Uncategorized

ఓటమి నుంచి పాఠం

ఓటమి నుంచి పాఠం
ఓటమి విత్తనాన్నినిరాశలో వ్రుధాగా వదిలేయకు
అనుభవంలో నాటి.. అప్పుడప్పుడు ఆలోచనలు చిలకరిస్తూ వుండు
ప్రతిబందకాలను పగులగొట్టుకుంటూ
సంతోషపు మొలకై నిలుస్తుంది
అనుభవపు పాఠాల గాలులు వీచే
విజయ వ్రుక్షమై ఎదుగుతుంది
కొరుకుడు పడనంతమాత్రాన
ప్రతీదీ పనికిరానిది కాదోయ్ అని చెపుతుంది.
కరడు కట్టిన కష్టాల ఉపరితలం కాదు
సున్నిత చైతన్యాంతర్గతాన్ని చూస్తేనే
అడుగు ముందుకు పడుతుందని మొట్టకాయ వేస్తుంది.


కట్టా…… 22.మే.2012
Standard
Uncategorized

F E M T O E S

వ్యాసాన్నయితే వండుకోవచ్చేమో….
కాని కవిత్వాన్ని పండించాల్చిందే….F E M T O E S


Two Types of F E M T O S 
————————————-
1. Tiny F E M T O S
2. Trendy F E M T O S

1. Tiny F E M T O S : “***************” =======>15 అక్షరాల లోపు కలవి.

Ex : (1) గురి తప్పా .. నీ వల్లే (Mercy Margaret)
(2) పుట్టి చచ్చే లోపల ఎన్ని సార్లు చావాలో…..(విశాలి )
(3) గుండె పగిలింది.. నిశ్శబ్దంగానే!… …..(నరేష్ కుమార్)
(4) నన్నొదిలి ఒంటరైంది ప్రపంచం…(వంశీధర్ రెడ్డి”)
(5) ఎక్కడ కలుద్దాం? విడిపోయిన దగ్గరేనా.. (వంశీధర్ రెడ్డి )

2.Trendy F E M T O S : “**********” =====> మొదటి Line లో 10 అక్షరాలలోపు
“***************” =====> రెండవ Line లో 15 అక్షరాలలోపు.

Standard
Uncategorized

స్రుష్టికి ముందునాటి ఓ సలహా

మగాడనే వాడొకడుంటాడు
జాగ్రత్త స్మీ
భూమ్మీదకి పంపటానికి ముందే
అందిన ఓ సలహా

అహా
ఏమవుతుందేం
నేనీకాలపు వనితను
చర్మాన్నీ తాకేస్తాడేమో
మాంసాన్ని నోక్కేస్తాడా
ఆఖరుకీ ప్రాణాలు తీస్తాడేమో
అంతేకదా
నేనైతే
భయంతో బతకలేను..

కాదు తల్లీ కాదు
వాడు ఊహిస్తాడు
ఊహించేలా చేస్తాడు.
చివరికి వ్యాపార సామ్రాజ్యపు గుమ్మంలో
ఆకర్షణ యంత్రాన్ని చేస్తాడు.

అమ్మో  !!!
ఏమవుతుందో……

Standard
Uncategorized

అమ్మా. . .!?!..ఎంత పనిచేసావ్…

ఆడదానివే కావచ్చు

ఐనా నీవెంత తీవ్రవాదివి

మానవత్వపు ఆటం బాంబుల్ని

ప్రపంచంలో ప్రత్యేకంగా ఎన్నకుని మరీ

భారత గడ్డపై పెటిల్మని పేల్చావు

అడుగు పెడితే చాలు

హఠాత్తుగా పేలేలా

అడుగడుగునా మందుపాతరల్ని

జాలి రూపంలో

గుండెలంచులేమ్మడి కూర్చి పోయావు.

పాషాణ హ్రుదయాల

సన్నని లోతు పగుళ్ళలో దయాబీజాలు

ఎంత నిశ్శబ్దంగా నాటేవు.

నీ వాత్సల్యపు వేడికి జనించిన

కరుణా మేఘాలు యింకా

అప్పుడప్పుడు వర్షిస్తూనే వున్నాయి.

మా కను కొలకుల్లోంచి

ఈ ఒక్కోచుక్కా చాలు

వేయి గునపాల శక్తని

ఓ బుల్లి విత్తనానికి యిచ్చేందుకు.

ఈ విద్వంసం నీతోనే ఆగకుండా

మరి కొంత సైన్యం తయారవ్వాలని

తపిస్తావా ?

ఎంత ధైర్యం ?

కరెన్సీ మహారాజుని నడి నెత్తిపై మోస్తున్న వాళ్ళం

వ్యాపార పునాదులపై సౌదాలు నిర్మించుకున్న వాళ్ళం

స్వార్థపు పరదాల నీడలో సుఖిస్తున్న వాళ్ళం

స్వామి ద్రోహం చేస్తామని కలలు కంటున్నావేమో

ఔరా ఎన్ని తూటాలు పేల్చవు

గురి చూసిమరీ మా గుండెలోతుల్లోకి

నీ మాటల రూపంలో…

‘‘ ప్రార్దంచే పెదవులకన్నా

సాయం చేసే చేతులు మిన్నంటావా’’

సంపాదించే జేబుల గురించి తప్ప

మాకేం చేవుల కెక్కదు సుమా!

కాదుగాని…

నీలాంటి వాళ్ళకిక్కడ

అసలే మాత్రం తగదు

నీవిక్కడుండటం ఈ మాత్రపు మనుగడకే ప్రమాదం

నీకు, నీ లాంటి వాళ్ళకూ మరో ప్రవేశముంది

అక్కడికే వెళ్ళిపో.

కుదిరితే వాళ్ళలోనే ఉండిపో

దాన్ని స్వర్గమని

నీలాంటి వాళ్ళనే దేవతలనే పేరుతో

తిడతారని

ఎక్కడో విన్నా

మరిచి పోకు

చివరగా

మరో మాట

పొరపాట్న మళ్ళి పుట్టేవు సుమా

మా సువిశాల సుసంపన్న

సామ్రాజ్య సౌధాల్ని

మళ్ళీ కూల్చటం ప్రారంభించేందుకు.

Standard
Uncategorized

అంచులపై, హర్మ్యాలపై

ఒక అర్దరాత్రి

నా కవితలు నేనే చదువుకుంటూ

నా డైరీని నేనే పరిశీలిస్తూ

నిర్దాక్షిణ్యంగా వరుసలన్నీ కొట్టేసి

పేజీని చించేయబోయే ముందు

ఒక్కసారి

నన్నిష్టపడే వారి కళ్ళలోంచి

చూద్దామనిపిస్తుంది

పదిలంగా పేజీ మడతల్ని

మళ్ళీ సవరిస్తాను

కొట్టేసిన వరుసలలో భావాన్ని తవ్వుకుంటూ

పేలియాలజిస్టునో

ఆర్కియాలజిస్టునో

అయిపోతాను

మళ్ళీ మరో అర్దరాత్రిదాకా

పుస్తకాన్ని నెత్తిమీద మోస్తుంటాను.

Standard
Uncategorized

పొరపాటుచింపిరి గుడ్డలతో
ఒళ్ళంతా గగ్గులతో
కాండానికి వేళ్ళాడుతున్న ఓ పండుని

ఏదోలే అని ఒలిచా
పసందైన వాసనల తొనలతో
శుచిగా కడుపు నింపింది పనస

మ్రుదువుగా ఊగే ఓ తెల్ల గులాబీని
పదిలంగా చేర్చ దోసిట్లో పట్టా
కరుకు ముళ్ళ పళ్ళతో
కసుక్కున దిగబొడిచి
ఎరుపెక్కిన వదనంతో
విలాసంగా చూస్తోంది తమాషా

Standard
Uncategorized

సు రా శో కం

‎” సు రా శో కం “

ఒక అర్దరాత్రి

కలత నిద్రలో సోలుతున్నప్పుడు
తలుపులు విరగబాదే శబ్డం

చెవుల్నిచేరకముందే
పరిచితమైన వాసన
నాసికాగుహల గుండా
ఒరుసుకుంటూ వెళ్ళి
మెదడుని ఉలిక్కిపడేలా కలుస్తుంది.

కళ్ళు నులుముకుంటూ కంగారుగా వెళ్ళి
గడియ తెరియగానే
చిత్తుచేసే మత్తు వాసనతో పాటు
మొరటు శరీరం ఒకటి
అదాటున మీదకి ఒరుగుతుంది.

కుండ లోని ఎదురు చూపుల్ని
కంచం లోకి వడ్డిస్తే
కాళ్ళైనా కడుక్కోకుండా
కన్నీళ్ళని జుర్రుకున్నట్లు
చిత్తడి చిత్తడిగా
తినటం పూర్తిచేసానని పిస్తాడు.

ఒక్కోసారి అంత మాత్రపు స్ప్రహకూడా

కళ్ళకొవ్వొత్తులలో మిణుకు మిణుకు మంటూ వుండదు.

ఈ రోజు ఇది ఎన్నోసారో
ప్యాక్టరీ గొట్టానికి గుప్పు గుప్పున నిప్పంటించడం.
నిద్రపోతున్న పిల్లల్ని సైతం లెక్కచేయకుండా
విషవాయువులని ఎగజిమ్ముతూ
నవ్వుకుంటున్నాడు.

దిండు మడతల్లో
దాచుకున్న మోహంతో
పక్కకి తిరిగి పడుకున్న
నా నడుము మడతల పై గుండా
రోకలి బండ పురుగులు
లోపలికి పాకుతుంటాయి.
రెండు బండపెదాల పైన
ఎప్పటి నుండో తిష్టవేసుకున్న
ఓ పాడు గొంగళిపురుగు
మెడ వంపులో మరీ మరీ
గుచ్చుకుంటూ వుంటుంది.

రోలింగు చక్రల బరువుకింద
రోడ్డునై
మౌనంగా బండబారి
బిగిసిపోయే లోగానే
ఏ రోడ్డు పక్కనో పడిపోకుండా
ఇంటి దాకా చేరాడు కాబట్టి
ఇలా నా పక్కన
సొమ్మసిల్లి పడిపోతాడు.

(చాలాకాలం క్రితం ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైన నా కవిత)

Standard