సమీక్ష, Facebook embed

బ్లాకుబలి : పెద్దనోట్లను రద్దు చేస్తే ప్రజలు నిజంగానే బాగుపడతారా?

పెద్దనోట్ల రద్దు బాహుబలిలో ఒక సీన్ ని గుర్తుకు తెస్తోంది. యుధ్దంలో కాలకేయుడు అమాయకులైన ప్రజల్ని రక్షణ కవచాల్లాగా ముందు వరుసలో నిలబెడతాడు. భల్లాలదేవుడు శత్రువులను శిక్షించడం కోసం అమాయకులైన ప్రజలను కూడా చంపుకుంటూ వెళతాడు. బాహుబలిమాత్రం వారి కాళ్లమీదకు బరువులతో చుట్టుకునే తాళ్ళను విసిరి వాళ్ళకు ఇబ్బంది లేకుండా వెనకున్న శత్రుసేనలమీదకు లంఘించే వ్యూహరచన చేస్తారు.
అనిల్ బోకిల్ ‘‘అర్ధక్రాంతి’’ (http://bit.ly/2eWq7Xo) లాంటి అమూల్య పరిశోధనల్లో తేలిన అంశాన్ని అమల్లో పెట్టడం. అసలు బడాబాబులకు నష్టం కలిగించే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే నేతలు రేపెప్పుడో కమ్యునిష్టు పార్టీల వంటివి పరిపాలనలోకి వస్తేనో, జెపి లాంటివారు పగ్గాలు తీసుకుంటేనో జరుగొచ్చేమో అని ఎదురుచూసాం. మన్మోహన్ లాంటి ఆర్ధికవేత్త మౌనంగా తన పబ్బం గడిపేసుకుని రబ్బరు స్టాంపులోదిగిపోయాడు. మనం సోషట్ నెట్ వర్క్ లలోనూ, సినిమల్లోనూ నల్లధనం అవినీతి అంటూ వాపోతూనే వున్నాం. మరిప్పుడు ఒక అడుగు ముందుకు పడింది. అవును నాక్కూడా ఎప్పటిలా పోల్చుకుంటూ రద్దు తర్వాత కొంత ఇబ్బందిగానే వుంది. కానీ మొత్తం దేశానికి ఉపయోగపడే ఒక పెద్ద ప్రయోజనం కోసం చిన్న చిన్న కష్టాలకు సైతం బావురుమనేట్లయితే, ఇక ఎవరో వచ్చి మార్చాలని ఏదో దేశం మారిపోవాలనీ కోరుకోవడం ఎందుకు? నత్తగుల్లలా మొత్తం డొల్ల అయ్యేంత వరకూ ఎప్పటికప్పుడూ సౌకర్యపు కన్నాల్లో దాక్కుంటూ వుంటే సరిపోతుంది.

ఇప్పటివరకూ చూసిన దానివల్ల ఆయన మోడీ కావచ్చూ మరేదయినా కావచ్చు మనకు మాత్రం రాజకీయనాయకులు స్వార్ధ ప్రయోజనాలు తప్ప అందరికోసం మంచి చేస్తారనే ఊహకూడా లేదు. వాళ్లంటే విలన్లు అంతే. ఇందులోనూ ముందు రంద్రాలే వెతకటం ప్రారంభిస్తున్నాం. కానివ్వండి ఒకరో ఇద్దరో ముందే తెలుసుకున్నారా? ఎక్కడో ఒకటో రెండో చోట్ల ఈయన గారి స్వంతి పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు దారి ఏర్పడిందా? పోనీ ప్రతిపక్షం బొరియల్లో పాపంలో పేరుకుపోయిన నల్లకొవ్వును కరిగించాలనే ఇదంతా చేసాడా? ఏదయినా దాని ఫలితం ఎవరికందుతోందో చూడరా?
దేశం మీద యుద్దం చేయడమంటే ఆయుధాలు వెయ్యడం కాదు. ఆర్ధికంగా నిర్వీర్యం చేయాలన్న కుట్రతో నిపుణులు సైతం పట్టుకోలేనంత పకడ్భందీగా చేసిన దొంగనోట్లను కుప్పలు కుప్పలుగా పంపుతున్నారు. లక్షకి ముప్ఫై వేలు, అరవై వేలంటూ వ్యాపారంగా మొదలేసేంత ముదిరిపోయిన జబ్బుని చూసి తిట్టుకుంటూనే వున్నాంకదా. ఎన్నికలంటే కంటెయినర్ల నిండా పెద్దనోట్లు అర్ధాంతరంగా గుమ్మరించడం మామూలు విషయమని చప్పరించేస్తూనే వున్నాం కదా. ఎలక్ట్రానిక్ మనీ అంటూ, ప్లాస్టిక్ కరెన్సీ అంటూ తెల్లవారు ఝూమున వేకువ కలలను పలవరిస్తూనే వున్నాం కదా. ఆయనెందుకు చేసాడో, ఏ పార్టీ, ఏరంగూ నాకనవసరం కానీ చేసిన పని నిజంగా చాలా చాలా చాలా గొప్పదని లైన్లలో నిల్చున్న ఇప్పుడు అర్ధం కాకపోయినా, లైను గా జరిగే మార్పులను గమనించే ఓపిక వుంటే తప్పకుండా తెలుస్తుంది. మనకే ఇంత ఒత్తిడి వుంటే అన్ని రకాలుగా శక్తివంతుల మెడలు వంచేందుకు న్యాయాన్ని భుజాన వేసుకుని నిలబడ్డ ఆ ఒంటరికి మరెంత ఒత్తిడి ఉండి వుండాలి. అవసరమైతే నేను నిలువునా కాలిపోడానికి సిద్దం అన్న మాటలో ఆర్ద్రత కంటే నాటకమే కనిపిస్తుందంటే అది మన తప్పకాదు మనల్నిలా తయారుచేసిన వాతావరణానిదే ఆ తప్పు. దేన్నీ నమ్మలేని తనంతో నిలువునా నింపేసింది. అద్దంలో మీ బొమ్మే అచ్చంగా మంచి పనులు చేయడం మొదలేసినా అర్రర్రే ఇదేదో టెక్నిక్ లా వుందే అనుకునే అనుమాన బలహీనతలోనికి మనసు దిగజారిపోయింద. మిగిలున్న ఆశలను బ్రతికించాలంటే దేశానికి కొంచెం నమ్మకమిద్దాం. కనీసం నిలబడటానికి సిద్దమవుతున్న ఒక్క వెన్నెముక కనిపిస్తే అర్ధాంతరపు అక్షేపణలూ, ఆధారం లేని అనుమానాలతో పడదోయకుండా కొంచెం భరోసా నిద్దాం. ఏమో గుర్రం ఎగరా వచ్చు. ప్రపంచంలో పనిచేసే సామర్ధ్యం అధికంగా వున్న యువత ఎక్కువగా వున్న దశలో ముందింది భారతదేశం. ఈ సమయంలో నల్లడబ్బు, అవినీతి లాంటి ప్రధాన మైన రోగాలు దగ్గరికి రాకపోతే, అమెరికానూ, చైనాను మనం ఉదాహరణగా చూడాల్సిన అవసరం లేదు. సహజవనరులూ, అనుకూల వాతావరణంతో అన్నిరంగాల్లోనూ మనమే ప్రపంచం మొత్తానికీ ఒక ఉదాహరణగా ముందువరుసలో వుండే రోజే రావచ్చు. దానికి వేలమైళ్ళ ప్రయాణం వుందని మళ్ళీ పెదవి విరిసినా పర్లేదు కానీ దానికోసం పడే ఒక్క అడుగునూ మాటల తూటాలతో గాయం చేయకండి చాలు.

భల్లాల దేవుడికి సాధ్యం కానట్లు అనిపిస్తే అది అసాద్యమైపోదు. మరికొంచెం ఆలోచించి అడుగేస్తే అటు ప్రజలను కాపాడుకుంటూనే శత్రువుపై దెబ్బతీసే అవకాశం దొరుకుతుంది.

http://bit.ly/2fOGNNW

from Blogger http://bit.ly/2fR4zup
via IFTTT

Standard
వివరణ, సమీక్ష, Telugu

చిన్నికృష్ణుడి పద్యంలో పట్టుదట్టీ, సందెతాయతులు అంటే ఏమిటి?

చిన్నప్పుడు నేను నేర్చుకున్న మొదటి పద్యం ఇదేననుకుంటా, అమ్మనేర్పించిన పద్యం నాన్న వల్లెవేయించిన పద్యం పైగా మాకప్పుడు రెండో తరగతిలోననుకుంటా మొదట్లోనే ఈ పద్యం వుండేది. ఇప్పుడీ పద్యాలేవీ కనిపించడంలేదు. పండుగలూ పద్యాలూ కేవలం భక్తినే నేర్పిస్తాయా? చరిత్రను తెలుసుకునేందుకు కూడా పనికొస్తాయా? బాగా తెలిసిన వాటిల్లోకి సైతం లోతుగా చూడటం మానేసాం. కొంచెం తరచిచూస్తే, ఏదైనా ఒక ప్రశ్న అడిగే వారుంటే చాలా విషయాలు చెప్పాలని ఎదురు చూస్తున్న సాహిత్యఆధారాలుగా పద్యాలు, ఊరిపేర్లు, పాతపుస్తకాలు, తాళపత్రాలూ, పండుగ ఆచారాలూ ఎదురుచూస్తూనే వున్నాయి. 

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు

ఈ పద్యాన్ని ఈమధ్య కాలంలో చదివినప్పడు నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

  • పట్టుదట్టి అంటే ఏమిటి? పట్టుబట్టటం లాంటిదా? పట్టు వస్త్రం లాంటిదా? 
  • అప్పట్లో సంది జ్వరం వస్తే పిల్లలకు కట్టె సందికాయలు, సంది తాయత్తులు లాగా చిన్ని కృష్ణుడికి కూడా వాళ్లమ్మ తాయత్తు కట్టిందని పద్యకర్త ఊహిస్తున్నాడా? లేక సందిట తాయతు అనాలా? మరేదన్నా అర్ధం వుందా? 
  • బంగరు అనాలా బంగారు అనాలా? 
  • మొలత్రాడు లేదా మొలతాడు అంటే సరిపోతుందా? 
  • చిన్ని కృష్ణాఆ.. అంటూ దీర్ఘం వుందా చిన్నికృష్ణ అంటే సరిపోతుందా?
  • సరిమువ్వలా సిరిమువ్వలా? 

సరే ఒకసారి నాకు అర్ధమయినంత వరకూ నేను పరిశీలించిన విశేషాలు మీముందుంచుతాను. మరేమైనా సవరణలుంటే పెద్దలు, విజ్ఞలు తెలియజేస్తే సంతోషంగా భావిస్తాను. 

సందర్భం : యశోద ఇంట పెరుగుతున్న చిన్ని కృష్ణుడి రూపాన్ని వర్ణిస్తూ కవి అటువంటి కృష్ణా నిన్ను చేరి కొలుస్తానయ్యా అని భక్తిగా చెపుతున్నారు. మరి ఆ కవి గారు నిజంగా గోపాల కుటుంబంలో పెరిగే కృష్ణుడిని చూసి వుంటారా? ఖచ్చింతంగా లేదు. ఆయన కూడా శృతంగా వస్తున్న బాగవత కథనం ఆధారంగా వారి ఊహను జోడించాలి. ఇక అప్పుడు కనిపించేదెవరు. తన కాలంలో తను చూసినంతలో ముచ్చటగా మురిపెంగా పెరుగుతున్న చిన్నారి బాలలకు కృష్ణుడి రూపాన్ని ఆపాదించాలి. బహుశా కవి అదే చేసి వుంటారు. 

వర్ణన లోని విశేషాలు  

చేతవెన్నముద్ద: గోపాలుర ఇంట పిల్లలకు సులభంగా అరిగుదలకు సహకరించేది, బలవర్ధకమైనదీ, ఇష్టంగా పెట్టేదీ ఏముంటుంది వెన్ననే కదా. బహుశా నెయ్యి తినడం కంటే వెన్న శ్రేష్టం ఆరోగ్యకరం అని ఇప్పటికీ చెపుతున్నారు కదా. అటువంటి వెన్నను చేతిలో పట్టుకుని వున్నాడట. వాళ్ళ అమ్మ పెట్టే వెన్న చాలకుంటే గోపికల దగ్గర వెన్నను దొంగిలించయినా తినేంత చిలిపివాడు వెన్నపై ఇష్టమున్నవాడూ కృష్ణుడని కధనమే కదా. 

చెంగల్వ పూదండ : కలువలు రాత్రిపూట వికసించే పుష్పాలయితే తామరలు (కమలాలు) పగటిపూట వికసిస్తాయి. ఆ కలువ పూవు కూడా ఎర్రనిదట. చెన్ను + కలువ = చెంగల్వ అంటే ఎఱ్ఱకలువ, హల్లకము; The red water lily. ఎర్రకలువ. చెన్ను (చెన్ ) ను ఎరుపు అనే అర్ధంలోనే కాక అందము (Grace, beauty ఉదాహరణ చెన్నుడు a beau or fop, అందగాడు) విధము (Manner) అనే సందర్భాలకోసం కూడా వాడినప్పటికీ అందమైన కలువ అనికాక ఎర్రకలువ అనేదే ఇక్కడ పొసుగుతుందని భావిస్తున్నాను. తమిళంలో సెందామరై, కన్నడలో కెంపుదావరై పదాలు కూడా ఎఱ్ఱ కలువనే సూచిస్తున్నాయి. రాత్రి పూసిన ఎర్రకలువను ఎవరో భృత్యుడు లేదా ఇష్టులు తీసుకొచ్చి చిన్నారి బాలకుడికి ఆడుకునేందుకు ఇచ్చివుంటారు. లేదా తల్లి మురిపెంగా తన బుజ్జాయికి అలంకరించి వుంటుంది. ఇప్పటికీ అమ్మలు చిన్న పిల్లలు మగపిల్లవాళ్ళయినప్పటికీ పూలతో అలంకరించడం మనం గమనిస్తూనే వుంటాం కదా. 

బంగరు మొలతాడు : కటిశృంఖల, కటిసూత్రము, ధటిని, శృంఖలము, మొలకట్టు అనేవి నడుముకు కట్టుకునే వస్త్రాన్ని జారిపోనీయకుండా పట్టుకునే విశేషణం గానే కాక, ఆటవిక జీవనంలో సైతం వివిధ ఆయుధాలను విరామ సమయంలో దోపుకునే అవసరంగా వుండేది. ఇప్పటికీ సైనికులూ పోలీసులూ తుపాకులు పెట్టుకునే హోల్ స్టర్ కానీ, అప్పట్లో కత్తిని పెట్టుకునే ఒరలు కానీ నడుముచుట్టూ వున్న బెల్ట్ (belt) వంటి దానినే ఉపయోగించాలి. waist string or thread అనేది ఒక సంప్రదాయంగా మారి మగపిల్లలకు మొలతాడు కట్టకపోతే హాని జరుగుతుందనే నిర్ణారణలకు సైతం వచ్చేసారు. అంటే ఆయుధాలను సరిగా భద్రపరచుకోలేదనీ, అంగవస్త్రం జాతిపోతుంటే వేటలోనో, పోటీలోనో,యుద్దంలోనో, కృరజంతువులనుండి తప్పించుకునేప్పుడో సక్రమంగా పనిచేయలేక నష్టపోయే అవకాశం వుంటుదన్న ధ్వనివుండవచ్చు. జాతియంగా కూడా మొలతాడు కట్టిన మొగవాడెవరన్నా వుంటే రమ్మను అనటం మనకి బాగా తెలుసు. తమిళం అణ్ణాకయిర్‌, కన్నడలో పురుషార ఉడుదార అని పిలిచే ఈ మొలతాడు వారి వారి స్థొమతలను అనుసరించి వెండి లేదా బంగారం తో చేయించుకునే వాళ్ళు. ఈ చిన్ని కృష్ణుడు తన మ్రొలకు కట్టుకున్న దారం బంగారపుదట. ఈ ఆటవెలది పద్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బంగారు అనేపదం పొసగదు, బంగరు అనే పదం అలాగే త్రాడు అనికాక తాడు అనే పదం ఆటవెలది నియమాలకు సరిపోయి ఈ పద్యంతో పొసుగుతాయి. సంస్కృతీకరణలో భాగంగానే, స్వచ్ఛ ఉచ్చారణ అంటూ పొరబడుతూనే ఈ పదాలను మరికొంత సాగదీయటం చాలాచోట్ల గమనించాను.

బంగారు అంటూ గ కు దీర్ఘం ఇస్తే ఆటవెలదిలో పొసగటం లేదు

పట్టుదట్టీ : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు (1903 vi.106) ప్రకారం దట్టీ లేదా దట్టి అంటే A sash, belt, girdle, cestus round the waist. నడికట్టు, కాసెకోక అంటే అడ్డముగా చుట్టు కట్టుకొనిన పంచకట్టునే దట్టీ అంటారు. అయితే బంగారపు మొలతాడు కట్టే స్థొమత వున్నవాళ్ళు కాబట్టి శ్రేష్టమైనదిగా చెప్పుకునే పట్టుతో చేసిన దట్టీ కట్టారు అని అనుకోవచ్చు. మరొక అర్ధంలో తెల్లని, లేదా నాజూకైన సన్నని వస్త్రంతో నేసిన పంచెకట్టు కట్టుకున్నాడని కూడా అర్ధం వస్తోంది. తెలంగాణా ప్రాంతంలో పట్టుదడియాలు అంటే సన్నని వస్త్రము, తెల్లని గుడ్డ అనే అర్ధాలున్నాయి ఈ విషయాన్ని తెలంగాణా పదకోశంలో శ్రీయుతులు నలిమెల భాస్కర్ గారు ప్రస్తావించారు. చిన్నికృష్ణుడే కాదు మానవుడు ఏర్పాటు చేసుకున్న చాలా మంది దేవుళ్ళకు వారి ఊహలకు అందిన కాలంనాటి వస్త్రధారణే వుంటుంది. ఆయా దేశీయమైన వస్త్రదారణలను ఆయా దేవతలకు మనుషులు ఆపాదించారు. చూడండి బ్రహ్మ చేతిలో తాటాకులపై రాసిన పుస్తకం వుంటుంది కానీ ప్రింట్ చేసిన పుస్తకమో, ఇప్పటి ఆధునిక టాబ్లెట్ పామ్ టాప్ లో వుండవు. పురాతన కాలంలో సృష్టించుకున్న దేవుని రూపాలు, సాహిత్యకాలానికి కొంత మార్పులకు లోనయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా పరివర్తనం చెందించకుండా దానినే కొనసాగించడం చేస్తున్నాం. దీంతో గుణభక్తిస్థానంలో రూపభక్తి కూడా ప్రధానంగా చేరిపోయిందిప్పుడు. 

సందెతాయతులు : తాయితు, తాయెతు తాయెత్తు అంటే రక్షరేకు లేదా తావీజు అనే అర్ధంలోనే ఎక్కువగా తీసుకుంటున్నాం. దీని అర్ధాన్ని మరికొంచెం శ్రద్దగా పరిశీలిస్తే తాయి + ఎత్తు అని కదా తాయి అంటే తల్లి లేదా పిన్ని. An amulet, or charm containing things supposed to bring luck. తల్లి బిడ్డలకుకట్టే రక్షరేకు. సందె అనే పదాన్ని సంది జ్వరం అనే అర్ధంలోనే కాక సందిట అని తీసుకుంటే మరింత సరిపోతోంది. దండచేతికి అలంకరణ చేసుకోవడం ఈ పద్యరచన చేసిన కాలంలో ఒక అవసరం కూడా యుధ్దంలో ప్రధానంగా దాడిచేసే శరీరభాగాలను కవచాలతో కప్పివుంచుకోవాలి. తలకు శిరస్త్రాణం, ఒంటికి కవచం లాగానే, దండచేతికి కూడా ఉక్కు పట్టీలను పెట్టుకునే వారు. వాటిపై కత్తి, బల్లెం వంటివాటి ద్వారా దాడిజరిగినా రక్షణ వుండాలని. అదే పద్దతిలో దండచేతులపై బంగారపు వెండి అలంకరణలనూ, పూదండలనూ ధరించడం ఆనవాయితీ. సందికడియము అంటే An ornament worn upon the upper part of the arm. An armlet, కేయూరము. a stout bangle or double bangle worn on the upper arm, అలాగే కేయూర భూషణము కుసుళ్ళు, దండకడియము, బాహుదము, బాహుపురి, బాహుభూష, బాహుభూషణము, భుజకీర్తి, సందిక(డె)(డియ)ము, సందిదండ అనేవి వాడుకలో వున్న పేర్లు. ఉదాహరణకు సందికడియంబు అనివాడిన ఇతర పద్యాలుకూడా వున్నాయి. కావడియుట్లు చిక్కము సందికడియంబు నూకలతోఁప పొగాకుతిత్తి అనేదానిలోనూ సంది కడియం ప్రస్తావన కనిపిస్తుంది. కన్నడలోనూ దీన్ని కేయూర భూషణమనే అంటారు. తమిళంలో మేల్ కైయిల్ అణియం వళైయమ్ అంటారట. వాళ్ళమ్మ చిన్ని కృష్ణుడి దండచేతిపై చేసిన అలంకరణ గురించి కవిగారు మనతో చెపుతున్నరిక్కడ.

తాయత్తులు అంటే అస్సలు సరిపోవడం లేదు

సరిమువ్వ గజ్జెలు : ప్రాంతీయ మాండలిక పదకోశంలో మువ్వలు అనే పదాన్ని కళింగ ప్రాంతంలో ఎక్కువగా వాడతారనీ, గజ్జెలు అనే పదాన్ని తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వాడతారనీ రాసారు. ఇక్కడ మువ్వలు, గజ్జెలు రెండూ వాడారు. నిజానికి మువ్వ అనేది గజ్జెలలో ఒక భాగం, తమిళంలో మునైయిల్‌ మూన్డ్రు ఇడై సందుగళుడైయ గజ్జై లేదా కన్నడలో మూరుతూతుగళ దొడ్డ గజ్జె అని చెప్పడంలో మొనలోమూడు సందులు గల పెద్దగజ్జె అంటూ బహుజనపల్లి సీతారామాచార్యులు [శబ్దరత్నాకరము 1912 ] గారూ పేర్కొన్నారు. సరి సంఖ్యలో వున్న మువ్వలతో కట్టిన గజ్జెలు అని అర్ధం కావచ్చు, సిరి మువ్వ అంటూ లక్షణమైన, సంపదకరమైన అంటూ సిరిని లక్ష్మి అర్ధంలో చెప్పివుంటారేమో అనుకున్నప్పటికీ అది కూడా చందస్సుకు సరిపోవడం లేదు. సరిమువ్వ అనేదే సరైన పదం అవుతోంది. మువ్వలను ఒక క్రమంలో పేర్చికట్టి తయారు చేసే గజ్జెలను పిల్లల కాళ్ళకే కాక నాట్య ప్రదర్శన సమయాల్లోనూ, జానపద కళల ప్రదర్శనల్లోనూ, పశువుల మెడల్లో అలంకరణలు గానూ వాడటాన్ని గమనిస్తాం. పిల్లలు ఆడుకుంటూ వున్నప్పుడు తల్లులు ఏదన్నా పనిచేస్తున్నప్పటికీ వారు దూరంగా వెళితే తెలియటం కోసం కూడా ఇవి ఉపయోగపడేవి. అసలే చిన్ని కృష్ణుడు ఒకదగ్గర వుండేవాడు కాదాయే అందుకే ఇవి మరింత బాగా ఉపయోగపడివుంటాయి.

సిరిమువ్వలు కూడా గణ విభజనలో కుదరటం లేదు. 
కృష్ణుడు చిన్నవాడే అయినా దీర్ఘం తీయకుండానే ఈ పద్యంలో పలుకుతాడ్లెండి

ఈ విధంగా చిన్ని కృష్ణుడి రూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించిన కవి, చివరి పాదంలో తన భక్తిభావాన్ని చాటుకున్నాడు. అయితే కృష్ణా అంటూ దీర్ఘం తీస్తూ చాలా మంది పద్యాన్ని పాడుతున్నారు కానీ దీర్ఘం లేకుండా ఆటవెలదికి చక్కగా సరిపోతోంది.

from Blogger http://bit.ly/2f0moXG
via IFTTT

Standard
సమీక్ష

కాకిపడిగెలు, సాధనా శూరులు

రవీంద్రభారతి “పైడి జయరాజ్ మినీ హాల్ లో ఈ రోజు(04-10-2016 Tue) బతుకమ్మ పండుగ నేపధ్యంలో జరుపుతున్న సాంస్కృతిక ప్రధర్శనలలో ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో సినిమాకు స్థానం ఇవ్వడమే ప్రత్యేకమైతే అందులో తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబిచే అంశాలకు స్థానం ఉండటం మరీ సంతోషం. కులలను ఆశ్రయించుకున్న కళలు కళాకారులు అంతరించిపోకముందే వారి కళారూపాలను వెతికిపట్టుకోవడం వారి జీవనాన్ని తరచిచూడడం రెండూ అవసరమే, ఇవ్వల్టి కార్యక్రమంలో ఆ పనిచేసారు.
ఒకటి సాధనా శూరులు వారి మాజికల్ ప్రదర్శనను రెండు కెమేరాలూ ఒక థ్రోణ్ ఉపయోగించి చక్కగా షూట్ చేసారు అంతే గొప్పగా ప్రజెంట్ చేసారు. పద్మ శాలీలను మాత్రమే అర్చించే వారిని సాధనా శూరులు అని పిలుస్తూ వుంటారు. వీరి ప్రదర్శనాలను అందరికీ ప్రదర్శిస్తారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సంచారం చేస్తూ ప్రతి గ్రామం లోని పద్మశాలీల అనుమతితో వీరు ప్రదర్శనలు ప్రారంభిస్తారు. వీరి ప్రదర్శన ఇంద్ర జాలానికి సంబంధించింది. వీరి ప్రదర్శనం పగటి వేళే జరుగుతుంది.వీరి కళారూపాల సాధనకు నిష్ట అవసరమంటారు. వీరి పనులు కనికట్టు గారడీగా వుంటాయి. క్రీస్తు శకం 234 నాటికాలం నుంచే ఈ ప్రక్రియ వుందని చారిత్రక ఆధారాలు చెపుతున్నాయట. ప్రస్తుతం అంతరించే దశలోవున్న ఈ కళను కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చేసిన సాధనా శూరుల ప్రదర్శనను శివ.జి చాలా చక్కగా తెరకెక్కించారు. ఫ్రదర్శన సందర్శంగా చూపిన వారి విద్యలను ఒక్కటొక్కటిగా వివరిస్తూ ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఉదాహరణకు రెండు చేతులతో చేసే కర్రసాము, గుండెలపై రాళ్ళను పగలగొట్టించుకోవడం, కట్లను విడిపించుకోవడం, నీళ్ళలో వేసిన ఇసుక పసుపు లాంటివాటిని మళ్ళీ పొడిపొడిగా రప్పించడం వంటివి డీటైల్ గా చూపారు. దానికి అధనంగా వారి జీవన స్థితిగతులపై భాష్యం ఆలోచింపచేసేదిగా వుంది.
==>>రెండవది కాకిపడిగెల వారి నేపద్యంపై డాక్యుమెంటరీ…
కాకిపడిగెలు ముతరాశి లేదా ముదిరాజ్ కులానికి ఆశ్రితకులంగా వుంటూ వారి కులోత్పత్తి(జీనియాలజీ) పారంపర్యత, సాంస్కృతిక నేపద్యం తరాలు గడిచిన మరిచిపోకుండా అందించేందుకు కృషిచేస్తున్న వారు. మిరాశీ వున్న గ్రామాలలోకి వెళ్ళి త్యాగం(తాగెం)ను ప్రతిఫలంగా తెచ్చుకుంటారు. నిజానికి బెగ్గింగ్ కాదు. వీరు అడుక్కునే వారు కాదు.
కాకిపడిగెలవారు మూడు రకాలుగా కథలు చెప్తారు. మొదటివి త్యాగం కథలు, రెండోవి చావుకథలు, మూడోవి ఉల్ఫా కథలు. పూర్వం ఐదు లేదా తొమ్మిది రోజులు కథలను ప్రదర్శించేవారు. ప్రస్తుతం తగ్గించారు. ప్రధానంగా వీరు చెప్పే కథల్లో ముదిరాజ్‌ల వృత్తాంతం, పాండవుల పుట్టుక, ధర్మరాజు జూదం, పాండవుల వనవాసం, విరాటకొలువు, ద్రౌపది స్వయంవరం, బకాసురవధ, కీచకవధ, గారములకోట, సుభద్రాపరిణయం, కర్ణునిపెళ్ళి, సహదేవకళ్యాణం, గోవులచెర, శశరేఖ పరిణయం, నవలోకసుందరి, రంభారంపాల, మాయాబజార్‌, గదాయుద్ధం, భీష్మమరణం, భీమ విషమన్నం, అభిమన్యు మరణం, దుర్యోధన మరణం, కురుక్షేత్రం, అల్లిరాణి, లక్షాగృహం, రాజసూయ యాగం, భీమాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణరాయభారం మొదలగునవి ముఖ్యమైనవి.
=> .. కాకిపడిగెల వారికి ఈ పేరు రావడం వెనకకూడా ఒక కథవుంది.
పూర్వం ముదిరాజ్‌ వాళ్ళలో ఐదుగురు అన్నదమ్ములు కల్సి పెందోట వనం చేసి ఆ వనానికి కావలి ఉండేవారు. అయితే ఒకరోజు అవుసలి బ్రహ్మ పండ్లు పెట్టమని వీరితోటకు వచ్చాడు. అతనికి పండ్లు పెట్టలేదు. ఎంత గట్టిగా పెట్టమని మాట్లాడినా కూడా వీళ్లు పెట్టక అతన్ని పెందోట వనం నుండి వెళ్ళగొట్టినారు. దీనితో అవుసలి బ్రహ్మకు కోపం వచ్చి ఒక బంగారు కాకిని చేసి ప్రాణం పోసినాడు. ఆ కాకి పెందోట వనంలోని పండ్లన్ని పాడుచేస్తుంటే ఈ ఐదుగురు ముదిరాజ్‌లకు కోపం వచ్చింది. అందులో చిన్నోడు ఒక బాణం తీసి ఆ కాకికి వేస్తే అది రెక్కలు విరిగి పడిపోతుంది. దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చి ”అమ్మా! నేను కాకిని పట్టుకొని వచ్చిన” అంటాడు” అందుకా తల్లి ”మనం ముదిరాజ్‌ వాళ్ళం. మనం మాంసం తినేవాళ్ళం కాదు. సూర్యున్ని చూసి చుక్కబొట్టు పెట్టం. చంద్రున్ని చూసి చంద్రవంక పెట్టం, వరాహావతారం ఎదురొచ్చినదంటే ఏడు నూతలల్ల స్నానం చేసి వచ్చేవాళ్ళం. అట్లాంటిది నీవు కాకిని చంపి కాకిని పట్టుకొని వచ్చినావు కాబట్టి కాకిపడిగెల వానివై పక్కనుండాలి” అని శపించింది. దానితో ”అమ్మా! నీవు శపించినావు కాబట్టి నేను పక్కకే ఉంటాను” అని అన్నం తినకుండా పక్కకుంటాడు.కొడుకు అన్నం తింటలేదని బాధపడి ఆ తల్లి ”కొడుకా! ఎన్ని రోజులు ఇట్ల అన్నం తినకుండా పక్కకుంటావు బిడ్డా” అని అన్నం తీసుకపోయి పెడుతుంది.
అప్పుడు ”అమ్మా! నీవు పక్కకు కూర్చోని అన్నం పెట్టినావు కాబట్టి నీ ఇంటోల్లకు నాకు అన్నం పొత్తు ఉంటుంది. నీవు తెచ్చి పెడితేనే తినాలి కాని నేను నీ ఇంట్లోకొచ్చి తినను” అంటాడు. అప్పుడు ఆ తల్లి ”మన ఇండ్లల్ల ఎవరైనా పుడితే పురుడు కట్నం, పెడితే పెండ్లి కట్నం, సమర్త అయితే కట్నం, చస్తే చావు కట్నం నీకు ఇస్త అని కట్టుచేసి, మనకు పాండవులంటే మనకిష్టము కదా! వాళ్ళకు సంబంధించిన 
వృత్తాంతము చెబుతూ ముదిరాజులను అడుక్కొని బ్రతుకు బిడ్డా” అని చెప్పింది. అప్పటి నుండి కాకిపడిగెల వాడై పాండవుల కథ చెపుతూ జీవనం గడుపుతున్నాడు. ఇట్లా కొంతకాలానికి ఊరికే నోటితో చెప్పితే సరిగా అర్ధమయితలేదని గుడ్డమీద మహాభారతం సంబంధించి బొమ్మలు వేయించి బొమ్మలు చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదేవిధంగా కథ చెపుతూ ముదిరాజ్‌ వాళ్ళను త్యాగం అడుక్కొని జీవిస్తున్నారు.
త్యాగం కథలు అయిపోయిన తరువాత పాళ్ళ ప్రకారం ముదిరాజ్‌ వాళ్ళకు ఎన్ని డబ్బులు పడతాయో అన్ని ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసుకొని మొత్తం వసూలు అయిన తర్వాత వేరొక ఊరికి వెళ్ళిపోతారు.కానీ ఇప్పటి రోజుల్లో కథచెప్పించుకునే వూర్లు లేవు. కనికరించే నాధుడూ లేదు. కనీసం కాస్టు సర్టిఫికెట్లో సైతం స్వంతం కులం పేరుకి అవకాశం లేక బిసి డిలోనే రాసుకుంటున్నారు. 
కాకిపడిగెల వారి జీవనస్థితి గమనిస్తే ఆర్థిక విషయంలో ఇతర ఆదార మార్గాలను వెతుక్కోవడంతో పూర్వానికి ఇప్పటికి కొంత మెరుగైనట్లు అనిపిస్తుంది. కాని ఆదరణ విషయంలో చాలా తగ్గింది. వారి అభిప్రాయం ప్రకారం ఈ తరం పోతే తమను చూసే వారు ఆదరించే వారు ఉండరేమో అని అంటున్నారు. సామాజికంగా వారి పరిస్థితి దయనీయంగానే ఉంది.

http://bit.ly/2dRFoGB

from Blogger http://bit.ly/2de83or
via IFTTT

Standard
సమీక్ష, telugu poetry

గోండి భాషా దినోత్సవం : గిరిజన భాషలకు లిపి వుంటే లాభం ఏమిటి?

గొండ్లి అంటే అది గోండులచే చేయబడే నృత్యంగా పేర్కొన్నారు
ఖర్మ నృత్యమంటే వర్షరుతువు ప్రారంభమయ్యే రోజుల్లో 
పంటలు బాగా పండాలని రైతులు చేసే ధర్తీమాత ఆరధనా నృత్యమిది.
ఖర్మ నృత్యంలో బాగా చిరురించినవిప్ప కొమ్మను తీసుకువచ్చి, 
ఇల కొత్త గుడ్డలో వుంచి వారి వారి ఇళ్ళలో వుంచుతారు, 
వారు అనుకున్న రోజున పెద్ద పండగ చేస్తారు. 
అందరూ ఆనందంగా విందు భోజనాలు చేస్తారు. 
తరువాత, జంత్ర వాయిద్యాలు, మృదంగ శబ్దాలు మ్రోగు తుండగా, 
స్త్రీలూ పౌరుషులూ కలిసి ఆ విప్ప కొమ్మల చుట్టూ తిరుగుతూ, 
ప్రేమ గీతాల్నీ, ప్రకృతి రామణీయక గీతాల్నీ పాడుతూ 
అద్భుతంగా నృత్య చేస్తారట. 
దీనిని వారు ఖర్మనృత్య మంటారు

గుంజాల గోండి లిపి దినోత్సవ సందర్భంగా

గోండు భాష : ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.

గోండులు అతి ప్రాచీనమైన తెగకు సంబంధించిన వారు. వీరిది ప్రాచీనమైన సంస్కృతీ వికాసం గల నాగరికత, వీరు అడవులలో నివసించే జాతి. వీరిలో రాజ గోండులు ముప్పై ఆరు సంస్థానాలను స్థాపించుకుని చత్తీసు ఘడ్ పేరుమీద రాజ్యపాలన చేశారు.

ఆ ప్రాంత మంతా ఈ నాటికిమధ్య ప్రదేశ్ లో ఛత్తీస్ ఘడ్ గా పిలువబడుతూ వుంది. ఆంధ్ర దేశాన్ని ఆనుకొని వున్న ప్రాంతాలైన, చాందా, సిరువంచా, బస్తర్ మొదలైన సంస్థానాలను రాజ గోడులు పాలించారు.

ఆదిలాబాద్ జిల్లా నార్నె మండలం గుంజాల అనే గ్రామంపై ఇప్పుడు అనేకమంది భాషా పరిశోధకుల దృష్టి పడింది. ఓ పది రాత పుస్తకాలతో ఆ ఊరిప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ రాత పుస్తకాలు ఏమిటి? అందులో ఏముంది? గిరిజన గోండులు ఐదారు రాష్ట్రాలలో ఉన్నారు. చాలా గిరిజనజాతులకు అత్యంత ప్రాచీన భాష ఉంది. కానీ లిపులు లేవు. అందుకే అవి చాలా వరకు నోటి భాషలే. ఆ నోటి భాష కూడా అంతరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గోండి భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తరువాత సంస్కృతం, అరబ్బీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చెలాయించాయి. గత యాభై ఏళ్లుగా చదువుపేరిట ఇంగ్లిషు కూడా దానిపై స్వారీ చేస్తున్నది.
మైదానప్రాంతాల ప్రజలకు దూరంగా, నాగరిక వాతావరణానికి భిన్నంగా, అడవుల్లో నివసించేవారు గిరిజనులు. నిజాం నవాబు అమల్లోకి తెచ్చిన అటవీ చట్టాల ఫలితంగా గిరిజనులు సాగుచేసుకున్న భూమి కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల వారు తాము ఉన్న చోటినుండి మరింత అడవి లోతట్టుకుపోయారు గిరిజనులు సాగుచేసిన భూముల్ని, మైదాన ప్రాంత భూస్వాములు హస్తగతం చేసుకున్నారు. భూస్వాములు, ఆ భూములపై పట్టాలు సంపాదించుకున్నారు. ఈ తతంగానికి వ్యతిరేకంగా భూమిపై అధికారాన్ని వదులుకోకుండా వుండడానికి గిరిజనులు అడవిని అంటిపెట్టుకుని ఉండడానికి రాజ్యాధికారం కావాలని భావించారు. అందుకే కొమురంభీం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. అనంతరకాలంలో పోరాటం అణచివేయబడింది. హైమన్ డార్ఫ్ అనే శాస్తవ్రేత్తను నివేదిక తయారుచేయమని నిజాం కోరాడు. అతని సంస్కరణల మేరకు గిరిజనులకు భూముల పట్టాలు దొరికాయి. లోతట్టు అడవిలోని భూములపై గిరిజనులకు అధికారం లభించింది. ఆ విధంగా అడవిలో గిరిజనులు, గిరిజనేతరులు కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అమాయకులైన గిరిజనులను మైదాన ప్రాంత షావుకార్లు మోసం చేసేవారు.
అయినా అది తట్టుకుని నిలిచింది. చాలా గిరిజన భాషలు మార్పునకు లోనై సాంకర్యంతో కళవెళ పడుతున్నాయి. ఈ సందర్భంలో గుంజాలలో పది రాత ప్రతులు లభించాయి. అదీ గోండీ లిపిలో చేతితో రాసిన ప్రతులు. దీనికే ‘గుంజాల గోండీ లిపి’ అని పేరు. వందేళ్ల క్రితం ఆ ఊరిలో ఈ లిపి ప్రచారంలో ఉండింది. ఈ లిపి సృష్టికర్త ఎవరన్నది నిర్దిష్టంగా చెప్పలేం. ఆ సమాజమే దీన్ని సృష్టించుకున్నది. అయితే మూడు తరాల కింద ఈ లిపిని ఎక్కువగా ప్రచారం చేసింది మాత్రం గుంజాలకి చెందిన పెందూర్ లింగోజి, కుంరా గంగోజి. వీరు ఒక పాఠశాల ఏర్పాటు చేసి దీన్ని నేర్పారు. అలా 60-80 ఏళ్ల కింద నేర్చుకున్న కోట్నక్ జంగు, కుంరా విఠల్, అర్క జైవంత్, కంరా లాల్‌షావు, అర్క కమలాబాయి ఇప్పటికీ ఉన్నారు.
వారు చదవగలరు, రాయగలరు. కమలాబాయి వయస్సు ఇప్పుడు తొంభై ఏళ్లు పైనే ఉంటుంది. దృష్టి మందగించినా ఆ రాతను చూసినప్పుడు ఆమె కళ్లల్లో మెరుపులు. ‘మా భాష మాకు కావాలి. అది మాకు గర్వకారణం’ అంటుందామె. పదేళ్ల వయసులో ‘బిడ్డా! ఇది మన లిపి. దీన్ని చదువు. కాపాడు’ అని ఆమె తండ్రి చెప్పాడట. అందుకే ఆమె ఈ లిపిని కొడుక్కి, మనవరాలికి కూడా నేర్పింది. గిరిజనులకు విద్య దూరం అనుకునే శిష్ట సమాజం నివ్వెరపోయే విషయం ఇది.
ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఆరు వేల భాషలున్నాయి. మన దేశంలో పదహారు వందల యాభై భాషలు ఉన్నట్లుగా అంచనా. ప్రస్తుతం అవి ఎనమిది వందలకు చేరిందని భాషావేత్తల అభివూపాయం. సుమారు ఇరవై ఐదు భాషలకు మాత్రమే లిపి, సాహిత్యం ఉంది. మిగితావన్నీ మౌఖికంగానే ఉన్నాయి. ఒక భాషకు లిఖిత రూపం రావడమంటే అంత సులువైన పని కాదు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక సాంస్కృతిక జీవనానికి నిలు నిదర్శనంగా లిఖిత రూపం వుంటుంది.

గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక 

ఈ రాత ప్రతులను మొదట చూసినప్పుడు మరాఠీనో, దేవనాగరి లిపో అనుకున్నాం. కానీ, అది ఒక విలక్షణమైన లిపిగానే కనిపించింది. అందుకే ఆ లిపిని గోండు పిల్లలకు నేర్పించాలని భావించాం. ఏడాదికింద అఖిల భారత గోండ్వానా గోండి సాహిత్య పరిషత్ జిల్లా మహాసభ జరిగింది. ప్రతి ఏడాది జనవరి 27 గుంజాల గోండీ లిపి దినోత్సవం జరపాలని అప్పుడు నిర్ణయించారు. ఈ ఏడాది కూడా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో తెలుగు తరవాత భాషా దినోత్సవాన్ని జరుపుకున్న ఘనత గోండులదే. గుంజాల లిపే వారికి ఆ ప్రేరణ.

‘గుంజాల గోండీ లిపి అధ్యయన వేదిక’ తరఫున చాలా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ఐటీడీఏ ఉట్నూరు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ దళిత్, ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్‌లేషన్’ (సిడాస్ట్) సహకారంతో మొదటిసారిగా గోండీ లిపిలో మొదటి వాచకం అచ్చేస్తున్నారు. గుంజాల గ్రామంలో లిపి అధ్యయనం కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు ఆఫీసర్ జే. నివాస్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ లోగా సిడాస్ట్ గుంజాలకి ఒక పరిశోధక బృందాన్ని పంపింది. జయధీర్, ఆచార్య వి.కృష్ణ ఆధ్వర్యంలో గోండీ లిపిలోని రాత ప్రతులను హిందీ, తెలుగు భాషలలోకి అనువాదం చేసే పని అక్కడ జరుగుతోంది. ఈ లిఖిత సమాచారంలో గోండీ ప్రజల ఆచారాలు, చరిత్ర వెల్లడవుతున్నాయి. ఈ లిపిపై గోండీ పిల్లలు ఆసక్తిగా ఉన్నారు. ఆరో తరగతి చదివే విఠల్ రెండో తరగతి చదివే పిల్లలకు, ఈ లిపిలో అక్షరమాలను, గుణింతాలను నేర్పుతున్నాడు. లాల్‌షావు (75) కోట్నక్ జంగు (72) తమ ఆత్మకథలను గుంజాల గోండి లిపిలో రాస్తున్నారు. వాటిని శ్రీధర్ శ్రీకంఠం తయారుచేసిన సాఫ్ట్‌వేర్ సాయంతో ఆ లిపిలోనే డీటీపీ చేసి పుస్తకం ముద్రించేందుకు రంగం సిద్ధమైంది.

అంటే గోండీ లిపిలో, గోండీ భాషలో అవి మొదటి ఆత్మకథలు అవుతాయి. ఎం.ఏ (తెలుగు) చదివిన కోట్నక్ వినాయక్ తెలుగు నుంచి గుంజాల లిపిలోకి అనువాదం చేయగలడు. అతని సహాయంతో గుంజాల గ్రామంలో లిపి అధ్యయన కేంద్రం కూడా ప్రారంభం కాబోతున్నది. అక్కడ ఒక గోండీ భాషా పాఠశాలకు అంకురార్పణ జరుగుతున్నది. అనువాదం పనిలో ఉండగా గోండీ-తెలుగు భాషలకున్న అనుబంధాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలిగింది. వందలాది గోండీ పదాలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా మూలాలే కాదు, సాంస్కృతిక, చారిత్రక లోతులు కూడా తెలుస్తాయని నమ్మకం. బౌద్ధుల నలందలాగా గోండీ లిపి భాషా విషయాలకు గుంజాల కూడా విశ్వవిద్యాలయంగా ఎదగాలని కోరుకుందాం.

కొన్ని గోండీ భాషా పుస్తకాలను ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

ధన్యవాదాలు
 సాక్షి పత్రికలో  జయధీర్ తిరుమలరావు గారి వ్యాసం
కొండ బతుకులు.. గోండు కథలు బివిఎన్ స్వామి గారి వ్యాసం
ఆదివాసీ భాషల మాటేమిటి? – ప్రొ. భంగ్యా భూ

Standard
సమీక్ష

సైకలాజికల్ థ్రిల్లర్ లను ఇష్టపడేవాళ్ళు చూడొచ్చు ‘‘ నేనొక్కడినే ’’

వన్ నేనొక్కడినే సినిమా చూసాను. పండగకు సినిమాకు వెళ్ళాలన్న దానికన్నా రివ్యూలలో రెండు స్థాయిల ఎక్స్ ట్రీమ్ లు ఎందుకొచ్చాయి బావుందంటే చాలా బావుందనీ, బాలేదంటే అస్సలు బాగాలేదనీ ఎందుకంటున్నారనే ఉత్సుకత కొద్ది మరీ సినిమా చూసాను. జండూబామ్ తీసుకెళ్ళండని భయపెట్టేంత బోరు వుండటం అబద్దమని చెప్పేందుకు రెండు ముక్కలు రాద్దామనిపించింది.

నడుస్తున్న కథనాన్ని నా ఇంట్రర్ప్రిటేషన్లూ, ఎక్స్ పెక్టేషన్లూ లేకుండా చూసుకుంటూ వెళ్ళాను. కొన్ని వాస్తవానికి సరిపోతున్నాయా లేదా అనే లాజిక్ ఒక్కటి వదిలేస్తే సినిమా నాకు నచ్చింది. మూసకి నిజంగా భిన్నంగా వుంది. జీవితమంత సాధారణంగానే కథకూడా నడుస్తుంది.

రాక్ స్టార్ గా మహేష్ బాబు, జర్నలిస్టు సనమ్ గా కృతిసనన్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ట ఈ రొటీనంతా చెప్పను కానీ మహేష్ బాబు దక్షిణాది హృతిక్ లా కొత్తగా వున్నాడనే ముక్క మాత్రం చెప్పాలి.

1) తమపై జరిగిన దాడినుంచీ తప్పించుకునేందుకు కార్ పార్కింగ్ లోని చాలా కార్ల తాళం చేతుల్ని గుప్పెట నిండా తీసుకుని ఒక్కొక్కటీ పారేసుకుంటూ వస్తాడు. నాకర్ధం కాలేదు ముందు తర్వాత తనకి దగ్గరలో బజర్ ఏది రింగయితే ఆ కారు వాడుకునేందుకు చేసిన ప్లాన్ అని ఇలాంటి కథనంతో పాటు వచ్చే మైండ్ గేమ్స్, లాజికల్ సీక్వెన్సెస్ బావున్నాయి.
ఫోటో సీక్వెన్స్ ల నుంచి నంబరు తీయటం. రూబిక్స్ కి బ్యాంక్ లోగో నంబరు కలపటం ( తండ్రి ఎలాగూ శాస్త్రవేత్త కదా),

2) రత్నవేలు కెమెరా పనితనం మొదటి షాట్ లో లైటింగ్ లో నీళ్ళమధ్యనుంచి కనిపించే రాళ్ళను చూపించటం దగ్గరనుంచి ఛేజింగ్ షాట్ల వరకూ అన్నీ బాగా నడిచాయి.

3) ముఖ్యంగా పీటర్‌ హేన్స్‌ హాలీవుడ్ సినిమాను మరిపించేలా స్టంట్ సీక్వెన్స్ లను అల్లాడు. రోడ్ బైక్ కార్ చేజింగ్ లు, మిడ్ సీ యాక్షన్ సీన్ లు గుర్తుండి పోయేలా తీసారు. అడ్డంగా వదిలిన బైక్ వల్ల పైకి లేచి తనమీదుగా వెళుతుండటాన్ని హీరో గమనించటం ఒకటి స్లోమోషన్ లో తీసిన సీన్ కథ ప్రకారం ఊహే కానీ ఒన్నాఫ్ ది హైలెట్. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో వుందనే విషయాన్ని విమర్శకులు కూడా కాదనటం లేదనుకుంటాను.

4) విలనెవరో తెలిసి పోరాడటం చూస్తూనే వున్నాం నిజంగా వున్నాడా లేడో తెలియదు. తనది బ్రమో నిజమో తెలియదు. బయటి వాళ్ళతోనే కాదు మనతో మనకీ పోరాటమే మధ్యలో వదిలేస్తే గోల్డెన్ రైస్ లాంటి నిధే కాదు. అంతకంటే విలువైన జ్ఞాపకాల ఆల్పం సైతం దొరకదు. ఇంటర్వెల్ కిముందే ఒక విలన్ ని చాలా కూల్ కామిక్ సిట్యుయేషన్ లో చంపేయటం రెగ్యులర్ హై వెయిట్ రివేంజ్ సీక్వెన్స్ లకు చాలా భిన్నంగా కొత్తగా ఊహించారు.

5) అనవసరమైన రొటీన్ కామెడీ లేదు కానీ కథానుగుణంగా వచ్చే సన్నివేశాలు ఆ కొరతను కొంతమేరకు తీర్చాయి.

6) దేవిశ్రీప్రసాద్ పాటల్లో హూ ఆర్ యూ కథకు బాగా అతికింది. మిగిలినవి స్పీడ్ గా అయితే వున్నాయి.

లండన్ టాక్సీ డ్రైవర్ గా పోసాని, ముఖ్యమైన కొన్ని పాత్రల్లో నాజర్ నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జి, షాయాజి షిండే, ఆనంద్, లు చేసారు.సినిమా చూసిన తర్వాత కథ రచయిత పేరుకోసం వెతుక్కున్నాను జక్కా హరిప్రసాద్ అట. విజువల్ మీడియం కొసం కంటే నవలలా మరింత బాగా పనికొచ్చెలా తయారు చేసినట్లున్నారు.

(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = “//connect.facebook.net/en_US/all.js#xfbml=1”; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, ‘script’, ‘facebook-jssdk’));

Standard
సమీక్ష, telugu poetry

కవిసంగమం ఈనాటికవిత-47 కట్టా శ్రీనివాస్ ‘ఎరుక’ పై – మల్లావజ్జల నారాయణ శర్మ గారి విశ్లేషణ

Narayana Sharma Mallavajjala
విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం అందుకే కాబోలు.
జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా.వీటినే శైశవ,బాల్య,యవ్వన,కౌమార్య,దాంపత్య ,గార్హస్త్య,వార్ధక్య దశలుగా చెప్పారు.ఇవన్నీ ఒకటిగా సాగుతున్నట్టేగాని వీటన్నిటికీ కొనసాగింపు లేనట్టుగా అనిపిస్తుంది.దానికి కారణం గతం ఙ్ఞాపకంలా మిగలటం.శ్రీనివాస్ ఇలాంటి “ఎరుక”నే కవితా వాక్యాలుగా ప్రకటిస్తున్నారు.
ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.
“నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను.”
“దారం ఉనికి తెలియనంత వరకూ
ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది.”
“రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్
ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి”
ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.
“నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.
నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను.
చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,
నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు.”
ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్ మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్రదర్శించడం ద్వారా రాబోయే బాధ దుఃఖాలను అహం పసిగడుతుంది.”చిన్నారి బుగ్గలు పుణికి నప్పుడల్లా/నాఙ్ఞాపకలతోనే నాకు వణుకు.” ఈవాక్యంలో ఆ తత్వం కనిపిస్తుంది.
అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.

కవిసంగమం ఈనాటి కవిత 

ఎరుక కవిత్వం

Standard
సమీక్ష

ఆది శంకరాచార్య నుంచి ఏం తెలుసు కోవచ్చు ?

శిష్యులతో ఆది శంకరాచార్య
ది శంకరాచార్య సినిమా చూసాను ఇంతకు ముందే. అతని గురించి కథగా తెలిసి చూస్తుంటే విషయాన్ని తెరకెక్కించటంలో క్రమం, శ్రధ్ధా బాగానే వున్నాయి. నటీనటుల పరంగానూ ఒకే. కానీ శంకర్ మఠ్ అంటే ఒక లాండ్ మార్క్ అని, అవుట్ డేటెడ్ డ్రెస్రింగ్ తో వున్న వ్యక్తిని తలకెక్కించటంలో విజయవంతం కాదేమో ననిపించింది. దానికి ప్రదాన కారణం కథలో బిగింపు ఏర్పడలేదు. కావాలని కల్పించే ఎమోషన్స్త్ ని బాగా సాగదీసారు. నేనీ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పటినుండీ చాలా ఉత్కంఠతతో ఎదురు చూసాను. భారతదేశ చరిత్రలో ప్రత్యేకంగా పేర్కొన దగ్గ మలుపు తిప్పిన వ్యక్తి జీవితం వెండి తెరకు ఎలా ఎక్కుతుందా అని.

భలేమంచి సమయం

ఎవరికి వారే తమదారే గొప్పదనుకుని చీలిపోతున్న సమయంలో శంకరుడు తన వంతు పాత్ర పోషించాడు వేరు వేరు కాదు ఒక్కటే (అద్వైతం) అనే సిధ్దాంతంతో అందరినీ కలిపేందుకు ఒక్కవ్యక్తి నిజంగా ఇంత పని చేయగలడా అనిపించేలాంటి కృషి చేసాడు. బ్రతికింది 32 సంవత్సరాలే, అయినా భారత దేశాన్ని ఆ చివరకూ ఈ చివరకూ నాలుగు సార్లు పాదయాత్ర చేస్తూ వ్యతిరేఖులను ఓడించి తన సిధ్దాంతాన్ని స్థాపిస్తూ తిరిగాడు. భాష్యాలూ, సిద్ధాంత గ్రంధాలూ, ప్రకరణ గ్రంధాలూ, స్తోత్రాలూ రచించాడు. పుస్తకాలను చదువటం ద్వారా నింపుకునే ఊటతో ప్రవహించటం కంటే రాహూల్ సాంకృతాయన్ లా అనుభవాల ఊటలు నింపుకుంటూ రాయటంలో పస పదునూ ఎక్కువ వుంటాయి. అదే ప్రయాణానికి ఒక లక్ష్యం వుండి ఆ జీవితానికి ఆ లక్ష్యం తప్ప మరోటి లేని ప్రయాణంలో ఒక ఉద్యమ కార్యాచరణ తోడయితే అది శంకరాచార్యుని జీవితం అవుతుంది. ఆది శంకరాచార్యుని జీవితమే అవుతుంది. 

ఏ కాలం వాడు ? 

శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు శంకర విజయ అన్న పేరుతో పిలుస్తారు..

మాధవీయ శంకర విజయం – 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన
చిద్విలాస శంకర విజయం – 15 – 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన
కేరళీయ శంకర విజయం – 17వ శతాబ్దికి చెందిన రచనల ద్వారా శంకరుని గురించి మనకు తెలుస్తుంది.
ఒక అంచనా ప్రకారం శంకరుడు క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో జీవించాడని అంటారు.అచ్చుయంత్రాలు లేవు. సరైన ప్రయాణ, ప్రసార, ప్రచార సాధనాలేవీ లేని రోజుల్లో ఒక్క వ్యక్తి అఖండ భారతదేశంపై ప్రభావం చూపి వెయ్యిసంవత్సరాల తర్వాత కూడా తన ఆలోచనలను సజీవంగా బ్రతికించ గలగటం నిజంగా గొప్పవిషయమే. సినిమా పొరపాటున బొరనిపించటం ద్వారా శంకరుని జీవితాన్ని కూడా బోరు అనే భావిస్తారేమో అనే సంశయంతోనే ఈ కొంచెం రాయాలని పించింది. ఇప్పుడు చదువుతున్న మీ ఒక్కరికి చేరినా సరే అన్న ఉద్దేశ్యంతోనే.
తండ్రి బాల్యంలోనే మరణించటంతో తల్లి ఆర్యమాంబ అన్నీ తనై పెంచుతుంది. తల్లిని ఒప్పించి సన్యాసం

మొసలినుంచి తప్పించుకోవాలంటే సన్యాసిగా మరేందుకు అనువతివ్వమ్మా

తీసుకుంటాడు. ( భవభందాలనే మొసలినుండి విడివడ్డానని రచయత చమత్కారం కూడా బావుంది) సాధారణ జనంపై గట్టిప్రభావం వెయ్యాలంటే మహిమలు తప్పనిసరి అప్పటికి వెయ్యేళ్ళక్రితం నుండీ నాస్తికతలోనుండీ పుట్టినప్పటికీ తన ప్రభావం చూపిస్తున్న బౌద్దానికైనా జాతక కథలు చెప్పటం తప్పలేదు. మహిమాన్విత విషయాలను ప్రచుర్యం చేయకా తప్పలేదు.

ప్రాణ,అపాన,వ్యాన,ఉదాన,సమానాలనే పంచప్రాణాలు శ్వేతవర్ణపక్షులుగా శంకరుని తండ్రి మరణం సమయంలోనూ, ఇతని పరకాయ విద్య సమయంలోనూ కపాలంనుంచి బయటికి ఎగురుకుంటూ వెళ్లినట్లు చూపించిన గ్రాఫిక్స్ కొంత సపోర్టివ్ గానే వున్నాయి. 

శంకరుని విషయంలో కూడా ఇలాంటి ప్రభావాన్ని చూపే మహిమల కథలున్నాయి. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవిబంగారు ఉసిరికాయలు వర్షింపజేయటం ఒక మహిమ అలానే తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయిందని. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించాడని చెప్పే మరోక కథా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటువంటివే వ్యక్తి సెలబ్రిటీ హోదాకు మించిన స్థితిని ఇచ్చి చెప్పబోయే అంశాలపై ఉత్కంటత ఏర్పడేలా చేస్తాయి. అంతకంటే ముఖ్యంగా ప్రాచీన యోగ విద్యకు సంభందించిన అనేక విషయాలను శంకరుడు అవపోశన పట్టాడని చెపుతారు. 

కలిసి వచ్చిన సజ్జన సాంగత్యం

మహా భారత రచన చేసిన వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యుడు గౌడపాదులు, నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదుని దర్శనం లభిస్తుంది.గోవిందపాదులు శంకరునికి బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారట.
సాధారణ ప్రజలు మొహాలను చూస్తూ మాట్లాడుతారు వీరికి ఉద్వేగాలు ముఖ్యం, మేధావులు మనసులోకి పరిశీలిస్తూ మాట్లాడగలరు వీరికి సంఘటనార్ధలు ముఖ్యం. తాత్వికులు సైద్దాంతికి కారణాల జన్యమయ్యే ఫలితాను లక్ష్యాలుగా చూస్తూ మాట్లాడుతారు వీరికి విస్తృతార్ధం, విస్తృత ఫలితం ముఖ్యం అన్నట్లు శంకరుని పాత్రధారి కూడా ఎక్కడో గాలిలోకి చూస్తున్నట్లు కవళికలు చూపిచాడు. తన తల్లికి కృష్ణ లీలలు చూపే సందర్భంలో చేసిన డబుల్ యాక్షన్ లో అతనికి నటనపై వున్న పట్టు కనిపించింది.

మనీషా పంచకమనే ముఖ్య ఘట్టం

ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో

ఛండాలునిగా నాగార్జున

నాలుగు శునకాలతో ఒక ఛండాలుడు (ఈ పాత్ర నాగార్జునా చేశారు) అడ్డువస్తాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు.

అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి

సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా?

వేదాలనే నాలుగు కుక్కలతో ఛండాలునిగా భోద
ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తరువాతి కర్తవ్యాన్ని  వివరించాడు: “వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని అందరూ అంగీకరించి పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి.” ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ఇక్కడే శంకరునికి నిజంగా తన జీవిత లక్ష్యం ఏర్పడినట్లు.

తను సిద్దాంతాన్ని ప్రతిపాదించటమే కాకుండా అది జనం లోకి వెళ్లాలంటే దానికి అన్యంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలి. పరమత ఖండన జరిగితేనే స్వమత స్థాపన జరుగుతుంది. అంటే వేరు వేరు సిద్ధాంతలకు అధిపతులుగా, నాయకులుగా,సిద్దంతకర్తలుగా వున్నవారిని ఓడించింతే అనుచర గణం, తదుపరి జనం తప్పని సరిగా మార్గాన్ని మారతారు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని తన ప్రయాణం ప్రారంభిచాడు.

మండన మిశ్రునితో వాదయుద్ద ఘట్టం

మండన మిశ్రునిగా సాయికుమార్
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వద్దకే వెళ్ళి కలుస్తాడు. మీసంలేని మండన మిశ్రునిగా సాయి కుమార్, న్యాయ కోవిద అయిన అతని భార్య ఉభయభారతిగా కమలినీ ముఖర్జీ నటించారు. వాదనియమాలు పెట్టటం వాదన జరగటం ప్రేక్షకులకు వినోదంగానే వుండేలా తీసారు. వాదనలో భర్తకు సహాయంగా ఆమె అడిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి వంటి కామ శాస్త్ర సంభంద ప్రశ్నలకు ఆజన్మ బ్రహ్మచారి ఐన శంకరుడు సమాధానం చెప్పలేక అప్పటికి సెలవు తీసుకుని పరకాయ ప్రవేశ విద్య ద్వారా వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు శరీరంలో ప్రవేశించి అనంగతంత్ర పాండిత్యం నేర్వడంతో పాటు సక్రమ రాజ్య పాలనమంటే ఏమిటో చూపించాడట. ఆ తర్వాత మండన మిశ్రుని పూర్తిగా ఓడిండి సన్యాసం ఇచ్చి శిష్యునిగా స్వీకరించాడు. మండన మిశ్రుడే తదుపరి సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్దుడయ్యాడట.

ఇదే పద్దతిలో వివిధ సిద్దాంత కర్తలను తన సిద్దాంత పటిమతోనూ, వాదనా సామర్ధ్యంతోనూ ఓడించి అద్వైత సిద్దాంతాన్ని స్థాపించి సర్వజ్ఞపీఠం అధిరోహణ చేశాడని చెపుతారు. అందుకే అతడు జగద్గురువుగా పిలువ బడ్డాడు.

సినిమాలో సుమన్, చిరంజీవి, పిరమిడ్ ధ్యానకేంద్రం పత్రీజీ, తనికెళ్ళ భరణి, లాంటి వారు కనిపించటం అదనపు ఆకర్షణ. చిరంజీవి శివుడిగా ఆపధ్భాందవుడిలో వేసిన శివతాండవాన్నే మళ్ళీ ఉపయోగించినట్లున్నారు.  నాగార్జునా, శ్రీహరి మాటల్లో వాళ్ళ ఒరిజినల్ స్లాంగ్ బాగానే కనిపించింది. పోసాని కృష్ణ మురళీ ఒరిజినల్ హడావిడి కాకుండా కొంచెం ఒద్దికగా ఉంచేసినట్లున్నారు. సుమన్ నోటి నుంచి నిప్పులు ఎగజిమ్మటం డ్రాగన్ లా ఎందుకు పెట్టారో మరి. 

ప్రతిభావంతమైన కార్యనిర్వాహకుడు

తన రచనలతో సిద్దాంతాన్ని శాశ్వతం చేయటమే కాకుండా చాతుర్మఠాల వ్యవస్థను రూపోందిని దాని నిర్వహణకు ఒక పటిష్టమైన చట్రాన్ని రూపోందించాడు. వాటి పరిపాలనకు సంభందించి అత్యంత ముందుచూపుతో వేరు వేరు నిర్వాహకులను ఏర్పరచి వారికి పద్దతులపై ఆధారపడిన నిర్వహణా భాద్యతలను అప్పగించాడు. ఆ పునాదులపై నిలబడిన నిర్మాణమే నేటీకీ దుర్భేద్యమై తలెత్తుకుని నిలబడే వుంది.

శంకరుని అనంతరం అతడి శిష్యులు అద్వైత సిద్ధాంతాన్ని తత్సంబంధిత మతాచారాలను ముందుకు తీసుకొని వెళ్ళారు. శంకరుని తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూమతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు.

గాంధీ కావచ్చు, సీతారామరాజు కావచ్చు మార్క్స్, అంబేద్కర్ ఎవరైనా కావచ్చు సమస్యని గుర్తించి మేధోపరమైన పరిష్కారాన్ని కనుక్కోగానే గొప్పవాళ్ళు కాలేదు. జనాన్ని ఒక్క తాటిపై తీసుకువచ్చేందుకు అవసరమైన సూత్రాన్ని అమలుచేయటంలో నిబద్దతను చూపారు. ప్రభావశీలత, ఫలితాలను పరస్పర ప్రేరకాలుగా ముందుకు నడిపించారు. పాకిస్తాన్ చైనాల దాడి కనబడుతూ జరుగుతుండవచ్చు, డాలర్ తన పగ్గాలను మన మెడచుట్టూ వేసి స్వారీ చెయ్యటం కంటికి కనిపించక పోవచ్చు ఈ పరాధీనతలను విడిలించుకునే కార్యాచరణకు లక్షల సైన్యం కాదు కావలసింది ఇదిగో ఇలానే నిబద్దతతో, లక్ష్యాన్ని చూస్తున్న దృష్టితో ముందుకు నడుస్తూ నడిపించేవారు ఒక్కరుంటే చాలదా.

Standard
వివరణ, సమీక్ష

కుతుబ్ మినార్ కథ : కొన్ని వివాదాలు

భారత దేశం లోనే అత్యంత ఎత్తైన ఇటుకలతో నిర్మించిన మినార్ గా ప్రసిద్ధి గాంచింది కుతుబ్ మినార్. ఇది UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గౌరవాన్ని పొందింది. ఇది ఢిల్లి లోని మెహ్రౌలీ వద్ద వున్న కుతుబ్ కాంప్లెక్స్ లో వుంది. ఇండో ఇస్లామియా నిర్మాణ కౌశలం కనిపించే ఈ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడని అతని పేరు మీదుగా కుతుబ్ మీనార్ అని పిలుస్తున్నారు. ఎర్ర యిసుక రాయి, పాలరాళ్ళను దీని నిర్మాణంలో వాడారు. 
72.5 మీటర్లు (237.8 అడుగులు) ఎత్తువున్న ఈ నిర్మాణానికి 399 మెట్లను పైవరకూ నిర్మించారు. పునాది దగ్గర దీని వ్యాసం 14.3 మీటర్లు వుంది. పైకి వెళ్తున్న కొదీ ఇది సన్న బడుతూ చివరలో 2.75 మీటర్ల వ్యాసాన్ని కలిగి వుంటుంది. అంతస్తులుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటే మొత్తం ఇది ఐదు అంతస్తుల నిర్మాణం. ఇప్పటికి వాడుకలో వున్న చారిత్రక ఆధారాలు 1192 లో కుతుబుద్ధీన్ ఐబక్ నిర్మాణం ప్రారంభించగా అల్తమష్ పూర్తి చేశాడని చెపుతున్నారు. కాల క్రమంలో జరిగిన అనేక భూకంపాలకూ, పిడుగు పాట్లకూ ఎన్నోసార్లు తట్టుకుని నిలబడింది.అక్కడక్కడ దెబ్బతిన్న బాగాలను వివిధ సందర్భాలలో బాగుచేసారు. దీనికి పునరుధ్దరణ, మెరుగుదల పనులు ఎక్కువగా ముస్లిం రాజుల కాలాలలోనే జరిగాయి. ఫిరోజ్ షా తుగ్లక్ (క్రీ.శ 1351-88) మరియు సికందర్ లోడి (1489-1517) లు ఈ పనిలో పాలు పంచుకున్నట్లు మీనార్ ఉపరితలం లో దొరికిన ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ నిర్మాణం నిట్టనిలువుకు 60 సెంటీ మీటర్లు ఒరిగి వున్నదని అయితే అది అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ వర్షపునీరు పునాదుల్లో ఎక్కువగా చేరుతున్నట్లయితే ఈ ఒరగటం మరింత పెరుగుతుందేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
1981 కి ముందు ఈ మీనార్ ను ఎక్కేందుకు సందర్శకులకు అనుమతినిచ్చే వారు కానీ 1981 డిసెంబర్ 4వ తారీఖున జరిగిన తొక్కిసలాటలో 45 మంది మరణించారు వారిలో ముఖ్యంగా పిల్లలున్నారు. ప్రమాద వశాత్తూ కరెంటు పోవటంతో ఏర్పడిన చీకటి వలన కలిగిన భయం వల్ల ఏర్పడిన తొక్కిసలాట అది. అది ప్రధాన కారణం అయితే నిరంతరం ఎక్కదిగుతున్న సందర్శకులవలన కట్టడానికి నష్టం వాటిల్లుతుందన్న భయంతోనూ ఆ తర్వాత దీని అధిరోహణను నిషేదించారు. 
దీని అసలు పేరు విష్ణుద్వజమా ?
కుతుబ్ మినార్ ఆవరణలోనే వున్న లోహశాస్త్ర విచిత్రం లాంటి ఇనుప స్థంబం పై 4 వ శతాభ్దానికి చెందిన బ్రహ్మీ లిపిలో రాయబడిన శాసనాధారాల ప్రకారం కుతుబ్ మినార్ పూర్వపు పేరు విష్ణుధ్వజ మని తెలుస్తుంది. విష్ణుదేవుని స్థంబమనే అర్ధంలో వాడారట. హిందు శిల్పకళా పద్దతిని ప్రతిబింబించేలా స్థంభంపై అలంకరించిన గరుడ శిల్పం వుంది. మీనార్ ను నిర్మించిన కొండ ప్రాంతాన్ని కృష్ణ పాదమని పిలుస్తారట. 
దీనిని విజయస్తూపంగా ముస్లింపాలకులు పేర్కొన్నారు. మహ్మద్ ఘోరి పృధ్విరాజ్ పై సాధించిన విజయానికి ఇది చిహ్నం అని చెపుతారు. కానీ పానిపట్ లో జరిగిన యుద్దం తాలూకూ విజయస్థూపాన్ని మరి ఢిల్లీలో ఎందుకు నిర్మించారనేది ప్రశ్న. పోనీ ఆయన రాజధానిలో నిర్మించారనుకుందామనుకున్నా ఆయన రాజధాని ఢిల్లి కాదు అని ప్రశ్నిస్తున్నారు 
అంతే కాకుండా స్థంబం నిర్మాణాన్ని పరిశీలించిన నిపుణుల అభిప్రాయం ప్రకారం అది ఒక ప్రాచిన వేధశాల లా వుందంటూ కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కొందరు చరిత్ర కారుల పరిశీలనల ప్రకారం క్రీస్తుకు పూర్వమే 280 లో సముద్ర గుప్తుడనే రాజు నిర్మించిన వేధశాల అని చెపుతున్నారు. స్థంభం పై దీని నిర్మాణానికి సంభంధించిన రాతలలో ‘‘శ్రీ విశ్వకర్మ ప్రసాద రచిత’’ అనే మాటలు వున్నాయట అంటే విశ్వకర్మ ఆశీర్వాదాలతో నిర్మించబడిన అనే అర్ధంలో వాడారు. ఇది హిందు మైధాలజీకి దగ్గరగా వుంది. 
అయితే ఇనుప స్థంభం పై రాతలను కుతుబ్ మినార్ కు అన్వయించటం ఎలాకుదురుతుందని ఇది ఉదయగిరి నుంచి క్రీ.శ 10 వశతాబ్ధంలో ఇక్కడికి మార్చారని వాటి అన్వయాన్ని ఈ మీనార్ పై చెయ్యటం కుదరదనీ వాదిస్తున్నారు. ఆరు టన్నులకు పైగా బరువుండి 7.21 మీటర్ల పొడవున్న 98 శాతం స్వచ్ఛమైన చేత ఇనుముతో తయారైన ఈ లోహ శాస్త్ర వింతను రెండవ చంద్ర గుప్త విక్రమాదిత్యుడు (375–414 AD) ఉదయ గిరి లోని ఒక విష్ణు ఆలయం ముందు నిర్మించాడు. విష్ణుదేవాలయానికి నిర్మించిన స్థంబం కాబట్టి దీనినే విష్ణుద్వజంగా పేర్కాన్నారని అంతే కానీ అది మీనార్ కు సంభందించిన అంశం కాదని ఈ వాదలలోని ముఖ్యాంశం.
చారిత్రక నిర్మాణాల విషయంలో మతకోణం కంటే అప్పటి రాజుల అధికార దర్పాన్నే చూడాలి. ఇప్పుడు కూడా పరువు సంభందించిన విషయంగా కాక చారిత్రక సత్యాలను అర్ధం చేసుకునే విషయంగా తీసుకుంటే ఉత్తమం.

ఇదే విషయంలో ఫ్రొఫెసర్ యమ్ ఎస్ భట్నాగర్ విశ్లేషణ స్క్రిబిడ్ కాపీ ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

Standard
సమీక్ష

సజీవ కవిత్వం – భాస్కర్ కొండ్రెడ్డి

శ్రీ భాస్కర్ కొండ్రెడ్డి

పొట్టిదానా అన్నాను హేళనగా,
భావం పిడిబాకై పొడిచేసింది.

ఎప్పుడో చాలకాలం క్రిందట రాసుకున్న వాక్యాలివి. అంతగా దూసుకుపోయే కవితలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయ్. అలా నాకు కన్పించిన రెండు కవితలు పి.రామకృష్ణ గారి, భగవాన్ ఉవాచ, ఎప్పట్లాగే.

రెండవకవిత “ఎప్పట్లాగే ‘” చదవగానే ఇంత ఆలోచనత్మకంగా, ఇంత సులభంగా చిన్న ఘటనను కవితగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. అరే, ఇలా మనం రాయలేకపోయామే అనిపిస్తుంది కూడా.

చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అన్న సామెత గుర్తుకొస్తుంది. ఒక చిన్న సంఘటనను, ఒక మంచి మార్గాన్ని సూచిస్తుందీ కవిత. ప్రకృతి పట్ల ప్రేమని, పర్యావరణం పట్ల బాధ్యతను చాలా సరళంగా స్పృశిస్తుంది. పిట్టగోడలు తప్ప పచ్చని చెట్లు కనిపించని నగరవాతావరణాన్ని ప్రశ్నిస్తుంది కూడా.బడిపిల్లల పాఠ్యపుస్తకాలలో వుంచదగ్గ కవిత ఇది,.
—————-

పి.రామకృష్ణ // ఎప్పట్లాగే

గుప్పెడు గింజల్నీ,
గిన్నెడు నీళ్ళనీ,
పిట్టగోడపై వుంచి
ఎదురుచూస్తున్నాను.
చెట్లను వెతుక్కుంటూ-
ఈ పక్షులన్నీ
ఎక్కడికి వెళ్ళాయో?

** ** **

ఎప్పట్లాగే
గుప్పెడు గింజల్ని చల్లి,
వాటిమీద-
గిన్నెడు నీళ్ళను పోసాను.
నాకు తెలుసు
పిట్టల కోసం వెతుక్కుంటూ
ఈ చెట్టు
ఎక్కడికీ వెళ్ళదు.

———-

కవిత్వాన్ని విభజించు అని నాకెవరైన అవకాశం ఇస్తే సజీవకవిత్వం, నిర్జీవకవిత్వం అని రెండు భాగాలుగా విడదీస్తానేమో! దేని ప్రాధాన్యత దానిదే అయినా కొన్ని సార్లు చటుక్కున జీవం ఆకట్టుకున్నంత సహజంగా ఇంకోటి ఆకట్టుకోదు.

పదాడంబరం చేతనో, లయచేతనో, కవి చేసే కనికట్టు వల్లనో కవిత్వం ఆకట్టుకోవచ్చు కాని మనుసు పొరల్లో తెరలు తెరలుగా అలలు, ఒక అలజడి రేకెత్తించలేకపోతే అది వస్తు కవిత్వమే.

కఠినమైన వాస్తవాన్ని, సత్యాన్ని, ఒక తాత్వికతను ఇంత సున్నితంగా చేయి తిరిగిన చిత్రకారుడిలా కేవలం రెండే రెండు దృశ్యాలతో హృదయపు కాన్వాస్ పై చిత్రించడం సామాన్యమైన విషమేమి కాదు.

మొదటి కవిత “భగవాన్ ఉవాచ” చదవగానే మొదటి దృశ్యం సర్వసాధారణంగా అనిపిస్తుంది. రెండో దృశ్యం జతకూడగానే ఎవరో చెంప చెళ్లుమనిపించినట్లు కళ్లలో నీరు సుడితిరగక మానదు. మనసు మూగగా రోదిస్తుంది భగవంతుడు ఎంత నిర్ధయుడో కదా అని.

ఎక్కడా అయోమయం ఉండదు, అస్పష్టతా ఉండదు. చెప్పదలుచుకున్నది అలవోకగా గుండెకు అతకబడుతుంది. అలజడి తగ్గి స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడితే గీతాసారాంశం కళ్లకు కడుతుంది. జరిగేది జరగక మానదని ,.ఇంకొంచెం తిక్కగా ఆలోచిస్తే నాస్తికత్వాన్ని భుజాన మోస్తున్న కవిత గా చెప్పుకోవచ్చు. ( కవికి ఆ ఉద్దేశ్యమే లేక పోవచ్చు అది వేరే విషయం) రెండు ఒకటి అని ఇచ్చిన సృజనాత్మక నెంబరింగ్ కూడా ఆకట్టుకుంటుంది ఈ చిన్న కవితలో. ఎక్కడైనా ఆదివారం అని కనిపిస్తే చాలు కవిత మొత్తం కళ్లముందు నిలబడిపోతుంది. బహుశా ఏ ప్రయత్నం చేయకుండా నాకు పూర్తిగా కంఠస్తమైన కవితకూడా ఇదొక్కటేనేమో.
—————-
 శ్రీ. పి.రామకృష్ణ

పి.రామకృష్ణ // భగవాన్ ఉవాచ

2. ఆ ఆదివారపు మధ్యాహ్నం
ఓ చిన్నారి కోడిపిల్ల
అమ్మకోసం వెతుకుతూ, వెతుకుతూ..
దార్లో-
కారు టైరు క్రిందపడి,
చనిపోయింది.

1. అదే ఆదివారపు ఉదయం
తల్లికోడి-
కసాయి కత్తిక్రింద కంఠాన్ని వుంచి,
కళ్లు మూసుకుని, ఇలా ప్రార్థించింది.
“భగవంతుడా ఇలాంటి చావు-
నా బిడ్డకు రాకుండా చూడు” అని.

———–
మొదటగా చెప్పుకోవలసిన రెండు మాటలు చివరలో చెప్తున్నాను.

కవిత్వం నచ్చడమనేది వ్యక్తిగతం.
కవిత్వమనేది ఓ కనెక్టివిటి.
ప్రతి కవితకు ఒక ఫ్రీక్వన్సీ వుంటుంది, అది పాఠకుడి ఫ్రీక్వెన్సీ కలవగలిగితేనే అది హత్తుకుంటుందనుకుంటాను నేను.
ప్రతి పాఠకుడి ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే కవితలు గొప్ప కవితలవుతాయ్. ప్రతి కవిత ఫ్రీక్వెన్సీకి అడ్జస్ట్ అయ్యే పాఠకుడు గొప్ప పాఠకుడౌతాడేమో?!

రెండో విషయం కనెక్టవిటి. కవి కుక్క గురించి ఫీలై కవిత రాస్తే చదివిన పాఠకుడు ఏనుగనుకుని కవిని నెత్తిన పెట్టుకొని పొగిడేస్తే ఆ కవిత ఫెయిలైనట్లే. కవి కూడా…
కవి ఏమనుకున్నాడో కవిత దాన్నే ప్రతిఫలించాలి. అదే పాఠకుడికి కనెక్ట్ అవ్వాలి. ఆ విషయంలో పై రెండు కవితలు పూర్తిగా విజయం సాధించాయనుకుంటాను.
బహూశా కొంత మందికి నచ్చకపోవచ్చు. కవిత్వం నచ్చడం వ్యక్తిగతం కావడంవల్ల.

—————————————14/7/2013,.17.18

కవిసంగమంనుండి…

Standard
సమీక్ష

కవిత్వం:కొన్ని ఆలోచనలు _ పాలపర్తి ఇంద్రాణి.

పదాలు అటూ ఇటూ పరుగులు తీస్తాయి

అర్ధాలు ఎటెటో దిక్కులు చూస్తాయి

ఆలోచనలు ముందుకి వెనక్కి వూగిసలాడతాయి
చివరికి,శూన్యంలోంచి పువ్వులు రాలుతాయి

అప్పుడేం జరుగుతుంది?
ఒక కవిత పుడుతుంది.
పుట్టగానే అది పరిమళిస్తుంది.

అంత మంచి కవిత,కాల ప్రవాహానికి ఎదురీది కలకాలం గుర్తుండిపోయే కవిత రాయాలంటే కవికి ఎటువంటి మానసిక స్థితి ఉండాలి? ఎలాంటి శిక్షణ కావాలి? ఇవన్నీ కవిత్వాన్ని చదువుతూ లేక రాస్తూ ఉన్నవారికి కలగాల్సిన అనుమానాలే,సందేహం లేదు.

మొదటిది: మానసిక స్థితి
సమస్యకు స్పందనను యధాతధంగా రాసిపారేయడం కవిత్వం కాదు.నిజానికి సమస్యకు కావాలసింది పరిష్కారం,కవిత్వం కాదు. సమస్య గురించి కవి తాను ఆవేదన చెంది పాఠకుడిని చైతన్య పరచదల్చుకుంటే ఆ విషయానికి సరి అయిన కవిత్వ రూపం ఇచ్చి మనసుకు హత్తుకునేలా సున్నితంగా చెప్పగలగాలి కానీ తిట్లు, విద్వేషాలు,శాపనార్థాలూ కవిత్వం కాదు.

కేవలం ఒక వర్గానికో కులానికో మతానికో తనని తాను పరిమితం చేసుకుని ఆ వర్గం,కులం లేదా మతానికి సంబంధించిన సమస్యలపైనే కవిత్వం అల్లే సంకుచిత మానవుడు కవి ఎలా అవుతాడు? విశ్వ నరుడే కవి కాగలడు.

ఆవేశాల్లోంచీ ఆక్రోశాల్లోంచీ పుట్టేది ఒక స్థాయి కవిత్వం మాత్రమే.కేవలం దిగులుని,దుఖాన్ని “గ్లోరిఫై” చేయడం కవిత్వం కాదు.కవిత్వం పాఠకుడి మానసిక స్థాయిని పెంచాలి.కవిత్వం చదిన తరువాత మనిషి మరి కొంచెం ఉన్నతుడు కావాలి.

అన్ని బాహ్య ప్రభావాలనూ, ఆలోచనలనూ వదిలి పెట్టాలి కవి. అన్ని సామాజిక విలువల వలువలను మురికి గుడ్డలను వదిలినట్టు వదిలేయాలి కవి. ఏకాంతంలో తన్ను తాను దర్శించుకోవాలి. ఈ విశాల ప్రకృతిలో, అప్పుడే పుట్టిన పాపాయిలా స్వచ్చంగా స్పందిస్తూ ఆ అనందంలో మమేకమవ్వాలి. అప్పుడు అల్లాంటి మానసిక స్థితిలోంచి పుట్టేది గొప్ప కవిత.

రెండవది: పదాల ఎంపిక

ఎల్లాంటి పదాలను వాడాలి? సరళమైన పదాలనూ,వినసొంపైన తేట తెలుగు పదాలనూ వాడాలి.ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం పెరుతుందో కవికి తెలియాలి.ఏ ఏ పదాలు కలిస్తే కవిత అందం చెడుతుందో కూడా తెలిసిపోవాలి.పదాలను పొదుపుగా వాడడంలో నైపుణ్యం సాధించాలి. ఇంగ్లీషు,ఉర్దూ,హిందీల్లాంటి అన్య భాషల పదాలను తెలుగు పదాలతో కలిపి కాలకూట కషాయాలను కాచి పాఠకుల చేత బలవంతంగా తాగించడం భావ్యం కాదు.

తెలుగు కవిత్వం తెలుగులోనే ఉండడం సమంజసం.
ఢమఢమలాడే పదాలను తెచ్చిపోస్తే అది ఘనమైన కవిత్వం అయిపోదు.
పాఠకుడిలో సున్నితమైన భావాలను మేలుకొలిపేదే కవిత్వం.

మూడవది: కల్పనాశక్తి

కవికి ముఖ్యంగా కావలసింది భావనా బలం,కల్పనా శక్తి. అల్లాగని ఊహలోంచి ఊహ,ఊహలోంచి ఊహలోకి వెళ్ళిపోతూ పాఠకులను గందరగోళానికి గురిచేయకూడదు. సరళంగా చెప్పగలగాలి.కవితకి ఒక తుది మొదలూ ఉండాలి.ఎక్కడించి ఎక్కడికో వెళ్ళిపోయి పాఠకుడిని గజిబిజి గల్లీల్లో వదిలేసి రాకూడదు. పదచిత్రాలే కవితకు ప్రాణం.

నాలుగవది: రూపం

వచన కవిత్వం అన్నారు కదా అని తుది మొదలూ లేకుండా వాక్యాలు వాక్యాలు రాసిపారెయ్యడం పరిపాటిగా మారింది తెలుగు దేశంలో.చందోబందోబస్తులు తెంచుకుందంటే దానర్ధం ఒక రూపం,నిర్మాణం,లయ లేకపోవడం ఎంత మాత్రం కాదు. పక్క పక్కన పేర్చితే వ్యాసమయ్యే వాక్యాల సముహాన్ని,ఒకదాని కింద ఒకటి రాసి దాన్ని కవిత్వమనడం మహాపరాధం. చక్కని రూపం,లయ మంచి కవితకు కావాల్సిన ముఖ్యమైన దినుసులు.

అయిదవది:వస్తువు

తీసుకున్న వస్తువు కవి మనసుకు బాగా దగ్గరదై ఉండాలి.ఎంత చిన్న విషయమైనా కవిత్వం కావచ్చు.నిత్య జీవితంలో జరిగే ఏ చిన్న సంఘటననుంచైనా కవిత్వం పుట్టవచ్చు.నిర్జీవ వస్తువులు కూడా కవితావస్తువులు కావచ్చు.

చివరగా,కవి ఏకాంతంలో తన కవిత్వాన్ని మెరుగులు దిద్దుకోవడం తాను పూర్తిగా సంతృప్తి చెందాకే పాఠకుల ముందు ఉంచడం చేస్తే తెలుగు పాఠకులకి పుంఖాలు పుంఖాలుగా వెలువడున్న కవితాసంకలనాల సముద్రాల్లో కొట్టుమిట్టాడే బాధ తప్పుతుంది.

Standard