వివరణ, సమీక్ష, Telugu

చిన్నికృష్ణుడి పద్యంలో పట్టుదట్టీ, సందెతాయతులు అంటే ఏమిటి?

చిన్నప్పుడు నేను నేర్చుకున్న మొదటి పద్యం ఇదేననుకుంటా, అమ్మనేర్పించిన పద్యం నాన్న వల్లెవేయించిన పద్యం పైగా మాకప్పుడు రెండో తరగతిలోననుకుంటా మొదట్లోనే ఈ పద్యం వుండేది. ఇప్పుడీ పద్యాలేవీ కనిపించడంలేదు. పండుగలూ పద్యాలూ కేవలం భక్తినే నేర్పిస్తాయా? చరిత్రను తెలుసుకునేందుకు కూడా పనికొస్తాయా? బాగా తెలిసిన వాటిల్లోకి సైతం లోతుగా చూడటం మానేసాం. కొంచెం తరచిచూస్తే, ఏదైనా ఒక ప్రశ్న అడిగే వారుంటే చాలా విషయాలు చెప్పాలని ఎదురు చూస్తున్న సాహిత్యఆధారాలుగా పద్యాలు, ఊరిపేర్లు, పాతపుస్తకాలు, తాళపత్రాలూ, పండుగ ఆచారాలూ ఎదురుచూస్తూనే వున్నాయి. 

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు

ఈ పద్యాన్ని ఈమధ్య కాలంలో చదివినప్పడు నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

  • పట్టుదట్టి అంటే ఏమిటి? పట్టుబట్టటం లాంటిదా? పట్టు వస్త్రం లాంటిదా? 
  • అప్పట్లో సంది జ్వరం వస్తే పిల్లలకు కట్టె సందికాయలు, సంది తాయత్తులు లాగా చిన్ని కృష్ణుడికి కూడా వాళ్లమ్మ తాయత్తు కట్టిందని పద్యకర్త ఊహిస్తున్నాడా? లేక సందిట తాయతు అనాలా? మరేదన్నా అర్ధం వుందా? 
  • బంగరు అనాలా బంగారు అనాలా? 
  • మొలత్రాడు లేదా మొలతాడు అంటే సరిపోతుందా? 
  • చిన్ని కృష్ణాఆ.. అంటూ దీర్ఘం వుందా చిన్నికృష్ణ అంటే సరిపోతుందా?
  • సరిమువ్వలా సిరిమువ్వలా? 

సరే ఒకసారి నాకు అర్ధమయినంత వరకూ నేను పరిశీలించిన విశేషాలు మీముందుంచుతాను. మరేమైనా సవరణలుంటే పెద్దలు, విజ్ఞలు తెలియజేస్తే సంతోషంగా భావిస్తాను. 

సందర్భం : యశోద ఇంట పెరుగుతున్న చిన్ని కృష్ణుడి రూపాన్ని వర్ణిస్తూ కవి అటువంటి కృష్ణా నిన్ను చేరి కొలుస్తానయ్యా అని భక్తిగా చెపుతున్నారు. మరి ఆ కవి గారు నిజంగా గోపాల కుటుంబంలో పెరిగే కృష్ణుడిని చూసి వుంటారా? ఖచ్చింతంగా లేదు. ఆయన కూడా శృతంగా వస్తున్న బాగవత కథనం ఆధారంగా వారి ఊహను జోడించాలి. ఇక అప్పుడు కనిపించేదెవరు. తన కాలంలో తను చూసినంతలో ముచ్చటగా మురిపెంగా పెరుగుతున్న చిన్నారి బాలలకు కృష్ణుడి రూపాన్ని ఆపాదించాలి. బహుశా కవి అదే చేసి వుంటారు. 

వర్ణన లోని విశేషాలు  

చేతవెన్నముద్ద: గోపాలుర ఇంట పిల్లలకు సులభంగా అరిగుదలకు సహకరించేది, బలవర్ధకమైనదీ, ఇష్టంగా పెట్టేదీ ఏముంటుంది వెన్ననే కదా. బహుశా నెయ్యి తినడం కంటే వెన్న శ్రేష్టం ఆరోగ్యకరం అని ఇప్పటికీ చెపుతున్నారు కదా. అటువంటి వెన్నను చేతిలో పట్టుకుని వున్నాడట. వాళ్ళ అమ్మ పెట్టే వెన్న చాలకుంటే గోపికల దగ్గర వెన్నను దొంగిలించయినా తినేంత చిలిపివాడు వెన్నపై ఇష్టమున్నవాడూ కృష్ణుడని కధనమే కదా. 

చెంగల్వ పూదండ : కలువలు రాత్రిపూట వికసించే పుష్పాలయితే తామరలు (కమలాలు) పగటిపూట వికసిస్తాయి. ఆ కలువ పూవు కూడా ఎర్రనిదట. చెన్ను + కలువ = చెంగల్వ అంటే ఎఱ్ఱకలువ, హల్లకము; The red water lily. ఎర్రకలువ. చెన్ను (చెన్ ) ను ఎరుపు అనే అర్ధంలోనే కాక అందము (Grace, beauty ఉదాహరణ చెన్నుడు a beau or fop, అందగాడు) విధము (Manner) అనే సందర్భాలకోసం కూడా వాడినప్పటికీ అందమైన కలువ అనికాక ఎర్రకలువ అనేదే ఇక్కడ పొసుగుతుందని భావిస్తున్నాను. తమిళంలో సెందామరై, కన్నడలో కెంపుదావరై పదాలు కూడా ఎఱ్ఱ కలువనే సూచిస్తున్నాయి. రాత్రి పూసిన ఎర్రకలువను ఎవరో భృత్యుడు లేదా ఇష్టులు తీసుకొచ్చి చిన్నారి బాలకుడికి ఆడుకునేందుకు ఇచ్చివుంటారు. లేదా తల్లి మురిపెంగా తన బుజ్జాయికి అలంకరించి వుంటుంది. ఇప్పటికీ అమ్మలు చిన్న పిల్లలు మగపిల్లవాళ్ళయినప్పటికీ పూలతో అలంకరించడం మనం గమనిస్తూనే వుంటాం కదా. 

బంగరు మొలతాడు : కటిశృంఖల, కటిసూత్రము, ధటిని, శృంఖలము, మొలకట్టు అనేవి నడుముకు కట్టుకునే వస్త్రాన్ని జారిపోనీయకుండా పట్టుకునే విశేషణం గానే కాక, ఆటవిక జీవనంలో సైతం వివిధ ఆయుధాలను విరామ సమయంలో దోపుకునే అవసరంగా వుండేది. ఇప్పటికీ సైనికులూ పోలీసులూ తుపాకులు పెట్టుకునే హోల్ స్టర్ కానీ, అప్పట్లో కత్తిని పెట్టుకునే ఒరలు కానీ నడుముచుట్టూ వున్న బెల్ట్ (belt) వంటి దానినే ఉపయోగించాలి. waist string or thread అనేది ఒక సంప్రదాయంగా మారి మగపిల్లలకు మొలతాడు కట్టకపోతే హాని జరుగుతుందనే నిర్ణారణలకు సైతం వచ్చేసారు. అంటే ఆయుధాలను సరిగా భద్రపరచుకోలేదనీ, అంగవస్త్రం జాతిపోతుంటే వేటలోనో, పోటీలోనో,యుద్దంలోనో, కృరజంతువులనుండి తప్పించుకునేప్పుడో సక్రమంగా పనిచేయలేక నష్టపోయే అవకాశం వుంటుదన్న ధ్వనివుండవచ్చు. జాతియంగా కూడా మొలతాడు కట్టిన మొగవాడెవరన్నా వుంటే రమ్మను అనటం మనకి బాగా తెలుసు. తమిళం అణ్ణాకయిర్‌, కన్నడలో పురుషార ఉడుదార అని పిలిచే ఈ మొలతాడు వారి వారి స్థొమతలను అనుసరించి వెండి లేదా బంగారం తో చేయించుకునే వాళ్ళు. ఈ చిన్ని కృష్ణుడు తన మ్రొలకు కట్టుకున్న దారం బంగారపుదట. ఈ ఆటవెలది పద్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బంగారు అనేపదం పొసగదు, బంగరు అనే పదం అలాగే త్రాడు అనికాక తాడు అనే పదం ఆటవెలది నియమాలకు సరిపోయి ఈ పద్యంతో పొసుగుతాయి. సంస్కృతీకరణలో భాగంగానే, స్వచ్ఛ ఉచ్చారణ అంటూ పొరబడుతూనే ఈ పదాలను మరికొంత సాగదీయటం చాలాచోట్ల గమనించాను.

బంగారు అంటూ గ కు దీర్ఘం ఇస్తే ఆటవెలదిలో పొసగటం లేదు

పట్టుదట్టీ : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు (1903 vi.106) ప్రకారం దట్టీ లేదా దట్టి అంటే A sash, belt, girdle, cestus round the waist. నడికట్టు, కాసెకోక అంటే అడ్డముగా చుట్టు కట్టుకొనిన పంచకట్టునే దట్టీ అంటారు. అయితే బంగారపు మొలతాడు కట్టే స్థొమత వున్నవాళ్ళు కాబట్టి శ్రేష్టమైనదిగా చెప్పుకునే పట్టుతో చేసిన దట్టీ కట్టారు అని అనుకోవచ్చు. మరొక అర్ధంలో తెల్లని, లేదా నాజూకైన సన్నని వస్త్రంతో నేసిన పంచెకట్టు కట్టుకున్నాడని కూడా అర్ధం వస్తోంది. తెలంగాణా ప్రాంతంలో పట్టుదడియాలు అంటే సన్నని వస్త్రము, తెల్లని గుడ్డ అనే అర్ధాలున్నాయి ఈ విషయాన్ని తెలంగాణా పదకోశంలో శ్రీయుతులు నలిమెల భాస్కర్ గారు ప్రస్తావించారు. చిన్నికృష్ణుడే కాదు మానవుడు ఏర్పాటు చేసుకున్న చాలా మంది దేవుళ్ళకు వారి ఊహలకు అందిన కాలంనాటి వస్త్రధారణే వుంటుంది. ఆయా దేశీయమైన వస్త్రదారణలను ఆయా దేవతలకు మనుషులు ఆపాదించారు. చూడండి బ్రహ్మ చేతిలో తాటాకులపై రాసిన పుస్తకం వుంటుంది కానీ ప్రింట్ చేసిన పుస్తకమో, ఇప్పటి ఆధునిక టాబ్లెట్ పామ్ టాప్ లో వుండవు. పురాతన కాలంలో సృష్టించుకున్న దేవుని రూపాలు, సాహిత్యకాలానికి కొంత మార్పులకు లోనయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా పరివర్తనం చెందించకుండా దానినే కొనసాగించడం చేస్తున్నాం. దీంతో గుణభక్తిస్థానంలో రూపభక్తి కూడా ప్రధానంగా చేరిపోయిందిప్పుడు. 

సందెతాయతులు : తాయితు, తాయెతు తాయెత్తు అంటే రక్షరేకు లేదా తావీజు అనే అర్ధంలోనే ఎక్కువగా తీసుకుంటున్నాం. దీని అర్ధాన్ని మరికొంచెం శ్రద్దగా పరిశీలిస్తే తాయి + ఎత్తు అని కదా తాయి అంటే తల్లి లేదా పిన్ని. An amulet, or charm containing things supposed to bring luck. తల్లి బిడ్డలకుకట్టే రక్షరేకు. సందె అనే పదాన్ని సంది జ్వరం అనే అర్ధంలోనే కాక సందిట అని తీసుకుంటే మరింత సరిపోతోంది. దండచేతికి అలంకరణ చేసుకోవడం ఈ పద్యరచన చేసిన కాలంలో ఒక అవసరం కూడా యుధ్దంలో ప్రధానంగా దాడిచేసే శరీరభాగాలను కవచాలతో కప్పివుంచుకోవాలి. తలకు శిరస్త్రాణం, ఒంటికి కవచం లాగానే, దండచేతికి కూడా ఉక్కు పట్టీలను పెట్టుకునే వారు. వాటిపై కత్తి, బల్లెం వంటివాటి ద్వారా దాడిజరిగినా రక్షణ వుండాలని. అదే పద్దతిలో దండచేతులపై బంగారపు వెండి అలంకరణలనూ, పూదండలనూ ధరించడం ఆనవాయితీ. సందికడియము అంటే An ornament worn upon the upper part of the arm. An armlet, కేయూరము. a stout bangle or double bangle worn on the upper arm, అలాగే కేయూర భూషణము కుసుళ్ళు, దండకడియము, బాహుదము, బాహుపురి, బాహుభూష, బాహుభూషణము, భుజకీర్తి, సందిక(డె)(డియ)ము, సందిదండ అనేవి వాడుకలో వున్న పేర్లు. ఉదాహరణకు సందికడియంబు అనివాడిన ఇతర పద్యాలుకూడా వున్నాయి. కావడియుట్లు చిక్కము సందికడియంబు నూకలతోఁప పొగాకుతిత్తి అనేదానిలోనూ సంది కడియం ప్రస్తావన కనిపిస్తుంది. కన్నడలోనూ దీన్ని కేయూర భూషణమనే అంటారు. తమిళంలో మేల్ కైయిల్ అణియం వళైయమ్ అంటారట. వాళ్ళమ్మ చిన్ని కృష్ణుడి దండచేతిపై చేసిన అలంకరణ గురించి కవిగారు మనతో చెపుతున్నరిక్కడ.

తాయత్తులు అంటే అస్సలు సరిపోవడం లేదు

సరిమువ్వ గజ్జెలు : ప్రాంతీయ మాండలిక పదకోశంలో మువ్వలు అనే పదాన్ని కళింగ ప్రాంతంలో ఎక్కువగా వాడతారనీ, గజ్జెలు అనే పదాన్ని తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వాడతారనీ రాసారు. ఇక్కడ మువ్వలు, గజ్జెలు రెండూ వాడారు. నిజానికి మువ్వ అనేది గజ్జెలలో ఒక భాగం, తమిళంలో మునైయిల్‌ మూన్డ్రు ఇడై సందుగళుడైయ గజ్జై లేదా కన్నడలో మూరుతూతుగళ దొడ్డ గజ్జె అని చెప్పడంలో మొనలోమూడు సందులు గల పెద్దగజ్జె అంటూ బహుజనపల్లి సీతారామాచార్యులు [శబ్దరత్నాకరము 1912 ] గారూ పేర్కొన్నారు. సరి సంఖ్యలో వున్న మువ్వలతో కట్టిన గజ్జెలు అని అర్ధం కావచ్చు, సిరి మువ్వ అంటూ లక్షణమైన, సంపదకరమైన అంటూ సిరిని లక్ష్మి అర్ధంలో చెప్పివుంటారేమో అనుకున్నప్పటికీ అది కూడా చందస్సుకు సరిపోవడం లేదు. సరిమువ్వ అనేదే సరైన పదం అవుతోంది. మువ్వలను ఒక క్రమంలో పేర్చికట్టి తయారు చేసే గజ్జెలను పిల్లల కాళ్ళకే కాక నాట్య ప్రదర్శన సమయాల్లోనూ, జానపద కళల ప్రదర్శనల్లోనూ, పశువుల మెడల్లో అలంకరణలు గానూ వాడటాన్ని గమనిస్తాం. పిల్లలు ఆడుకుంటూ వున్నప్పుడు తల్లులు ఏదన్నా పనిచేస్తున్నప్పటికీ వారు దూరంగా వెళితే తెలియటం కోసం కూడా ఇవి ఉపయోగపడేవి. అసలే చిన్ని కృష్ణుడు ఒకదగ్గర వుండేవాడు కాదాయే అందుకే ఇవి మరింత బాగా ఉపయోగపడివుంటాయి.

సిరిమువ్వలు కూడా గణ విభజనలో కుదరటం లేదు. 
కృష్ణుడు చిన్నవాడే అయినా దీర్ఘం తీయకుండానే ఈ పద్యంలో పలుకుతాడ్లెండి

ఈ విధంగా చిన్ని కృష్ణుడి రూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించిన కవి, చివరి పాదంలో తన భక్తిభావాన్ని చాటుకున్నాడు. అయితే కృష్ణా అంటూ దీర్ఘం తీస్తూ చాలా మంది పద్యాన్ని పాడుతున్నారు కానీ దీర్ఘం లేకుండా ఆటవెలదికి చక్కగా సరిపోతోంది.

from Blogger http://bit.ly/2f0moXG
via IFTTT

Standard
వివరణ, సమాచారం, History

మొహర్రం అనేది పండుగ కాదా?

మొహర్రం వేడుకల ఉత్సవం కాదు, వర్ధంతి విషాద జ్ఞాపకాలు,ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సర ప్రారంభం.
పీర్లు, నిప్పులగుండాలు, మాతమ్ ఏడ్పులు షియాల సాంప్రదక సంతాప పద్దతులు.
క్రీ.శ. 622 లో మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కానుండి మదీనా కు వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు. “హిజ్రీ శకా”నికి మూలం ఇదే అంటే ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) ‘యస్రిబ్’ నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా(తెలుగార్థం: నగరం) లేదా “మదీనతున్-నబీ” లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు మరియు క్రైస్తవులతో సహా) ఈ కేలండర్ ను వాడేవారు.
ఇస్లాంను కాపాడుకోవడం కోసం జరిగిన పవిత్ర యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ మోహర్రం నెలలో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందుతాడు. అప్పటి నుంచీ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూమ పది రోజుల పాటు సంతాప దినాలు నిర్వహిస్తారు. ప్రతిమా మూర్తులుగా పీర్లు ఊరేగింపు, న్యాయపోరాటానికి శరీర కష్టాన్ని లెక్కజేయమన్న నిప్పుల గుండాలు తొక్కటం, రక్తాన్ని చిందించటం “షహీద్ ” (అమరవీరుల ) నెల సందర్భంగా షియాలు గుండెలు బాదుకుంటూ మాతమ్ (శోక ప్రకటన) జరుపటం, నల్లటి వస్త్రాలను ధరించడం లాంటివి చేస్తారు. కానీ ముస్లిం సంప్రదాయాలకు హిందుత్వాన్ని పోలి వుండే ఈ పద్దతులు వ్యతిరేకం, ఈ విధానాలకు వ్యతిరేఖంగా పత్వాలను సైతం చేసారు. అయినప్పటికీ ప్రాధమికంగా మొహర్రం ముస్లింలకు సంబంధించింది అయినా కాలక్రమంలో భారతీయ సంస్కృతిలో భాగమైంది. తెలంగాణలో పీర్ల పండగగా ప్రాచుర్యం పొందింది. 
మొహర్రం వెనకున్న కథ
క్రీ.శ. 632లో మహమ్మద్‌ ప్రవక్త (స) పరమపదించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌, హజ్రత్‌ ఉమర్‌, హజ్రత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌- ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్‌ (స) మనవలు. హజ్రత్‌ అలీ తనయులు. హజ్రత్‌ అలీ తరువాత ప్రజలు ఇమామ్‌ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకొన్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌ మావియా. అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమామ్‌ హసన్‌ను గద్దెదించాలనుకొన్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమామ్‌ హసన్‌ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్‌ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్‌ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ననుసరించి సంప్రతింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చలకోసం ఇమామ్‌ హుసైన్‌ రాజధాని కుఫాకు బయల్దేరారు. యజీద్‌కు విషయం తెలిసింది. పాషాణ హృదయుడైన అతడు ఇమామ్‌ హుసైన్‌ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమామ్‌ పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్‌ను రాజుగా అంగీకరించమని 4000 సైన్యంతో వచ్చిన సైన్యాధిపతి హెచ్చరించాడు లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలసి మొత్తం 108 మంది లోపు జనాలు ఇమామ్‌ హుసైన్‌ వెంట ఉన్నారు. పది రోజులు యుద్ధం జరిగింది. ఇమామ్‌ హుసైన్‌ పరివారం స్వల్పమైనా వీరోచితంగా పోరాడి అశువులు బాసింది. యూఫ్రటీస్ నదీ తీరాన కర్బలా మైదానంలో జరిగిన ఈ యుద్ధాన్నే కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు, ఒక్క జైనుల్ ఆబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ధ ఖైదీలుగా ‘షామ్’ (సిరియా) కు, యజీద్ వద్దకు తీసుకెళ్ళారు. పదోరోజు హుసైన్‌ ఒక్కరే మిగిలారు. ‘యజీద్ సైన్యం దాడి చేసి ఈయనను కూడా పట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్‌ కోసం శత్రువునడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై ఇమామ్‌ హుసైన్‌ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహర్రం పది రోజులు విషాద దినాలు.అప్పటి నుంచీ…ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మొహర్రం చేసుకుంటారు.
మొహర్రం నెలలో ఇమామ్ హుస్సేన్ ఆత్మ శాంతి కోసం ఉపవాసాలు ఉంటారు. నమాజ్ చేస్తారు,ఫాతెహా ఇస్తారు.షియా ముస్లింలైతే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రక్తం చిందిస్తారు. దీన్నే మాతం అంటారు. 
పీర్ల పండుగ 
మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన అయిదవ అరోజు రాత్రి పంజోఁ కా పిఠారా లేదా తాబూత్ అనే పంజాల నుంచిన పెట్టెను, ముజావిరు అనే అర్చకుని ఇంటి నుండి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ పంజాలకు విగ్రహాలకు పది రోజులు ఫాతిహాలు జరుగుతాయి. పీరులంటే వీరుల యొక్క హస్తాకృతిలో మరియు పంజాల రూపంలో కొలుస్తారు. ఊరేగింపు అయిన తరువాత రాత్రికి ఊరు మధ్యలో నున్న నిప్పుల గుండం దగ్గరకు వస్తారు. ఆఖరు రోజున బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి అందులో పెద్ద పెద్ద కట్టెలు పేర్చి నిప్పు ముట్టిస్తారు. అది బాగా మండి కణకణ మండే బొగ్గులుగా తయారౌతాయి. ఈ సమయానికి ఊరేగింపు ముగుస్తుంది.
హసన్, హుస్సేన్ పేరులతో పాటు, వారితో పాటు ప్రాణా లర్పించిన వీరుల పీర్లను కూడా పట్టుకుని హసన్, హుస్సేన్ …. హైసాయి, జూలోయ్ అంటూ ఆవేశపు కేకలతో పీర్లను చేత బట్టి వుదృతంగా మారు మోగే సన్నాయి , డప్పు వాయిద్యాల మధ్య పరుగు పరుగున ఆవేశంతో పరుగెత్తుతూ నిప్పుల గుండం మధ్య నుంచి నడచి పోతారు. ఈ దృశ్యం ప్రేక్షకుల్ని చికితుల్ని చేస్తుంది. నిప్పుల గుండంలో దూకే వారికి ప్రజలు కూడ కేకలతో మద్దతు నిస్తారు. ఆ విధంగా మృత వీరులైన హసన్, హుస్సేన్ లకూ తదితర అమర వీరులకూ జోహార్లు ఆర్పిస్తారు. ఇలా నిప్పుల గుండంలో నడచి వెళ్ళడం పీర్ల మహాత్యంగా కీర్తిస్తారు. ఇలా పీర్ల పండుగ ముగుస్తుంది. ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పలావు మొదలైన మాంసాహాన్ని భుజిస్తారు. అలా ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి ఆత్మీయులైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు. ఆలా హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతీక. పేటికలో వుంచి మరుసటి మొహరం నెల వరకు ముజావర్ వద్ద భద్ర పరచటం జరుగుతూ వుంటుంది. ఆంధ్ర దేశంలో వున్న ముస్లిములు అన్ని ప్రాంతాల లోనూ ఈ పండగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్బంలోనే మొహరం గీతాలను అలాపిస్తారు
పీరుల్ని పీర్ల చావడి లో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు. కాని ముస్లింలలో ఒక తెగ వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. ఇస్లాంలో ఇలాంటి సంప్రదాయాలను కొనసాగించే పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు వ్యతిరేకంగా ఫత్వాలు వున్నాయి. అందుకే ఈ విషయం నిషిద్దం అని తెలిసే కొద్దీ ఈ పండుగను ఆచరించే ముస్లిముల సంఖ్య తగ్గుతోంది. “ఊదు వేయందే పీరు లేవదు”. ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి. 
పీరు
మొహరం నెలలో పదవ రోజు షహాదత్ ను సంతాప దినంగా పాటించ వలసిందిగా హుసేన్ అనుచర వర్గం నిర్వచింది. ఆ రోజున పీర్లు అనే హస్త్గాకృతులను ఊరేగించి, ఊరి యందు గల బావి దగ్గరో, నదుల దగ్గరో వాటిని శుభ్ర పరచి నిర్ణీత పేటికలో వుంచి మరుసటి మొహరం నెల వరకు ముజావర్ వద్ద భద్ర పరచటం జరుగుతూ వుంటుంది. ముస్లిములు ఈ పండగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్బంలోనే మొహరం గీతాలను అలాపిస్తారు. మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు. కాని ముస్లింలలో ఒక తెగ వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్టించి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. 
పీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడని, డా: టి. దోణప్ప గారు కూడ తమ జానపద కళా సంపద గ్రంథంలో ఉదహరించారు. పీరు అనే పదం సూఫీతత్వాని కి సంబంధించినది. పీరు అనగా గురువు, “ఆధ్యాత్మిక గురువు”. కానీ కొద్ది మంది ఈ “పంజా” లేదా “నిషాన్” లేదా “అలం” (జెండా) ను “పీరు” అనే పేరు పెట్టేసారు. అది అదే పేరుతొ చాలా కాలం కొనసాగింది. ఈ పంజా (పీరు) మొహర్రం నెలలోని మొదటి ‘అష్రా’ (పదిరోజులు) లో జరిపుకొను ఉత్సవాలలో ఉపయోగించే, ‘పంజా’ లేదా ‘అలమ్’ (జెండా). ఒక రాతిపై వున్న ఇటువంటి పంజా గుర్తు మేరకే హైదరాబాదులోని ఒక ప్రాంతానికి పంజాగుట్ట అనే పేరు వచ్చింది. ఇత్తడి పళ్ళాల్లాంటివి కర్ర లకు తొడిగి పీర్ల పండుగ లో ఊరేగిస్తారు. కర్బలా యుద్ధంలో, ఇమామ్ హుసేన్ మరియు వారి కుటుంబీకులు ఉపయోగించిన, కరవాలాలు, డాలులు, జెండాలకు చెందిన నమూనాలు, ఈ రోజుల్లో, వారి అమరత్వాన్ని గుర్తించుకొంటూ, స్మరించుకొంటూ ఊరేగిస్తారు.
నిప్పుల గుండం

మొహర్రం పండుగలో ముఖ్యంగా మసీదుల ఎదుట అలాయి తవ్వుతారు. దానిలో అగ్నిగుండాన్ని రాజేసీ దాని చుట్టూ ప్రజలు, పీర్లు ఎత్తువారు, యువకులు అసోయి-దూలా ఆరతి- కాళ్ల గజ్జెల గమ్మతి, దూలదూలరే ఖాసీమా, దుమ్ము లేసరా ఖాసీమా, వివిధ పాటలతో నృతాలు

ఉపవాసాలు 
ఇస్లాం మతం కోసం ప్రాణత్యాగం చేసిన ఇమామె హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తారు. మొహర్రం 6,7,8,9న, 10న షహదత్ రోజు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. శోకమాసమని ముస్లింలు ఈ మాసంలో శుభకార్యాలు చేయరు. కొత్తదుస్తులు వస్తువులు ఖరీదు చేయరు. 
షర్బత్, రోటీలు 
కర్బాలా మైదానంలో ఇమామె హుస్సేన్, అయన అనుచరులు పిల్లలు, మహిళలకు యజీద్ సైన్యం కనీసం మంచినీరు కూడా ఇవ్వరు. ఆ పరిస్థితి నేడు ఎవరికీ రావొద్దంటూ ముస్లింలు నీళ్లు, లేక పాలలో బెల్లం తీపి, సోంపు కలిపి షర్బత్ తయారు చేసి తాపుతారు. ఆకలితో ఎవరూ మరణించరాదని చక్కర, ఎండు ఫలాలలతో రొట్టెలను తయారు చేసి దానం చేస్తుంటారు. ఆ కాలంలో హుస్సేన్ పెరుగు అన్నం సద్ది కట్టుకొని వెళ్లారంటూ నేటికీ పెరుగన్నం (బుత్తి) తయారు చేసి పంచుతారు. 
పులివేషాలు
పీర్లను పంజాలొ నెలకొల్పిన తరువాత ఆవేశ పరులైన ముస్లిం సోదరులు పులి వేషాలను ధరించి డప్పు ల వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పెద్ద పులి నృత్యం చేస్తూ, పులి చేష్టలను అనుకరిస్తూ, హుంకరిస్తూ పిల్లలను భయ పెడుతూ హంగామాగా వీధులన్నీ తిరుగుతూ పెద్ద పులి ఠీవిలో హుందాగా నడక నడుస్తూ పల్టీలు కొడుతూ ప్రతి ఇంటికీ వెళ్ళి వ్వాచిస్తారు. ఈ ప్రదర్శనాన్ని అందరూ ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. పారితోషికాల నిస్తారు. ఇలా సంపాదించిన డబ్బును అఖరు రోజున ఆనందం కోసం ఖర్చు పెడతారు.
ధులా
ధులా అనే కళా రూపం, సర్కారు ఆంధ్ర దేశం లో కానీ, రాయలసీమ ప్రాంతం లో కాని ఎక్కడా కనిపించక పోయినా, తెలంగాణా ప్రాంతంలో మాత్రం అధిక ప్రచారంలో వుంది. ఇది ముఖ్యంగా శ్రమ జీవుల కళా రూపమనీ, అంత కంటే ముఖ్యంగా ముస్లింలు జరుపుకునే పీర్ల పండగకు సంబంధించిందనీ, జయధీర్ తిరుమల రావు గారు ప్రజా కళారూపాలు అనే తమ గ్రంధంలో వివరించారు. ఇది శ్రమ జీవుల కళారూపమైనా శ్రమ జీవులందరూ ఈ కళా రూపంలో పాల్గొన్నట్లు మనకు పెద్ద అధారాలు లేవు. ఇది అందరూ కలిసి సామూహిక నృత్యం చేస్తారు. పాటకు, పాటకు సంబంధించిన ఆటకూ సంబంధించిన జానపద కళారూపం. ధులా కళా రూపానికి సంబంధించిన పాటల్లో గానీ, పదాల్లో గానీ అవి అతి చిన్నవిగానూ, అంత కంటే కథా వస్తువు అతి చిన్నది గానూ వుంటుంది. ముఖ్యంగా మొహరం పండుగల్లోజరిగే పీర్ల పండుగల్లో ధులా ఎక్కువ ప్రచారమైనా, ఆ కళారూపాన్ని తెలంగాణా పోరాట సమయంలో సాయుద దళాల్లో వున్న ముస్లిం సహోదరులూ, ఇతర శ్రమ జీవులూ కూడా ఈ కళారూపాన్ని బాగా ఉపయోగించు కున్నారు. దళాలకు సంబంధించిన క్యాంపులలో వున్న వారందరూ వలయాకారంగా నిలబడి, ఒకరు పాటను ప్రారంభించి, ఆ పాటను సామూహికంగా అందరూ అందుకుని ఆ పాటకు తగిన అడుగులను అందరూ ఒకే రీతిగా క్రమశిక్షణతో లయ బద్ధంగా ధులా పాటను పాడుకునే వారు

మొహర్రం గురించి చారిత్రక ఉటంకింపులు

తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య జూన్ 29, 1830న నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహర్రం పండుగను తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించారు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహర్రం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించారు: షహరు(హైదరాబాదు)కు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో నెక్కువగా ప్రకాశించుటచేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆ తొమ్మిదో దినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు
హైదరాబాద్‌ పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మీరాలం మండీ, దారుల్‌ షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌ ఘాట్‌ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ వూరేగింపు సాగుతుంది.
4వ నిజాం మీర్ అఫ్జలుదౌల్హా హయాంలో నిజాం పరిపాలన ప్రదేశంలో వర్షాలు పడక తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో ఆయన మతగురువులను, ప్రజలను ప్రత్యేక ఆరాధనలు చేయాలని, వర్షాలు పడాలని దేవుడిని వేడుకోవాలని కోరారు. ఆయన ఆదేశానుసారం మతగురువులు, ప్రజలు ప్రత్యేక ఆరాధనలు చేశారు. దీనితో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. కరువు పోయింది. 
దీనితో ఆయన తన సంస్థానంలోని అన్ని వర్గాల ప్రజల కోసం మసీదులు, దేవాలయాలు, ఆషూర్‌ఖానాలను నిర్మించాడు. అదే క్రమంలో డబీర్‌పూరలోని బీబీకా అలావా నిర్మించారు. అప్పట్లో గోల్కొండ ఖిల్లాలో ప్రతిష్ఠిస్తున్న ఆలంను డబీర్‌పుర బీబీకా అలావాకు మార్చారు. దీనితో షియా ముస్లింలు ఏటా 1వ మొహర్రం నుంచి 10వ మొహర్రం వరకు ఆలంను ప్రతిష్ఠిస్తారు. ఈ ఆలావాను 1928లో 7వ నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్ ఈ ఆషూర్‌ఖానాకు తుది మెరుగులుదిద్దారు. 
హిందూ ముస్లింలను ఏకం చేసే పండుగ
ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర్వచనమే తౌహీద్ (“లాయిలాహ ఇల్లల్లాహు”) అనగా సర్వేశ్వరుడైన అల్లాహ్ ఒక్కడే ( వాహిద్ ) అను విశ్వాస చాటింపు. అరబ్బీ పదమైన ‘అహద్’ లేదా ‘వహద్’ అనగా “ఏక”, ‘వాహిద్’ అనగా ‘ఏక’ లేదా ఏకవచనము, దేవుడి విషయంలో ‘ఏక + ఈశ్వరుడి’ విశ్వాసం ఈ “తౌహీద్”.
తౌహీద్ కు వ్యతిరేకపదము షిర్క్, అనగా ఏకేశ్వరునికి భాగస్వాములుగా ఇతరులను చేర్చడం లేదా బహుదైవారాధన . షర్క్, షిర్క్, షరీక్, షిర్కత్, ఇష్తెరాక్, ఇష్తెరాకియ, ఇష్తెరాకియత్ మొదలగు పదాలకు మూలం ష-ర-క. దీని అర్థం భాగస్వామ్యం, మిళితం, కలపడం, కలవడం, ఈ “షిర్క్”. షిర్క్ ను ఆచరించేవారిని ‘ముష్రిక్’లు అని వ్యవహరిస్తారు. ఉదాహరణకు దర్గాలను సందర్శించి ఔలియాలతో నోములు, శరణుకోరటాలు, విద్యాబుద్ధులు, ఉపాధి, సంతానం, వివాహం మొదలగు విషయాల పట్ల తమ కోరికలు ప్రకటించి వాటిని పూర్తి చేయండని ప్రార్థనలు చేయడం మరియు వేడుకోలు చేసుకోవడం. అలాగే, పంజాకు (పీర్లకు), జెండాలకు, జెండామానులకు, జిన్నులకు, పాములకు (జిన్నులుగా భావించి), పాముల పుట్టలకు, ఔలియా నషానులకు ఫాతెహాలు చదువుతారు, నోములు నోచుతారు, ప్రార్థనలు చేస్తారు. ఇస్లాం విశ్వాసాల ప్రకారం ఇది బిద్ అత్ మరియు షిర్క్ లు. ఈ విషయాలన్నీ అంధవిశ్వాసాలు, అంధ-శ్రద్ధల కోవలోకి వస్తాయి.
షియా నవాబుల కాలంలో ఈ సంప్రదాయం అన్నిచోట్లా ప్రాకింది. ఒకానొక కాలంలో ఈ పీర్లపండుగ ముస్లింల ముఖ్యమైన పండుగగా భావింపబడినది. కొన్ని ప్రాంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడ పీర్ల పండగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. ముస్లిములలో ముఖ్యంగా దూదేకులా’ వారు ఆటలమ్మ, మారెమ్మ మొదలైన హిందువుల దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎఱ్ఱెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, నారసింహులు, బాలన్న అనే పేర్లు పెట్టుకోవటమూ, అలాగే హిందువులలో కుల్లాయమ్మ, దస్తగిరి రెడ్డి, నబీగౌడు ఫక్కీరప్ప, మస్తాన్ రావు, లాలెమ్మ, సేకణ్ణ, సైదల్లీ, హుసేన్ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ, పరసలలోనూ పాల్గొనటం, దర్గాలకు, మసీదులకూ వెళ్ళటం, పీర్లను కొలవటం సర్వసామాన్యంగా జరిగే విషయాలు.
అరబ్బీ క్యాలెండర్ లోని నెలలు ఇవి
1. మొహర్రం :محرّم (ముహర్రముల్ హరామ్)
2. సఫర్ : صفر (సఫరుల్-ముజఫ్ఫర్)
3. రబీఉల్-అవ్వల్ : ربيع الأول
4. రబీఉల్-ఆఖిర్ (రబీఉస్-సాని): ربيع الآخر أو ربيع الثاني
5. జమాదిఉల్-అవ్వల్: جمادى الأول
6. జమాదిఉస్-సాని: جمادى الآخر أو جمادى الثاني
7. రజబ్ : رجب (రజబ్-ఉల్-మురజ్జబ్)
8. షాబాన్ : شعبان (షాబానుల్-ముఅజ్జమ్)
9. రంజాన్ : رمضان (రంజానుల్-ముబారక్)
10. షవ్వాల్: شوّال (షవ్వాలుల్-ముకర్రమ్)
11. జుల్-ఖాదా: ذو القعدة
12. జుల్-హిజ్జా: ذو الحجة
హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.

ధన్యవాదాలు : ఈ సమాచారం అంతర్జాలంలోనూ, పత్రికలలోనూ ప్రచురితమైన వేర్వేరు ప్రదేశాలనుంచీ సేకరించినదే. మొత్తంగా ఒక క్రమంలో పెట్టడం మాత్రమే నేను చేసిన పని ఆయా సోర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు

from Blogger http://bit.ly/2dKIfly
via IFTTT

Standard
వివరణ, Science

బ్రహ్మపదార్ధం గుట్టువిప్పి కొత్తప్రపంచానికి దారులు వేసిన త్రిమూర్తులకు 2016 ఫిజిక్స్ నోబెల్ బహుమతి

పదార్థం తాలూకూ అసాధారణ స్థితులకు (ఎగ్జోటిక్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మాటర్‌) సంబంధించిన రహస్య ద్వారాలను తెరిచినందుకు బ్రిటిష్‌కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2016 సంవత్సరానికిగాను వారిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్టు ‘ద రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ ప్రకటించింది. ”థియోరెటికల్‌ డిస్కవరీస్‌ ఆఫ్‌ టొపొలాజికల్‌ ఫేజ్‌ ట్రాన్సిషన్స్‌ అండ్‌ టొపొలాజికల్‌ ఫేజెస్‌ ఆఫ్‌ మాటర్‌” అనే అంశంపై వారు చేసిన పరిశోధనలకుగాను వారికి నోబెల్‌ బహుమతి లభించింది. సూపర్ కండక్టర్స్ (అతివాహకత),సూపర్ ఫ్లూయిడ్స్ (అతి ప్రావాహికత), మాగ్నెటిక్ ఫిల్ములు (అయస్కాంత పట్టీలు), ఇతర అంశాలపై గణితభావన అయిన టోపాలజీని ఉపయోగించిన వారి విస్తృత పరిశోధనలకు గుర్తింపు లభించింది. దీని ద్వారా క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ కొత్తతరం కంప్యూటర్లు, నానో టెక్నాలజీ అభివృద్ధికి బాటలు ఏర్పడ్డాయి.
ఎవరీ త్రిమూర్తులు?
ఈ ఏడాది నోబెల్ అందుకొన్న థౌలెస్ (82), హాల్డేన్ (65), కోస్టర్లిట్జ్ (73) బ్రిటన్‌లో జన్మించిన వారే. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నారు. థౌలెస్ వాషింగ్టన్ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా, హాల్డేన్ నూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో, కోస్టర్లిట్జ్ రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. 
థౌలెస్‌(82).. 1934లో బియర్స్‌డెన్‌లో జన్మించారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో ప్రొఫెసర్‌ ఎమిరిట్‌సగా వ్యవహరిస్తున్నారు. 
1951లో లండన్‌లో జన్మించిన హాల్డేన్‌ (65).. న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 
1942లో అబెర్డీన్‌లో జన్మించిన కోస్టర్‌లిట్జ్‌ (73).. ప్రస్తుతం రోడ్‌ఐలండ్‌ (అమెరికా)లోని బ్రౌన్‌ యూనివర్సిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. 
నోబెల్ కమిటీ అనూహ్య నిర్ణయం:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ కమిటీ షాకిచ్చింది. గురుత్వాకర్షణ తరంగాలు (గ్రావిటేషనల్ వేవ్స్)ను కొనుగొన్న శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ లభించవచ్చని అందరూ 
ఊహించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పదార్థాల వింత ప్రవర్తన, స్థితి, దశలపై ప్రపంచానికి తెలియని విషయాలను వెల్లడించిన ముగ్గురు బ్రిటన్ శాస్త్రవేత్తలును ఈ పురస్కారానికి ఎంపిక చేసి కమిటీ ఆశ్చర్యపరిచింది.
బహుమతి ఎంత? ఎవరికెంతెంత?
బహుమతి మొత్తంలో సగభాగం డేవిడ్‌ థౌలస్‌కు, మిగిలిన సగభాగాన్ని డంకెన్‌హాల్డెన్‌, కోస్టర్లిజ్‌లకు ఇస్తారు. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు సంపాదించిన ఆహారంలో సగం భీముడికి పెట్టి మిగిలిన సగాన్ని మిగతావారికి కుంతి పంచేదట. అలా థౌలస్ విశేష శ్రమను గుర్తిస్తూ మొత్తాన్ని మూడు సమాన భాగాలగా కాక ఈ పద్దతిని ఎంచుకున్నారు.  ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు సుమారు రూ.6.2 కోట్లు (931,000 డాలర్లు లేదా 8 మిలియన్ల స్వీడిష్ క్రోనోర్లు) నగదు బహుమతి లభిస్తుంది. 
బ్రహ్మపదార్ధం గుట్టువిప్పేందుకు మరోఅడుగు వేశారు
పదార్దం శక్తి పరస్పరం రూపం మారతాయి కానీ కొత్తగా పదార్ధం సృష్టించబడదు. ఇప్పటికే వున్న పదార్ధం నాశనం కాదు అన్న నిత్యత్వ నియమం వరకూ చదువుకుంటున్నాం కానీ పదార్ధం ఎలా ఏర్పడింది అన్న అంశంపై శాస్త్రానికి ఇంకా పూర్తి సమాధానం దొరకలేదనే నిజాన్ని వీరి ప్రయోగాలు కూడా బట్టబయలు చేసారు. సాధారణ న్యూట్రాన్, ప్రొటాన్ కలయికతో కాకుండా సుదూర నక్షత్ర మండలాలనుంచి వెలువడుతున్న అసాధారణ పదార్ధాలపై అధ్యయనం చేసి సరికొత్త పదార్ధాల ఆవిష్కరణలకు వున్న అవకాశాన్ని వీరు చూపించారు. ఖగోళంలో రూపు మార్చుకుంటున్న పదార్ధాలను అధ్యయనం చేసే శాస్త్రం టోపాలజీ. వీరు ముగ్గురూ టోపాలజీలో పరిశోధనలు చేశారు. రూపుమార్చుకుంటున్న పదార్ధాల సమూహాలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందా లేదా సహజసిద్ధంగా ఏర్పడినవా అన్న విషయంలో పరిశోధనలు చేసి భౌతికశాస్త్రంలో ప్రపంచానికి తెలియకుండాబ్రహ్మపదార్థంగా మారిన టోపోలాజి అంశాల గుట్టురట్టు చేయడంలో వీరు సఫలమయ్యారు. థౌలెస్‌, కోస్టర్‌లిట్జ్‌ అత్యంత పల్చనైన అయస్కాంత ఫిల్ములపై (టూ డైమెన్షనల్‌) పరిశోధన చేయగా.. హాల్డేన్‌ వన్‌ డైమెన్షనల్‌ పదార్థంపై పరిశోధనలు చేశారు. 1970-80ల నాటి వీరి ఆవిష్కరణ.. భవిష్యత్తులో మరింత మెరుగైన సామర్థ్యంగల సూపర్‌ఫాస్ట్‌, క్వాంటమ్‌ కంప్యూటర్ల తయారీకి ఉపయోగపడే అవకాశం ఉంది. పదార్థం తాలూకూ అసాధారణ దశలు లేదా స్థితులపై అధ్యయనం చేసేందుకు వారు అత్యంత అధునాతనమైన గణిత విధానాలను ఉపయోగించారని నోబెల్‌ కమిటీ తన ప్రకటనలో వివరించింది.
వీరి ప్రయోగంతో ఏమిటి లాభం ?
ఈ పరిశోధనల ఆధారంగా శాస్త్రజ్ఞులు రూపొందిస్తున్న స్టానీన్‌ అనే టోపొలాజికల్‌ ఇన్సులేటర్‌ భవిష్యత్తులో కంప్యూటర్లలో రాగితో తయారుచేసిన అన్ని పరికరాలనూ రీప్లేస్‌ చేస్తుందని అంచనా. అంటే.. రాగి పరికరాల స్థానంలో ఆ స్టానీన్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. టిన్‌ అణువులతో రూపొందించే ఈ ఇన్సులేటర్‌ చాలా పల్చగా ఉండి.. అత్యధిక ఉష్ణోగ్రతల్లో సైతం అతి తక్కువ నిరోధకతతో విద్యుతను ప్రసారం చేస్తుంది. ఇది కంప్యూటర్ల సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
దీనివల్ల ఆవిష్కరణలతో కొత్తతరం, వేగవంతమైన కంప్యూటర్లు, నానో ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన డిజైన్, రూపకల్పనకు మార్గం ఏర్పడుతుంది. వీరి ఆవిష్కరణలతో కొత్తతరం, వేగవంతమైన కంప్యూటర్లు, నానో ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన డిజైన్, రూపకల్పనకు మార్గం ఏర్పడుతుంది. సూపర్ కండక్టర్స్, సూపర్‌ఫ్లూయిడ్స్, పలుచటి మాగ్నటిక్ ఫిల్మ్‌కు సంబంధించిన అసాధారణమైన దశలు, స్థితి, అంశాలపై విస్తృత అవగాహన ఏర్పడుతుంది. . వీరి ఆవిష్కరణల ఆధారంగా రూపొందే టోపోలాజికల్ మెటీరియల్స్ కొత్త తరం ఎలక్ట్రానిక్స్, సూపర్ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ రంగాలలో ఉపయోగించే అవకాశం పుష్కలంగా ఉంది. అధిక ఉష్ణోగ్రత వెలువడకుండా సూపర్ కండక్టివిటీ ప్రక్రియను కనిష్ఠస్థాయి ఉష్ణోగ్రత వద్ద నిర్వహించడంలో వీరు సఫలమయ్యారు.
కొత్త ప్రపంచానికి దారులు తెరిచారంటున్న నోబెల్ కమిటీ
బహుమతి ప్రధానం సందర్భంగా నోబెల్ కమిటీ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ , కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్‌లో ఈ ముగ్గురు పరిశోధకుల అధ్యయనాలు ఉత్తమ పరిశోధనలకు ఊతమిస్తా యని,. పదార్థాల (మ్యాటర్)లో అసాధారణ దశలు ఉం టాయని తెలియచెప్పటంతో ఓ కొత్త ప్రపంచానికి దారులు తెరుచుకున్నాయని, ఈ పరిశోధనలు భావితరాల శాస్త్రవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తాయని. మ్యాటర్‌కు సంబంధించిన అసాధారణ, సరికొత్త దశల కోసం ఇక అన్వేషణ మొదలైందనీ పేర్కొన్నారు. 
నోబెల్ పురస్కారాల ప్రకటన తర్వాత హాల్డేన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నా ఆవిష్కరణ యథాలాపంగా జరిగింది అని అన్నారు. 
పరిశోధనలను ముందు అర్ధం చేసుకోవడం కూడా చాలా కష్టం..:
టోపాలజీని వివరించేందుకు వాడే మొబియస్ స్ట్రిప్
ఫిజిక్స్‌లో మ్యాటర్, స్పేస్‌కు సంబంధించిన భౌతిక లక్షణాలను పరిశోధించే గణితశాస్త్ర విభాగం టోపోలాజీలో ఈ ముగ్గురు నిష్ణాతులు. పలుచటి పొరలుగా ఉండే మెటీరియల్ లో సూపర్‌కండక్టివిటీ లేదా సూపర్‌ఫ్లూయిడిటీ సంభవించదని చెప్పిన సిద్ధాంతాన్ని థౌలెస్, కోస్టరిలిట్జ్ 1970లో తోసిపుచ్చా రు. 1980లో టూ డైమెన్షనల్‌గా పేర్కొనే ఎలక్ట్రానిక్ కండక్టర్స్ లేయర్లకు సంబంధించిన పూర్వ పరిశోధనలపై అధ్యయనం చేసిన థౌలస్ టోపోలాజికల్ ఇంటేజర్ల విశిష్టతను వివరించారు. అదే సమయంలో కొన్ని పదార్థాల్లో లభ్యమైన సూక్ష్మ మ్యాగ్నెట్ల అంశాల ఆధారంగా టోపోలాజికల్ సిద్ధాంతాలను డంకన్ హాల్డెనే కనుగొన్నారు. ప్రయోగాలను వివరించడానికి రబ్బరు కాఫీ కప్పును వంచి, మెలికపెట్టి, తిరిగి దానిని డోనట్ (పిండిపదార్థం)గా మార్చారు. రెండు ఆకారాల్లో బేధాలున్నప్పటికీ.. వాటిని విడదీయలేమని స్పష్టం చేశారు. 
టోపాలజీ.. మూడు రొట్టెలు.. 
సంక్లిష్టమైన ఫిజిక్స్‌ నోబెల్‌ పరిశోధనలో ముగ్గురు శాస్త్రజ్ఞులూ ఉపయోగించిన టోపాలజీ గురించి నోబెల్‌ కమిటీ సభ్యుడు థోర్స్‌ హాన్స్‌ హాన్సన్‌ మూడు రొట్టెల సాయంతో వివరించారు. ఫిజిక్స్‌ నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించే సమావేశానికి ఆయన సినామున్‌ బన్‌, బాగెల్‌, ప్రెట్జెల్‌ బన్నులను తీసుకొచ్చారు. విజేతలను ప్రకటించాక.. ‘‘టోపాలజీ కాన్సెప్ట్‌ మీకు అంతగా తెలియకపోవచ్చు’’ అంటూ తన వద్ద ఉన్న సంచిలోంచి ఆ మూడు బన్నులనూ ఒక్కొక్కటిగా బయటికి తీసి టోపాలజీ గురించి వివరించారు. దాని ఆధారంగా చేసిన ప్రయోగాలకే వారికి నోబెల్‌ వచ్చిందని తెలిపారు. 
కోనిగ్స్ బర్గ్ వంతెనల సమస్య

టోపాలజీ అనే మాటకు ప్రాణం పోసిన ఒక చిక్కులెక్క లాంటవి సమస్య ఒకటుంది దాని సంగతులొకసారి చూడండి.  అనగనగా కోనిగ్స్‌బర్గ్ (ఇప్పటి కలినిన్‌గ్రాడ్, రష్యా) అనే ఊరు ఆ ఊళ్లో మన హైదరాబాదు నగరంలో మూసి నదిపై ఏడు వంతెలను వున్నట్లుగానే 7 వంతెనలు ఉండేవట అయితే అవి కొంచెం ప్రత్యేకమైన పద్దతిలో వున్నాయి. ఈ పట్టణాన్ని ప్రెగోల్ నది రెండు పాయలుగా ప్రవహిస్తూ, మధ్యలో ద్వీపంతో నాలుగు భాగాలుగా విభజించింది. వాటిని కలుపుతూ ఏడు వంతెనలు ఉండేవి. పట్టణ ప్రజలు “దాటిన వంతెన దాటకుండా అన్ని వంతెనలనీ దాటగలమా?” అని ప్రశ్నించుకునేవారు. వందేళ్ళకు పైగా ఆ ప్రశ్నకి సమాధానం తెలియలేదు. 1736లో ఆయ్‌లెర్ (Euler) అన్న గణిత శాస్త్రజ్ఞుడు “దాటిన వంతెన దాటకుండా అన్ని వంతెనలనీ దాటలేము” అని నిరూపించాడు. అంతేకాదు, దానితో టొపాలజీ (Topology) అన్న ఓ కొత్త గణితశాస్త్రానికి నాంది పలికాడు. 

ఇంచుమించు ఇలాంటిదే మరో సమస్య కూడా ఉంది. చిన్నప్పుడు అందరూ దాంతో ఆడుకుని ఉంటారు. పక్కన కనిపించే చిత్రాన్ని  చెయ్యి ఎత్తకుండా, గీసిన గీత మళ్లీ గియ్యకుండా, పెన్నుతో కాగితం మీద గీయాలి.అయితే దాన్ని సాధించడం ఎన్నటికీ కుదరదు. (ఒకవేళ పేజీ మడిచి, మడత పేచీ పెట్టి మోసం చేస్తే తప్ప). అయితే అలా ఎన్నటికీ గీయలేకపోవడానికి కూడా శాస్త్రీయంగా కారణాన్ని తెలుసుకోవాలి. అప్పుడే విషయాన్ని అర్ధం చేసుకున్నట్లుఅవుతుంది. 
అదృష్టవశాత్తు ఈ విషయాన్ని రుజువుచేయడం మరీ అంత కష్టంమైన విషయం కాదు

నిరూపణని వివరించే ముందు కొంచెం పరిభాషని పరిచయం చెయ్యాలి. పై చిత్రాలలో పలు గీతలు కలిసే బిందువుని శీర్షం (vertex) అంటారు. శీర్షాలని కలిపే గీతలని అంచులు (edges) అంటారు. ఒక శీర్షం వద్ద కలిసే మొత్తం అంచుల సంఖ్యని సత్తా (degree) అంటారు. అలా శీర్షాలని అంచులతో కలపగా ఏర్పడే జాలాలని graphs అంటారు. అలాంటి గ్రాఫ్ ల అధ్యయనాన్నే జాల సిద్ధాంతం (graph theory) అంటారు.
ఇప్పుడు చిత్రం 2 లోని చిత్రాన్ని పెన్నుతో గీసిన గీత గియ్యకుండా, చెయ్యెత్తకుండా, గీసినప్పుడు ఒక శీర్షం దరిదాపుల్లో పెన్ను కదలికలు ఈ మూడు రకాలుగా ఉంటుంది:
1వ రకం: ఒక అంచు వెంబడి శీర్షాన్ని చేరి, మరో అంచు వెంబడి శీర్షానికి దూరం అవుతుంది.
2 వ రకం: శీర్షం నుండి బయలుదేరి, ఆ శీర్షాన్ని తాకే ఒక అంచు ద్వారా అక్కణ్ణుంచి దూరంగా జరుగుతుంది.
(అలాంటప్పుడు ఆ శీర్షం పెన్ను యొక్క మొత్తం రేఖా పథానికి మొదటి బిందువు అవుతుంది.)
3వ రకం: ఒక అంచు వెంబడి శీర్షాన్ని చేరుకుని ఇక ముందుకి పోకుండా అక్కడే ఆగిపోతుంది. (అంటే ఆ శీర్షం
పెన్ను యొక్క మొత్తం రేఖాపథానికి చివరి బిందువు అన్నమాట.)
ఏదైనా శీర్షం యొక్క సత్తా సరి సంఖ్య అయితే, దాని వద్ద పెన్ను కదలికలు 1 రకం కదలికలు అవుతాయి.
ఏదైనా శీర్షం యొక్క సత్తా బేసి సంఖ్య అయితే, దాని వద్ద పెన్ను కదలికలు పై మూడు రకాలలో ఏ రకమైనవైనా కావచ్చు.
పెన్ను యొక్క రేఖా పథానికి కొసలు రెండే ఉంటాయి కనుక బేసి సంఖ్యలో సత్తా ఉన్న శీర్షాలు రెండే ఉండాలి. అప్పుడు పెన్ను వాటిలో ఒక దాని వద్ద మొదలై, రెండవ శీర్షం వద్ద ఆగుతుంది. లేదా అన్నీ సరి సంఖ్య సత్తా గల శీర్షాలు అయితే పెన్ను ఆరంభం అయిన బిందువు వద్దనే చివరికి ఆగుతుంది.
అంటే పై సమస్యకి పరిష్కారం ఉండాలంటే ఇదీ నియమం:
“బేసి సంఖ్య సత్తా గల శీర్షాలు ఉంటే రెండు గాని, లేకుంటే సున్నాగాని ఉండాలి.”
పైన చెప్పుకున్న కోనిగ్స్ బర్గ్ సమస్య కూడా ఇలాంటిదే. వంతెనల అమరికని ఒక గ్రాఫ్ రూపంలో వ్యక్తం చేస్తే ఇలా ఉంటుంది

ఈ గ్రాఫ్ లో మొత్తం నాలుగు శీర్షాలు, ఏడు అంచులు (వంతెనలు) ఉన్నాయి. నాలుగు శీర్షాల్లోమూడింటి సత్తా మూడు (బేసి సంఖ్య). ఒక దాని సత్తా నాలుగు. బేసి సంఖ్య సత్తా ఉన్న శీర్షాలు రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి కనుక సమస్య పరిష్కరించడానికి కావలసిన నియమాలు ఉల్లంఘింపబడ్డాయి. అంటే కోనిగ్స్ బర్గ్ సమస్యకి పరిష్కారం లేదన్నమాట.
ఈ నియమాలని మొట్టమొదట సూత్రీకరించిన వాడు ప్రఖ్యాత గణితవేత్త ఆయిలర్ (Euler). ఆ నియమాలు ఉల్లంఘించబడితే పరిష్కారం ఉండదన్నది గుర్తించడం సులభమే. అలాంటి నియమాలని అవసరమైన నియమాలు (necessary conditions) అంటారు.
కాని ఆ నియమాలు ఉల్లంఘింపబడకపోతే పరిష్కారం ఉంటుందని నమ్మకం ఏమిటి? అంటే ఆ నియమాలు సంపూరక నియమాలా (sufficient conditions) అన్న ప్రశ్న వస్తుంది. ఇవి సంపూరక నియమాలు కూడా అని నిరూపించినవాడు పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన జర్మన్ గణితవేత్త కార్ల్ హీర్ హోల్జర్ (Carl Hierholzer). హీర్ హోల్జర్ తన మరణానికి కొంచెం ముందుగా ఈ సమస్య పరిష్కారాన్ని తన మిత్రుడికి వివరిస్తే, హీర్ హోల్జర్ మరణానంతరం ఆ మిత్రుడు ఆ నిరూపణని ప్రచురించాడట.
కోనిగ్స్ బర్గ్ వంతెనల సమస్య ఒక విధంగా Graph theory కి శ్రీకారం చుట్టింది. అంతే కాదు, ఆ సమస్య టోపాలజీ (Topology) అనే ఓ ముఖ్య గణిత విభాగానికి పునాది రాళ్లలో ఒకటయ్యింది.

from Blogger http://bit.ly/2cSyTGg
via IFTTT

Standard
సమీక్ష

కాకిపడిగెలు, సాధనా శూరులు

రవీంద్రభారతి “పైడి జయరాజ్ మినీ హాల్ లో ఈ రోజు(04-10-2016 Tue) బతుకమ్మ పండుగ నేపధ్యంలో జరుపుతున్న సాంస్కృతిక ప్రధర్శనలలో ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో సినిమాకు స్థానం ఇవ్వడమే ప్రత్యేకమైతే అందులో తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబిచే అంశాలకు స్థానం ఉండటం మరీ సంతోషం. కులలను ఆశ్రయించుకున్న కళలు కళాకారులు అంతరించిపోకముందే వారి కళారూపాలను వెతికిపట్టుకోవడం వారి జీవనాన్ని తరచిచూడడం రెండూ అవసరమే, ఇవ్వల్టి కార్యక్రమంలో ఆ పనిచేసారు.
ఒకటి సాధనా శూరులు వారి మాజికల్ ప్రదర్శనను రెండు కెమేరాలూ ఒక థ్రోణ్ ఉపయోగించి చక్కగా షూట్ చేసారు అంతే గొప్పగా ప్రజెంట్ చేసారు. పద్మ శాలీలను మాత్రమే అర్చించే వారిని సాధనా శూరులు అని పిలుస్తూ వుంటారు. వీరి ప్రదర్శనాలను అందరికీ ప్రదర్శిస్తారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సంచారం చేస్తూ ప్రతి గ్రామం లోని పద్మశాలీల అనుమతితో వీరు ప్రదర్శనలు ప్రారంభిస్తారు. వీరి ప్రదర్శన ఇంద్ర జాలానికి సంబంధించింది. వీరి ప్రదర్శనం పగటి వేళే జరుగుతుంది.వీరి కళారూపాల సాధనకు నిష్ట అవసరమంటారు. వీరి పనులు కనికట్టు గారడీగా వుంటాయి. క్రీస్తు శకం 234 నాటికాలం నుంచే ఈ ప్రక్రియ వుందని చారిత్రక ఆధారాలు చెపుతున్నాయట. ప్రస్తుతం అంతరించే దశలోవున్న ఈ కళను కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో చేసిన సాధనా శూరుల ప్రదర్శనను శివ.జి చాలా చక్కగా తెరకెక్కించారు. ఫ్రదర్శన సందర్శంగా చూపిన వారి విద్యలను ఒక్కటొక్కటిగా వివరిస్తూ ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఉదాహరణకు రెండు చేతులతో చేసే కర్రసాము, గుండెలపై రాళ్ళను పగలగొట్టించుకోవడం, కట్లను విడిపించుకోవడం, నీళ్ళలో వేసిన ఇసుక పసుపు లాంటివాటిని మళ్ళీ పొడిపొడిగా రప్పించడం వంటివి డీటైల్ గా చూపారు. దానికి అధనంగా వారి జీవన స్థితిగతులపై భాష్యం ఆలోచింపచేసేదిగా వుంది.
==>>రెండవది కాకిపడిగెల వారి నేపద్యంపై డాక్యుమెంటరీ…
కాకిపడిగెలు ముతరాశి లేదా ముదిరాజ్ కులానికి ఆశ్రితకులంగా వుంటూ వారి కులోత్పత్తి(జీనియాలజీ) పారంపర్యత, సాంస్కృతిక నేపద్యం తరాలు గడిచిన మరిచిపోకుండా అందించేందుకు కృషిచేస్తున్న వారు. మిరాశీ వున్న గ్రామాలలోకి వెళ్ళి త్యాగం(తాగెం)ను ప్రతిఫలంగా తెచ్చుకుంటారు. నిజానికి బెగ్గింగ్ కాదు. వీరు అడుక్కునే వారు కాదు.
కాకిపడిగెలవారు మూడు రకాలుగా కథలు చెప్తారు. మొదటివి త్యాగం కథలు, రెండోవి చావుకథలు, మూడోవి ఉల్ఫా కథలు. పూర్వం ఐదు లేదా తొమ్మిది రోజులు కథలను ప్రదర్శించేవారు. ప్రస్తుతం తగ్గించారు. ప్రధానంగా వీరు చెప్పే కథల్లో ముదిరాజ్‌ల వృత్తాంతం, పాండవుల పుట్టుక, ధర్మరాజు జూదం, పాండవుల వనవాసం, విరాటకొలువు, ద్రౌపది స్వయంవరం, బకాసురవధ, కీచకవధ, గారములకోట, సుభద్రాపరిణయం, కర్ణునిపెళ్ళి, సహదేవకళ్యాణం, గోవులచెర, శశరేఖ పరిణయం, నవలోకసుందరి, రంభారంపాల, మాయాబజార్‌, గదాయుద్ధం, భీష్మమరణం, భీమ విషమన్నం, అభిమన్యు మరణం, దుర్యోధన మరణం, కురుక్షేత్రం, అల్లిరాణి, లక్షాగృహం, రాజసూయ యాగం, భీమాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణరాయభారం మొదలగునవి ముఖ్యమైనవి.
=> .. కాకిపడిగెల వారికి ఈ పేరు రావడం వెనకకూడా ఒక కథవుంది.
పూర్వం ముదిరాజ్‌ వాళ్ళలో ఐదుగురు అన్నదమ్ములు కల్సి పెందోట వనం చేసి ఆ వనానికి కావలి ఉండేవారు. అయితే ఒకరోజు అవుసలి బ్రహ్మ పండ్లు పెట్టమని వీరితోటకు వచ్చాడు. అతనికి పండ్లు పెట్టలేదు. ఎంత గట్టిగా పెట్టమని మాట్లాడినా కూడా వీళ్లు పెట్టక అతన్ని పెందోట వనం నుండి వెళ్ళగొట్టినారు. దీనితో అవుసలి బ్రహ్మకు కోపం వచ్చి ఒక బంగారు కాకిని చేసి ప్రాణం పోసినాడు. ఆ కాకి పెందోట వనంలోని పండ్లన్ని పాడుచేస్తుంటే ఈ ఐదుగురు ముదిరాజ్‌లకు కోపం వచ్చింది. అందులో చిన్నోడు ఒక బాణం తీసి ఆ కాకికి వేస్తే అది రెక్కలు విరిగి పడిపోతుంది. దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చి ”అమ్మా! నేను కాకిని పట్టుకొని వచ్చిన” అంటాడు” అందుకా తల్లి ”మనం ముదిరాజ్‌ వాళ్ళం. మనం మాంసం తినేవాళ్ళం కాదు. సూర్యున్ని చూసి చుక్కబొట్టు పెట్టం. చంద్రున్ని చూసి చంద్రవంక పెట్టం, వరాహావతారం ఎదురొచ్చినదంటే ఏడు నూతలల్ల స్నానం చేసి వచ్చేవాళ్ళం. అట్లాంటిది నీవు కాకిని చంపి కాకిని పట్టుకొని వచ్చినావు కాబట్టి కాకిపడిగెల వానివై పక్కనుండాలి” అని శపించింది. దానితో ”అమ్మా! నీవు శపించినావు కాబట్టి నేను పక్కకే ఉంటాను” అని అన్నం తినకుండా పక్కకుంటాడు.కొడుకు అన్నం తింటలేదని బాధపడి ఆ తల్లి ”కొడుకా! ఎన్ని రోజులు ఇట్ల అన్నం తినకుండా పక్కకుంటావు బిడ్డా” అని అన్నం తీసుకపోయి పెడుతుంది.
అప్పుడు ”అమ్మా! నీవు పక్కకు కూర్చోని అన్నం పెట్టినావు కాబట్టి నీ ఇంటోల్లకు నాకు అన్నం పొత్తు ఉంటుంది. నీవు తెచ్చి పెడితేనే తినాలి కాని నేను నీ ఇంట్లోకొచ్చి తినను” అంటాడు. అప్పుడు ఆ తల్లి ”మన ఇండ్లల్ల ఎవరైనా పుడితే పురుడు కట్నం, పెడితే పెండ్లి కట్నం, సమర్త అయితే కట్నం, చస్తే చావు కట్నం నీకు ఇస్త అని కట్టుచేసి, మనకు పాండవులంటే మనకిష్టము కదా! వాళ్ళకు సంబంధించిన 
వృత్తాంతము చెబుతూ ముదిరాజులను అడుక్కొని బ్రతుకు బిడ్డా” అని చెప్పింది. అప్పటి నుండి కాకిపడిగెల వాడై పాండవుల కథ చెపుతూ జీవనం గడుపుతున్నాడు. ఇట్లా కొంతకాలానికి ఊరికే నోటితో చెప్పితే సరిగా అర్ధమయితలేదని గుడ్డమీద మహాభారతం సంబంధించి బొమ్మలు వేయించి బొమ్మలు చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదేవిధంగా కథ చెపుతూ ముదిరాజ్‌ వాళ్ళను త్యాగం అడుక్కొని జీవిస్తున్నారు.
త్యాగం కథలు అయిపోయిన తరువాత పాళ్ళ ప్రకారం ముదిరాజ్‌ వాళ్ళకు ఎన్ని డబ్బులు పడతాయో అన్ని ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసుకొని మొత్తం వసూలు అయిన తర్వాత వేరొక ఊరికి వెళ్ళిపోతారు.కానీ ఇప్పటి రోజుల్లో కథచెప్పించుకునే వూర్లు లేవు. కనికరించే నాధుడూ లేదు. కనీసం కాస్టు సర్టిఫికెట్లో సైతం స్వంతం కులం పేరుకి అవకాశం లేక బిసి డిలోనే రాసుకుంటున్నారు. 
కాకిపడిగెల వారి జీవనస్థితి గమనిస్తే ఆర్థిక విషయంలో ఇతర ఆదార మార్గాలను వెతుక్కోవడంతో పూర్వానికి ఇప్పటికి కొంత మెరుగైనట్లు అనిపిస్తుంది. కాని ఆదరణ విషయంలో చాలా తగ్గింది. వారి అభిప్రాయం ప్రకారం ఈ తరం పోతే తమను చూసే వారు ఆదరించే వారు ఉండరేమో అని అంటున్నారు. సామాజికంగా వారి పరిస్థితి దయనీయంగానే ఉంది.

http://bit.ly/2dRFoGB

from Blogger http://bit.ly/2de83or
via IFTTT

Standard