అని చెప్పుకు తిరిగేవాడైతే బహుశా అంత సుళువుగా
చెప్పలేకపోయేవాన్నేమో. కవి గురించి కూడా ఎక్కువగా చెప్పలేదు.. కానీ,రెండూ- ఒకసారి ప్రయత్నిస్తాను.
తర్కం,తత్వం,సామాజికత,స్నేహశీలత అగుపించే సరళమైన వచనం కట్టాది.ఊహాతీత ఇమేజరీతో ఇబ్బందిపెట్టడు.ఇబ్బందిపడడు.titleకి సరిపడేలా చెప్పాలంటే మట్టిపరిమళం గుండెల్లోనే దాచుకుని,పచ్చటి చెట్టుగా ఎదుగుతూ వచ్చినవాడు కట్టా.నువ్వొక పచ్చని చెట్టువైతే–తర్వాతేం జరుగుతుందో మనకి తెలిసిందే.. 🙂 సరదాగా గుర్తుచేస్తున్నాగాని,నిజమదే.బహుశా ఆ నిబద్దత,నిగర్విగా ఉండగల జ్ఞానమే అతని శాఖా బాహువుల్లోకి అన్ని పిట్టలు వచ్చేలా చేస్కుంది. ఈ చెట్టుకి ఉన్న మరో అదృష్టమేమంటే ఇతడు కాంతిని ఆవహించుకోగలడు.ఆవాహన అని ఎందుకంటున్నా అంటే నీడల్లో పెరుగుతున్నప్పుడు, తిరుగుతున్నపుడు కూడా తన జీవనానికి సరిపడా కాంతిని భాధ్యతగా సంపాదించుకోగల శక్తి అతని స్వంతం.
తన 67 కవితల సంకలనంలో చాలా విషయాల్నే స్పృశించాడు కట్టా..
స్నేహం,సమాజం,దాంపత్యం,దారిద్ర్యం,థెరిస్సా,ఇస్మాయిల్…అన్నింటిని వృత్త బిందువులనుకుంటే, వాటి కేంద్రం మాత్రం అన్నిట్లో సమాంతరంగా పరావర్తనమైన మనిషితనం. ఆ ఒక్కటి వ్యక్తిగాను,కవిగాను అతడెప్పుడు మరిచిపోనందుకు అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.అతని కవిత్వంలో శైలి,శిల్పాల గురించి వ్యాఖ్యానించడానికి సరిపడా సాహిత్యానుభవం నాకు లేదు.నాల్గో,ఐదో పుస్తకాలు తప్ప ఏమి చదవనందుకు అర్హత ప్రశ్నార్ధకమే.కానీ ఆలోచన్నో,ఆస్వాదన్నో ఏదో ఒకదాన్నైనా తృప్తిచెందించే విషయ సమాహారమే అవసరమైన సాహిత్యమనుకునే నాకు, అతని ప్రయత్నం చూసి సంతోషమనిపించింది.
ఇకపోతే- తర్కశాస్త్ర పరిచయంవల్లనో,గట్టిగా శబ్దించే పదాలమీద ఇష్టంవల్లనో తెలీదుగాని,అరుదుగానే అయినా అక్కడక్కడా ఒకటో రెండో సంస్కృత పదాలు దొర్లడం..తను ఈ మధ్య రాసినవి ఇంకా బాగున్నాయని చెపుతున్నా ఫిక్స్ అయిపోయిన పేజిల సంఖ్యలో మార్పులు చేయకపోవడం కట్టాపై నాకున్న కంప్లైంట్స్.సామాజికతని సబ్జెక్ట్‌గా చేసుకున్నవాటిలో మాత్రం వ్యక్తిగా కట్టా ఏంటో తెలుసు కాబట్టి ఫస్ట్ పర్సన్లో చెప్పకపోవడం ప్రాధామ్యంగా తోచలేదు. మనమెలా ఉంటున్నామనేదే తన ప్రశ్నల ఆంతర్యంగా అర్ధంచేస్కుంటే సబబుగా ఉంటుంది.సో ఆ విషయంలో నో కంప్లైంట్స్. అపరిచితుడు,చంద్రముఖి తన పదాల్లోకి వచ్చెళ్ళిపోచడం బోనస్సేనేమో.. 🙂
మనుషులం దీవులమంటు,మనల్ని మనమే ఆవిష్కరించుకోవాలంటు మొదలైన సంకలనం మనం చెయ్యాల్సింది పనే పనే పనే అనే ముగింపు వాక్యాల్తో,(నాలాగ నిద్రపోయేవాళ్ళకి కొంచెం కోపం తెప్పిస్తూ) అయిపోతుంది.”ఇంకా- చిర్నవ్వుతో ఇద్దరు శత్రువులు తమ శత్రువునెలా చంపారో,కిరీటం పెద్దదైతే తలకేమవుతుందో,సరళాలు పరుషాలెలా అవుతాయో” ఇత్యాది గమ్మత్తులన్ని బుక్ చేతికొచ్చాక చదివేయండి..
చివరగా ఒక్క మాట.అక్కడి సాహితీమితృలందరు అతన్ని గుర్తుంచుకున్న కారణాలు,స్పందించిన తీరు చూస్తే చాలా ముచ్చటేసింది.అందులో కేవలం సాహిత్య ప్రియత్వమే లేదు.అభిమానం,ప్రేమ అక్కడ నిశ్శబ్ధంగా ప్రవహించాయ్. బహుశా వ్యక్తీకరించడం కంటే వ్యక్తిత్వానికున్న శక్తి గొప్పదనుకుంటా!

Standard