Personalities

వీడు మగాడ్రా బుజ్జీ

అది తమిళ నాడు లోని ఒక మద్య తరగతి ఇల్లు. ఆయన పేరు అరుణాచలం మురుగానందం. ఆరోజు ఇంటి దగ్గరే వున్నాడు. అప్పుడే వాళ్ళవిడ చేతుల వెనక ఏదో దాచుకుంటూ వెళ్తోంది. “ఏంటి శాంతి అది” మృదువుగానే కానీ ఉత్సుకతతో అడిగాడు. ఒక్కక్షణం ఆగి మళ్ళీ ప్రశ్నను పట్టించుకొనట్లు ఆమె అలాగే వెళ్తోంది. “ఏంటమ్మా అది” ఈసారి ప్రశ్నలో అసహనం కూడా కలిసింది. ఇకతప్పదన్నట్లు ఆమె ఆగింది. పెటిల్మని మొహంమీద ఒకటిచ్చినట్లు ” ఇది మీకు అనవసరం లెండి” అనేసింది. పురుషాహంకారం కాకపోయినా పిల్లచేష్ట కావచ్చు. స్వయంగా లేచెల్లీ అమెచేతులు ముందుకు లాక్కుని చూసాడు.

…..

బహుశా ఈ సంఘటన చాలా పెద్ద మార్పుకు బీజం అవుతుందని ఆమెకు కానీ అతనికి కానీ తెలియదు. ఆమె చేతుల్లో పాత గుడ్డలున్నాయి. అవి ఎంత పాతవి అంటే బైకు తుడుచే గుడ్డ కంటే మురికిగా ఉన్నాయి. అతనికి అప్పుడు అర్ధం అయ్యింది. అతిముఖ్యమైన ఆమె జీవిత అవసరాన్ని అనారోగ్యకరంగా వెళ్ళదీస్తోందని, “వేరేవి కొనొచ్చు కదా శాంతీ” అతనా ప్రశ్నలో ప్రేమను తొణకిస లాడించానని సంబరపడేలోగానే ఇతని తెలియని తనాన్ని సున్నితంగా వెక్కిరిస్తూ ఆమె సమాధానం చెప్పింది. “నేను కూడా టీవీ చూస్తాను. నాక్కూడా పత్రికల్లో వచేప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మనింట్లో ఇద్దరికి ఇవి కొనాలంటే పాలబిల్లు కత్తిరించాల్సి వస్తుందని ఇలా సర్దుకు పోతున్నాం.” సమాచార జ్ఞానం కంటే మించిందేదో మునీశ్వరుల్లా బయటపడని ఈ ఆడవాళ్ళ దగ్గరుంటుంది అని అర్ధం అయినట్లు ఆయన నిశ్శబ్దంగా మారిపోయాడు. ఆమె అతన్ని దాటుకుంటూ మెల్లగా లోపటి గదిలోకి వెళ్ళింది.

కధ ఇప్పుడే మొదలయ్యింది.

◆}◆

1962 లో పుట్టిన అరుణ్ ఇంకా గానుగెద్దు జీవిలా మారలేదు. ఎలాగైనా శాంతికి ఒక ఆరోగ్యకరమైన పరిష్కారాన్ని బహుకరించాలనుకున్నాడు. అలా అప్పుడప్పుడూ ఆమెను సంతోషపెట్టడం తనకి మరింత సంబరం కాబట్టి. బయటి షాపులో ఒక నాప్ కిన్ కొన్నాడు. సెల్లులోస్ కాటన్, పైన్ చెట్ల చెక్కపేడు గుజ్జు లాంటివి మాత్రమే ఉన్న ద్రవాన్ని పీల్చుకుని నిల్వవుంచుకునే ఈమాత్రం గుడ్డ ముక్కలకు ఇంత ఖరీదా? ఆశ్చర్య పోయాడు. ఇంత కాంటే మెరుగైనవి ఇంకా చౌకగా తయారు చెయ్యటం సాధ్యమే అనిపించింది. వెంటనే చకాచకా ఆ ఆలోచనను అమల్లో పెట్టాడు. పరీక్షించమని శాంతి కిచ్చాడు. పెద్దగా బాగాలేదు పాతపద్ధతే నయమని పెదవి విరిచింది ఆమె. ఎడిసిన్ బల్బు కనుక్కునేప్పుడు వెయ్యిసార్లు పరీక్ష చేసి ఉండొచ్చు. ఇప్పుడు రెండోసారి తను పరిశీలించాలంటే మరో నెల వరకు ఆగాలి. ఇలా అయితే మంచి నమూనా సృష్టించడానికి దశాబ్దాలు పడుతుంది. మరో మార్గం వెతకాలి. ఇది అత్యంత రహస్య విషయమే కాదు. అత్యంత నిషిద్ధ కట్టుబాటుగా సమాజం లో ఉండటం తో ఆఖరికి ఈయన గారి అక్కాచెల్లెళ్ళు కూడా ఈవిషయం లో ప్రయోగాలకైతే నువ్వు మయింటికి రాకపోవడమే మంచిదని తేల్చేశారు. మగవాడైన తనకి ఇంత సున్నితమైన విషయంలో మరో మార్గం ఎలా అని ఆలోచిస్తుంటే హఠాత్తుగా మెడికల్ కాలేజి విద్యార్థినులు గుర్తొచ్చారు. నోటితో చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే ఫీడ్ బ్యాక్ పత్రాల్లో రాసిమ్మని అడిగాడు. ఈ ధోరణికి చుట్టుపక్కల వాళ్ళు బహిరంగంగానే విమర్శించే వాళ్ళు. వీడొక పర్వర్టు రా అని హేళనలు ఎన్నెన్నో చుట్టుముట్టాయి. ఆఖరికి ఎవరిగురించి ఈ పరిశోధన మొదలెట్టాడో ఆ శాంతి కూడా అశాంతిగా మారింది. వీటన్నిటికీ ప్రతిగానా అన్నట్లు అరుణ్ మరింత కసిగా తన పని కొనసాగించాడు. మెడికల్ కాలేజీ అమ్మాయిలు సైతం ఇంత ముడుచుకు పోతారా అని ఆ సమాధాన పత్రాలను చూసి నైరాశ్యానికి గురయ్యేవాడు.

ఎవరిమీదో ఎందుకు తన మీద తానే ప్రయోగం చేసుకోవాలనే ప్రళయ నిర్ణయం తీసుకున్నాడు. ఒక రబ్బరు తిత్తి లో ఇంకు పోసి దానికి సెలైను గొట్టం కలిపాడు. తిత్తిని నొక్కినప్పుడల్లా ఇంకు గొట్టం ద్వారా బయటికి వస్తుంది. అంతే కాదు భార్య శాంతి కూడా ఈయన్ని వదిలి బయటికి వచ్చేసింది. విడాకుల పత్రాలూ పంపేసింది. వాటిని పక్కన పెట్టి వంటరి ఇంట్లో ఈయన పరిశోధన మరీ పెంచాడు. వాడిన తర్వాత లోపాలను తెలుసుకునేందుకు used pads తెచ్చి వెనక గదిలో కుప్పలుగా పోసాడు. సరే వాటిని తేవడానికి పడ్డ బాధలు మరో కథ అవుతుంది వీటిని వాడి ఈ పిచ్చోడు వశికరణమో, చేతబడో చేస్తాడేమో నాని అనుమానించి అవమానించిన వారూ వున్నారు.

ఒక ఆదివారం ఈయన దగ్గరకు వల్ల అమ్మ వచ్చింది. ఈ నీచు వాసనకు కారణం, కొడుకు చేపలో, చికెను కూరో వండు తున్నాడు కావచ్చు  అని ముందు అనుకుంది. తర్వాత విషయం తెలిసి షాక్ అయిపోయి శోకాలు పెట్టింది ఆవిడ.

చివరికి కోట్లాది రూపాయల ఖర్చుతో ఉన్న యంత్రాల స్థానం లో 65 వేల రూపాయిల యంత్రాన్ని సృష్టించాడు. అంతేకాదు ఈ గొప్ప ఆవిష్కరణకు పేటెంట్ కూడా లభించింది. 9 వ తరగతి లో చదువు ఆపేసిన అరుణ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉపన్యసించాడు. దేశంలో గొప్ప పురస్కారం “పద్మశ్రీ” ని పొందాడు. టైమ్స్ పత్రిక నిర్వహించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో మోడీ ని, రాహుల్ ని, కేజ్రివాల్ ను తోసి రాజాని ముందుకొచ్చి నిలబడ్డాడు. అయినా సరే ఆయన లక్ష్యం ఇంకా నేరవేరనే లేదంటున్నారు. దేశం లోని 29 రాష్ట్రలలో 23 లో ఇప్పటికే తన జయశ్రీ పరిశ్రమ ద్వారా తక్కువ ధరకే వ్రక్తిగత అవసర వస్తువుని అందుబాటులో కి తీసుకువచ్చాడు. ప్రతి 5 మంది అమ్మాయిల్లో ఒకరు ఈ సమస్యతోనే బడి మానేస్తున్నారు. అధిక సర్వైకల్ కాన్సర్ లకు అందుబాటు లో లేని పరిశుభ్రతే కారణమని అరుణ్ కి తెలుసు అందుకే.
తన పేటెంట్ ను అధిక మొత్తానికి అమ్ముకోకుండా ప్రపంచంలో అన్నీమూలలకూ అది తక్కువ ధరలోనే చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ menustual man.

సరే అసలు విషయం చెప్పనే లేదు కదా శాంతి తిరిగొచ్చింది. ప్రపంచం సగౌరవంగా తన భర్త గొప్పతనాన్ని నెత్తి మీద పెట్టుకుందో అర్ధం అయిన తర్వాత తనెంత తప్పుగా అనుకుందో తెలిసొచ్చింది. ఇప్పుడు అరుణ్ తోనే సంతోషంగా కలిసిపోయింది.

■ మొత్తం ఆర్టికల్ ను మొబైల్ మీదనే టైప్ చెయ్యడం తో కొన్ని అక్షర దోషాలు దొర్లాయి. అర్థాన్ని తీసుకుంటూ చదవగలరు.
మూలం : నా ఫేస్ బుక్ పోస్ట్http://bit.ly/2sl9mK3

from Blogger http://bit.ly/2swhLd8
via IFTTT

Standard
History, Hyderabad, Personalities

మహాలఖా బాయి చాందా

నిజాం రాజ నర్తకీమణులు
నిజాం నవాబుల కాలంలో ప్రముఖ ఉర్దూ కవయిత్రి మహలఖబాయి. ఆమెను ‘చందాబీబి’ అని కూడా పిలిచేవారు. 

భారతదేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రిగా ఆమెకు పేరుంది.

నిజాం నవాబుల రాజనర్తకి, గాయని, కవయిత్రి మహాలఖా బాయి చాందా (మాహ్ అంటె చంద్రుడు, లఖా అంటె వదన = చంద్రవదన).
ఆమె వంశీయులు గుజరాత్‌కు చెందినవారు. 1వ శతాబ్దంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. మాహ్‌లఖా బాయి చందా తల్లి రాజ్‌ కన్వర్‌ బాయి. ఆమె హిందువు. ఆమె అన్న నైజాం సైన్యంలో ఉన్నతాధికారిగా పని చేసేవాడు. నృత్యం ఆమెకు ఆరో ప్రాణం. ఆస్థాన నర్తకిగా వున్నా వివాహం చేసుకుంది. భర్త తాజ్‌ అలీ షా. విభిన్న రంగాలలో ప్రతిభాశాలి. చిత్రకారుడే కాదు, చరిత్రకారుడు కూడా. వారి ఏకైక సంతానమే మాహ్‌లఖా బాయి. తల్లి నుండి నృత్యాన్ని, అందాన్ని తండ్రి నుండి కళాత్మక హృదయాన్ని, చరిత్ర గ్రంథాల యెడల మమకారాన్నే గాక మేన మామ నుండి ధైర్యాన్ని, వీరత్వాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకుంది.
క్రీ.శ. 1764 ఏప్రిల్ 4న మహాలఖా బాయి హైదరాబాద్ నగరంలో జన్మించింది

. మాహ్‌లఖా బాయి జననమే ఒక వింత కథ.  ఆమె తల్లి ఆర్నెల్ల గర్భవతిగా ఉన్నప్పుడు మౌలాలీ గుట్ట మీద ఉన్న ఒక సూఫీ సాధువు దర్గా సందర్శనకు పోయింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించినై. భర్త తాజ్‌ అలీ షా ఒక్కడే పరిగెత్తి పైకి పోయి అక్కడి ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయింది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత పండంటి బిడ్డ ‘మాహ్‌లఖా బాయి’ని కన్నది. ఆమె అసలు పేరు ‘చాందా బీబీ’. మహాలఖా బాయి ప్రతిభను గుర్తించిన అప్పటి నిజాం ప్రధాని అరిస్తు జాహ్ రెండవ నిజాంకు ఆమెను పరిచయం చేసారు. దీంతో నిజాం ఆమెను రాజనర్తకిగా నియమించారు. అనతికాలంలోనే నిజాంకు నమ్మకస్తురాలైన సలహాదారుగా మారింది. ఆమె విశ్వసనీయతకు మెచ్చి నిజాం అపార భూములను మహాలఖా బాయికి కానుకగా ఇచ్చారు. అందులో నేడు నగరంలో ఉన్న పురానా హవేలీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కార్యాలయ ప్రదేశాలు ఒకప్పటి మహాలఖా బాయి ఎస్టేట్లే. అంతేకాదు, నిజాం ఆమెకు అనేక సౌకర్యాలు కల్పించారు.ఆమె తన జీవితకాలంలో మౌలాలీ గుట్టపై ‘ఉర్సులను’ ప్రతి యేటా ఘనంగా జరిపించేది. గుట్ట కింద ఒక పెద్ద పూలతోటను నిర్మించింది. అందులో తన తల్లిని సమాధి చేసింది.

రాజనర్తకీమణుల నాట్యవిన్యాసాలు
చందా 1824 లో సుమారు 55 సంవత్సరాల వయస్సులో మరణానంతరం  మౌలాలీ కొండపైన ఆమె జ్ఞాపకార్థం నిర్మించిందే మక్‌బారా. ఆమె బతికున్న సమయంలో ఇక్కడ ముషాయిరా నిర్వహించేదట. అందుకే, ఇక్కడే ఆమె సమాధి నిర్మించారు.
మౌలాలీ గుట్టపై వున్న మహాలకా చందా సమాధి
మౌలాలీ, అధికమెట్ట (అడిక్‌మెట్‌) నేటి ఉస్మానియా యూనివర్శిటీ, సీఫెల్‌ నుండి బాగులింగంపల్లి వరకూ ఈమె జాగీరులోని ఇలాఖాలు. చదువుల తల్లి ఉస్మానియా యూనివర్శిటీ, వివిధ విదేశ భాషలను అభ్యసించే ‘సీఫెల్‌’(ఇప్లూ), ఆంధ్ర మహిళా కళాశాలతో పాటు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొదలగు విద్యాకేంద్రాలన్నీ మాహ్‌లఖా బాయి చందా భిక్ష పెట్టిన స్థలాలే.

మహాలక చందమెట్ల బావి ఉస్మానియా యూనివర్సిటీలోని ఇప్లూ వద్ద ఉంది. చుట్టూ ఉండే భవనం మధ్యలో బావి ఆకారంలో ఉండడంతో దీనిని ‘మహాలక బావి’ అనేవారు.

ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణ సమయంలోనే దీనిని నిజాం కట్టించినట్లు చెబుతారు.

మహాలక చందమెట్ల బావి

మహ్ లకా భాయి పద్యాలున్న పేజీ
Ratika Sant Keswani enacts the role of Mah Laqa Bai Chanda
Show at Taramati Baradari
‘చందా’ అనే కలం పేరుతో దక్కనీ ఉర్దూలో ఆమె అనేక పద్యాలు, గజల్స్ రాశారు. ఆమె స్వయంగా గజల్స్ రాసిపాడేది. చందా అన్న తఖల్లూస్‌తో (కలంపేరు) ఆనాటి దక్కన్‌లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ‘తవాయఫ్‌’ (కళావంతురాలు) ఆమె. ఇట్లా, తన ఆటపాటలతో నిజాం నవాబులను అలరించిన మహాలఖా బాయి చివరికి 124లో తుదిశ్వాస విడిచింది. మహాలఖా బాయి మరణం తర్వాత ఆమె రచనలు ‘గుల్జారీ-ఇ-మహాలఖా’ పేరుతో అచ్చయినవి. ఆమె సమాధి నగరంలోని మౌలాలీలో ఉంది.

ఆమె గజల్స్ 39 వ దివాన్ సంకలనంలోని ఒక గజల్ ‘‘ మొగ్గవికసించాలనే ఆశ’’ “Hoping to blossom (one day) into a flower” కు ఆంగ్లాను వాదం

Hoping to blossom (one day) into a flower,Every bud sits, holding its soul in its fist.

Between the fear of the fowler and (approaching) autumn,
The bulbul’s life hangs by a thread.

Thy sly glance is more murderous than arrow or sword;
It has shed the blood of many lover.

How can I liken a candle to thy (glowing) cheek?
The candle is blind with the fat in its eyes.

How can Chanda be dry lipped. O Saqi of the heavenly wine!
She has drained the cup of thy love.ఆమె సమాధిమందిరం టేకు తలుపుపై చెక్కన పద్యం అనువాదం ఇలావుంటుంది. 

Cypress of the garden of grace and rose-tree of the grove of coquetry,
an ardent inamorata of Hydar and suppliant of Panjtan.

When the tidings of the advent of death arrived from God,
she accepted it with her heart, and heaven became her home.

The voice of the invisible speaker called for her chronogram,
Alas! Mah Laqa of the Deccan departed for heaven 1240 A.H.


 ఆధార సూచికలుStandard
Personalities

మన వేమన్నకు ముందువాడు బసవణ్ణ

జీవితంలోని వివిధ కోణాలను వాడుక మాటలతో జనానికి సులభంగా అర్ధం అయ్యేలా వచించిన మహాపురుషుడు కన్నడ నేలపై 880 సంవత్సరాల క్రితం పుట్టాడు. కుల రహిత సమాజాన్ని 12వ శతాబ్దంలో ప్రబోధించి ఆచరించి చూపించిన క్రియాశీలి, సత్యము, అహింస, భూతదయ గురించి ఎన్నో అనుసరించదగిన వచనాలను వచించిన మహాపురుషుడు బసవడు. గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, సద్గుణ సంపన్నుడు, అసమాన మేధాసంపన్నుడు అయిన మహాత్మా బసవేశ్వర. బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని మరియు విశ్వగురు అని పిలుస్తారు. 
కర్ణాటకలోని ‘హింగుళేశ్వర బాగెవాడ’ ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. అందుతున్న చారిత్రక ఆధారాల మేరకు జీవన కాలం 1134–1196 మధ్యలో చిన్న వయసులోనే శైవ పురాణ గాధలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయాలనుకున్న తల్లిదండ్రులను వదలిపెట్టి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం చేరుకున్న బసవుడు అక్కడ వున్న సంగమేశ్వరుణ్ణి నిష్టతో ధ్యానించాడు. దేవుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, దేవుడు ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు.
భక్తి బండారీ బసవనిగా అతని నిబద్దతను సూచించే కథ ఒకటి వాడుకలో వుంది.
బీదర్ జిల్లాలోని బసవకళ్యాణ్ పట్టణంలో నిర్మించిన
108 అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం

ఓసాయం సంధ్యవేళ దీపం వెలుతురులో మహాత్మా బసవేశ్వరుడు ఏదో చదువుతూ కూర్చొన్నాడు. ఆయన్ని కలవడానికి కొందరు పెద్దలు వచ్చారు. అందరూ బసవేశ్వరుడికి నమస్కరించి కూర్చొన్నారు. వారంతా ఏదో పనిబడి తనవద్దకు వచ్చారని గ్రహించిన బసవేశ్వరుడు ‘‘నావద్దకు వ్యక్తిగత పని గురించి వచ్చారా? లేదంటే ప్రభుత్వ పని గురించి వచ్చారా?’’ అని ప్రశ్నించాడు.

‘‘మతపరమైన చర్చ గురించి మీవద్దకు వచ్చాం’’ అన్నారు పెద్దలు.
వెంటనే బసవేశ్వరుడు అప్పటివరకు ఏ దీపం వెలుగులో తాను పనిచేసుకుంటున్నాడో, ఆ దీపాన్ని ఆర్పివేసి, మరో దీపం వెలిగించి వారితో మాట్లాడటానికి సిద్దమయ్యారు.
విషయం పెద్దలకు అర్థంకాలేదు. దీపం మార్చడంలో ఆంతర్యం ఏమిటో? అన్నట్లు బసవేశ్వరునివైపు చూసారు. మొదటి దీపం ప్రభుత్వానిది, రెండవది నా స్వంతానిది అన్నాడు బసవేశ్వరుడు. మతపరమైన చర్చ ధర్మసంబంధంగా నా వ్యక్తిగత విషయం. ఇందుకు ప్రభుత్వం వారి సొమ్ము వాడటం ‘తగదని’ అలా చేసాను అని బదులిచ్చాడు. ఇప్పుడు మంత్రులగా మరేదే ప్రజాదనాన్ని దోచుకోవడానికి అనేవిధంగా తయారైన నేపధ్యంలో ఈ కథ ఒక చురకలాంటింది. 
ఒక వైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ బసవడు భగవద్భక్తి వ్యాప్తికి నిరంతర కృషి చేశాడు. అతని బోధనలలోని సమదృష్టి పలువురిని ఆకర్షించింది. వీరశైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రదేశంలోను వ్యాప్తి చెందినది. ప్రతిరోజు లక్షా తొంభై ఆరువేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్చించి అనంతరం తాను భుజించేవాడట. బసవడు తన ఉపదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు వ్రాసాడు. వీటిలో సూక్ష్మమైన తత్త్వం సులువుగా బోధపడేది. సాహిత్య పరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది. ఇతడు మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతీతి. కానీ, ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి.
బసవేశ్వరుడు స్థాపించిన సంఘ ‘అనుభవ మండపం’ అని పేరు. బసవేశవరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు. అది ఆనాటి సంఘంలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నూతన దంపదుతులు హత్యకు గురౌతారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని కలచివేస్తుంది. తన అమాత్య పదవిని వదలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుని సన్నిధికి చేరి, కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు.
బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశాడు. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు. ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటినుంచి పారిపోయాడు.శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు. ఆయన ఉపదేశాలు:
సాహిత్యం పై ప్రభావం
శ్రీ గురు బసవ

బసవేశ్వరుడి ప్రభావం కర్ణాటక ప్రాంతంలో చాలా ఎక్కువ. ఆయన చెప్పిన ‘మాటలు’ వచనాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన ప్రభావంతోనే తెలుగులో పాల్కురికి సోమనాథుడు విశేషమైన రచనలు చేశాడు. తెలుగులో మొట్టమొదటి దేశిపురాణం బసవపురాణం. మొదటి శతకం వృషాధిప శతకం. ఈ రెండూ సోమనాథుడు బసవేశ్వరుని ప్రభావంతో రచించినవే. పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుని రెండవ శంకరుడనెను.

ఘనుడు బసవణ్ణ. శెట్టి అయిన సిరియాళుణ్ణి, రజకుడైన మడివాలు మాచయ్యను, చండాలుడిగా చెప్పే కక్కయ్యను, మాదిగ కులస్థుడైన చెన్నయ్యను, బాలిక అయిన గొడ గూచిని, స్ర్తి అయిన అక్కమహాదేవిని కుల, బాల, స్ర్తి, పురుష బేధం పాటించకుండా శివభక్తి ప్రస్థానంలో మహోన్నత స్థానంలో నిలబెట్టాడు బసవేశ్వరుడు.
సామాజిక స్థితి గతులపై బసవని ప్రభావం
బెంగుళూరులోని గురు బసవన్న విగ్రహం
కులాన్ని త్రోసి రాజని సర్వమానముల చేతిలో చిన్ని లింగాన్ని పెట్టి లింగార్చన చేయమన్నాడు. అప్పట్లోనే కులాంతర వివాహాలు నిర్వహించి కులాలు మానవుడు కల్పించినవే అవి సహజంగా వచ్చినవి కావని చెప్పగలిగిన జ్ఞానం తోపాటు ధైర్యం కలవాడు బసవన్న. శైవమత వ్యాప్తిలోవున్న కాలం కావడం వల్ల కావచ్చు లేదా ఏదో ఒక కేంద్రీకృత లక్ష్యం మనిషికి అవసరమని భావించడం వల్ల కావచ్చు ఆద్యాత్మిక దోరణిని ప్రజలలో వ్యాపింప చేయడం లో ప్రధాన పాత్ర పోషించారు. పరమేశ్వరుణ్ణి ప్రతి మనిషికీ అందేలా చేసి కులాలతోనూ, ఆడా,మగ వ్యత్యాసంతోనూ సంభందంలేకుండా లింగధారణ చేయించాడు. దేవుణ్ణి ప్రతివారి లోనూ వుండేలా చేసినపుడే సమాజనిర్మాణం సక్రమంగా వుంటుందని భావించారు. ఈ లింగార్చన ఒక ధ్యానయోగం. ఈ రోజుల్లో ఎందరో తమ మనస్సు శాంతి, ఏకాగ్రత కొరకు ధ్యానం అభ్యాసం చేస్తున్నారు. కాని బసవణ్ణి ఆ రోజుల్లోనే సహజంగానే ధ్యానం కుదిరే పద్ధతి వ్యాప్తి చేసాడు.
ధనమే ప్రధానం అనుకొనేవాడికి శివుణ్ణి చేరడం సాధ్యంకాదు అంటాడు బసవన్న. వడ్డీ వ్యాపారం మానవుల ఆర్థిక అసమానతలకు కారణం అని ఆనాడే నిరసించాడు. ధనవ్యామోహం దుర్బలమైంది అనేది బసవణ్ణ ప్రగాఢ విశ్వాసం. సత్యమే దైవము మరియు అన్ని ప్రాణుల యెడల దయకు మించిన దైవము మరొకటి లేదంటాడు. బసవేశ్వరుడు అస్పృశ్యతా నివారణ, స్ర్తిగౌరవము పెంపుదల, స్ర్తి సమానత్వము, కుటీర పరిశ్రమల పెంపు, ఆర్దిక సమానత్వం మొదలైన సంస్కరణలు ఆరోజుల్లో అమలుపరచి సత్ఫలితాలను సాధించాడు.
బస వేశ్వరు డికి లభిస్తున్న ఆదరణ ఛాందసవాదుల్లో కంపనాలు రేకెత్తించింది. వారు అతడి పట్ల ఈర్ష్యపడేవారు. అతడికి శత్రువులుగా మారారు. అయినప్పటికీ బసవేశ్వరుని వ్యక్తిత్వం ముందు అవి నిలబడలేదు. క్రీ.శ. 1167లో బసవేశ్వ రుడు తిరిగి కుండల సంగమానికి చేరుకున్నాడు. అక్కడే తన దేహాన్ని చాలించాడు.
శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు. ఆయన ఉపదేశాలు:

Kudala sangama in Bagalkot district,
where Guru Basavanna’s samadhi is located.
మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు.

శివుడే సత్యం, నిత్యం.

దేహమే దేవాలయం.

స్త్రీ పురుష భేదంలేదు.

శ్రమను మించిన సౌందర్యంలేదు.

భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.

దొంగలింపకు, హత్యలు చేయకు
కల్లలనాడకు, కోపగింపకు ఆత్మస్తుతి పరనిందల విడువు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అంటారు. కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవనానికి గౌరవస్థానం కల్పించిన బసవేశ్వరుడు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు .ఇప్పటికీ బసవన్న జయంతిని ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు జరుపడం అనవాయితీ.

One of his most famous lessons is  
Original –
ಕಲಬೇಡ ಕೊಲಬೇಡ
ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೆಡ
ಮುನಿಯಬೇಡ, ಅನ್ಯರಿಗೆ ಅಸಹ್ಯ ಪಡಬೇಡ
ತನ್ನ ಬಣ್ಣಿಸ ಬೆಡ, ಇದಿರ ಹಳಿಯಲುಬೇಡ
ಇದೇ ಅಂತರಂಗ ಶುದ್ಧಿ, ಇದೇ ಬಹಿರಂಗಶುದ್ಧಿ
ಇದೇ ನಮ್ಮ ಕೂಡಲಸಂಗಮನೊಲಿಸುವ ಪರಿ
Transliteration –
Kalabeda, Kolabeda, Husiya nudiyalu beda,
Muniyabeda, Anyarige asahya padabeda
Tanna bannisabeda, Idira haliyalubeda
Ide antaranga shuddhi, Ide bahiranga shuddhi
Ide namma koodalasangamanolisuva pari.
Translation –
Don’t steal. Don’t kill. Don’t lie.
Don’t lose your temper. Don’t act with disgust towards anyone.
Don’t praise yourself. Don’t degrade others.
This is  inner cleanliness. This is outer cleanliness*.
This is the means to please our Kudalasangama**.
* Cleanliness in this context refers to the Hindu concept of moral and physical cleanliness. Orthodox upper caste Hindus consider a whole range of actions, deeds, movements, methods and people as ‘unclean’ and go to many ritualistic means to avoid becoming ‘unclean’ through contact of these things. Basavanna is clarifying that such deeds, rather than the ritual actions, make one ‘clean’.
** Kudalasangama was Basavanna’s name for his personal god and he addressed his sayings to this version of god.( ఈయన కూడల సంగమేశ్వరా అనే మకుటంతోనే తన వచన గీతాలన్నీ వెలువరచారు)
భారత పార్లమెంటు లో 2003 ఏప్రియల్ 28 న అప్పటి రాష్ట్రపతి
శ్రీ ఎపిజె అబ్దుల్ కలాం బసవేశ్వరుని విగ్రహం ఆవిష్కరించారు
బసవేశ్వరుని పేరుతో 1997 లో విడుదల చేసిన
పోస్టల్ స్టాంపు
మహాత్మ బసవ అంటూ భారత ప్రభుత్వం విడుదల చేసిన
స్మారక  ఐదు రూపాయిల నాణెం 

మరింత సమాచారం కోసం

1) బసవని జీవిత చరిత్ర, వారి రచనలు, వాక్కులూ వంటి వివరాలు ఆంగ్లలో చదవదలుచుకుంటే
http://www.vishwagurubasavanna.com/Default.aspx

2) దీవి సుబ్బారావు గారు అనువాదం చేసిన బసవని వచనాలు కొన్ని
‘‘ మాటన్నది జ్యోతిర్లింగం ’’ పుస్తకంలో దొరుకుతాయి
.
Standard
Personalities

తెలంగాణా ఇగురం నందినీ సిధారెడ్డి

‘‘నాగేటి సాలల్లో నాతెలంగాణా ’’ పాటను అప్పటికే అనేక సభల్లో అనేక మంది గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, వైభవాన్ని తెలిపే ఆ పాటచివరకు ఆర్.నారాయణమూర్తి నటించిన వీర తెలంగాణచిత్రంతో వెండితెరకు కూడా ఎక్కింది. గేయరచయిత నందిని సిద్దారెడ్డికి ఉత్తమ గేయరచయితగా 2010 సంవత్సరానికి నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఆ పాటే నాగేటి సాలల్లో నా తెలంగాణ…’.తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించే సిధారెడ్డగారు కెసిఆర్, కోదండరామ్ వంటి ముందుశ్రేణి నాయకత్వానకి దగ్గరగా వున్న వ్యక్తి.


పుస్తకాలు చదవడం కాదు….పుస్తకాలు రాసుడు గొప్ప అన్న తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకొని బడిలో తెలుగు పాఠాలు చెప్పే అష్టకాల నర్సింహ్మశర్మ గురువు ప్రోత్సాహంతో అన్నింటా గురువైన శివారెడ్డి ఆదరణతో తెలంగాణ బతుకు చిత్రాలను తన కలం నుండి మన కంటికి చూపిన బంగారమసొంటి కవి నందిని సిధారెడ్డి. 1955 జూలై 12న మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బాలసిధారెడ్డి, రత్నమాల కు ముద్దుబిడ్డ నందిని సిధాడ్డి. బందారం గ్రామంలో బాల్యాని గడిపి ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ఉన్నత పాఠశాల విద్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్కటూర్‌లో పూర్తి చేశారు. పేదరికం విద్యకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాలు తిప్పక కలం పట్టిన కవి సిధారెడ్డి. ఒక్క పూట తిండితోనే గడిపిన రోజులు ఎన్నో ఉన్నా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువులను పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంటూ పోస్టు గాడ్యుయేషన్ , 1981 లో ‘‘ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు ’’ అనే అంశంతో  ఎంఫిల్‌ను పూర్తి చేశారు. 1986లో డాక్టర్ సి.నారాయణడ్డి పర్యవేక్షణలో ‘‘ ఆధునిక తెలుగు కవిత్వంలో వాస్తవికత, అధివాస్తవికత ’’ అనే అంశంతో పిహెచ్‌డి పూర్తి చేసి డాక్టరేట్‌ను అందుకున్నారు.

సాహితీ ప్రయాణం

1973 నుండి మిత్రుడు భగవంతాడ్డి ప్రోత్సాహంతో సామాజిక కవిత్వం రాయడం మొదలు పెట్టారు.
1974 లో సిధారెడ్డి రాసిన దివిటి మినీ కవితా సంకలనాన్ని కందుకూరు శ్రీరాములు, కర్ణాల బాలరాజు కలిసి తొలి                పుస్తకంగా అచ్చు వేయించారు.
1991లో సంభాషణ,
1995లో ప్రాణహిత,
1997లో భూమిస్వప్నం,
2001లో ఒక భాద కాదు,
2007లో నది పుట్టుబడి,
2007లో ఇగురం
2008 తెలుగు కుల వృత్తుల సాహిత్యం
2011 తెలంగాణా సాహిత్యంపై వ్యాసాలు
2012 నాగేటి సాలల్లో నా తెలంగాణా – నంది బహుమతి పొందిన పాట

గుర్తింపు

1987 భూమి స్వప్నం కవితా రచనకుగాను ఫ్రీవర్స్ ఫ్రంట్
1988 లో దాశరథి అవార్డు పొందారు.

2001లో ప్రాణహిత కవితా సంకలనానికిగాను తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది. కానీ అప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. 
2009లో విశ్వకళాపీఠం వారు ఒక భాద కాదు కవిత రచనకుగాను ఉత్తమ కావ్య స్నేహనిధి పురస్కారాన్ని అందించింది
1979లో మల్లీశ్వరీ గారిని జీవితభాగస్వామిగా ఆయన జీవితంలోకి ఆహ్వానించారు. వీరి గారాల పట్టి కుమారి వీక్షణ.
1994లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పని చేసిన సిధారెడ్డి ఉద్యమాలతో నిరంతర సంబంధాలు వామపక్ష విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించారు. 
1994నాటి విప్లవ ఉద్యమం మొదలుకొని నేటి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన పాటలు, మాటలు తుపాకీ తూటాలైనవి. 
1997 ఆగస్టు నెలలో ఆయన రాసిన తొలి పాట నాగేటి సాలల్లో నా తెలంగాణ అనే పాట తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ఉర్రుతలూగించింది. అమరుల స్మృతి కోసం రాసిన జోహారులు…జోహారులు అనే పాట కడుపులో ఉన్న దుఃఖాన్ని కళ్లకు తెచ్చింది. ఆయన కవిత్వం రాసేటప్పుడు మనిషి ఎడ ఉన్నా మనస్సు మాత్రం బందారం చెరువు కట్టకాడ, మూడు గుండ్ల కాడ, బందారం ఊర్లే సంచారం చేస్తదట. ఊరి జ్ఞాపకాలన్నీ మదిలో మెదిలితేనే ఆయన కలం కదులుతదట. అందుకేనేమో ఆయన కవిత్వంలో పల్లె కన్న తల్లోలే కనబడుతది.
కీలక బాధ్యతలు

1984లో మెదక్ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు.
1986లో మంజీర రచయితల సంఘాన్ని (MARASAM)- ఏర్పాటు చేసి తెలంగాణ కవులకు కొత్త వేదికను అందించారు.
2001అక్టోబర్ లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరించారు.

మంజీర అనే ద్వైమాసిక, సోయి అనే త్రైమాసిక పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిధాడ్డి కాలినడకను ఎక్కువగా ఇష్టపడతారు. చిందు భాగవతం, శారదకాళ్లు వంటి తెలంగాణ సంసృ్కతిని అద్దం పటే కళా ప్రదర్శనలు ఎక్కడ జరిగినా ముందు వరుస ప్రేక్షకుడు సిధారెడ్డి. ఫలితం వచ్చే దాకా పట్టువిడవకుండా పోరాడే తత్వాన్ని పెంచుకోవాలని సిధాడ్డి ఎప్పుడూ అనే మాట.
‘నాగేటి సాలల్లో…’ అనే పాటకుగాను నాకు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు వస్తుందని తనేమాత్రం ఊహించలేదని సిధారెడ్డి గారంటారు. ఎందుకంటే గత 14 ఏళ్ళుగా అనేక మంది ఈ పాటను పాడుతున్నారు. బాగా పాపులర్ అయిన పాట అంది. 1997 ఆగస్టు 16వ తేదీన షేక్ బాబా అనే గాయకుడు ఓ పాటను రాసివ్వండి… బహిరంగ సభలో పాడుదాం అని అడిగినందుకు ఆ మరుసటి రోజే అంటే ఆగస్టు 17వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ పాటను రాసిచ్చేశారట. ఆ పాటకు ఆయనే ట్యూన్ కట్టుకుని బహిరంగ సభలో పాడారు. అలా మొదలైన ఆ గేయాన్ని దేశపతి శ్రీనివాస్ అనేక సభల్లో పాడి పాపులర్ చేశారు. ఈ పాట ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయన పాడటమూ ఓ కారణం. ఓ రోజు ఆర్.నారాయణమూర్తి సిద్ధిపేటలో ఉన్న సిధారెడ్డిగారి ఇంటికి వచ్చి ఈ పాటను తన సినిమాలో పెట్టుకుంటానని అడగడమూ…వీరు వెంటనే ఒప్పుకోవడమూ జరిగిపోయింది. ఈ పాటను తన సినిమాలో జె.ఏసుదాసుతో పాడించారు. సినిమాల్లోకి వెళ్ళాలని సిధారెడ్డిగారి చిన్నప్పటి నుంచి వున్న కోరిక ఆవిధంగా నంది అవార్డు రావడంతో తీరిందేమో. కానీ ఉద్యమం బాటలో నడిచే క్రమంలో సినిమాకోసం అటుతర్వాత ఆయన సమయాన్ని ఇవ్వలేకపోయారట.
ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే పాటలను రాయాలనేదే వారి సంకల్పం. ఇప్పటి వరకు 25 పాటలు రాస్తే అందులో పది పాటలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి. 1992లో జరిగిన మద్యపాన వ్యతిరేఖ ఉద్యమానికి సంబంధించి ఓ ఐదు పాటలను, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఓ పాటను, ప్రజా ఉద్యమాలకు సంబంధించి తొమ్మిది పాటలను రాశారు.

మే 2012లో సిధ్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతిగా పదవీ విరమణను చేశారు.


                                                           ( వేర్వేరు ఆధారాలనుంచి సేకరించిన సమాచారం మేరకు తయారు చేసిన వ్యాసం ఇది, సవరణలూ పూరణలూ వుంటే తెలపండి )దేశపతి శ్రీనివాస్ గారు పాటలోనాగేటి చాళ్ళల్లో నా తెలంగాణా
నాగేటి చాల్లల్ల నా తెలంగాణా నా తెలంగాణా

నవ్వేటి బతుకులు నా తెలంగాణా నా తెలంగాణా
పారేటి నీల్లల్ల – పానాదులల్ల
పూచేటి పువ్వుల్ల – పునాసలల్ల
కొంగు చాపిన నేల నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి నా తెలంగాణా నా తెలంగాణా                       |నాగేటి|

తంగేడు పువ్వుల్లు – తంబాలమంతా
తీరొక్క రంగుల్ల – తీరిచీనా పువ్వు
బంగారు చీరలు బజారులన్నీ
బతుకమ్మ పండుగ – నా తెలంగాణా నా తెలంగాణా
బంతి పూలతోట – నా తెలంగాణా నా తెలంగాణా                         |నాగేటి|

వరదగూడు గడితె వానొచ్చునంట
బురద పొలమూ దున్ని మురిసున్నరంతా
శివుని గుల్లె నీల్లు చీమలకు శక్కరి
వాన కొరకు భజన – జడకొప్పులేసి
వాగుల్ల వంకల్ల – నా తెలంగాణా నా తెలంగాణా
చూపు రాలిన కండ్లు – నా తెలంగాణా నా తెలంగాణా                    |నాగేటి|

కొత్త బట్టల్లు గట్టి – కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి – పడుచు చప్పట్లు
జొన్న కర్రల జెండా – జోరున్నదేమి
అలయి బలయి దీసె – నా తెలంగాణా నా తెలంగాణా
జంబి పంచిన ఆర్తి – నా తెలంగాణా నా తెలంగాణా                        |నాగేటి|

మోటగొట్టే రాత్రి – మోగీన పాట
తాడు పేనిన తండ్రి – తలుపులున్నప్పు
కల్లమూడ్సిన అవ్వ – కలలోని గింజ
ఆరుగాలం చెమట – నా తెలంగాణా నా తెలంగాణా
ఆకలిదప్పుల మంట – నా తెలంగాణ నా తెలంగాణా                     |నాగేటి|

ఊరు గాచే తల్లి ఉరిమి చూడంగ
బువ్వలేని తల్లి బోనమొండింది
సేనుకొచ్చిన పురుగు సెరిగిబోసిందా
బోనాల పండుగ – నా తెలంగాణ నా తెలంగాణా
కాట్రావుల ఆట – నా తెలంగాణా నా తెలంగాణా
శివసత్తుల ఆట – నా తెలంగాణా నా తెలంగాణా                        |నాగేటి|

దట్టి గట్టిన రోజు దప్పు చప్పుల్లు
పీరీల గుండంల పిలగాండ్ల ఆట
కుడుకపేర్ల మొక్కు కూలి బతుకుల్లు
ఆలువాడిన పాట – నా తెలంగాణా నా తెలంగాణా
ఆత్మగల్ల చెయ్యి – నా తెలంగాణా నా తెలంగాణా

కలిసేటి సేతుల్ల కన్నీటి పాట
సిందోల్ల సిందుల్ల సిగురించె నాట్యం
వొగ్గు మద్దెల డప్పు వాద్య సంగీతం
కళలకే పుట్టుకా – నా తెలంగాణా నా తెలంగాణా
పాటగాచిన పట్టు – నా తెలంగాణా నా తెలంగాణా                        |నాగేటి|

తాడూ పేనిన తండ్రి తలుపులున్నప్పుడు
మంటలేని కొలిమి బతుకుల్ల మంట
నీళ్లు లేని చెరువు నిను జూసి నవ్వె
బతికి చెడ్డా బిడ్డ – నా తెలంగాణ నా తెలంగాణా
తల్లడిల్లే తల్లి – నా తెలంగాణా నా తెలంగాణా                               |నాగేటి|

బురుజు గోడల పొగరు మెడలు వంచంగ
గుట్టల్ల చెట్లల్ల గోగు పువ్వుల్లు
సద్ది మోపిన తల్లి సావు బతుకుల్ల
పానమిచ్చిన వీర కథలు బతుకంగ

గోరుకొయ్యల పొద్దు – నా తెలంగాణా నా తెలంగాణా
గోరువంకల సభలు – నా తెలంగాణా నా తెలంగాణా

సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యవసాయ బావుల వద్ద రైతులు జరుపుకునే ‘‘కాట్రావుల పండుగ’’ గురించి కూడా పాటలో పేర్కొన్నారు దాని వివరాలు తెలియవు.

 పునాస వువ్వులు : 
The first crop of the year which consists of grain of an inferior kind
వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయదారులు ఆయా పైరులను విత్తి పెంచు కాలము. సంవత్సరమును
పునాస (ఎండ) కారు,
తొలకరి (ముంగటి వానకారు),
నడివాన కారు,
వెనుకటి వానకారు,
శీతకారు,
పయరకారు అని ఆరుకారులుగా వ్యవసాయాధారితంగా విభజింపవచ్చును (Sowing seasons).

  •  జూన్‌ నెలలో (పునర్వసు కార్తెలో) చల్లు పంట.
  •  మామిడిలో ఒక రకము.( మామిడి కాయలు పునాసపిందెలు బజార్లోకి వస్తున్నాయి అనే వాడుకను వింటుంటాం)

తాంబూలంలో తంగేడుల పేర్పు, బతుకమ్మ పండుగకు చేసే ఏర్పట్లలో బాగంగా పువ్వులు పేర్చే ఇత్తడి లాంటి లోపపు పళ్ళేన్ని తాంబూలం అంటారు.

 వరదగూడు / వరదగుడి ( చంద్రునిచుట్టు ఏర్పడు వృత్తాకారం లేదా పరివేషము) దూరాన్ని బట్టి వర్షాన్ని అంచనా వేస్తారు,

 భజన, కోలాటంలో జడకొప్పులాట, దసరాకు కొత్తబట్టలూ,పాలపిట్టలూ, అలయ్ బలయ్ లు, జమ్మిఆకు పంచుకోవడం గురించి చెప్పారు.

మోట కట్టేందుకు (మోటబావిలో నీళ్ళుతోడుకునేందుకు) తండ్రి తాడు పేనటం
అవ్వ కల్లాన్ని ఊడ్చటం (

  • వరికట్టల్ని బంతికొట్టేందుకు వీలుగా కల్లంలో అమర్చడం)

 , ఆరుకాలల/ఆరుగాలం (ఋతువుల) శ్రమ
బోనాల పండుగ, శివసత్తుల ఆట, కాట్రావుల ఆట
దట్టీ కట్టడం [నడుముకు కట్టుకున్న పంచె గోచీ లాంటిదాన్నీ బిగించి కట్టడం, అరదట్టీలు (Cut drawer). ] చిన్ని కృష్ణుడి వర్ణనలో ప్రసిద్ధ పద్యంలో కూడా ‘‘ బంగారు మొలత్రాడు, పట్టు దట్టీ గురించి చెపుతారు.

పీరీల గుండం (ముస్లిం సంప్రదాయం పీరిల పండుగ సందర్భంగా పెద్ద పెద్ద మొద్దులను మండించి తయారుచేసే నిప్పుల గుండం) , 

సిందోళ్ళ సిందుళ్లు (చిందు బాగోతం చిందు యక్షగానం)

చితికిపోతున్న జానపద కళల్లో ప్రజాదరణ, బహుళ ప్రాచుర్యం పొంది చిందు యక్షగానం. కాకతీయుల కాలంలో పురుడు పోసుకున్న ఈ చిందు బాగోతం చిందు యక్షగానంగా ప్రసింది చెందింది. చిందు బాగోతం ప్రదర్శించిన పల్లె లేదంటే ఆ కళారూపం ఎంతగొప్పదో మనం అర్ధం చేసుకోవచ్చు. చిందు కళాబృందంలో 20 నుంచి 30 మంది కళాకారులు ఉంటారు.చిందు కళాకారుల కుటుంబంలో ఆరు నెలల పసిపాప మొదలుకొని అందరూ కళాకారులే. గ్రామం నడిబొడ్డున ‘చాందిని’ వేసి, చిందు ప్రదర్శన ఉందని చాటింపు వేసి ఊరంతా తిరిగి చెప్పేవారు. సాయంకాలం మసక చీకటి ప్రారంభానికి ముందే గ్రామ ప్రజలంతా ఈత చాపలు, జోరసంచులు, గొంగళ్లు, గడె మంచాలు వేసి వారు కూర్చునే స్థానాలను ముందే ఆక్రమించుకునే (రిజర్వ్‌) వారు. ’లాయిరి’ (బందరమియ్యా)గాని రాకతో యక్షగానం ప్రారంభమయ్యేది. పౌరాణిక గాథలు ఈ చిందు యక్షగానంలో ప్రధాన కథాంశాలు. చిందు కళాకారులు వేషధారణ ప్రదర్శిస్తూ, పాటపాడుతుంటే వారి కుంటుబాలలోని మహిళలు తాళం వేస్తూ కోరస్‌ పాడేవారు. మద్దెల, హార్మోనియం, తాళాలు ప్రధాన సంగీత పరికరాలు. కిరీటాలు, బుజకిరీటాలు, పట్టువస్త్రాలు తదితరాలు ఆహార్యాలుగా ఉండేవి.

ఒగ్గు కళాకారుల చిందులు, :

ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టి పడేసే కళ ఒగ్గు కథ. బోనం ఎత్తుకొని, వేప మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ కథ చెప్తుంటే జనం ఊగిపోతారు. బోనం నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వ కుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాళ్లో ‘ఒగ్గు కథ’ ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం – గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.

కురబ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీరప్పలు, రాయలసీమలొగొరవయ్యలు అని వీరిని పిలుస్తారు. వైవిద్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం ఒగ్గు (ఢమరుకం) ఉపయోగించి చెప్పే వృత్తి పురాణం గురించి తెల్సుకోవడం అంటే కురుమ జాతి చరిత్ర, సంస్కృతుల్ని గురించి తెలుసుకోవట మన్నమాట. ఒగ్గు దీక్ష ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు మంత్రం బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు [[బీరన్న, మల్లన్న కథలు[[ చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరప్ప దీక్ష తీసుకున్న వాళ్లు బీరప్పలవుతారు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.

సద్ది మోయడం, ముందురోజు రాత్రి వండిన ఆహారపదార్దాలను తెల్లవారగట్ల పనిలోకి వెళ్లేముందు కట్టుకుని తీసుకువెళ్లేవారు. బతుకమ్మ పండుగలో భాగంగా సద్దులు మోయటం అనే సంప్రదాయం కూడా వుంది.

 గొరుకొయ్యల పొద్దు(సప్తర్షి మండల దర్శనం)  ఆర్ద్రానక్షత్రము, గొర్తి కొయ్యలవలె వరుసగా ఉండు మూడు నక్షత్రములు, గొర్తి కొయ్యలు. — గడియారాలు వాడని ఆ రోజుల్లో రాత్రిసమయాన్ని లెక్కించేందుకు నక్షత్రగమనాన్ని ఆధారంగా తీసుకునే వారు.

ఇవన్నీ ఒక సంస్కృతిని తమ భుజాలపై మోస్తున్న మాటలు వాటిని పాటలో అల్లి జనాలకు అందించిన కవి నిజంగానే ధన్యుడు కదా.
వీటిలో ఒక్కో పదానికి పూర్వాపర వివరణ ఒక్కో పెద్దవ్యాసమో గ్రంధమో అయ్యేంతటి విస్తారమయినవి.

Standard
Personalities

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు

►1928లో కర్నూలు జిల్లా నంద్యాల లో జరిగిన ఆంధ్ర మహాసభలో రాయలసీమ కు ఈ పేరును సూచించి ఖరారు చేసారు. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని దత్తమండలం/సీడెడ్ (Ceded) అని పిలిచేవారు. నైజాంఆంధ్రసీడెడ్ ప్రాంతాలు అనేది ఇప్పటికీ సినమా ఇండస్ట్రీలో మార్కెటింగ్ సందర్భంగా వాడేమాటనే.

► 1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి ‘దత్తమండలం’ (సీడెడ్) అనేవారు.

►దత్తమండలానికి రాయలసీమ అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించాడని, గాడిచర్ల హరిసర్వోత్తమరావు సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర శ్రీ సర్వోత్తమజీవితంలో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసారు. నాడు జరిగిన సభలో గాడిచర్ల,చిలుకూరు నారాయణ రావు చేసిన సూచనను ప్రతిపాదించారు. అప్పటికే రాయలసీమ పదం పరివ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపిందట.

1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునరుద్ధరించి ఉంటాడని కొందరి వాదన.

రాయల సీమ విశేషాలను వేంపల్లి గంగాధర్ గారి పుస్తకం హిరణ్య రాజ్యంలో ఇక్కడ నుంచి చూడండి.

► 1883 సెప్టెంబర్ 14 న కర్నూలు లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించాడు. వారి పూర్వీకులు వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాధమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్ధికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో1906 లో మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత రాజమండ్రి లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907 లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతావందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

► 1908 లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు విపరీతబుద్ధి (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు.

► 1927 సంవత్సరంలోనే నంద్యాల నియోజక వర్గం నుంచి మద్రాసు శాసన మండలికి ఎన్నికైన గాడిచర్ల హరి సర్వోత్తమరావు నంద్యాల మొట్టమొదటి ఎమ్మెల్సీగా నిలిచారు.

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard