సమాచారం

రామ రామ ఏమి సేతు ?

రామ రామ ఏమి సేతు ? దేశమంతా డబ్బుపోటు రాజకీయపు విషపు కాటు
…………………………………………………………………………….
భారత్-శ్రీలంక దేశాల మధ్య రామేశ్వరం మరియు శ్రీలంక దీవులును కలుపుతు సేతువు లాంటి సున్నపు రాతి ఆకారం. దీనిని ‘ఆడమ్స్ బ్రిడ్జ్’ అని కూడ అంటారు. ఇది పాక్ జలసంధిలో ఉన్నది. సేతువులను ‘షోల్స్’ లేక ‘సాండ్ బార్స్’ అని కూడా అంటారు.(http://en.wikipedia.org/wiki/Shoal ) అక్కడ ఒక వైపు వున్న పాక్ జలసంధి గుండా కాలువ తవ్వి మరోవైపున గల మన్నార్ సింధు శాఖతో కలుపుతూ కాలువ మార్గం ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో నలుగుతున్నాయి.
ఇది పగడపు దిబ్బనే అని శాస్థ్రావేత్తలు వివరిస్తున్నారు. ఎప్పటిదో మానవనిర్మితమని కొందరు నమ్ముతున్నారు.
ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు ? సుయజ్‌ కెనాల్‌, పనామా కాలువ లాంటివి భారీ నౌకలకు వేలాది మైళ్ళ దూరాన్ని తగ్గించి, వందల గంటల సమయాన్ని ఆదాచేశాయని. అటువంటి ఆర్థిక లాభాల కోసమే దీన్ని పగలగొట్టేసి నౌకామార్గం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల అరేబియన్ సముద్రం నుంచి హిందు మహ సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలు శ్రీలంకను చుట్టి వెళ్లే బాధ తప్పుతుందని అందువల్ల దేశ తూర్పు పశ్చిమ తీరాల మధ్య దూరంలో 424 నాటికల్ మైళ్లు అంటే 780 కిలోమీటర్ల దూరం కలిసొస్తుందని. సుమారు 30 గంటల సమయం ప్రయాణంలో కలిసి వస్తుందని ఈ పనికి పూనుకోవాలని చూస్తున్నట్లు చెపుతున్నారు.
అంతర్జాతియ నౌకా రవాణాలో మరింత సౌలభ్యం వుంటుందనీ చెబుతున్నారు. మరికొన్ని నిజాలు చూద్దాం.
►2005 జూలై 2 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌న శంకుస్థాపనచేశారు. 2007 సెప్టెంబరులో సుప్రింకోర్టు దీనిపై నిలుపుదల ఉత్తర్వులను జారీ చేసింది. 
ఇది కేవలం ఆర్ధిక అంశమే కాదు. ముఖ్యంగా పర్యావరణపరమైన కారకాలను, మత పరమైన అంశాల వల్ల ఏర్పడిన సున్నిత మనో భావాలనూ కూడా పరిగణలోకి తీసుకోవాలి.
►అధికారిక నివేదికలే ఇది అనవసం అంటున్నాయి : ప్రఖ్యాత శాస్త్ర్రవేత్త RK పచౌరీ సారధ్యంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రస్తుత రూపంలో సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేఖిస్తూ నివేదిక సమర్పించింది.
►దీని ఖర్చు : ప్రాధమిక అంచనాల ప్రకారమే 24,700 కోట్ల రూపాయిలు, తాజా అంచనాల ప్రకారం 45,000 కోట్లకు పెరిగింది.
►ఉపయోగ పరిధి : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 60,000 DWT ( డెడ్ వెయిట్ టన్నేజి ) రవాణా నౌకలు సంచారం పెరిగింది. కానీ సేతు కాలువ ద్వారా కేవలం 32,000 DWT మించిన రవాణా నౌకలు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు ఆర్ధికంగా పెద్ద లాభదాయకం కాదు.
►పర్యావరణం : మన్నార్ సింధు శాఖలో అరుదైన జీవవృక్షజాతులు 3600 వరకూ వున్నాయని, వైవిధ్య భరిత క్షీరదాలకు ఇది అనుకూల ఆవాస ప్రాంతం గా ఉపయోగ పడుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటిలో ఆమ్లీకరణ పెరుగుతుంది. చమురు తెట్టుల వంటి కాలుష్యం ముసురు కోవడం వల్ల వీటికి నష్టం ఏర్పడుతుంది.
►జీవన భృతి : లక్షలాది మంది ఇక్కడ లభించే మత్ససంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. 20 లక్షల మంది మత్య్సకారుల జీవనం జీవికలు కోల్పోతారు. ప్రత్యామ్నాయ జీవికలను వారు ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది.
►ప్రకృతి వైపరీత్యాలు : కెనడాలోని అట్టావా విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ టాడ్ ఎస్ మూర్తి వెల్లడించిన పరిశీలనల ప్రకారం 2004 నాటి సునామీ కేరళపై విరుచుకు పడకుండా రామసేతు అడ్డుకుందన్నారు. రామసేతును తొలగిస్తే భవిష్యత్తులో సునామీల వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకునే ఈ సహజమైన గోడను కోల్పోయినట్లే అంటున్నారు. ( ఒకప్పుడు కలివికోడి కోసం తెలుగు గంగ దారి మార్చటం మన రాష్ట్రంలోనే జరిగింది )
►మనోభావాలు : పురాణాల ప్రకారం సీత ను రక్షించడానికి రాముడు, వానరసేన సహాయంతో లంకకు కట్టిన వారధి ఈ రామ సేతు. సముద్రంపై తేలే బండలతో కట్టినట్లు చెప్తారు. దీన్ని కూల్చటం అంటే వీరందరి మనోభావాలను కూల్చటమే అనిది మరో అంశం. ఇది కూడా సులభంగా కొట్టిపారేసే చిన్న అంశం కాదు.
బీజేపి కూల్చొద్దంటోంది కాబట్టి దాన్ని కూల్చేద్దాం అంటే సెక్యులర్ అనుకుంటారా ? జయలలిత దీనిని జాతియ కట్టడంగా ప్రకటించ మన్నారు కాబట్టి ఆమె రాజకీయ వ్యతిరేఖులు అది వృధా నిర్మాణమని ఊరుకోవంటం సరైందా?
నిజాల వెలుతురులో విషయాలను చూడటం నాదేశానికి అబ్బితే ఎంతబాగుండును.

Standard
telugu poetry

రంగులద్దకం

ఉగ్రవాదానికి ఏ రంగు అద్దాలి ?అదో కారు చీకటి.
దేన్నయినా అమాంతం మింగేస్తుంటే.
చీకటిలో వుంటూ, చీకటినే మిగిల్చి
చీకటై విస్తరిస్తుంది.

విధ్వంసానికి ఏ రూపు తోడగాలి?ధ్వంస రచనే తన పనిగా మారినపుడు.
నిర్మించటం రాని చోట, కూల్చడమే ప్రధానంగా నడుస్తున్నపుడు.
ఉద్వేగానికి ఏ సిద్ధాంతం ఆపాదించాలి?
నిభాయించుకోలేని తనం
దబాయింపులతో గడుపుతున్నపుడు.

నడక ఆగిపోకూడదంటే
కాస్త వెలుతురు సంయమనమై పరుకోవాలి.కొంచెం ధైర్యం నిర్మాణమై తలెత్తాలి.
పడగెత్తిన పశుబలాన్ని
పడదొక్కె పాదం అడుగెత్తాలి.

Standard
సమాచారం

అంతర్జాలంలో తెలుగు పత్రికలు – కె.ఎక్స్‌.రాజు

ఇప్పుడు అంతర్జాలంలో తెలుగు వెలుగులు దశదిశలా పరిఢవిల్లుతున్నాయి. మొన్నమొన్నటి వరకూ అంతర్జాలంలో తెలుగు చదవాలంటే ఇమేజ్‌ ల రూపంలోనో, పిడిఎఫ్‌ ల రూపంలోనో మాత్రమే అందుబాటులో వుండేవి. ఈనాడు దినపత్రికవంటి సైట్లు సొంత ఖతులను (ఫాంట్స్‌) అభివృద్ధి చేసుకొన్నాయి. దీనికి ఖర్చు అధికంగా వుండడంతో ఎక్కువమంది ఆ దిశగా మొగ్గు చూపలేదు. ఇటీవల యూనికోడ్‌ అభివృద్ధి చెందడంతో అంతర్జాలంలో తెలుగు భాష వెలుగుతోంది. దీనివెనుక ఎందరో సాంకేతిక నిపుణుల అవిరళ కృషి దాగుంది. ఏదేమైనా అంతర్జాలంలో నేడు అనేక తెలుగు దిన, మాస పత్రికలు వెలుగు చూస్తున్నాయి. వీటన్నిటితోపాటు వేలసంఖ్యలో తెలుగు బ్లాగులు కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. అంతర్జాలంలో ఇప్పటికే కొన్ని పత్రికలున్నాయి. ఒక్కోదానికీ ఒక్కో ఒరవడి ఉంది. సాహిత్య ప్రధానమైనవీ.. సమకాలీన అంశాలతో నిండినవీ.. ఇలా రకరకాలుగా ఉన్నాయి. చాలా పత్రికలు ఏదో ఒక వాదానికి చెందినవి. తొలినాళ్ళలో అంతర్జాల పత్రికలు సాహిత్య ప్రధానంగా ఉండేవి. సాహిత్య వ్యాసాలు, కథలు, పాత గ్రంథాల సమీక్షలు, పద్యాలు మొదలైనవి ప్రధానంగా వుండేవి. ప్రస్తుతం సినీసాహిత్యం, పుస్తక సమీక్షలు, వ్యక్తిగత విషయాల నుంచి వంటల వరకూ అనేక విషయాలపై తెలుగు సైట్లు అభివృద్ధి చెందాయి. కంప్యూటర్లో తెలుగు అమలు చెయ్యడం సాంకేతికంగా చాలా సులభమైంది. ఇంకా సులభమౌతూ ఉంది.

ఇంగ్లీషు తప్ప గత్యంతరం లేని అంతర్జాలంలో తెలుగులో రాయగలిగే సౌకర్యం రావడంతో తెలుగువారికి తమ ఆలోచనలను తమ భాషలోనే రాతలోపెట్టే అవకాశం దొరికింది. ఇప్పటి నెటిజనుల్లో ఎక్కువమంది ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవాళ్ళే అయినప్పటికీ తెలుగులో రాయగల ప్రావీణ్యత లేనప్పటికీ రాయాలన్న తృష్ణ ఎక్కువగా ఉంది. వెబ్‌2.0 వచ్చాక, బ్లాగులూ, వికీలూ వెల్లువెత్తాక, అంతర్జాల పత్రికల ధోరణి మారిపోయింది. ముఖ్యంగా, కంటెంటు మేనేజిమెంటు విషయంలో జరిగిన సాంకేతిక పురోగతి కారణంగా అంతర్జాల ప్రచురణ క్షణాలమీద అయిపోతోంది. అచ్చు పత్రికలకు అలవాటు పడిన పాత తరం రచయితలు కూడా ఈ మధ్యకాలంలో అంతర్జాలంలో రాయడానికి అలవాటుపడ్డారు. ఇప్పుడు అంతర్జాలంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన అనేక సైట్లు, బ్లాగులు దర్శనమివ్వడానికదే కారణం. ఇప్పుడు అంతర్జాలంలో తెలుగు వెలుగులను విరజిమ్ముతూ.. సాహిత్య గుబాళింపులతో విభిన్న రంగాలకు చెందిన వెబ్‌ సైట్లు, బ్లాగులు అనేకం వున్నాయి. వాటిలో కొన్ని…

పుస్తకం (http://pustakam.net)

ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాల పత్రిక. పుస్తకాలపై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో ఇక్కడ చోటు చేసుకుంటాయి. దీని ముఖ్యోద్దేశం పాఠకులు తమ మాటల్లో తాము చదివిన పుస్తకాల గురించి అందరితో పంచుకోవడం. పుస్తకాలను ఇష్టంగా చదువుకోవడమనేదే ఇక్కడ ప్రాథమిక అర్హత. ఈ సైట్‌ జనవరి ఒకటి, 2009న ప్రారంభమయ్యింది.

ప్రస్థానం(www.prasthanam.com)

సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాహిత్యపత్రిక ఇది. తెలుగు సాహిత్యంతో పాటు భారతీయ భాషలలో వెలువడుతున్న సమకాలీన సాహిత్యాన్ని, దాంతో పాటే అంతర్జాతీయ సాహిత్య ధోరణులను కూడా ఎప్పటికప్పుడు పరిచయం చేయడానికీ, పరామర్శించడానికీ ప్రస్థానం ప్రయత్నిస్తుంది. జిల్లాల్లో జరిగే సాహిత్య కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని అందిస్తుంది. నూతనత్వానికి ప్రాధాన్యతనిస్తూనే గతంలో వెలువడిన విలువైన అధ్యయనాలను, రచనలను పాఠకులకు అందించడానికి కృషి చేస్తుంది. కవిత్వంతో పాటు ప్రజా గీతాలకూ చోటుంటుంది. స్థానికంగా జరిగే సాహిత్యసభలలో వక్తలు చేసే మంచి ప్రసంగాలను, ప్రముఖుల ఇంటర్వ్యూలను జాగ్రత్తగా రాసి పంపితే ప్రచురించే అవకాశముంటుంది. వివిధ విషయాలపై కవులు, రచయితలు, పాఠకులు తమ రచనలు, అభిప్రాయాలను పంపితే తగు శీర్షికలో ప్రచురిస్తుంది.

ఈమాట (www.eemata.com)

వెబ్‌ పత్రికలు అచ్చు పత్రికలకు ఏమాత్రం తీసిపోవు. కొండొకచో వెబ్‌ పత్రికలే ముందంజలో ఉన్నాయి. అలాంటి పత్రికల్లో పేరెన్నికగన్నది ఈమాట. తెలుగు వెబ్‌ పత్రికల్లో వయసు రీత్యానూ, పరిణతి రీత్యానూ పెద్దది ఈమాట. ఎప్పుడో యూనికోడు ప్రాచుర్యంలోకి రాకముందే పుట్టిన ఈ పత్రిక కాలంతో పాటు రూపునూ, సాంకేతికతనూ మార్చుకుంటూ, మెరుగుపరచుకుంటూ, అదే సమయంలో తన రచనల స్థాయిని కాపాడుకుంటూ వస్తోంది. తెలుగు సాహిత్యానికి నెట్లో ఉన్న ప్రధాన వనరుల్లో ఈమాట ఒకటి. ఈమాట కూడబెట్టినంత సాహితీ సంపద అంతర్జాలంలో మరో తెలుగు పత్రిక చెయ్యలేదు. ఈమాట గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు డౌనులోడు చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వచ్చినన్ని పరిశోధనాత్మక వ్యాసాలు ఇంకెక్కడా రాలేదేమో. ఆంగ్లంలో ఎకడెమిక్‌ జర్నల్‌ తరహాలో ఈ పత్రికని నడుపుతున్నారు. ప్రతి రచనను ముందుగా ముగ్గురు సమీక్షకులు పరిశీలిస్తారు. అవసరమైన చోట్ల మార్పులుచేర్పులకు సూచనలు ఇస్తారు.

సుజనరంజని (www.sujanaranjani.org)

కాలిఫోర్నియా బే ఏరియా తెలుగువారి సాంస్కృతిక సంస్థ సిలికానాంధ్ర వారి పత్రిక ఇది. మాసపత్రిక. 2004 జనవరి నుండి ప్రచురితమౌతోంది. ప్రతి నెలా ఒక ముఖచిత్రాన్ని ప్రచురిస్తారు. మామూలు అచ్చు పత్రిక భావన కలుగజేస్తుంది. తెలుగు సాహిత్యమే ప్రధానంగా నడిచే పత్రిక ఇది. సుజనరంజని యూనికోడులోనే కాక, పి.డి.ఎఫ్‌గా కూడా లభిస్తుంది. తాము స్వయంగా తయారుచేసుకున్న సాఫ్టువేర్‌ వాడుతున్నారు. బొమ్మలు ఎక్కువగా వుండడంతో ఈ సైటు మిగతా పత్రికలతో పోలిస్తే నిదానంగా లోడవుతుంది.

ప్రజాకళ (www.prajakala.org)

ప్రజాకళ అక్టోబరు 2006 లో మొదలైంది. కథ, నవల, సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శ తదితర రచనలను పరిచయం చేస్తారు. ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేస్తుంటారు. ప్రజాస్వామిక సాహిత్యం పట్ల ఆసక్తీ, ప్రేమా వున్న కొంతమందిమి మేము ఈ వెబ్‌ సైటు ప్రారంభించాలనుకున్నాము అని ఈ సైట్‌లో రాసారు. ప్రజాకళ వర్డ్‌ప్రెస్‌ సాఫ్టువేరును వాడుతున్నది. పి.డి.ఎఫ్‌ రూపంలో కూడా దొరుకుతుంది.

ప్రాణహిత(www.pranahita.org)

ప్రాణహిత 2007 జూలైలో మొదలైంది. ప్రధానంగా, విభిన్న గొంతుకల సమ్మేళనమై వినబడే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదిక కావడమే ప్రాణహిత లక్ష్యం అని చెబుతూ.. ప్రపంచవ్యాప్తంగా, దేశ దేశాల్లో ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యాన్ని తెలుగు చేసి మీకందించే ప్రయత్నం చేస్తాం అని ఈ సైట్‌లో చెప్పుకున్నారు. ప్రాణహితది ఆహ్లాదకరమైన రూపం. పత్రిక పి.డి.ఎఫ్‌ రూపంలో కూడా దొరుకుతుంది పాఠకులకు ప్రజాకళ, ప్రాణహిత పత్రికలలో దగ్గరి పోలికలు కనిపిస్తాయి.

కౌముది (www.koumudi.net)

వెబ్‌లో ప్రచురితమౌతున్న మరో మాసపత్రిక కౌముది. గతంలో సుజనరంజని పత్రికను నిర్వహించిన కిరణ్‌ ప్రభ 2007 జనవరిలో కౌముదిని ప్రారంభించారు. యూనికోడ్‌ యుగంలో మొదలైనప్పటికీ, కౌముదిని పి.డి.ఎఫ్‌, బొమ్మల రూపాల్లోనే ప్రచురిస్తున్నారు. పాఠకుల స్పందన వెంటనే కనిపించదు.

భూమిక (www.bhumika.org)

భూమిక స్త్రీవాద పత్రిక. అచ్చు పత్రికగా మొదలై, 2006 నవంబరులో అంతర్జాలానికెక్కింది. తెలుగులోనే కాక యావత్‌ దక్షిణ భారతంలోనే వస్తున్న ఏకైక స్త్రీవాద పత్రికగా భూమిక గురించిన పేజీలో రాసారు. కొండవీటి సత్యవతి ఈ పత్రిక సంపాదకురాలు. ఇందులో పనిచేసే వారంతా స్త్రీలే కావడం విశేషం. భూమికలో రచనలు ఎక్కువగా స్త్రీకి సంబంధించినవే. కాల్పనిక రచనలు తక్కువగానూ, వాస్తవ విషయాలకు సంబంధించిన రచనలు ఎక్కువగాను ఉంటాయి. కేవలం రచనలతోటి సరిపెట్టడమే కాకుండా, స్త్రీలకు మాటసాయం చేసే ఉద్దేశ్యంతో భూమిక ఒక హెల్ప్‌లైన్‌ ను కూడా నిర్వహిస్తోంది.

నవతరంగం (www.navatarangam.com)

తెలుగు పత్రికలలో పసి కూన ఇది. పొద్దు లాగానే ఒక వేళాపాళా లేకుండా వచ్చే పత్రిక. సినిమా కోసమే ప్రత్యేకించిన పత్రిక. సినిమా విమర్శకుడిగా పేరొందిన వెంకట్‌ సిద్ధారెడ్డి మరి కొందరు ఔత్సాహికులతో కలిసి స్థాపించిన పత్రిక. నిష్పాక్షిక సినిమా సమీక్షలకు నెలవుగా నవతరంగం పేరు పొందుతోంది. నవతరంగం అనే పేరుతో తమ సైటు కొత్త ఆలోచనలను, కొత్త భావాలను తెస్తుంది అని చెప్పదలచినట్టున్నారు. ఇది వర్డ్‌ప్రెస్‌ సాఫ్టువేరు ఆధారంగా నడిచే పత్రిక. సైటు చాలా త్వరగా లోడవుతుంది. ఇటీవలి వ్యాసాల సంక్షిప్త పరిచయం మొదటి పేజీలో కనిపిస్తాయి. ఫోకస్‌, భారతీయ సినిమా, ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష మొదలైన వర్గాలున్నాయి. ఇవి వర్గాలు.. శీర్షికలు కావు. ఒక్కో వ్యాసమూ ఒకటి కంటే ఎక్కువ వర్గాల్లోకి చేర్చారు. అది సహజమే. కానీ ఆ వర్గాలనే పైనున్న లింకులుగా పెట్టడంతో ఒకే వ్యాసం ఒకటి కంటే ఎక్కువ లింకుల్లో ఉంటోంది.

చాలా వరకూ వెబ్‌ పత్రికలన్నీ సాహిత్యానికి లేదా ఏవో కొన్ని సామాజిక అంశాలకీ పరిమితమైపోయాయి. ఎంతో మంది తెలుగు వాళ్ళు, ప్రపంచం నలుమూలలా ఎన్నో రంగాలలో నిష్ణాతులుగా పని చేస్తున్నారు. ఇప్పుడు, తెలుగులో రాయటం చాలా తేలికైపోయింది. ఉత్సాహం, రాయాలనే పట్టుదలా, ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉంటే చాలు. ఎకనామిక్సు, పొలిటికల్‌ సైన్సు, సైన్సులు, సోషియాలజీ మొదలైన రంగాలలో నైపుణ్యం ఉన్నవారు ఆయా అంశాలలో తెలుగులో రాస్తే బావుటుంది. ఇప్పటికే, కొంతమంది భాషా శాస్త్రం, కంప్యూటర్‌ సైన్సు, టెక్నాలజీ, సైన్సు మొదలైన విషయాలలో, ఉన్నత స్థాయి రచనలు చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండు ఇలాగే కొనసాగితే, తెలుగు అంతర్జాలం, వెబ్‌ పత్రికలు ప్రింటు మాధ్యమాలకి ప్రత్యామ్నాయంగా ఎదగటం ఖాయం.

మరికొన్ని సైట్లు

http://poddu.net/

http://www.rachana.net/

http://scienceintelugu.blogspot.in/

http://www.haasyam.com/—(ఈ న్యూస్‌)

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

ఇది ప్రతి తెలుగువాడి ప్రతిభను ప్రపంచవ్యాపితంచేసే మొట్టమొదటి రికార్డుల సంస్థ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (www.telugubookofrecords.com). ఒక రాష్ట్రానికి, ఒక భాషకు సంబంధించి, తెలుగు ఔన్నత్యాన్ని ఈ సంస్థ ద్వారా ప్రపంచానికి తెలియజేసే తొలిప్రక్రియ. ప్రపంచంలోని నివాస, ప్రవాస ఆంధ్రుల ప్రతిభలను వెలికితీసి వారికొక వేదిక, గుర్తింపును కల్పించడం దీని ముఖ్యోద్ధేశం. ఈ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కి ప్రతి తెలుగువాడు దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ రికార్డులతో గౌరవిస్తూ సముచిత రీతిన సత్కరిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ముఖ్యంగా తెలుగువారి తెలివితేటలను రానున్న తరాలకు తెలియజేసేవిధంగా తెలుగు సంప్రదాయం భారతీయ లలితకళలు, తెలుగు కట్టూబొట్టు, తెలుగుతనానికి సంబంధించిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. దేశ విదేశాలలో వున్న తెలుగువారిని కలుపుకొని ఆయా ప్రాంతాల తెలుగు సమాఖ్యలతో కలిసి ఈ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నడపబడుతుంది. ఏ ప్రాంతంలో జరిగిన రికార్డ్స్‌ కు ఆ ప్రాంతీయంగా వున్న తెలుగు సంస్థల సలహాలు, సహకారంతో సదరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

Source : http://www.prajasakti.com/tecpage/article-413389
Standard
telugu poetry

మాటల మాంత్రికులు

నిండుతనాన్ని నింపుకుని

రంగురంగులను చిమ్మె సభాకార్యక్రమాలలో

ప్రదర్శనకూ ప్రదర్శనకూ మధ్య ఖాళీలను నింపేదెవరు ?

గడ్డకట్టుకున్న మంచుముద్దలను (breaking the Ice) బద్దలు కొట్టేదెవరు ?

భోజనానికి ముందు సూపులా కార్యక్రమంపై ఆకలిని పెంచేదెవరు ?

పూర్తయిన పనికి చప్పట్లను అడిగిమరీ కురిపించేదెవరు ?

గడబిడలనూ, తడబాట్లనూ కనబడకుండా దాచేదెవరు ?

నిజానికి

అన్ని అందమైన రంగురంగు పూవుల కార్యక్రమాలను

దారమై ఒక క్రమంలో పేర్చి, కూర్చి అలంకరించేదెవరు ?

పరుగులు పెడుతూ మనసుల మద్య, మనుషుల మద్య ప్రవహించేదెవరు?

ఎవరు ఇంకెవరు..

మాటల కోటలను, బీటలు వారకుండా నిర్మిస్తూ,

ఆ సౌధాల సౌఖ్యాలను అందజేసేవారు మాంత్రికులు

నిజంగా మాటల మాంత్రికులు.

Standard
ప్రక్రియ

అందమైనది కంద పద్యం

తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు.
…………………………………………………………….

►ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది.

►సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.

►క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్

► లక్షణములు

♫ పాదాలు: 4
☼ కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు

1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.
2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.
2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి.

2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.
పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి.
యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి

ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు.

► కంద పద్యములో ఉండవలసిన గణములు ◄

గ గ = U U
భ = U I I (ఆది గురువు)
జ = I U I (ఆది గురువు)
స = I I U ( అంత్య గురువు )
నల = I I I I

☼ ఏ గ్రహాంతర వాసుల వైజ్ఞానిక సంపదో అందలేదు కదా అనేలా కంప్యూటర్ లో లాగానే ఛందస్సు కూడా ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉన్నది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటున్నాం. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారు.

♦ ♣ ♣ ♣ ♦

కొన్ని ఉదాహరణలు


అడిగెద నని కడువడి జను
నడిగిన దను మగుడ నుడుగ డని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడ బడ
నడుగిడు నడు గిడదు జడిమ నడుగిడు నెడలన్

మొసలికి చిక్కి శ్రీహరి కొఱకై ఆర్తనాదాలు చేయుచున్న గజేంద్రుని రక్షించుటకై వడివడిగా బయలుదేరిన విష్ణువు ననుసరించిన లక్ష్మీదేవి పరిస్థితిని వివరించే పద్యం ఇది. సంగతేమిటో, ఏమయిందో అడుగుదామని అడుగు ముందుకేసి కూడా అడగలేక, తడబడుతున్న అడుగులతో, గుండె దడతో భర్తను అనుసరించింది.

►శ్రీశ్రీగారు మ,న,స అనే మూడక్షరాలతోనే త్యక్షర కందాన్ని రసవత్తరంగా అందించారు.

మనసాని నిసిని సేమా
మనసా మసి మనిసి మనసు మాసిన సీనా
సినిమా నస మాసనమా
సినిమా నిసి సీమ సాని సిరిసిరి మువ్వా!!

సాని, రాత్రి సేమా (ఒకటేనా), మనసు ఒక మసి, మనిషి మనసు మాసిన సీనుతో సమానమా, సినిమా నస మా ఆసనమా, సినిమా,నిసి, సీమ, సాని అని మ,న,స అనేపదాలతో చమత్కారమందించారు. ఇందులో శ్రీ శ్రీగారు మహాకవిగా కంటె సినిమా కవిగా కనిపిస్తారు.

►ఒక అజ్ఞాత కవిగారు సప్తస్వరాలతో కంద పద్యాన్ని చెప్పి రసజ్ఞుల నలరించారు.

మా పని నీ పని గాదా
పాపను మా పాప గారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పని గానిమ్మా!!

► కొన్ని పద్య చమక్కులు చూద్దాం. ఎటువైపునుండి చదివినా ఒకేలా ఉండడమే కాకుండా అర్థభేదంతో ఉండే అనులోమ-విలోమ పద్యాలు. ఈ పద్యాలు మొదటినుండి చివరకు చదివితే ఒక అర్థం. చివరనుండి మొదటి వరకు చదివితే ఇంకో అర్థం వస్తుంది.

దామోదర సామ తనధ
రామా సరసాకర దశరధ హరి రాధా
కామా సదయాతి పరమ
ధామా వర యాదవకుల దారక రాసా!!

ఇప్పుడు క్రింది విధంగా చదివితే ఇంకో అర్థం వస్తుంది.

సారాకర దాల కువద
యారవ మాధామ రపతి యాదస మాకా
ధారా రిహ ధర శదరక
సారస మారా ధన తమసారద మోదా!!

► పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని మొదటి నుండి చివరకు, చివరి నుండి మొదటికి చదివితే ఒకేలా ఉంటాయి. ఇది చూడండి.

ధీర శయనీయ శరధీ
మార విభాను మత మమత మను భావి రమా
సారస వన నవ సరసా
దారద సమతార తార తామస దరదా!!

► ఇక పద్య భ్రమకంలో ఐతే మొత్తం పద్యాన్ని ఎటునుండి చదివినా ఒకేలా ఉంటుంది. చూడండి. (ఈ ప్రక్రియను ఇంగ్లీషులో Palindrome అంటారు)

రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా!!

► పింగళి వెంకట కృష్ణారావు కవిగారు ఒక సభలో తెనాలి రామకృష్ణుడికి వికట కవిత్వమెలా అబ్బిందో క భాషలో ఇలా చమత్కారంగా చెప్పారు.

తే.గీ. కవి కక కట కక కవి కగ కన కను క
దీ కవ కన కలి కడి కకా కళి కక
కజ కన కని కవో కలె కక కని కక
కర కము కన కజూ కచి కన కపు కడె!!

ఈ పద్యంలో క లు తీసివేసి చదివితే ” వికట కవిగ నను దీవన లిడి కాళిక జనని వోలె కనికరమున జూచి నపుడె ” అనే వాక్యం వస్తుంది.

► అల్లంరాజు రంగశాయిగారు మ గుణింతంతో ఓ అందమైన కంద పద్యాన్ని అందించారు.

మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!

చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు. కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.

► మల్కిభరాముడు ఇచ్చిన సమస్యా పూరణం…
ఆకుంటే, ఈకుంటే, మాకుంటే, మీకుంటే అని సమస్య.

ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే హీనుడగును హీనాత్ముండౌ
మీకుంటే మాకియ్యుడు
మాకుంటే మేము రాము మల్కిభరామా…

మాలిక్ ఇబ్రహీం కాస్తా తెలుగు వారి అభిమానంతో మల్కిభరాముడు అయ్యాడని ప్రతీతి.

► పాద భ్రమకంలో ప్రతి పాదాన్ని మొదటి నుండి చివరకు, చివరి నుండి మొదటికి చదివితే ఒకేలా ఉండే మరో పద్యమిది. ఇది శ్రీ విక్రాల శేషాచార్యుల వారి విరచితం శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నాకరము లోనిది.
..
దామోదర రదమోదా
రామా తతరా జయ యజరా తతమారా
రామా జని నిజ మారా
భూమా తతభూ మతతమ భూతత మాభూ.

► తెలుగులో పాదభ్రమక లక్షణమును తన లక్షణ సార సంగ్రహములో చిత్రకవి పెద్దన గారు వర్ణించిన విధానమిది.
..
అనులోమ విలోమంబుగ
ననువొంతగ బాదపాద మతి తిరుగంగా
బెనచుక చెప్పిన గందము
జను బాదభ్రమకమనగా సత్కృతులందన్

► కందం పైన ప్రయోగ రూపమే సినారె గారి “మాకందం”. కంద పద్యంలో 1,3 పాదాలను 2,4 పాదాలపైన కూర్చితే వచ్చేదే “మాకంద పద్యం”.
..
కందమునే మలచితి మా
కందముగా పలికితి ఆ
ఛందమునకు పాతగతులు సమకూరుస్తూ
స్పందమునకు కొత్త శృతులు సంపాదిస్తూ!

► పూర్తి హ్రస్వ అకార (హల్లులపై తలకట్టు)పద్యమొకటి కేశవయ్యగారి దాశరథి చరిత్ర లోనిది.
..
దయగనర ఘన దశరథ తనయ! సనయ!
గగన చర రథ!దశశతకర శశధర
నయన!సతతసరస!నతనగచరచయ!
తత దరహరద!దశ గళదళన!సదయ.

Standard
telugu poetry

దొంగకుక్కలు తిరుగుతున్నవేళ

నిర్లజ్జగా నిస్సిగ్గుతో,సంశయమేం లేకుండా దొంగపిల్లులు మ్యావ్ మనికూడా అనకుండానే
పాలుపంచుకున్న భావాలను తాగేసి ముతితుడుచుకు పోతున్నాయి.

కాకితో కష్టపడిపొదిగించేకొకిల గొప్పదై జనంనెత్తిన కూచుంటోంది.
చల్లగాదోచుకెళ్లి దొరనని దొంగమూతి తుడుచుకునే దొంగకుక్కకు
అంతకన్నా అడుక్కోవటం నయమని చెప్పేవాడులేడు.

నీదికాని మొహాన్ని తగిలించుకోవాలని చూస్తే,ఓనాటికి నీకంటూ చూపేందుకేమీ మిగలదు
వున్నా తుపుక్కున ఊసేందుకే తప్ప 
వెతుక్కుని చూసేందుకెవరూ వాడరు దాన్ని.

కరువుకాలంలో అరువు బుర్రల్నిపాడించాల్సిన రామకీర్తన రికార్డు చేయాల్సిందే
బరువు గా ఈడ్చే బతుకులకి
పరువుగా బతకటం కొంచెం నేర్పించాల్సిందే

పదిచోట్ల ఎత్తుకొచ్చి పరిశోధననుకునేవాడుఆసాంతం ఎత్తిపోతల పథకంపై గుత్తాధిపత్యం ప్రకటిస్తున్నాడు.
నేతిబీర లాంటి నిప్పుకోడి జాతి జీవుడా
వెలలేని నీ తలని దాచుకునేందుకు ఎడారి ఇసుక లేదు సమాధి మన్ను తప్ప

► 05 – FEB – 2013 ◄

Standard
telugu poetry

గుచ్చుకునే చూపులు

వయసులో వుంటే పందికూడా
అందగానే వుందనే ఈ సమాజంలో
వందలో ఒక్కరినయినా వందనీయులను చూడాలి.

చూపులవంకరలను తొలగించే పట్టకం కావాలి.
దృష్టిలో కల్మషాలను కడిగేసే సాధనం కావాలి.
వంకర గీతల్ని సరిచేయలేకుంటే చెరిపేసేందుకో ఎరేజర్ కావాలి.

పిచ్చి చూపుల పైత్యానికో మందుబిళ్ళ కావాలి
చేతల చత్వారాలకు ముందుచూపు నేర్పే ఓ పాఠశాల కావాలి.
నాకో దండం కావాలి. దానికి కొంచెం అండ కావాలి.

మనిషిగా నడుచుకుంటూ వెళ్లేందుకు
చూపులేవీ ఒరుసుకు పోని చోటు కావాలి.
గోడలేవీ అడ్డురాని జాగాలో నాక్కొంచెం ఊపిరాడాలి.

వేడి వేడి మీ ఊర్పులతో ఉడికిపోతున్న వేళ
సేదదీరి నిలుచుందుకో చల్లని నీడ కావాలి.
గాలాలూ, వలలూ తగలని ఓ స్వేచ్చా ప్రయాణం కావాలి.

తోడేసినా, తిట్టుకున్నా పయనం ఆపని మురికికాలువ ప్రవాహానికి
కారకాన్ని కనిపెట్టి నిర్మూలించే ఓ చేతి సాయం కావాలి..
చిత్తకార్తె కుక్కలనడ్డగించే ఓ చట్టం కావాలి.

నాడి ఎప్పుడో తెలిసింది మందువాడే ఓ వైద్యుడు కావాలి.
సోషల్ కాస్ట్రేషన్ చేసేందుకో సాధనం కావాలి.
శవాలలోనైనా చర్మాన్నే చూసే మీడియా కంటికో అద్డం తొడగాలి.

అంగాంగాన్ని అమ్మకపు వస్తువుగా చూపని విపణి కావాలి.
ఆదర్శంగా తలెత్తుకుని చేయగలిగే పని కావాలి.
అందాన్ని ఆరబెట్టటం కాదు, అమ్మపాత్రలో చూపే రంగస్థలం కావాలి.

కనీసం ముక్కుకో కళ్ళకో కట్టుకునేందుకో వడగుడ్డ కావాలి.
లేదా కుళ్లిన బాగాలను తెగనరికే ఆయుధం కావాలి,
కనీసం నా వెన్నెముకనే ఆయుధంగా మలచే నైపుణ్యం కావాలి.

◘ 04-02-2013
https://www.facebook.com/groups/kavisangamam/permalink/511382878914469/

Standard
telugu poetry

వల లోపల

ఛస్…

అంతా డబుల్ గేమ్..

నాతో నేనే, నాకు నేనే.

ఇంతకీ

అక్కడ

ఆడిస్తాందెవడ్రా?

వార్నీ

దీ** జీవితం,

అదీ నేనే.

ఇంతకీ పెపంచకం

పాడయిపోనాదండెవడ్రా.

అదీకూడా నేనేనా ఏంది?

అద్దంలో సూస్కోవాల ఓపాలి.

♦ 01-02-2013

Standard