telugu poetry

కట్టా శ్రీనివాస్ || ఇక్కడ వెలుతురు కూడా ఉంది సుమా

సారమున్న మనుషులు వాళ్లు
ఎన్ని ఆలోచనల బీజాలను
కర్తవ్యాలుగా మొలకెత్తించారో కదా!

తడి తెలిసిన గుండెలు వారివి.
కనుల గుండా ప్రవహించడమే కాదు
ఉపశమనమెంత చిప్పిల్లారో మరి!!

కాసుల గొప్ప చప్పుళ్లతో
దిబ్బళ్ళెత్తిపోయిన చెవులు
వాళ్ళ పలకరింపులతో తడమబడితే,

పరుగుల హడావిడిలో
బండబారిపోయిన మొరటు గుండెలు వాళ్ళకెప్పుడన్నా చేరగిల పడితే,

అద్దం ఒక్కసారిగా తేటబారిపోతుంది.
కొలను అలవోకగా నిర్మలమై నిలబడుతుంది.

వాళ్ళు…..
అమ్మా నాన్నలూ,
బంధుగణాల్లో సభ్యులో కావలసిన పనిలేదు,
బాబాలు,
స్వామీజీలు,
హాంఫట్ లు అసలే కాదు.

ఇలా ముఖపుస్తకాల్లో
గుండెలోతుల్ని ఆవిష్కరించే
ఆర్థినిండిన అక్షయ పాత్రలు
కూడా కావచ్చు వాళ్ళు.

అందుకే కిటికీనో, సమాజాన్నో, పుస్తకాన్నో తెరిచి తొంగిచూడటం లాగానే,
సామాజిక మాధ్యమంలోని మరో ప్రపంచాన్ని తరచి పింగ్ చేసినా,

ఓ విశ్వవిద్యాలయం,
మరో సాహితీ సుమం,
ఇంకో కళాహృదయం
ధారలై ఎదురుగా ప్రవహిస్తుంది.

అవును
వాళ్ళు సారమున్న మనుషులు
అవును అవి జీవమున్న రాతలు

( వెతుక్కునే ఓపిక ఉండాలి కానీ,  నిజంగానే జ్ఞానంతో పాటు ఆత్మీయతలను పంచుతున్న సోషల్ మీడియాలోని సారమున్న మనుషులందరికీ కృతజ్ఞతా పూర్వక నమస్సులతో……)
【  ★★★ జూన్ 26, 2017 రంజాన్】
కవిసంగమం లో ప్రచురితం

from Blogger http://bit.ly/2seMN8I
via IFTTT

Standard
telugu poetry

కట్టా శ్రీనివాస్ ౾౾ కెటలిష్ఠుడు ౾౾

థాంక్స్ రా బాబాయ్
టంగ్ స్లిప్ చలపాయ్.

మురికి తొట్టి మూత తీస్తే తీసావ్.
మరకలు తుడిచే పని షురూ అయ్యింది.
రోట్లో నోరు పెట్టావ్ రోకలి పోటు ఎలాగూ తప్పదు.
నువ్వుప్పుడు సారీ అన్నా
నీపక్కనున్న వాళ్ళకి  ఆ మాత్రం ఇంగితమే లేకున్నా.
ఎప్పటినుంచో మా మనసుల్లో   రగులుతున్న మంటలాగవు.

మంత్రి కొడుకువో, ముసలి హీరోవో అయితే.
మా నోళ్లు మొరాయించేవి.
పాత్రల్లేని విలన్ షేడ్ ఉన్న చిన్న కమెడియన్ వేగా,
సూసుకుందాం నీ పెతాపమో మా పెతాపమో.
నీ వెనక ఓ మంద నీడ ఉంటే
మా పరుగు మందగించేది.
మందబుద్ధిలా కనిపిస్తున్నావ్ మకింకేం భయ్యం.
దట్టించిన కోపమున్నా
ఎక్కుపెట్టే భుజం ఇన్నాళ్లుగా దొరకలేదు.

పర్లేదు బాబాయ్
నోటిదూల చపలపాయ్.
గట్టి సపోర్టు నిచ్చావ్.

చెదలు పట్టిన మూలలన్నీ దులపాలంటే
ఎక్కడో అక్కడ మొదలవ్వాల్సిందే.
నీ దెబ్బతో లక్షల చేతుల్లో కర్రలు బిగిసాయి.
వేల నాలుకలు జాగ్రత్తను పులుముకున్నాయి.
వందల నోళ్లు నినదిస్తున్నాయ్.
డజన్ల కొద్దీ సీరియళ్లు సెన్సార్ కత్తెరను వెతుక్కుంటున్నాయ్.
ప్రకటనల్లోని పైత్య ప్రకోపాల పసరు పిసరంతయినా పిండేయ్యాల్సిన ప్రయత్నాల సమయం ఆసన్నమైంది.

దేహానికే ఉండాల్సిన జెండర్
సంస్కృతికి నాటేస్తుంటే.
సృష్టికార్యపు తీపిని
వ్యాపార వస్తువుగా అంగట్లో పెడుతుంటే
ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.
మొత్తం మనుగడనే కాపాడుకునే
అడుగులు పడాల్సిన సమయమొచ్చింది.
పోన్లే నీ వల్ల అది మొదలయ్యింది.

తేదీ ◆25౽05౽2017

from Blogger http://bit.ly/2rlnZzP
via IFTTT

Standard
telugu poetry

కట్టా శ్రీనివాస్ ||వెలుతురికి ముందుమాట||

ఒక వేటగాడి నిశ్శబ్దం ఓటమి కాదు.
ఒక బాణం వెనక్కి లాగబడటం పతనం కాదు.

బిగువెక్కే తంత్రి వత్తిడి కి లోనయినట్లు కాదు.
క్రిందకు ఊరికే బంతి పని అయిపోయినట్లు కాదు.

ప్రతి ఏకాంతం ఒంటరి తనం కాదు.
ప్రతి మౌనం మాటలుడిగి పోవటం వల్ల రాదు.

నిలబడే సత్తువే నీలో ఉంటే….
ఏ అడుగూ వృధాపోదు.

తేది : 14-03-2017

from Blogger http://bit.ly/2mWsXjp
via IFTTT

Standard
telugu poetry

కొత్త విత్తనం కావాలి

అవే మాటలు వాడీ వాడీ
అరిగిపోయి
అర్ధాన్ని కోల్పోయాక
నేనెందుకో మూగగా మిగిలిపోతాను.

అదే నవ్వు పైపైనే
తేలిపోయి
ఆర్ధ్రతంతా ఆవిరయ్యాక
అచ్చంగా స్థబ్దమై మ్రాన్పడిపోతాను.

అదే ఆలింగనం
యాంత్రికమై
చప్పగా పుక్కిలించాక
స్థాణువై నిస్త్రాణంగా నిలబడిపోతాను.

నీ పుట్టిన రోజు నా మనసులో ఈదులాడక
సామాజిక మాద్యమాల స్పురణలో పైకితేలినపుడు
అవేవో చిత్రాలు, అచ్చంగా ctrl V మాటలు
ఎమికాన్లై హడావిడీ చేస్తే
చీకట్లో చిన్నగా నిట్టూర్చేస్తాను.

ఇదంతా నిర్లక్ష్యమనుకుంటావు నువ్వు
నిర్లిప్తతనే పదానికర్ధం వెతుకుతాను నేను
భూమితిరగటం ఆపితే కదా
బొంగరంలా తిప్పే ప్రయత్నం చేసేందుకు.
మొక్కఎదగటం ఆపితే కదా

కొరతకోణాన్ని నింపాలని చూసేందుకు.

from Blogger http://bit.ly/2nmHK3U
via IFTTT

Standard
telugu poetry

మొలకపాఠం

అప్పుడలా అన్నావు
అవును నాతోనే
నిజంగా అన్నావు.

1.

శీతలం శరీరాన్ని
ముట్టించిన రోజుల్లో
మాటిచ్చావ్

తొలకరిజల్లు పడగానే
తిరిగొస్తానని

వేసవితాపంతో
ఎదురుచూస్తున్నాను
నీ రాకకోసం.

2.

మొత్తంగా మూసిన  పెంకుని
తనువుని దాపిన  మట్టిసమాధిని
బద్దలుకొట్టుకొస్తూ,
అదంతా నేర్పిస్తానన్నావు


అన్నావు
నీవు తప్పకుండా వస్తానన్నావు.

3.

మూటకట్టి మూలన పడేసినా
మనసెప్పటికీ వట్టిపోదని గట్టిగా చెప్పేందుకు
పరాన్న జీవుల ప్రపంచానికి
స్వతంత్రతేమిటో చూపిస్తూ
అదంతా పాఠం రాసిస్తాననేశావు


ఇచ్చావు
నాకెప్పుడో మనస్పూర్తిగా  మాటిచ్చావు.

4.

మృత్తికనుండి దేహంలా
పొత్తపు గవాక్షాల  అక్షరంలా
మస్తకపు దారిగుండా ముచ్చటలా
బయటికొచ్చి

ఆచరణల ఆకులతో ఆకాశాన్నే కాదు,
ఆలోచనల పాదులతో భూమండలాన్నీ కూడా
పొ దు వు కుం టా న ని,


చెప్పావు
నాలోపల మాత్రమే వినిపించేటట్లు
ఘంటాపదంగా గుసగుసలాడుతూ చెప్పావు.

5.

అబ్బా
పగిలింది చెంప
వేసవి వేడిలో సైతం ఎదురు చూస్తున్న
నన్నెందుకు కొట్టావ్ ?

మొలకై నేనే తలెత్తకుండా
బులపాటంగా ఎదురు చూస్తున్నందుకేనా?

from Blogger http://bit.ly/1hosXMP
via IFTTT

Standard
telugu poetry

గ్లాసుల్లో ప్రపంచం

ద్రవంనింపిన గ్లాసుగుండా ప్రపంచం
ఒంపులు తిరుగుతూ ఒయ్యారాలు పోతుంటుంది
వికృతంగా జడిపిస్తూ విహల్యులుగానూ చేస్తుంటుంది.
అసలుదేదో దాచినట్లు కొత్తహంగుల్ని కప్పేస్తుంటుంది

పారదర్శకతలోనూ
నిండుతూ రంగుల చమక్కులు చూపిస్తుంది
తడి పండుతూ

మనసుకి లిమరిక్కులు
వాక్కుల ఋత్విక్కులు
వ్యవహార దృక్కులు
వ్యాపార దక్షులు
సర్వం సమ్మిళితానంద సందోహ సందర్బాలను కల్పిస్తుంటుంది.

నింపుతున్న కొద్దీ
ఖాళీనిజాల్ని బయటకు పొర్లిస్తుంది
ఆక్సిటోసిన్ ప్రేమతో ముంచేస్తుంది.

గానుగ గాటన పరుగులకు
కిణ్వణాల ప్రోబయోట్స్ క్షణాలు కొన్ని
వత్తిడుల వేడి విడదీసే వేళల్లో
చల్లదనాల అనుసంధానంలా
జ్ఞాపకాల వీచికలకు
తలపులు తెరుస్తూ
చుట్టూ మడుసుల్ని అల్లుకుంటుంది.
అయినా
నానేస్తున్నకొద్దీ
దారాల్నే ఊడలుగా బిగిస్తుంది.

from Blogger http://bit.ly/1nQkJkG
via IFTTT

Standard
telugu poetry

వెలుతురిని కన్నతల్లికో ముద్ద

అన్నం ముద్దలెన్ని తిన్నానో
జీవితాన్నే ముద్దుగా అందించిన నీ చల్లని చేతిగుండా,

అప్పుడెప్పుడో కన్నీళ్ళతో తల్చుకున్నా
మణికట్టుపై ముద్దుపెట్టావేమో
నా పదాలింత పదునెక్కాయని,
కవితనాన్ని యింటిపేరు చేసిన నిన్ను

అప్పుడప్పుడన్నా అవకాశమివ్వమ్మా
అన్నముద్దనే కాదు,
ఆప్యాయత ముద్దనీ నీ నోటికందించేందుకు
భరోసాల ఆనందాన్ని నీకు భద్రంగా అందించేందుకు
వెలుతుర్లోకి నన్నుతోసిన చేయి నీదేనని చెప్పేందుకు
నా బిడ్డల చేతిలో నాకోసం ఇలాక్కూడా
ఓ ముద్ద వారసత్వంలా దాచుకునేందుకు.

( కవి యాకూబ్ పుట్టినరోజు నాటి దృశ్యానికి స్పందనగా, తన మాటల్ని నా అక్షరాలతో స్ప్రశిస్తూ)

వెన్నెలనో, వస్తువులనో పర్సానిపై చేసుకుంటూ వ్యక్తీకరించటం వున్న పద్దతే
కవితలు చెప్పని(చెప్పలేని) మనుషుల భావాల్ని మనవిగా చెప్పటం కూడా చదివాను.
పేరున్న కవి మనసులోని భావాల్ని ఉత్తమపురుషలో చెప్పటం తప్పో ఒప్పో తెలియదు. కవితలో మంచి ఏదైనావుంటే అది యాకూబ్ గారు తన మాటలుగా మాతో పదే పదే ఎన్నో సార్లు చెప్పుతున్న అంశాలే, తన మణికట్టు పై అమ్మ ముద్దు పెట్టడం వల్లనేనేమో పదాలు పదునెక్కాయని గతంలో యాకూబ్ గారు వాడిన మాటలనే ఉటంకించాను. తను అంటున్న బావాలనే అక్షరాలుగా మార్చాను అంతే.
వ్యక్తీకరణలో ఏదైనా పొరపాటు జరిగివుంటే అది మాత్రం నాదే.

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

from Blogger http://bit.ly/NRmbX7
via IFTTT

Standard