ఖమ్మంజిల్లా, History

నేలకొండపల్లి ఎంత తవ్వినా తరగని ఒక చారిత్రక గని

ప్రాచీన ఆదిమనవుని అడుగుజాడల నుంచి జైనం ఆనవాళ్ళు, అతిపెద్ద బౌద్ధస్థూపం, కోట్లాది రూపాయిల విలువైన బుద్ధవిగ్రహం బయటపడిన ప్రాంతం ఇదే. త్రిపీఠకాలలో ఒకటైన సుత్తపిటకములోని ఐదుమహా నికాయల్లోని మజ్జమ నికాయాన్ని ప్రతిబింబించే ప్రాచీన ప్రాకృతపదాన్ని గుండెల్లో పొదువుకున్న మజ్జిగూడెం వున్నదీ ఇక్కడే. నాసిక్ శాసనం ద్వారా గౌతమీపుత్రశాతకర్ణి ఆధీనంలో వున్న రాజ్యాలలో అస్మకకు చెందిన రాజ్యాభాగాల్లో ఇదొకటి. ఇదే. దక్షిణాపథపతి అనిపిలువబడ్డ ఇక్షాకుడు శాంతమూలుని పాలనలో క్రీస్తుశకం ప్రారంభదశల్లో వున్న ప్రాంతాల్లో ఒకటి. క్రీశ 591 ప్రాంతంలో మహదేవ వర్మ ఖమ్మం దుర్గాన్ని ఏలుతున్న కాలాన్ని పొదువుకుంది. 950 ల నాటికి ఖమ్మం కోటకు తమ గుప్తధనాన్ని వెచ్చించిన ముగ్గురు రెడ్డి సోదరులు(రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెల్మారెడ్డి) పాలనాదశలను చూసింది. ముదిగొండ చాళుక్యుల్లో రణమర్ధనుడి కుమారుడు మొదటి కుసుమాయుధుడి రాజకీయ కార్యకలాపాలను ప్రస్తావించిన బెజవాడ తామ్రపత్రశాసనంలో ప్రస్తవించబడిన ప్రాంతం. వేంగిదేశ సరిహద్దుప్రాంతంగా కొన్నాళ్ళు కొరవి కొండపల్లి వున్నట్లు పేర్కొన్నారు.

విదేశీయుల దృష్టిని సైతం అత్యంతంగా ఆకర్షించిన ప్రాంతం అప్పుడెప్పుడో మరీ ఒకటవ శతాబ్దం కాలంలోనే ptolemy (టోలమీ) రాసిన Ancient India లో పేర్కొన్న ‘‘Nelkynda ’’ గా తన వ్యాపార కార్యకలాపాలను మసలీపట్నం వరకూ నిర్వహించుకున్నప్రాంతం. ఏడవశతాబ్దంలో హర్షవర్ధనుడి కాలంలో చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ తన పర్యటన డైరీలో ప్రస్తావించిన ప్రాంతం. 12 వ శతాబ్దంలో ప్రఖ్యాత ఇటలీ యాత్రికుడు మర్కోపోలో చూసుకుంటూ వెళ్ళిన ప్రాంతం.

చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరాలయం , భీమేశ్వరాలయం , వేణుగోపాలస్వామి మరియు ఉత్తరేశ్వర ఆలయములను ఇప్పటికీ తన గుండెల్లో పొదవుకునే వున్న ప్రాంతం. భక్తరామదాసును కన్నతల్లిగా భద్రాద్రిరాముడి ముందు మోకరిల్లిన ప్రాంతం. ఇప్పుడంటే ఒక చిన్న ఆవాసంగా ఖమ్మంనుంచి కోదాడ వెళుతున్న రహదారిలో ఒకానొక పల్లెటూరుగా మాత్రమే ఉండొచ్చుగాక. ఇంత చరిత్రా కాలగర్భంలో మాయమై పోతుందా? లేదు ఒక్కోకాలానికీ సంభందించిన గుప్పెడు ఆధారాలను జాగ్రత్తగా తన దేహపైనే జ్ఞాపకంబొట్లుగా నిలుపుకోనే వుంచింది. వెతుక్కునే మనసూ తీరికా మనకే వుండాలి కానీ.

సరే ఇప్పటికే దొరకిన అపార సంపదగురించి రాస్తే అదే పెద్ద పుస్తకం అవుతంది కానీ ఈమధ్య గమనించిన మరికొన్ని ఆధారాలను మీముందుంచుతాను. రామదాసు ధ్యానమందిరాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, గోపన్న సాహిత్యాన్ని వ్యయప్రయాలకోర్చి సేకరిస్తున్న విశ్రాంత అద్యాపకులు శ్రీయుతులు సాధురాధాకృష్ణమూర్తిగారు కాల్వొడ్డున ఒక శాసనం ఉన్నట్లుంది చూసిపోదురురమ్మని హరగోపాల్ గారినీ, నన్నూ పిలిచారు. 29నాటి తానా కార్యక్రమం ముగించుకుని హరగోపాల్ సార్ తిరుగుప్రయాణంలో వుండటంతో నేనొక్కడినే శాసనాన్ని చూద్దామని వారితో వెళ్ళాను. తీరాచూస్తే అక్కడ ఆ పాత కాల్వ ఒడ్డున, పందుల పెంపకం నడుస్తూ గందరగోళంగా వున్న ప్రదేశంలో శాసన స్థుపంతో పాటు ఆశ్చర్యపోయేంత అపార చారిత్రక ఆధారాలు నిరాధరణలో పడిపోయివున్నాయి. నల్లశానపురాయితో నిర్మించిన అమ్మవార్లవిగ్రహాలు తలలు తెగగొట్టబడివున్నవి. వేర్వేరు వీరగల్లులు అడ్డదిడ్డంగా పడేసివున్నాయి. శాసన స్థంభానికి పందులు వీపుగోక్కునేందుకు వాడుకుంటున్నాయి. చాలా కాలం క్రితం కవి బావ పోతగాని సత్యనారాయణ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి నువ్వెలాగైనా ఒకసారి వచ్చి చూడొచ్చుకదా అని అడిగారు కానీ పూర్వపు విజిట్స్ లో ప్రదేశాన్ని సరిగ్గా లొకేట్ చేయలేకపోయాను. నడుంనొప్పికోసమని పెట్టిన సెలవెటుపోయిందో కానీ ఒకపూటంతా గడిపినా నొప్పేమీ తెలీలేదు, సమయమూ సరిపోలేదనిపించింది. ఇంకా చెరువులోపట బురదమధ్యలో తూటికాడల పేరుకుని పున్న చోట్లలో కొన్ని ఇలాంటి బ్లాక్ గ్రానైట్ బండలూ, శిలలూ వున్నాయంట ఒకదానిలో అక్షరాలున్నట్లున్నాయి అని స్థానికులు చెప్పారు. కానీ సాయంత్రం వేళ వెళ్లేలా లేదు. మరికొంచెం నీళ్ళు తగ్గితే సులభం అవుతుంది అన్నారు. ఈ శాసనాన్ని మట్టిల్లోంచి బయటికి జాగ్రత్తగా పెల్లగిస్తూ శుభ్రంగా కడిగించి దానిని వైట్ ఫౌడర్ ఫోటోలుగా తీసుకున్నాను.ఇంతకు ముందే ప్రచురించిన శాసనాల్లో వుంటుందేమో నని తెలంగాణ శాసనాలు ఒకటి రెండు సంపుటాలను, ICHR ప్రచురించిన కాకతీయ శాసనాలు (SS రామచంద్రమూర్తిగారు) లో మాత్రం వెతికి చూసాను. మొదటి దాన్లో నేలకొండపల్లివి రెండు శాసనాలు వున్నాయి కానీ ఇది లేదు. రెండవదానిలో నేలకొండపల్లి శాసనాలేవీ చేర్చబడిలేవు. మరికొంత సరిచూడాలి కానీ అప్పటివరకూ ఏం రాసివుందోనన్న ఆతృత ఆగదు కాబట్టి వాటిని అచ్చుగా తీసుకున్నాను. కాకతీయుల పాలన నాటివని అయితే స్పష్టంగా తెలిసింది. కొండపల్లిఅంటూ ఊరిపేరు ప్రస్తావించబడింది. మరికొంచెం పరిశీలనగా చూసేందుకు సీనియర్ల సహకారాన్నీ కూడా తీసుకోవాలి. ఆ ఫోటలను ఇక్కడ జతచేస్తున్నాను ఒకసారి పరిశీలించండి. నేలకొండపల్ల వాస్తవ్యులు సహకరిస్తే త్వరలోనే ఈ శాసన స్థంబాన్ని రామదాసు ధ్యానమందిరం ఆవరణలోకి చేర్చాలి. ఈ విగ్రహాలను సైతం సరైన పద్దతిలో బౌధ్దస్థూపం ఆవరణలో ఒక గది కేటాయించి అమర్చగలిగితే ఇదే ఒక చారిత్రకమ్యూజియంలా వుంటుంది. వీటికి తోడు మరెన్నో ఆధారాలనూ, వాటి రెప్లికాలనూ సైతం నేలకొండపల్లి బౌద్ధస్థూపం ఆవరణలో ఏర్పాటుచేసే మ్యూజియంలో వుంచవచ్చు. స్థూపం సందర్శనకోసం వచ్చేవారికి ఏదో చూసాం వెళ్ళాం అన్నట్లు కాక నేలకొండపల్లి చారిత్రక నేపద్యాన్ని కాలానుగుణంగా అర్ధంచేసుకునే అవకాశం వస్తుంది. చూడాలి చరిత్ర గురించి నిజంగా ఆమాత్రం పట్టించుకునే శ్రద్ద ఈ నూతన సంవత్సరానికైనా వుంటుందా లేదా అన్నది.

మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో
మీ కట్టా శ్రీనివాస్.

ఫోటోలను ఈ లింకు నుంచి చూడొచ్చు

from Blogger http://bit.ly/2iOU4rj
via IFTTT

Standard
ఖమ్మంజిల్లా, History

కొత్తగూడెం జిల్లాలోని కారుకొండ బుద్ద గుహలయాలు

తెలంగాణలో బౌద్ధం ఆనవాళ్లు, కొత్తగూడెం జిల్లాలో గుహాలయం జాడలు
కారుకొండ ధ్యానబుద్ధ శిల్పం ఈశాన్య దిశలోని చిత్రం
ఖమ్మంజిల్లా నేలకొండపల్లిలో బౌద్ధస్థూపం వుంది,పైగా ఇది చాలా పెద్దది కూడా, బౌద్ధం ఈ ప్రాంతంలో ఒక వెలుగు వెలిగింది అనడానికి గొప్పఆధారం. మరి అక్కడొక్కచోటనే వుండి చుట్టుపక్కల లేదా మనకు ఆధారాలు దొరకటం లేదా అని చూస్తే తుడిచిపెట్టబడిన ఆధారాలు ఫినిక్స్ లా అదే చారిత్రక బూదిలోంచి రెక్కలు విప్పార్చుకుంటూ బయటకు వస్తున్నాయి. మొన్నీమద్య నాగులవంచ దగ్గర రామసముద్రంలో దొరికిన నాలుగు పాలరాతి బుద్దప్రతిమలు, ధమ్మ పదానికి గుర్తుగా నిలచిన ధమ్మపేటలోని నాగుపల్లిలో దొరికిన బుద్ధ విగ్రహాలూ ఇదే విషయాని రూఢి పరుస్తున్నాయి. 

http://bit.ly/2gZywu5

తెలంగాణలో భౌద్ధం

బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రస్థానాన్ని పొందినవాడు. ఆరాధనీయుడు. అటువంటి బుద్ధుని ధర్మప్రభోదాలు జీవన మార్గదర్శకాలుగా దేశ విదేశాల్లో విస్త్రుతంగా వ్యాపించాయి. జనులకు నైతిక జీవనాన్ని ధర్మాచరణను ప్రభోధించటంలో ప్రముఖ పాత్రవహించింది బౌద్ధం. నియమబద్దమైన వ్యాప్తికోసం గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని పరిఢవిల్లజేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తను పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956నుంచి మరోకసారి పునర్వికాస దశ పొందింది.
బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యమైనప్పటికీ, ఆ ఆధారాలను మిగుల్చుకోవడంలో వెతుక్కోవడంలో తగినంత శ్రద్ధ ఇప్పటివరకూ చూపలేదనేది ఒప్పుకోవలసిన నిజం. 
ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ- నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- నేలకొండపల్లి, అశ్వారావుపేట(?), కాపవరం. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. ఇటువంటి కొండలున్నా గుహా విహారాలు ఆధారాలను దొరకలేదు. కానీ కొత్తగూడెంలో వున్న ఈ భౌద్ధ ఆనవాలు గుహాలయమనేందుకు సరిపోయేలా వుంది. దీనివివరాలను చూద్దాం. 
ఎక్కడుంది ఈ భౌద్ద గుహాలయం?
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళ్ళే బైపాస్ రహదారిలో 5 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడినుంచి కేవలం ఒక్కకిలోమీటరు ఎడమపక్కగా వున్న కచ్చా రోడ్ లో వెళితే క్వారీగా తొలుచుకుంటూ వచ్చిన కారుకొండ పర్వతం కనిపిస్తుంది. దానికి పడమటి దిక్కున కారుకొండ చెరువు కనిపిస్తుంది. కొండను బలమైన రాళ్ళుదొరుకుతున్నాయని చుట్టూతా పండుని కొరుక్కుంటూ వచ్చినట్లు తొలుచుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతానికి కూడా ముప్పు పొంచి వున్నప్పుడు, స్థానికుల నిరసన వెల్లువెత్తింది. తమ ఆరాధ్య దైవం సడాలమ్మ గుడిని, ఆనాదిగా వస్తున్న బుద్దుని రాతిగుండు, దెబోగా గుహలను కూల్చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ కొంచెం ప్రాంతం వరకూ క్వారీ పనులు నిలిపివేసారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుహల అభివృద్దికి స్వల్పంగా నిధులు కేటాయించడంతో వాటికి రక్షణగా చుట్టూతా ఇనుపవల వేసారు. రక్షిత కట్టడంగా ప్రకటిస్తూ ఆర్కియాలజీ వారు బోర్డును కూడా ఏర్పాటు చేసారు. 

ఏమున్నాయక్కడ ?
చతుర్ధిశ బుద్ధప్రతిమలతో ఏకశిలా నిర్మిత గోళాకార గుహదేవళం
కారుకొండ గుట్టకు పడమట దిక్కున ఈశాన్య దిశగా పది అడుగుల పైబడిన ఎత్తులో పాతిక అడుగుల పైగా చుట్టుకొలత వున్న ఇసుకరాతిగుండు ఒకటుంది. దానికి నాలుగు దిశల్లోనూ ధ్యానముద్రలో వున్న రూపం వుంది. రాతి గుండులో నాలుగు ముఖాలుగా ఎంచిన దిశల్లో అడుగులోతు గుంటలుగా తొలిచి దానిలోపట ఈ రూపాన్ని మలచారు. బహుదళ పద్మాన్ని ఆసనంగా తీసుకుని ధ్యానస్థితిలో నిర్మలంగా కూర్చుని వున్న ఒకేరకమైన రూపాలు నాలుగువైపులా వున్నాయి. మూర్తి కుడిభుజం వైపున్న దిశలో దీపం వెలిగించే గూడును ఏర్పాటు చేసారు. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాలకు అత్యంత పురాతనమైన సహజరంగులను వేసారన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మహాయాన బౌద్ధానికి చెందిన శిల్పాలయివుండొచ్చనిపిస్తున్నాయి. 

Borobudur_ Buddha Statue
Dhyana Mudra, Amitabha is similar to
karukonda buddha silpam

ధ్యానముద్రలో ఎడమ చేతిపై కుడిచేయి
ఎడమ కాలుపై కుడికాలు వేసి వుండటాన్ని గమనించవచ్చు
ధ్యానభంగిమ ప్రత్యేకతలు : భౌద్ధ ప్రతిమాశాస్త్రాన్ని (Buddhist iconography) పరిశీలిస్తే ప్రతిభంగిమకూ ప్రత్యేకమైన అర్ధం వుంది. నిలబడే, కూర్చునే భంగిమలకే కాక చేతివేళ్ళను వుంచే విధానికి కూడా దీనిలో ప్రత్యేకమైన వివరణలు వున్నాయి. ధ్యాన స్థితిలో వున్న బుద్దుడి విగ్రహాల్లో ఎక్కువగా భూస్పర్శాముద్ర కనిపిస్తూ వుంటుంది కానీ ఇక్కడి విగ్రహలలో మాత్రం ధ్యాన సమహిత ముద్ర కనిపిస్తుంది. ఒడిలోకి చేర్చుకున్న ఎడమ చేతిని వెల్లకిలాతిప్పివుంచి దానిపై కుడిచేతిని వెల్లకిలా తిప్పిసున్నితంగా ఆనించివుంచిన ముద్రలో గమనించ వచ్చు. ధ్యానసమాధిస్థితికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ముడుచుకున్న కాళ్ళుకూడా పద్మాసన స్థితిలో కాక ఎడమముంగాలిపై కుడముంగాలు చేర్చిన స్థితిలో వున్నది. తిన్నగా వుంచిన వెన్నెముక, పైకెత్తిన తల, ప్రశాంతమైన ముఖం నిటారైన మెడతో తలెత్తికనిపిస్తోంది. ఇటువంటి ఆసన స్థితి ప్రశాంత ధ్యానానికి అత్యంత అనుకూలమైనదిగా చెపుతారు. రావిచెట్టుక్రింద జ్ఞానోదయం అయినప్పుడు సైతం బుద్ధుడు అవలంభించిన ధ్యానపద్దతి ఇదే స్థితిలోనే అని యోగసాధకులు చెపుతారు. ఇటువంటి స్థితి జ్ఞానేంద్రయాలపై వత్తిడిపడకుండా శరీరాన్ని సమస్థితిలో వుంచేందుకు దోహదం చేస్తుంది. చైనాలో చియాంగ్ సేన్ పిరియడ్ లో తయారుచేయించిన బుద్ధప్రతిమలు బ్యాంకాక్ దగ్గర వాట్ బెంచంభోఫిట్ ప్రాంతలో ఇదే ఆసనస్థితిలో వుండటాన్ని గమనించవచ్చు. భారతదేశంలో సైతం అనేక చోట్ల ఇదే రకమైన ధ్యానస్థితిలో వున్న బుద్దప్రతిమలున్నాయి. ఒడిలో భిక్షాపాత్రనుంచుకున్న విగ్రహాలుసైతం భిక్షాపాత్రమినహా మిగిలిన రూపమంతా ఇలానే వుంటుంద. 
కొంత పొడవుగా సాగిన చెవులు, ఉంగరాలు తిరిగిన జుట్టు, బుద్దుని భారతీయ రూపానికి అచ్చమైన ప్రతీకలుగా వున్నాయి. మెడలో ఏదో కంఠాభరణం ఆనవాలు అస్పష్టంగా కనిపిస్తోంది. ఎడమభుజం వైపుకు వేసిన వస్త్రపుజాడలు కనిపిస్తున్నాయి. అయితే ఇసుకరాయికావడం వల్ల అనేక శతాబ్దాల కోరివేతతో నష్టపోయిన భాగం కొంత అయితే ప్రధానమైన రూపాన్ని మాత్రం ప్రత్యేకకారణాలతో మనుషసంభంధమైన ధ్వంసీకరణ జరిగివుండొచ్చన్నట్లే కనిపిస్తున్నాయివి. బుద్ధ విగ్రహం వున్న తొలచిన గూడుకు తోరణం మాదిరిగా ప్రత్యేకంగా గాడులను కొట్టి అలంకరించారు. అంతేకాకుండా గూడుకు అడుగు క్రిందనుంచి చుట్టూతా తిరిగొచ్చేలా రెండంగుళాల లోతుతో ఒకగాడిని కొట్టారు. రాతిగుండుకు పై భాగంలో ఖచ్చితంగా మధ్య భాగంలో అడుగు లేదా పద్నాలుగు అంగుళాల భుజం కొలతతో ఒక చతురస్రాకారపు గాడి, దానికి మధ్యభాగంలో మరికొంత లోతుగా వృత్తాకారపు గాడి కనిపిస్తున్నాయి. ఎత్తుగావున్న ఈ భాగంలో రాత్రిపూట దీపం వెలిగించే వారో లేదా. ధ్యానసాధనలో భాగంగా గుడ్రని ఆకారంలో వున్న ఈ రాతిని మొత్తంగా భుద్దుని శిరస్సుగా భావిస్తే ఆ మధ్యలో వున్న భాగాన్ని సహస్రారంగా పరిగణించేవారో, లేక ధాతుగర్భంగా మలచేందుకు ఇదేమైనా సూచనవుతుందో ఇతిమిధ్దంగా ఇప్పటికి దొరికిన ఆధారాలతో తేల్చలేము. ఈశాన్య దిశవైపు చూస్తున్న బుద్ధప్రతిమకు ముందువైపున వున్న రాతిబండకుమధ్యలో ఒక చెట్టుమొలవడం వల్ల నిలవుగా చీలి ఆ వైపు ఒక ప్రత్యేక ద్వారతోరణంటా కనిపిస్తోంది. ఆ మొక్క మొదలు ఇంకా పచ్చిగానే వుంది మళ్లీ మొలకెత్తితే అది ఈ బండలను మరింత చీల్చివేసే ప్రమాదంలేకపోలేదు. గొడ్డలితో నరకటం, పలుగుతో పొడిచిమొదలు తీయటం కంటే యాసిడ్ లాంటి రసాయనాలను వాడి చెట్టుని తొలగిస్తే రాతిగుండుకు నష్టం కలకుండా వాటిని తీసేయడం సాధ్యం అవుతుంది.

బుద్దుడేనా  లేక జైన పార్శనాధుడా?
బహుదళ పద్మాన్ని ఆసనంగా, నాగపడగలను ఛత్రంగా వేసుకుని అచ్చంగా ఇటువంటి ధ్యానముద్రలో కంఠాభరణంతో సహాకనిపించే వారిలో జైనానికి సంభందించి పార్శనాధుడు పోలికలున్నాయి. జైనబసదుల్లోనూ ఇటువంటి పూజలు జరిగేవిధానం వుంది. అయితే జైనంలో దిగంబరత్వం వుంటుంది. బౌద్ధంలో వస్త్రధారణ కనిపిస్తుంది కానీ ఈ బొమ్మలలో వస్త్రదారణ వున్నది లేనిదీ స్పష్టంగా తెలియటం లేదు. 
దెబోగా [Dagobah] గుహలు :
రాతిగుండు నుంచి మరికొంత పడమటి దిశగా వెళ్ళి చూస్తే గుట్టపై కొంచెం ఎత్తులో ఈ రెండు గుహలూ కనిపిస్తాయి. దెబోగా గుహలు అంటే అదృశ్యశక్తులున్న మాంత్రికగుహలని నిజానికి అర్ధం స్టార్ వార్స్ సినిమాలో కూడా మాంత్రిక గుహలకు ఈ పేరే వాడటంతో ప్రాచుర్యంలోకి వచ్చిందీపేరు. ఇసుకరాతికొండలో తొలచిన ఈ గుహల్లో ఒకదానిపై 1986 లో గుట్టమీదనుంచి ఒక పెద్దరాయి దొర్లుకుంటూ వచ్చిపడటంతో ఒక గుహ పాక్షికంగా ధ్వంసం అయ్యింది. 
ఎనిమిదడుగుల ఎత్తుతో పన్నెండడుగుల వెడల్పు ఆరడుగుల వెడల్పుతో గుహలు చక్కటి గదిలా వున్నాయి. ఆరడుగుల ఎత్తులో మూడున్నర అడుగుల వెడల్పున్న రాతి ద్వారాలున్నాయి. ద్వారాలు మూసేందుకు కూడా ఏదో ఇరుసులు లాంటివి తిప్పారనేందుకు గుర్తుగా రెండు పెద్ద గుంటలవంటివి కూడా వున్నాయి. ద్వారాలకు ఎదురుగా ప్రధాన విగ్రహరూపాలు ధ్వంసం తర్వాత కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే రూపం పోల్చుకునేలా తెలుస్తున్నాయి. వైష్టవ సంప్రదాయంలా కనిపిస్తున్న విగ్రహాలలో మధ్యలో పురుషదేవుడు ఆయనకు రెండువైపులా దేవేరుల విగ్రహాల్లాగా వున్నాయి. ఆభరాలు దండిగా వేయబడివున్నాయి. పైగా కుడిఎడమల వున్న గోడల్లో ద్వారపాలక విగ్రహాల్లాగా రెండు నిలువెత్తు విగ్రహాలున్నాయి. కానీ అవి తర్జని చూపిస్తూ ద్వారపాలన చేస్తున్నట్లుగా కాక ముకుళిత హస్తాలతో భక్తభంగిమలో కనిపిస్తున్నాయి. ఎక్కువగా జనసంచారమేమీ లేకపోవడం వల్ల పురుగులూ, పాములూ దీన్ని ఆవాసంగా చేసుకున్నట్లున్నాయి. నేను సందర్శనకు వెళ్ళినప్పడు విడియో తీస్తుండగా ఒక సన్నని పొడవాటి పాము కాప్ మీదనుంచి చేతిమీదకు జారి ప్రాణభయంతో హడావిడిగా పక్కనే వున్న పొదల్లోకి పారిపోయింది. ఆ తర్వత చూస్తే అంతే మందం వున్న పాము కుబుసాన్ని కూడా ఆ గుహలో గమనించాను. రెండవ గుహలో కూడా దాదాపు అదేవిధమైన స్ట్రక్చర్ కనిపిస్తోంది. అక్కడక్కడ పురాతన సహజరంగుల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. 
కొత్తగూడెం మండలంలోని కారుకొండ రామవరంలో దెగోబా గుహాల ప్రాంతంలో బంగారు నాణేలు దొరికాయని ఆర్కియాలజీ సైటులో పేర్కొన్నారు. 40 బంగారు నాణేల నిధి పగిలిపోయిన కాంశ్యపేటికలో దొరకాయట. ప్రాధమిక పరిశీలనలో ఇవి విజయనగర కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ మొత్తం నాణేలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1వ రకం శ్రీకృష్ణదేవరాయల కాలం(1530-1542) కాలం నాటివి రెండవ రకం తుళువ వంశానికే చెందిన అచ్యుతరాయని కాలం(1530-1542) కు చెందినవి. ఒక్కక్క నాణెం బరువు కనీసం 1650 మిల్లీ గ్రాముల నుంచి గరిష్ణంగా 3380 మిల్లీ గ్రాముల వరకూ వున్నాయి. అన్ని నాణేలు దాదాపు గుండ్రని ఆకారంలో వున్నాయి. మొత్తం నాణేల బరువు 117.840 గ్రాములుగా వుంది.   1994-1995 సంవత్సరం కాలంలోనే కాలచక్ర పేరుతో వీటిని విజయవాడ బౌద్ధశ్రీ ప్రదర్శనశాలకు తరలించారు నేలకొండపల్లిలో దొరికిన కోట్లాది రూపాయిల విలువచేసే బుద్దవిగ్రహంతో పాటు ఇవికూడా. ఇప్పటికి అక్కడే ఉన్నాయి. ఆ నాణేలు విజయనగర కాలం నాటివని వాటిపైనున్న లిపి మరియు సంకేతాల ఆధారంగా నిర్దారించారు. అంటే విజయనగర రాజ్యపు కాలంలో ఇక్కడ విరివిగా పూజాదికాలు జరిగేయని భావించవచ్చు. బహుశా ముడుపులుగా వేసినవో లేదా ఏదైనా నిర్మాణం కోసం వాడిన నాణేలో భూగర్భంలో కలిసి ఇప్పటికి దొరికివుంటాయి. విగ్రహాలు శిధిలమైన విధానం చూస్తే కేవలం వాతావరణ కోరివేత వల్లమాత్రమే అవిధ్వసం అయినట్లనిపించదు. ప్రత్యేకంగా శత్రుమూకల దాడిలో ధ్వంసం అయినట్లు సులభంగా అర్దం అవుతుంది. 
శిల్పం మధ్యలో ఇరుక్కున కుబుసాన్ని కూడా చూడండి
ప్రస్తుతం నిరుపయోగంగా వున్న పాఠశాల భవనం ఇదే

శ్రీకృష్ణ దేవరాయల కాలానికి చెందిన నాణేలు బాలకృష్ణ భగవానునికి సంభందించినవి, బొమ్మవున్న వైపు బాలకృష్ణుడు కూర్చుని వున్న భంగిమ కనిపిస్తుంది. ఎడమకాలుని పూర్తిగా వంచి కింద కూర్చుని వుంటాడు. కుడికాలను మాత్రం కొంతవంచి ఎడమకాలుకి క్రింద పెట్టడం గమనించవచ్చు. కుడి చేతిలో వెన్నముద్దను పెట్టుకుని ఎడమ చేతిని ఎడమ మోకాలుకు ఆనించి వుంచిన భంగిమను గమనించవచ్చు. నారాయణావతారం అనిచెపుతున్నట్లు శంఖ చక్రాలను ఎడమ కుడి పక్కలలో గమనించవచ్చు.
ఇక బొరుసు వైపు శ్రీ ప్ర తా ప కృ ష్ణ రా య అనే అక్షరాలను గమనించ వచ్చు. 

రెండవరకమైన బంగారు నాణేలు రెండుతలల గంఢభేరుండ పక్షి రకానికి చెందినవి. బొమ్మ వైపు దీనిలో రెండుతలల గంఢభేరుండ పక్షి
పైపైకి ఎగురుతున్నట్లుగా చిత్రించి వుంది. ఇవి కూడా గుండ్రని నాణేలే, గంఢభేరుండ పక్షికి రెండు వైపులా ఒక్కో ఏనుగును చిత్రించారు.
పక్షి తన తోకను కాళ్ళను క్రిందవైపున ఆనించి వుంచింది. రెండు మెడలనూ కలుపుతున్న దగ్గర ఒక కంఠాభరణం వంటి నిర్మాణం వుంది.
బొరుసు వైపు గమనిస్తే శ్రీ ప్ర తా పా చ్యు త రా య అనే అక్షరాలున్నాయి. 

గుట్టకు వేరే దిక్కుల్లో ఆధారాలుండేవా?
కారుకొండ గుట్టకు పటమటి దిక్కు పల్లంగా వుంది ఆ వైపునే కారుకొండ చెరువు కూడా వుంది. అప్పట్లో ఏ బౌద్ధ ఆరామాన్ని లేదా చైత్యాన్ని గమనించినా నీటివసతిని ఆదరవుగా చేసుకునే వాటిని ఏర్పాటు చేసినట్లు గమనించవచ్చు. అదే విధంగా ఈ నిటివసతిని ఆధారంగా చేసుకున్నారని భావిస్తే. ఇక్కడ నివసించే వారి అవసరాలకు తటాకం వినియోగపడేదని భావించవచ్చు. పైగా చెరువునుంచి ఉదయం పూట తూర్పు దిశగా తిరిగి సూర్యనమస్కారం వంటివి చేస్తే అదే దిశలో ఈ బుద్ద శిలాగోళం కూడా కనిపిస్తూ వుంటుంది. అంతమాత్రాన మిగిలిన దిశల్లో ఎటువంటి ఆధారాలు ఉండవు అనుకునేందుకు ఏమీ లేదు. బౌద్ధారామాలు విలసిల్లిన చోట పెద్దపెద్ద నగరాలవంటి నిర్మాణాలే వుండేవి. భూగర్భంలో మరింకేమైనా చారిత్రకఆధారాలు దాగున్నాయేమో మరింత లోతుగా గమనించాల్సిన అవసరం కూడా వుంది.
కారకొండ చెరువు ఇదే
కారుకొండ తటాకం నుంచి కనిపిస్తున్న గుట్ట
సీతమ్మ పాదాలు
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళుతున్న బైపాస్ రోడ్ లోనే కారుకొండ గుట్టకు ఉత్తరదిక్కున రోడ్డుమీద సీతమ్మ పాదాల పేరుతో రాతిమీదున్న ముద్రలను పూజిస్తున్నారు. పెద్ద రాతిమీద వస్తువులను అరగదీయటం వల్ల ఏర్పడిన నున్నటి గుంటలు మూడు వున్నాయి. వాటి పక్కనే నునుపు దేలిన పొత్రంవంటి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. రాతిపనిముట్లకాలంలో ఆదిమానవుడు ఉపయోగించిన పనిముట్లమాదిరిగా ఇవికనిపిస్తున్నాయి. ఈ క్యుప్యూల్స్ గురించి మరికొంత లోతుగా అద్యయనం చేయవలసివుంది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎప్పటినుంచో జీవరాశివుండేదని ఆదిమానవులు ఈ ప్రాంతమంతా తిరుగాడారని ఇప్పటికే అనేక నిర్ధిష్టఆధారాలతో నిరూపించబడింది. మన రైల్వే మార్గమంతా సిస్టులు, కైరెన్లు అనబడే రాక్షసగుళ్ళమీదుగానే వెళ్ళిందని ప్రఖ్యాత చరిత్ర కారులు ఆదిరాజువీరభద్రరావుగారు పలుమార్లు పేర్కొన్నారు. అటువంటి ఆదిమానవుల ఆవాసాలకు జంతువులనుంచి ఎండావానలనుంచి రక్షించుకునేందుకు ఇలా చక్కటి కొండ పక్కనే వాగు వుండటం ఎంతైనా ఉపయోగకరమైన అనువైన ఆవాసం అవుతుంది. సహజంగా జైనం కానీ ఆ తర్వాతి బౌద్ధం కానీ ప్రాధమిక ఆవాసాలను ఆధారంగా ఆలంబనగా చేసుకునే వారివారి బసదులను పునర్నించారు. వాటిని ధ్వంసం చేస్తూ ఆ తదనంతర కట్టడాలు ఏర్పడ్డాయని చరిత్ర చెపుతున్న నిజం. 

సీతమ్మ పాదాలుగా పిలువబడుతున్న ప్రాంతం 
ఆదిమానవుల ఆవాసంగా ప్రతీకాత్మక చిత్రం

హేమచంద్రాపురం

కారుకొండ గుట్ట వున్న ప్రాంతం హేమచంద్రాపురం అనిపిలుస్తున్నారు. ఈ పేరురావడం వెనక వున్న కథను స్థానికులు చెప్పినదాని ప్రకారం. గతంలో ఈ ప్రాంతపై జమిందారుగా అధికారాలను స్వంతంగా 700 ఎకరాలను కలిగివున్న కొండపల్లి గోపాలరావుగారి అబ్బాయిపేరు హేమచంద్రరావు, ఆ హేమచంద్రరావుగారి పేరుమీదుగా ఏర్పడినదే హేమచంద్రాపురమట. అట్లాగే కారుకొండ గుట్టకు దక్షిణం వైపున వున్న జుబ్లీపురానిది మరో చిత్రమైన కథ స్థానిక CSI చర్చి జుబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా బిషప్ హజరయ్యగారిచ్చిన స్థలంలో ఏర్పాటయిన వాడకట్టుకు జుబ్లిపురంగా నామకరణం చేసారట. ఈ వివరాలను జూబ్లిపురం గ్రామస్థుడు శ్రీ కనక సుందరం తెలియజేసారు. ఈయన కొన్నాళ్ళు సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యారట. మొదట్లో ఎక్కువ కుటుంబాలుండేవి వారికోసం ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేసారు అయితే కాలక్రమంలో రోడ్డుకు దగ్గరగా వుండటం కోసం వారి ఇండ్లను హేమచంద్రాపురం వైపుకు మార్చడంతో జూబ్లిపురం జనాభా దానితోపాటే బడికొచ్చే పిల్లలు ఎవరూ లేకపోవడంతో బడి భవనాలు పూర్తిగా శిధిలాలుగా వదిలేసారు. నిజానికి వాటిని కారుకొండ గుహాలయాల విశిష్టతను తెలియజేసే మ్యూజియం వనరుగా అదేసమయంలో తాత్కాలిక వసతిగృహంగా కూడా వినియోగించుకునే ఏర్పాట్లు చేయవచ్చు. దానివల్ల అంత ఖర్చుతో నిర్మించిన భవనాలు వృధాగా శిధిలమైపోవడం కాకుండా సరైన పనికి ఉపయోగపడ్డట్లవుతుంది. అన్నట్ల ఈ భవనానికి నీటి వసతి, విద్యుత్తు కూడా అందుబాటులో వున్నాయి. 
గ్రామదేవతగా సడాలమ్మ పూజలందుకునేది ఇక్కడే
గిరిజనుల కొలుపులు ప్రతీకాత్మక చిత్రం

సడాలమ్మ దేవత

ఏదో రాయితెచ్చి పసుపుకుంకుం బొట్లు పెట్టి దణ్ణం పెట్టేస్తున్నారు పైగా కనీసం ఆకారం అందంగానైనా చెక్కిలేదు. తొచినదేదో చేస్తున్నారు గ్రామస్థులు అనుకుంటూ చాలా మంది సులభంగా ఈ గ్రామదేవతను తీసేస్తుంటారు కానీ కొంచెం లోతుగా పరిశీలస్తే గ్రామదేవతలు చాలా పురాతన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యాలు. మాతృస్వామ్య వ్యవస్థకాలంలో ప్రారంభమైన అమ్మదేవతల ఆరాధన పురుషాధిక్య సమాజపు కట్టడులనుతట్టుకుంటూ నిలబడి అనేక ఆనవాళ్ళను మనకోసం అందించేలా చేసింది ఈ గ్రామదేవతలు, సప్తమాత్రుకలు, గిరిజన దేవతలు వంటి వారే. అలాగే సమ్మక్క, సారలమ్మలు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడిని ఎదిరించి నిలబడిన శౌర్యాన్ని రెండెళ్ళకొకమారు వచ్చే జాతర ఆధారంగా గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ముసలమ్మ, నాగులమ్మ, సడాలమ్మ, బాపనమ్మ వంటి కోయ నారీమణుల గురించిన కథలు వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఆ సరిహద్దుల్లో వున్నాయి. కానీ ఆ కథలను చెప్పేవారు దొరకటం లేదు. పటం కధలు కులపురాణాల్లాగా కోయలలో డోలీలు కోయభాషలో ఆయాకథలను చెప్పేవారు. కానీ ఇప్పుడు అటువంటి వారే కనిపించడం లేదు. పైగా పోలవరం పేరుతో అత్యంత ఆదివాసులను ఉన్నచోటునుంచి తరలిస్తున్నాం. తిండి నీరు ఆవాసం దొరికేలా చేయగలమేమో కానీ వారి నరనరాల్లో ఇంకిపోయివున్న సంస్కృతి వారి తరంతోనే చచ్చిపోకుండా కాపాడగలమా. డిష్ యాంటెన్నా మధ్య, టెలిఫోన్ వైర్ల వలల్లో వారి జీవితాలు చిక్కుబడి గందరగోళపడిపోకుండా సాఫీగా నడిచేలా చేయగలమా? ఈ సడాలమ్మ కథకూడా ఎక్కడో ఏ గిరిజన డోలీ మెదడులో బ్రతికుందో వెతికి చెప్పించుకోలేకపోతే అది అతనితో పాటే చితిలో నిశ్శబ్దంగా కాలిపోవడం ఖాయం. పినపాక ప్రాంతంలోనూ సడాలమ్మ జాతర వసంతకాలం ఆరంభం అంటే మార్చినెలలో జరుగుతుంది. వనదేవత రాక సందర్భంగా లక్ష్మీదేవిని తోడ్కొని వెళ్లి కొండ ప్రాంతంలో వన దేవతకు ఎదుర్కోలు పలికి డప్పువాయిద్యాలతో గద్దెకు తరలించడం.. వనదేవత రాక సందర్భంగా పెద్దవాగు వద్ద సంతాన ప్రాప్తి కోసం అధిక సంఖ్యలో మహాళలు వేచి ఉండగా గిరిజన పూజారి వడ్డే వన దేవతను గిరిజన మహిళల పైనుంచి తోడ్కొని వెళ్లారు. తమకు ఆ వనదేవత దీవనెలు అందినట్లు భావిస్తారు. ఆ తర్వాత భక్తులు కానుకలు, బెల్లం, మొక్కుబడులను దేవతలకు సమర్పించుకుంటారు. రాత్రి వనదేవతను, సడాలమ్మ తల్లిని గోదావరికి తరలించి అక్కడ పుణ్య స్నానాలు చేయించి మళ్లి గద్దె పైకి తోడ్కొని రావడం అనేది గిరిజన ఆచారంగా పినపాక ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకోవడం మనం గమనించవచ్చు. 
ప్రపంచస్థాయి మ్యూజియం ఏర్పాటుకు తెలంగాణ ప్రణాళిక 
తెలంగాణలోని బౌద్ధమత అవశేషాలన్నీ ఒకచోట చేర్చి అతి పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నారు. గత మే నెలలో నాగార్జునసాగర్‌లో ప్రజాప్రతినిధులకు శిక్షణా శిబిరాలు నిర్వహించినపు సాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన సీఎం అక్కడ నిర్మాణంలో ఉన్న థీమ్ పార్కును సందర్శించి అభివృద్ధికి అనేక సూచనలు చేశారు. ఇక్కడ ప్రపంచస్థాయి మ్యూజియంను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మ్యూజియంతో పాటు సుమారు 500 ఎకరాల్లో మైసూరు బృందావనం మాదిరిగా ధీమ్ పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం యాదగిరిగుట్టలాగే ఒక ప్రత్యేక అథారిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇపుడు ఈ మ్యూజియంలోకి వివిధ బౌద్ధమత అవశేషాలను తరలించాల్సి ఉంది. సాగర్ డ్యామ్ పక్కన ఏర్పాటవుతున్న ఈ మ్యూజియంలోకి ఇంతకుముందు డ్యామ్ గర్భంలో లభించి తరలించిన పురాసంపదను వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది. అలాగే కాలచక్ర పేరుతో తరలించిన స్థూపాలు శిల్పాలు ఇతర ఆనవాళ్లను కూడా తీసుకురావాలి. నల్లబంగారంతో రాష్ట్రానికి సిరులవన్నెలద్దే ఈ ప్రాంతం ఇప్పుడు జిల్లా కేంద్రంగా కూడా మారింది. దీనికి సహజంగానే వున్న అత్యంత అరుదైన పర్యాటక ఆకర్షణలను వెలుగులోకి తీసుకు రావడం వల్ల ఖ్యాతితోపాటు, పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది. 
Referance

ఈ గుహల గురించి ఆర్కియాలజీ వారు అధికారికంగా ప్రచురించిన సమాచారం ఇది
తెలంగాణ మ్యూజియం లో పొందుపరచిన బొమ్మ. రాతిగోళం చుట్టూ పిచ్చిపిచ్చిగా
మొక్కలూ వృక్షాలూ పెరగటాన్ని గమనించవచ్చు.

@ సడాలమ్మ : బుద్ద విగ్రహం దగ్గర్లో కొలువొందిన దేవత, సమ్మక్క సారలమ్మల లాగానే గిరిజన వీరవనిత కావచ్చని ఒక కథనం. పాండవులలో చిన్నవాడైన సహదేవుని పేరుమీదుగా ఈ సడాలమ్మ పేరు వచ్చి వుండొచ్చని మరొక కథనం 
@ దెగోబా : విచిత్ర మాంత్రిక గుహలు అన్న ఉద్దేశ్యంతో పెట్టిన పేరు. Dagobah is a solar system in the Star Wars films, The Empire Strikes Back and Return of the Jedi. It also appears in a deleted scene from Revenge of the Sith. Yoda went into exile on Dagobah after a lightsaber battle with Darth Sidious.
“That place… is strong with the dark side of the Force. A domain of evil it is. In you must go.” “What’s in there?” “Only what you take with you.”
The Cave of Evil, also known as the dark-side cave, was a large, dark side-infested hollow located under a gnarltree on the swamp planet of Dagobah. Entering the cave gave an individual the ability to see an apparition of a possible dark future.
@ గవిడి మంగయ్య గారు శ్రీకంఠ ఉమామహేశ్వరుని ఆలయం కోసం స్థల దానం చేసిన వ్యక్తి
@ కె సాయి గోపాల్ గారి తండ్రిగారి పేరుమీదుగానే హేమచంద్రాపురాన్ని గోపాలరావు జమిందారు గారు కట్టించారట. సాయిగోపాల్ గారు ప్రస్తుతం ఇండియన్ గ్యాస్ లో మేనేజర్ గా చేస్తున్నారు నంబరు 9394775014
@ కనకసుందరం : మాజీ సింగరేణి ఉద్యోగి, జుబ్లీపురం వివరాలను తెలిపిన వ్యక్తి.
@ శ్రీ హరిప్రసాద్ : వృత్తిరీత్యా హిందీపండిట్ నాతోపాటు ఈ వివరాల కోసం పర్యటించిన మిత్రులు.

@ G.Chandra Reddy, ‘Rock-cut Buddhist Monuments of Karukonda’, PAPHC.
vol.12, 1988 (ఈ మెటీరియల్ ఇంకా దొరకవలసి వున్నది మిత్రులెవరిదగ్గరయినా అందుబాటులో వుంటే దయచేసి వివరాలివ్వగలరు)

from Blogger http://bit.ly/2hxMx2G
via IFTTT

Standard
History

తెలంగాణలో బౌద్ధం ఆనవాళ్లు -మలయశ్రీ

బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రేశరుడు. ఆరాధనీయుడు. ఆ మహనీయుని ధర్మప్రబోధం బౌద్ధం- దేశ విదేశాల్లో వ్యాపించింది. జనులకు నైతిక జీవనాన్ని ప్రసాదించుటతోపాటు గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని వ్యాప్తి చేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తన పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956నుంచి పునర్వికాస దశ పొందుతున్నది.
బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యం.
అందుకు ఆధారాలు-
1. అశ్మక దేశ (మహాజనపదం) గోదావరి నదీ తీర (ద్వీప) కపిత్ధ వన నివాసి ‘బావరి’ ముని శిష్యులు 16 గురు, గురుని కోరికగా మగధకు వెళ్లి బుద్ధునితో సంభాషించి బౌద్ధులుగా మారి వచ్చి తమ గురువు బావరికి బౌద్ధ దీక్ష ఇచ్చిన కథ బౌద్ధ సుత్త పిటిక ‘సుత్త నిపాత-పారాయణ వగ్గ’లో ఉంది. అది క్రీ.పూ 6వ శతాబ్ది సంగతి. బావరి నాడు నివసించిన ప్రదేశం ‘బావన కుర్తి’ నేటి ‘బాదనకుర్తి’. (ఈ ఊహ ఠాకూర్ రాజా రాంసింగ్‌గారిది. ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించి బాదవకుర్తి బావరి నివాస ప్రదేశమని నిర్ణయించింది నేను-2001. ఇది నా ‘కొండన్న కథ’లో ఉంది. బావరి విషయం ‘బుద్ధ బోధ’ పేరుతో మిసిమిలో వ్యాసం రాసిన, ‘తెలంగాణా సర్వస్వం’లోనూ నా ‘బావరి’ వ్యాసముంది. బుద్ధ-బావరి శిష్య చర్చను ‘బుద్ధ బోధ’ గేయకావ్యంగా ముద్రించిన-2010. ‘నిజమైన బౌద్ధం 2007 వ్యాసముంది)
2. ఆంధ్ర నటులు బింబిసారుని (మగథ-రాజధాని రాజుగృహ) సమక్షాన బుద్ధ జీవితం ‘మహాబోధి’ నాటకాన్ని ప్రదర్శించినట్టు ‘లలిత విస్తర’ గాథ పేర్కొంది. ఆంధ్రుల రాజధాని కరీంనగర్-కోటి లింగాల. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు.
3. బుద్ధుని శిష్యుడు మహా కాత్యాయనుడు అశ్మక రాజుకు బౌద్ధ ధర్మ దీక్ష ఇచ్చినట్టు ‘విమానవత్తు’లో ఉంది. అశ్మక రాజధాని పోతలినగరం-బోధన్ నిజామాబాద్. (పోతలి మొదటి తీర్ధంకరుడైన రిషభనాధుని రెండవ కుమారుడు బాహుబలికి రాజధాని. 24వ తీర్ధంకరుడు బుద్ధుని కాలపు వర్ధమాన మహావీరుడు. అంటే అశ్మక పోతలి అంతకు పూర్వపుదన్నమాట.
4. బుద్ధుని శిష్యుడు కొండన తెలుగు వ్యక్తి.
5. సెరివణిజు జాతకం ‘తెలివాగ’ నది దాటితే వచ్చే ఆంధ్ర నగరిని పేర్కొంది. తెలివాగ ఒరిస్సాలోని మహానదికి ఉపనది. కాని, దాని తీరంలో ఆంధ్రనగరం లేదు. అది ఓడ్రదేశం. తెలివాక-తెలివాగ, వాహ, అంటే తెల్లని ప్రవాహం-పాలేరు వలె. అది ఏ నదికైనా వాడవచ్చు. గోదావరిని తెలిగాహ-తెలివహ అనీ అనిరేమో నాడు. ఆ నది దక్షిణ తీర ప్రాచీన పట్టణం- కోటినగరం కోటిలింగాల-కరీంనగర్. కోట లింగాల తర్వాతి పేరు ఇప్పటి కోటి లింగాల. బౌద్ధ స్థూపాలు హిందువులకు శివలింగాలే. ఈ కోటి లింగాలలో దొరికిన ఆంధ్ర రాజుల (గోబధ, కంవాయ సిరి, నారన, సామగోప)నాణాలు భారతదేశంలోనే మొదటివి. శాతవాహనుల తొలిరాజధాని (చిముక) ఇదే క్రీస్తు తర్వాతనే కోస్తాంధ్రకు వారి వ్యాప్తి-్ధరణి కోట. కోటిలింగాల కొండాపురం తర్వాత ప్రతిష్ఠానం వారి రాజధాని. మగధను కూడా జయించి కొన్నాళ్లు పాలించి, కాలం కలిసిరాక వెనుతిరిగి స్థిరపడింది ధరణికోట-అమరావతిలో క్రీస్తు తర్వాత ఆచార్య మొదటి నాగార్జునునిది క్రీశ ఒకటవ శతాబ్ది. రెండు నాగార్జునుడు రెండవ శతాబ్ది. అమరావతి స్థూప ప్రాకారం ఇతని కాలపు నిర్మాణమే యజ్ఞశ్రీ శాతకర్ణికి ‘సుహృల్లేఖ’, కావ్యం రచించింది ఇతడే. ఈ ఇద్దరు బౌద్ధాచార్యులు నాగార్జున కొండ-విజయపురి నివాసులే.
తెలంగాణలో జిల్లాలవారీగా బౌద్ధ కేంద్రాలు- ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. మిగతా జిల్లాల వివరాలు ఇవి.
నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ- నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- న్యాలకొండపల్లి, అశ్వరావుపేట, కాపవరం.
ఇటు కొండలున్నా గుహా విహారాలు లేవు. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. వీటిలో కొన్ని నగరాలు మిగిలినవి స్తూప-చైత్యాలు. పై వాటిలో బాదనకుర్తిని కూడా చేర్చవచ్చు.
విశేషాంశాలు
కొటిలింగాల స్తూపం. ఇటీవల వెలువడిన చైత్య సూపం అమరావతి స్తూపం కన్నా పూర్వపువి. ఈ అభిప్రాయాన్ని బి.ఎన్.శాస్ర్తీ ఒప్పుకున్నారు. ధూళి కట్ట స్థూపమూ అంతే. ఇవి రెండూ కోట నగరాలు. కోటి లింగాలలో శాత వాసనులకు, పూర్వాంధ్ర రాజుల నాణాలు దొరికినై. కోటి లింగాల, ధూళికట్ట, కొండాపూర్ శాతవాహన చక్రవర్తుల పట్టణాలు. నాగార్జున కొండ మలి శాతవాహనుల కాలంలో, 3వ శతాబ్ది ఇక్ష్వాకుల కాలంలో అభివృద్ధి చెందింది.
గోదావరి తీర బౌద్ధ స్థావరాలు ధీరవాద బౌద్ధానివి, కృష్ణానది ప్రాంతానివి మహాయాన బౌద్ధ కేంధ్రాలు అనేది విశేషాంశం.కరీంనగర్ జిల్లా కప్పారావుపేట మునుల కొండకు, మంధని అడవి సోమనపల్లి గుహాలయాలున్నా మొదటిది జైనులది, రెండవది శైవులది.
న్యాలకొండపల్లిలో బుద్ధుని లోహప్రతిమ లభించింది. ఫణిగిరి విలువై న శిల్పాల స్తూపవిహారం. అది మహాయాన కేంద్రం మీర్జాపురం స్తూపం చిన్నదైనా దానిలో ధాతుపేటిక  దొరికింది.
పాశిగాం-పాయసి గ్రామం అయి ఉంటుందేమో. ఇదే దిజ్నాశుని నివాసం అని డా.వి.వి.కృష్ణశాస్ర్తీ అభిప్రాయం.
ధూళికట్ట నాగముచిలింద స్తూపం. ఆచార్య 2వ నాగార్జునుడు ప్రజ్ఞాపారమత గ్రంథాన్ని పొందినది ఒకానొక నాగరాజునుంచే. నాగార్జునుని జన్మస్థలం వేదలి. అది కృష్ణా జిల్లా యాజులి కావచ్చునని చరిత్రకారుల ఊహ. కాని ధూళికట్టకు సమీపంలోనే వెల్ది అనే పురాతన గ్రామం ఉంది. వేదరికి వెల్ది దగ్గరి పదం.
సాహిత్యాధారాలు
పాల్కురికి సోమనాధ బసవ పురాణంలో శైవేతర మతాల నిందలో బౌద్ధం పేరుకూడా ఉంది. ఎంతో కొంత వ్యాప్తిలో లేనిదే ఆ పేరు ఫ్రసక్తి ఉండదుకదా. కల్యాణి చాళుక్యుల కాలపు బెక్కండి మల్లారెడ్డి ఇక్కడి మతాలను పేర్కొంటు బౌద్ధాన్ని కూడా స్మరించారు.
కాకతి మొదటి రుద్రుని మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్‌లోని నగరూప త్రికూటాలయ శాసనంలోతాను బుద్ధదేవుని మందిరం నిర్మించినట్టు చెప్పాడు. అయితే అతని అభిమానం గౌతమ బుద్ధుడు విష్ణుమూర్తి దశావతార బుద్ధుడనే.
రామప్ప దేవాలయ గర్భగుడి గోడ వెనుక భాగాన ఒక బౌద్ధ సాధు శిల్పముంది.
రంగనాధ రామాయణ కర్త గోన బుద్ధారెడ్డివరంగల్- నర్సంపేట వద్ద ‘బుద్ధారం’ ఊరుంది. ఇవి తెలంగాణలో బౌద్ధ మత వ్యాప్తికి నిదర్శనాలు.
14 అక్టోబర్ 1956న డా. బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకారంతోనే భారతదేశంలో బౌద్ధానికి పునర్వికాస దశ. కానీ తెలంగాణలో ‘నవ దీక్షిత బౌద్ధులు’ తక్కువ. హైదరాబాద్‌లో కొందరు బౌద్ధులున్నా వాళ్లు కోస్తావాళ్లే. ఆదిలాబాద్ జిల్లాలో కొంతవరకు నవబౌద్ధం ప్రభావముంది. ఇటీవల 5,6 ఏండ్లనుంచి ఇటు బౌద్ధ సంఘాలు ఏర్పడుతున్నవి.
రచయిత ఫోన్ నంబరు : 

9866546220

from Blogger http://bit.ly/2gVSqaZ
via IFTTT

Standard