వివరణ, సమీక్ష, Telugu

చిన్నికృష్ణుడి పద్యంలో పట్టుదట్టీ, సందెతాయతులు అంటే ఏమిటి?

చిన్నప్పుడు నేను నేర్చుకున్న మొదటి పద్యం ఇదేననుకుంటా, అమ్మనేర్పించిన పద్యం నాన్న వల్లెవేయించిన పద్యం పైగా మాకప్పుడు రెండో తరగతిలోననుకుంటా మొదట్లోనే ఈ పద్యం వుండేది. ఇప్పుడీ పద్యాలేవీ కనిపించడంలేదు. పండుగలూ పద్యాలూ కేవలం భక్తినే నేర్పిస్తాయా? చరిత్రను తెలుసుకునేందుకు కూడా పనికొస్తాయా? బాగా తెలిసిన వాటిల్లోకి సైతం లోతుగా చూడటం మానేసాం. కొంచెం తరచిచూస్తే, ఏదైనా ఒక ప్రశ్న అడిగే వారుంటే చాలా విషయాలు చెప్పాలని ఎదురు చూస్తున్న సాహిత్యఆధారాలుగా పద్యాలు, ఊరిపేర్లు, పాతపుస్తకాలు, తాళపత్రాలూ, పండుగ ఆచారాలూ ఎదురుచూస్తూనే వున్నాయి. 

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు

ఈ పద్యాన్ని ఈమధ్య కాలంలో చదివినప్పడు నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

  • పట్టుదట్టి అంటే ఏమిటి? పట్టుబట్టటం లాంటిదా? పట్టు వస్త్రం లాంటిదా? 
  • అప్పట్లో సంది జ్వరం వస్తే పిల్లలకు కట్టె సందికాయలు, సంది తాయత్తులు లాగా చిన్ని కృష్ణుడికి కూడా వాళ్లమ్మ తాయత్తు కట్టిందని పద్యకర్త ఊహిస్తున్నాడా? లేక సందిట తాయతు అనాలా? మరేదన్నా అర్ధం వుందా? 
  • బంగరు అనాలా బంగారు అనాలా? 
  • మొలత్రాడు లేదా మొలతాడు అంటే సరిపోతుందా? 
  • చిన్ని కృష్ణాఆ.. అంటూ దీర్ఘం వుందా చిన్నికృష్ణ అంటే సరిపోతుందా?
  • సరిమువ్వలా సిరిమువ్వలా? 

సరే ఒకసారి నాకు అర్ధమయినంత వరకూ నేను పరిశీలించిన విశేషాలు మీముందుంచుతాను. మరేమైనా సవరణలుంటే పెద్దలు, విజ్ఞలు తెలియజేస్తే సంతోషంగా భావిస్తాను. 

సందర్భం : యశోద ఇంట పెరుగుతున్న చిన్ని కృష్ణుడి రూపాన్ని వర్ణిస్తూ కవి అటువంటి కృష్ణా నిన్ను చేరి కొలుస్తానయ్యా అని భక్తిగా చెపుతున్నారు. మరి ఆ కవి గారు నిజంగా గోపాల కుటుంబంలో పెరిగే కృష్ణుడిని చూసి వుంటారా? ఖచ్చింతంగా లేదు. ఆయన కూడా శృతంగా వస్తున్న బాగవత కథనం ఆధారంగా వారి ఊహను జోడించాలి. ఇక అప్పుడు కనిపించేదెవరు. తన కాలంలో తను చూసినంతలో ముచ్చటగా మురిపెంగా పెరుగుతున్న చిన్నారి బాలలకు కృష్ణుడి రూపాన్ని ఆపాదించాలి. బహుశా కవి అదే చేసి వుంటారు. 

వర్ణన లోని విశేషాలు  

చేతవెన్నముద్ద: గోపాలుర ఇంట పిల్లలకు సులభంగా అరిగుదలకు సహకరించేది, బలవర్ధకమైనదీ, ఇష్టంగా పెట్టేదీ ఏముంటుంది వెన్ననే కదా. బహుశా నెయ్యి తినడం కంటే వెన్న శ్రేష్టం ఆరోగ్యకరం అని ఇప్పటికీ చెపుతున్నారు కదా. అటువంటి వెన్నను చేతిలో పట్టుకుని వున్నాడట. వాళ్ళ అమ్మ పెట్టే వెన్న చాలకుంటే గోపికల దగ్గర వెన్నను దొంగిలించయినా తినేంత చిలిపివాడు వెన్నపై ఇష్టమున్నవాడూ కృష్ణుడని కధనమే కదా. 

చెంగల్వ పూదండ : కలువలు రాత్రిపూట వికసించే పుష్పాలయితే తామరలు (కమలాలు) పగటిపూట వికసిస్తాయి. ఆ కలువ పూవు కూడా ఎర్రనిదట. చెన్ను + కలువ = చెంగల్వ అంటే ఎఱ్ఱకలువ, హల్లకము; The red water lily. ఎర్రకలువ. చెన్ను (చెన్ ) ను ఎరుపు అనే అర్ధంలోనే కాక అందము (Grace, beauty ఉదాహరణ చెన్నుడు a beau or fop, అందగాడు) విధము (Manner) అనే సందర్భాలకోసం కూడా వాడినప్పటికీ అందమైన కలువ అనికాక ఎర్రకలువ అనేదే ఇక్కడ పొసుగుతుందని భావిస్తున్నాను. తమిళంలో సెందామరై, కన్నడలో కెంపుదావరై పదాలు కూడా ఎఱ్ఱ కలువనే సూచిస్తున్నాయి. రాత్రి పూసిన ఎర్రకలువను ఎవరో భృత్యుడు లేదా ఇష్టులు తీసుకొచ్చి చిన్నారి బాలకుడికి ఆడుకునేందుకు ఇచ్చివుంటారు. లేదా తల్లి మురిపెంగా తన బుజ్జాయికి అలంకరించి వుంటుంది. ఇప్పటికీ అమ్మలు చిన్న పిల్లలు మగపిల్లవాళ్ళయినప్పటికీ పూలతో అలంకరించడం మనం గమనిస్తూనే వుంటాం కదా. 

బంగరు మొలతాడు : కటిశృంఖల, కటిసూత్రము, ధటిని, శృంఖలము, మొలకట్టు అనేవి నడుముకు కట్టుకునే వస్త్రాన్ని జారిపోనీయకుండా పట్టుకునే విశేషణం గానే కాక, ఆటవిక జీవనంలో సైతం వివిధ ఆయుధాలను విరామ సమయంలో దోపుకునే అవసరంగా వుండేది. ఇప్పటికీ సైనికులూ పోలీసులూ తుపాకులు పెట్టుకునే హోల్ స్టర్ కానీ, అప్పట్లో కత్తిని పెట్టుకునే ఒరలు కానీ నడుముచుట్టూ వున్న బెల్ట్ (belt) వంటి దానినే ఉపయోగించాలి. waist string or thread అనేది ఒక సంప్రదాయంగా మారి మగపిల్లలకు మొలతాడు కట్టకపోతే హాని జరుగుతుందనే నిర్ణారణలకు సైతం వచ్చేసారు. అంటే ఆయుధాలను సరిగా భద్రపరచుకోలేదనీ, అంగవస్త్రం జాతిపోతుంటే వేటలోనో, పోటీలోనో,యుద్దంలోనో, కృరజంతువులనుండి తప్పించుకునేప్పుడో సక్రమంగా పనిచేయలేక నష్టపోయే అవకాశం వుంటుదన్న ధ్వనివుండవచ్చు. జాతియంగా కూడా మొలతాడు కట్టిన మొగవాడెవరన్నా వుంటే రమ్మను అనటం మనకి బాగా తెలుసు. తమిళం అణ్ణాకయిర్‌, కన్నడలో పురుషార ఉడుదార అని పిలిచే ఈ మొలతాడు వారి వారి స్థొమతలను అనుసరించి వెండి లేదా బంగారం తో చేయించుకునే వాళ్ళు. ఈ చిన్ని కృష్ణుడు తన మ్రొలకు కట్టుకున్న దారం బంగారపుదట. ఈ ఆటవెలది పద్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బంగారు అనేపదం పొసగదు, బంగరు అనే పదం అలాగే త్రాడు అనికాక తాడు అనే పదం ఆటవెలది నియమాలకు సరిపోయి ఈ పద్యంతో పొసుగుతాయి. సంస్కృతీకరణలో భాగంగానే, స్వచ్ఛ ఉచ్చారణ అంటూ పొరబడుతూనే ఈ పదాలను మరికొంత సాగదీయటం చాలాచోట్ల గమనించాను.

బంగారు అంటూ గ కు దీర్ఘం ఇస్తే ఆటవెలదిలో పొసగటం లేదు

పట్టుదట్టీ : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు (1903 vi.106) ప్రకారం దట్టీ లేదా దట్టి అంటే A sash, belt, girdle, cestus round the waist. నడికట్టు, కాసెకోక అంటే అడ్డముగా చుట్టు కట్టుకొనిన పంచకట్టునే దట్టీ అంటారు. అయితే బంగారపు మొలతాడు కట్టే స్థొమత వున్నవాళ్ళు కాబట్టి శ్రేష్టమైనదిగా చెప్పుకునే పట్టుతో చేసిన దట్టీ కట్టారు అని అనుకోవచ్చు. మరొక అర్ధంలో తెల్లని, లేదా నాజూకైన సన్నని వస్త్రంతో నేసిన పంచెకట్టు కట్టుకున్నాడని కూడా అర్ధం వస్తోంది. తెలంగాణా ప్రాంతంలో పట్టుదడియాలు అంటే సన్నని వస్త్రము, తెల్లని గుడ్డ అనే అర్ధాలున్నాయి ఈ విషయాన్ని తెలంగాణా పదకోశంలో శ్రీయుతులు నలిమెల భాస్కర్ గారు ప్రస్తావించారు. చిన్నికృష్ణుడే కాదు మానవుడు ఏర్పాటు చేసుకున్న చాలా మంది దేవుళ్ళకు వారి ఊహలకు అందిన కాలంనాటి వస్త్రధారణే వుంటుంది. ఆయా దేశీయమైన వస్త్రదారణలను ఆయా దేవతలకు మనుషులు ఆపాదించారు. చూడండి బ్రహ్మ చేతిలో తాటాకులపై రాసిన పుస్తకం వుంటుంది కానీ ప్రింట్ చేసిన పుస్తకమో, ఇప్పటి ఆధునిక టాబ్లెట్ పామ్ టాప్ లో వుండవు. పురాతన కాలంలో సృష్టించుకున్న దేవుని రూపాలు, సాహిత్యకాలానికి కొంత మార్పులకు లోనయినప్పటికీ ఆ తర్వాత పెద్దగా పరివర్తనం చెందించకుండా దానినే కొనసాగించడం చేస్తున్నాం. దీంతో గుణభక్తిస్థానంలో రూపభక్తి కూడా ప్రధానంగా చేరిపోయిందిప్పుడు. 

సందెతాయతులు : తాయితు, తాయెతు తాయెత్తు అంటే రక్షరేకు లేదా తావీజు అనే అర్ధంలోనే ఎక్కువగా తీసుకుంటున్నాం. దీని అర్ధాన్ని మరికొంచెం శ్రద్దగా పరిశీలిస్తే తాయి + ఎత్తు అని కదా తాయి అంటే తల్లి లేదా పిన్ని. An amulet, or charm containing things supposed to bring luck. తల్లి బిడ్డలకుకట్టే రక్షరేకు. సందె అనే పదాన్ని సంది జ్వరం అనే అర్ధంలోనే కాక సందిట అని తీసుకుంటే మరింత సరిపోతోంది. దండచేతికి అలంకరణ చేసుకోవడం ఈ పద్యరచన చేసిన కాలంలో ఒక అవసరం కూడా యుధ్దంలో ప్రధానంగా దాడిచేసే శరీరభాగాలను కవచాలతో కప్పివుంచుకోవాలి. తలకు శిరస్త్రాణం, ఒంటికి కవచం లాగానే, దండచేతికి కూడా ఉక్కు పట్టీలను పెట్టుకునే వారు. వాటిపై కత్తి, బల్లెం వంటివాటి ద్వారా దాడిజరిగినా రక్షణ వుండాలని. అదే పద్దతిలో దండచేతులపై బంగారపు వెండి అలంకరణలనూ, పూదండలనూ ధరించడం ఆనవాయితీ. సందికడియము అంటే An ornament worn upon the upper part of the arm. An armlet, కేయూరము. a stout bangle or double bangle worn on the upper arm, అలాగే కేయూర భూషణము కుసుళ్ళు, దండకడియము, బాహుదము, బాహుపురి, బాహుభూష, బాహుభూషణము, భుజకీర్తి, సందిక(డె)(డియ)ము, సందిదండ అనేవి వాడుకలో వున్న పేర్లు. ఉదాహరణకు సందికడియంబు అనివాడిన ఇతర పద్యాలుకూడా వున్నాయి. కావడియుట్లు చిక్కము సందికడియంబు నూకలతోఁప పొగాకుతిత్తి అనేదానిలోనూ సంది కడియం ప్రస్తావన కనిపిస్తుంది. కన్నడలోనూ దీన్ని కేయూర భూషణమనే అంటారు. తమిళంలో మేల్ కైయిల్ అణియం వళైయమ్ అంటారట. వాళ్ళమ్మ చిన్ని కృష్ణుడి దండచేతిపై చేసిన అలంకరణ గురించి కవిగారు మనతో చెపుతున్నరిక్కడ.

తాయత్తులు అంటే అస్సలు సరిపోవడం లేదు

సరిమువ్వ గజ్జెలు : ప్రాంతీయ మాండలిక పదకోశంలో మువ్వలు అనే పదాన్ని కళింగ ప్రాంతంలో ఎక్కువగా వాడతారనీ, గజ్జెలు అనే పదాన్ని తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వాడతారనీ రాసారు. ఇక్కడ మువ్వలు, గజ్జెలు రెండూ వాడారు. నిజానికి మువ్వ అనేది గజ్జెలలో ఒక భాగం, తమిళంలో మునైయిల్‌ మూన్డ్రు ఇడై సందుగళుడైయ గజ్జై లేదా కన్నడలో మూరుతూతుగళ దొడ్డ గజ్జె అని చెప్పడంలో మొనలోమూడు సందులు గల పెద్దగజ్జె అంటూ బహుజనపల్లి సీతారామాచార్యులు [శబ్దరత్నాకరము 1912 ] గారూ పేర్కొన్నారు. సరి సంఖ్యలో వున్న మువ్వలతో కట్టిన గజ్జెలు అని అర్ధం కావచ్చు, సిరి మువ్వ అంటూ లక్షణమైన, సంపదకరమైన అంటూ సిరిని లక్ష్మి అర్ధంలో చెప్పివుంటారేమో అనుకున్నప్పటికీ అది కూడా చందస్సుకు సరిపోవడం లేదు. సరిమువ్వ అనేదే సరైన పదం అవుతోంది. మువ్వలను ఒక క్రమంలో పేర్చికట్టి తయారు చేసే గజ్జెలను పిల్లల కాళ్ళకే కాక నాట్య ప్రదర్శన సమయాల్లోనూ, జానపద కళల ప్రదర్శనల్లోనూ, పశువుల మెడల్లో అలంకరణలు గానూ వాడటాన్ని గమనిస్తాం. పిల్లలు ఆడుకుంటూ వున్నప్పుడు తల్లులు ఏదన్నా పనిచేస్తున్నప్పటికీ వారు దూరంగా వెళితే తెలియటం కోసం కూడా ఇవి ఉపయోగపడేవి. అసలే చిన్ని కృష్ణుడు ఒకదగ్గర వుండేవాడు కాదాయే అందుకే ఇవి మరింత బాగా ఉపయోగపడివుంటాయి.

సిరిమువ్వలు కూడా గణ విభజనలో కుదరటం లేదు. 
కృష్ణుడు చిన్నవాడే అయినా దీర్ఘం తీయకుండానే ఈ పద్యంలో పలుకుతాడ్లెండి

ఈ విధంగా చిన్ని కృష్ణుడి రూపాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించిన కవి, చివరి పాదంలో తన భక్తిభావాన్ని చాటుకున్నాడు. అయితే కృష్ణా అంటూ దీర్ఘం తీస్తూ చాలా మంది పద్యాన్ని పాడుతున్నారు కానీ దీర్ఘం లేకుండా ఆటవెలదికి చక్కగా సరిపోతోంది.

from Blogger http://bit.ly/2f0moXG
via IFTTT

Standard
Telugu

దేవరకొండ బాల గంగాధర తిలక్ || నీడలు

( జనసేన పార్టీని ప్రారంభిస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని లైన్లు ఈ కవితలోనివే )

చిన్నమ్మా
వీళ్ళమీద కోపగించకు
వీళ్ళ నసహ్యించుకోకు
నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు

చిన్నమ్మా
వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటిని గురించి భయం సంఘం భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు

చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌడ్యం వాళ్ళ బలాడ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్య తరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకు రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్చావర్తనకి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు

చిన్నమ్మా
వీళ్ళందరూ సగం సగం మనుష్యులు
మరోసగమ్ మరుగునపడిన భయస్తులు బాధాగ్రస్తులు
భారతం, భాగవతం చదువుతారు
పాపం,పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా ఉన్నట్లు నటిస్తారు
చప్పబడిన నిన్నటి మాటలనే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు
వీళ్ళందరూ ముక్కలైన గాజుపెంకులు
చెల్లాచెదురైన మూగ ముత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తామే మోసగించుకునే విధ్యాధికులు విధూషకులు
తమ చెట్టు కొమ్మని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు

చిన్నమ్మా
వీళ్ళను విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య
డైనమైట్ పేలాలి
డైనమోలు తిరగాలి
కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
ధారిపక్క నిల్చిన మోడుచెట్ల భాధని అనువదించాలి
పచ్చికలో ధాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి

చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది
శిథిల సంధ్యా గగనం రుథిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు, ఇల్లేమో దూరం
చేతిలో దీపమ్ లేదు, ధైర్యమే ఒక కవచం

from Blogger http://bit.ly/1gq7Yv9
via IFTTT

Standard
వివరణ, Telugu

మా తెలుగు తల్లి గీతంలో మల్లమ్మ ఎవరు ?

1942 లో దీనబంధు సినిమా కోసం శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు తేటగీతిలో రచించిన మా తెలుగు తల్లికీ గీతంలో  తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించారు.

శ్రీ శంకరంబాడి సుందరాచారి

ఆంద్రప్రదేశ్ లో ప్రముఖంగా ప్రవహిస్తున్న
గోదావరి, కృష్ణా నదులు
అమరావతి లోని శిల్పసంపద
త్యాగరాజు గానం, తిక్కన్న రచనలూ
కాకతీయ రాణి రుద్రమ దేవి భుజబలశక్తి
మహా మాత్యుడు తిమ్మరుసు మంత్రి గారి తెలివి తేటలూ,
కృష్ణ దేవరాయల వారి కీర్తి ప్రతిష్టలూ పేర్కొంటూ అందులోనే
మల్లమ్మ పతి భక్తి అన్నారు ? ఈ మల్లమ్మ ఎవరు ? ఆ పతి భక్తి కథ ఏమిటి ?

మా తెలుగు తల్లికి మల్లెపూ దండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపు లో బంగారు కనుచూపు లో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి !

గల గలా గోదారి కదలిపోతుంటేను
బిరా బిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలే దొరలుతాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచివుండే దాక

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి క్రిష్ణరాయుని కీర్తి
మా చెవులు రివ్వుమని మారుమ్రోగే దాకా
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం


జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

…………………………………

బొబ్బిలి పరాసు ప్రభువుల (ఫ్రెంచి) పాలనలో ఒక సంస్థానంగా వుంటూ పొరుగు రాజ్యం విజయనగరం తో శతృత్వం ఉండేది

హైదరాబాదు నిజాం సలాబత్ జంగ్ బుస్సీని ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత విజయనగరం రాజులు తప్ప ఉత్తర కోస్తా జమిందారులు ఎవరు ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించలేదు. అందుచేత బుస్సీ సర్కారు ఈ శిస్తుల వసూలు కోసం జిల్లాల పర్యటనకు వచ్చాడు.

ఈ అవకాశాన్ని వినియోగించుకొని విజయనగరం జమిందారు బొబ్బిలిపై ఎప్పటినుంచో వున్న కక్ష సాధించాలనుకుని విజయరామరాజు కూడా వంత పలకడం ద్వారా ఫ్రెంచి వారచే బొబ్బిలిని ముట్టడింపజేసాడు. వారికి విజయనగరం, పెద్దాపురం సైన్యాలు కూడా తోడ్పడినాయి.

క్రీ.శ. 1757 జనవరి 24 తేదీన జరిగిన బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి జమిందారైన రంగారావు/ రంగరాయుడు చంపబడ్డాడు. బొబ్బిలి కోట పతనమైనది. (ఈ సందర్భంలోనే పట్వర్ధన్ గారు పేర్కొన్న మల్లమ్మ పాత్రౌచిత్యం కథనంగా చెప్పుకుంటారు) మల్లమ్మ మాత్రమే కాదు బొబ్బిలి పురుషులు వీరమరణం చెందగా, అనేక మంది స్త్రీలు ఆత్మ త్యాగం చేసారు.

తాండ్ర పాపారాయుడు

బొబ్బిలి రాజు బావమరిది యైన తాండ్ర పాపారాయుడు ( … ‘‘ ఎందుకు కట్టాలిరా శిస్తూ’’ ….. అనే పెద్ద యన్టీఆర్ డైలాగ్ గుర్తుండే వుంటుంది) దీనికి ప్రతీకారంగా జనవరి 24, 1757లో ప్రతి దాడి చేసాడు. . యుద్ధం ముగిసాక, వీజయరామరాజు తన గుడారంలో నిదుర పోతుండగా, తాండ్ర పాపారాయుడు అతడిని హతమార్చాడు.

from Blogger http://bit.ly/1lLilNP
via IFTTT

Standard
Telugu

తెలుగులో తొలి యాత్రా సాహిత్యంకాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. 
తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే మొదటిదని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా “15 నెలల 15 రోజుల కాలం” నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

► అప్పటికి (1831-1832) బ్రిటిషు వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజు ల క్రింద ఉండేది.

► ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగాడు.

► అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశాడు.

► విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశాడు.

► కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.

► పుప్పాడ లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.

పుస్తకాన్ని ఉచితంగా ఇక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

Standard
వివరణ, Telugu

కవిత్వం :అభివ్యక్తి :మెటానవికాభివ్యక్తి

“కవిత్వం మెటాఫర్ నుండి మెటానమీకి… ప్రయాణించాలి” (వేగుంట మోహన్ ప్రసాద్).

          కవిత్వాభివ్యక్తిలో ఒకానొక నిలకడ స్థితి వచ్చిందని అనిపించినప్పుడల్లా పెద్దకవులు ఇటువంటి సూచనలివ్వడం సహజమే. వర్తమాన తెలుగు కవిత్వం లో ఇటువంటి స్థితి ఉన్నట్టు మనకు కనిపించదు. మరి అట్లాంటప్పుడు ఎందుకీ సూచన ఇచ్చాడన్న సందేహమోస్తుంది. కవులు మెటాఫర్ దగ్గరే ఆగకుండా ముందుకు పోవాలన్నది అ కవి ఆకాంక్ష. వ్యక్తీకరణ సాధారణమైపోకుండా ఉండాలంటే సాధనాలను నిరంతరం మార్చుకుంటూ ఉండాలి కవులు.అలా మారిస్తేనే అభివ్యక్తిలో వైవిధ్యం సాధ్యపడుతుంది. వర్తమాన తెలుగు కవిత్వం ఈ మెటానమీని ఆశ్రయించి సాగుతున్నది.అసలు మెటానమీ అంటే ఏమిటి? గ్రీకు పదమైన మెటనామియా నుంచి నిష్పన్నమైంది మెటానమీ.మెటా అంటే మార్పు, వోనోమ్ అంటే పేరు. ఇక్కడ ఒక వస్తువు పేరు దానితో సంబంధం ఉన్న మరొక దాని స్థానానికి బదలాయించడం ఉంటుంది. ఒక పదానికి బదులుగా ఆ పదం తో దగ్గర సంబంధమున్న మరొక పదాన్ని ఆ స్థానం లో వాడటమే ఉంటుంది.యాకబ్ సన్ భాషా విషయంగా చెప్పిన రెండు ద్రువాలలో మెటానమీ కూడా ఒకటి. మెటాఫర్ సాదృస్యత మీద ఆధారపడితే మెటానమీ రెండు వస్తువుల మధ్య సారూప్యం లేదా అ రెండు వస్తువుల మధ్య అవిచ్చిన్న సంబంధం వల్ల వ్యక్తం అవుతుంది.

ఇక్కడ జయప్రభ కవితను చూడొచ్చు మనం .

“నయావిస్పర్” అంటూ 
పావురం లా పాపాయి 
తెల్లచూడిదార్ లో 
ఎగిరితే ఎంత హాయి
కానీ ప్రకటనల్లో పాపాయిలకి కూడా
కాళ్ళు గుంజుతాయి, ఎగిరినందుకు కాదు!
కడుపు బిగుసుకుపోయి నొప్పె నొప్పి అత్తయ్యకి
ఎదిరినందుక్కాదు”

ఇందులో సదృశీకరణం తో పాటుగా మెటానమీని ఆశ్రయించింది. ఎగిరినందుకు కాదు అన్న క్రియాంత వాక్యం, కారణాన్ని చెప్పడం వల్లా `నయావిస్పర్’ అన్నది బహిష్టుతో సంబంధాన్ని తెలిపేందుకు వాడటం వల్ల మెటానమిక్ అభివ్యక్తిగా రూపం తీసుకుంది కవిత. కార్యకారణాలలో ఎ ఒక్కటి చెప్పినా మెటానామి అవుతుంది. ‘గదిని మంచం మీదనుండి కిందకి దించారు ‘ అన్నచోట కవి మృత్యువుని సూచించదలచాడు. ఇక్కడ గది మంచామెక్కుతుందా అన్న ప్రశ్న వేసుకుంటే హాస్యాస్పదం గా తోస్తుంది విషయమంతా. గదిలో మంచం మీదే మరణించిన మనిషిని క్రిందికి దింపడమే కవి చెప్పాలనుకున్న విషయం. చనిపోయిన మనిషితోపాటుగా గదిని నిర్జీవం చేస్తున్నాడు. అ గదిలో మనిషి బ్రతికిఉన్నంత కాలమే అ గది జీవించి ఉందనేది కూడా కవి చూపించదలచిన కోణం. అలాగే ‘ఈ మనిషికి మరో చెయ్యి అవసరం’ అని మనం ఎక్కడో వింటూ ఉండే వాక్యం లో కూడా మెటానమిక్ అభివ్యక్తి ఉంది. ఈ క్రింద పేర్కొనే వాక్యాలు మెటానామీ కి ఉదాహరణలు :

1. వాషింగ్టన్ మాస్కోతో చర్చలు మొదలుపెట్టింది.
2.వైట్ హౌస్ పెదవివిప్పలేదు (ఒబామా)
3. భీతిల్లిన త్రిలోకపురి (ప్రజలు)
4. బహిష్కరణ ను సమర్థించిన క్రెమ్లిన్

ఇవన్నీ మెటానామీలో ఉన్న సాధారణ నియమాన్ని ప్రతిఫలింపచేస్తున్నాయి. వాస్తవానికి కవిత్వం లో ఉండే మెటానామీ తో సమానంగా పత్రికలలో వచ్చేవార్తలకు పెట్టే శీర్షికలలో ఈ విధమైన మెటానామిక్ అభివ్యక్తి కనిపిస్తుంది.పత్రికలలో అధికశాతం కవులే ఉపసంపాదకులుగా పనిచేయడం ఒక కారణం. అయితే దీన్ని ఒకరకమైన లింగ్విస్టిక్ బిహేవియర్ గా కూడా పేర్కొనవచ్చు. 
కవిత్వంలో ఒక్కోసారి సంఘటనకు బదులుగా ఆయా స్థలాలను మాత్రమే చెబుతాడు కవి. ‘ఇరాక్ ను మరో వియత్నాం కానీయకు’ ఇటువంటిదే. మెటానమిక్ అభివ్యక్తి ఉన్నచోట పాఠకులు సులభంగానే వాటికి తగిన సూచితాలను నిర్దారించుకోగలరని సైకోలింగ్విస్టిక్స్ పరిశోధనలు తెలుపుతున్నాయి. సరియైన అన్వయాన్ని పాఠకుడు ఎలా సాధించుకుంటాడుఅన్నది ప్రస్నార్థకమే. ప్రతి పదానికీ ఉండే సాధారణ అర్తాలన్నిటినీ పాఠకుడు తన మనఃపదకోశంలొనే జాబితీకరించుకుంటాడనీ, ఒక పదం ఇచ్చిన సందర్భంలో వెనువెంటనే పాఠకుడు ఆ నిఘంటువులోంచి తనకు కావల్సిన అర్థాన్ని ఎంపిక చేసుకుంటాడనీ, ఎంచడం కలపడం అనే ప్రక్రియలో పర్యాయతను చూపి కవిత్వాన్ని సృష్టించి ఇచ్చిన కవిని అనుసరించడు; సరికదా అర్థం చేసుకునే క్రమంలో విధిగా పర్యాయతను పాటిస్తుండడం చేత ఈ విధమైన అభివ్యక్తి పధ్ధతులను పాఠకుడు అర్థం చేసుకుంటాడు.
కత్తిని సూచించేందుకు ఫోర్కునూ, దీపానికి బదులు అది పెట్టే స్థలాన్ని వెలుతురు బల్లగా, సినిమా తెరకి బదులు పెద్ద టీవీ అని పిల్లలు చెబుతారు. ఇట్లాంటి పొరపాట్లు భాషావైకల్యం (అఫేజియా) ఉన్నవారు చేస్తారు. అయితే కవులు ఉద్దేశపూర్వకంగానే కవిత్వంలో చేస్తారు. అవి దోషాలుగా కాకుండా గుణాలు అవుతాయి కవిత్వంలో.

a figure of speech that consists of the use of the name of oneobject or concept for that of another to which it is related, or ofwhich it is a part, as “scepter” for “sovereignty,” or “the bottle” for“strong drink,” or “count heads (or noses)” for “count people.”

[సీతారాం ‘అదేపుట’ వ్యాస సంకలనం నుండి] సోదరుడు యశస్వికి ధన్యవాదాలతో

మరికొంత సమాచారం వికీలో : http://en.wikipedia.org/wiki/Metonymy

Standard
Telugu

దీప న్యాయం

సంస్కృతంలోని విశేష న్యాయాలు


ఇప్పుడంటే ఒక్క మీటనొక్కితే భళ్ళున వెలుతురు పరచుకుంటోంది. హోరున గాలి వీచిన సరే చలించకుండా నిలబడి వుంటున్నాయి. కానీ నునెదీపాలు, కాగడాలూ వాడే రోజుల్లో పగటి వెలుతురు ముగియగానే పనులేవి చక్కబెట్టుకోవాలన్నా దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చేది. లేదంటే ‘‘ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో’’ మనే వారు. సాహిత్యంలో కూడా దీపాన్ని అనేక రకాలుగా వర్ణించారు. తాత్వికతలో కూడా దీపాన్ని జ్ఞాన రూపంగా పేర్కొన్నారు. ఇప్పటికీ అనేక కార్యక్రమాలు పట్టపగలే చేసినా సరే జ్ఞోతీ ప్రజ్వలనం చేయటం అనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వున్నారు. అంతటి ప్రాధాన్యత వున్న దీపం చుట్టూ సంస్కృతన్యాయాలు కొన్ని ముడిపడి వున్నాయి. వాటిని ఒక దగ్గర పొందుపరచటంకోసం ఇక్కడ ఇస్తున్నాను.


అస్నేహదీపన్యాయం
: సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి)
2006    
నూనె లేని దీపం కొద్దిసేపట్లోనే ఆరిపోయినట్లు. [క్షణికం అని భావం.]
 ________________________________________________________________
కాచకుంభదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గాజుకుప్పెలోని దీపం ఎంత గాలి వీచినా కదలకుండా నిలిచినట్లు. (వేమన.)
 ________________________________________________________________
ఘటప్రదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
కుండలో పెట్టిన దీపం వెలుతురు ఆ కుండలోనే ఉండి పైకి వ్యాపించనట్లు. [తన లాభం మాత్రమే కోరేవాడు ఇతరులకు మేలు చేయడు.] చూ: కుంభదీపన్యాయం.
 ________________________________________________________________
చక్షుర్దీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
చీకటిని పోగొట్టుకోవడానికి కన్నులు, దీపము- రెండూ అవసరమైనట్లే ఒక పనిని సాధించడానికి బుద్ధి, ప్రయత్నం- రెండూ అవసరమౌతాయి.
 ________________________________________________________________
తమోదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
దీపంతో చీకటిని చూచినట్లు. [జ్ఞానంతో అజ్ఞానాన్ని చూస్తాడు.]
ప్రమాణోత్పన్నయా దృష్ట్యా యోవిద్యాం ద్రష్టుమిచ్ఛతి దీపేనాసీద్ధ్రువం పశ్యేద్గుహాకుక్షిగతం తమః”
  ________________________________________________________________

దేహళీదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గడపమీద పెట్టిన దీపం ఇంటిలోనూ, ఇంటి బయటా వెలుతురు ప్రవరింపజేసినట్లు. [ఒకే వస్తువు రెండు ప్రయోజనాలను సాధించడం.]
ఏకా క్రియా ద్వ్యర్థకరీ.” (one shot two birds)
 ________________________________________________________________
నివాతస్థితదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గాలి లేనిచోట దీపం ఉంచినట్లు. [శమాదిషట్క సంపత్తి ఉన్న చిత్తం నిశ్చలత్వాన్ని పొందుతుంది.]
నివాతస్థో యథా దీపః” (భగవద్గీత.)
  ________________________________________________________________
ప్రదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
1. దీపం ఒక్కచోటే వెలుగుతూ ప్రకాశింపజేసినట్లు.
2. చమురు, వత్తి విడివిడిగా నిప్పును కొంత చల్లార్చేవే ఐనా మూడూ కలిసి దీపంగా వెలిగినట్లు. [పరస్పర విరోధులే ఐనా అందరూ కలిసిఒక మంచి పనిని చేయవచ్చు.]
 ________________________________________________________________
బహుచ్ఛిద్రఘటప్రదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
చాలా రంధ్రాలున్న కుండలో పెట్టిన దీపం రంధ్రాల్లో నుండి పైకి వ్యాపించినట్లు. [జీవునికి ఉపాధియైన బుద్ధి శరీరంలోని నవరంధ్రాల నుండి బాహ్యవిషయాల్లో వ్యాపిస్తుంది.]
నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం, జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్యందతే.” (దక్షిణామూర్తిస్తోత్రం.)
  ________________________________________________________________
మధ్యదీప(పికా) న్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గృహమధ్యంలో ఉన్న దీపపుకాంతి ఇంటిలో అన్ని దిక్కులకూ కాంతిని ప్రసరింపజేసినట్లు.
గృహే దధిఘటీం ద్రష్టుమానీతో గృహమేధినా, అపూపానపి తద్దేశాన్‌ ప్రకాశయతి దీపకః” (ఇంట్లో పెరుగుకుండను చూడడానికి దీపం పట్టుకొని లోపలికి వచ్చిన ఇంటి యజమాని ఆ దీపపుకాంతితో అక్కడున్న రొట్టెలను కూడా చూస్తాడు.)
 ________________________________________________________________
రథ్యాదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
దీపం పట్టుకొని దారిలో నడుస్తుంటే దీపం వెలుతురు ముందున్న స్థలంమీద పడుతుంది. తరువాత ఆ స్థలంమీదికి దీపమే వస్తుంది. వెలుతురు ముందుకు పోతుంది. వెనుక చీకటి ఆక్రమిస్తూనే ఉంటుంది.
 ________________________________________________________________
వాతప్రదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
గాలికి పెట్టిన దీపం మాదిరిగా. [స్థిరంగా ఉండక వెంటనే నశించి పోయేదని భావం.]
 ________________________________________________________________
స్నేహదీపన్యాయం : సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006    
చమురు లేకపోతే దీప మారిపోయినట్లు.

మరింత వివరంగా తెలుసుకునేందుకుసంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006
సంస్కృతన్యాయములు (కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939

Standard
Telugu

ఇలా ఎవరిఫోటోని వాళ్ళే తీసుకుంటే దానిపేరు ‘‘ selfie ’’ అట
self-portrait అనేదానికి సంక్షిప్తరూపం.
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 2013 కు గానూ ఈ సంవత్సరపు పదం ( word of the year) గా ఎన్నికయ్యింది. ఈ పదాన్ని మొదటిగా ABC అనే ఒక ఫోరంలో సెప్టెంబర్ 2002 లో వాడారట. మత్తులో తన పెదవిని కొరుక్కున్నానని చూపించేదుకు దాన్ని ఫోటోగా తీసుకుని ఫోరంలో ఇలా పోస్టు చేసారట…..

“Um, drunk at a mates 21st, I tripped ofer [sic] and landed lip first (with front teeth coming a very close second) on a set of steps, I had a hole about 1cm long right through my bottom lip. And sorry about the focus, it was a selfie.”

కొత్త పదాన్ని వాడిన ఆస్ట్రేలియన్ కి పెదవి తెగటమేమో కానీ దేశం ఈ పదాన్ని చూసుకుని మేము కనిపెట్టిందే అని మురిసిపోతోంది. కుట్లతో వున్న అతగాడి పెదవి ఫోటో కూడా అతని మొహంకంటే ప్రముఖంగా ప్రచారంలో హల్ చల్ చేస్తోందట.

అవునుకదా ఎవరూ కనిపెట్టకపోతే భాషెలా పుడుతుంది?
జంగమయ్యా వేసుకో రెండు వీరతాళ్ళు  (ఇక్కడ పెదవిని కుట్టే తాళ్ళు, కొత్త పదాలను విప్పే తాళ్ళు కావచ్చు)

మరి దీన్ని తెలుగులో ఏమందాం?

స్వీచి (స్వీయ చిత్రణ) లాగా మరింత మంచి పేర్లుంటే సూచిస్తారేంటి?

Standard
Telugu

భాషా రక్షతి… రక్షిత:

దమ్మిడీ, నిట్టాడు, సాలు
ఈ మాటలకు అర్ధం ఇప్పటి పిల్లలకు తెలుసా?
పదాలకు సమానమైన పరభాషా పదాలు అదే సంస్కృతి లేకపోతే వుండవు.
అంటే ఆ పదాన్ని మర్చిపోతే దానివెనకున్న సంస్కృతికూడా కనుమరుగయినట్లే.
పెద్దింటి అశోక్ కుమార్ గారి ‘‘జిగిరి’’ నవల చదువుతున్నప్పుడు ఎలుగు బంటిని ఆడించే సంస్కృతి తో ముడిపడ్డ పదాలు చదువుతున్నప్పుడు ఇదే అనిపించింది.

అలాంటిది లిపిలేని భాషవుంటే ఆ సంస్కృతి దాని విశేషాలు ఆ మనుషుల తర్వాత ఎలా అందాలి.

సవర భాషకు గిడుగు (http://tinyurl.com/p9huaev ) వారు. తన స్వంత నౌకరీనుంచి వచ్చే చిన్న మొత్తంతోనే చేసిన కృషి ఈ రోజు ఆ భాషకు అస్థిత్వన్ని నిలబెట్టింది. మనకి భాషని నిలబెట్టుకునేందుకు ఒక స్ఫూర్తిని ఇచ్చింది.

మన సంస్కృతి నిలబడక పోతే ఏమవుతుంది ?
ఇలాగే అరువు సంస్కృతి బరువు రూపాయి నెత్తిన రోజురోజుకూ పెరుగుతుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు మన రూపాయినో, ఆర్ధిక వ్యవస్థనో పాతాళంలోకి తొక్కేస్తుంది. రిమోట్ ఆపరేషన్స్ తో మెదళ్ళమీద సాధించిన పట్టుతో బలహీన వస్తువులని అంటగట్టి సైతం స్ట్రాతో పీల్చినట్లు మన జేబుల్లో రూపాయిని పీల్చుకునే శక్తిని మనమే ఇస్తున్నాం.

మన మూలాల్ని కాపాడుకోవటం అంటే మన కాళ్ళపై మనం నిలబడటమే, మన వెన్నెముకని మనం భద్రంగా వుంచుకోవడమే.

Standard
Telugu

తెలుగు లిపి పుట్టు పూర్వోత్తరాలు – భాస్కర రామిరెడ్డి

యరలవ మదనస యనుచును
బరువది నీ యక్షరములు భయనయ తతులన్
నిరతమునం వ్రాయనేర్చిన
వరకరుణా వానివ్రాలు వట్రు వలమరున్


మన దస్తూరి గుండ్రంగానూ అందంగానూ వుండడానికి మన పూర్వులెవరో ఈ గోసాయి చిట్కాను చెప్పారు. ఇప్పటి అక్షర సమామ్నయం స్వరూపం చూచి ఇది మొదటినుండి ముత్యాలకోవ అని మనం అనుకోరాదు. చిత్రాల రూపంలో వంకర టింకర గీతల రూపంలో మొదట వుంది. రాతిబండల మీద, రాగిరేకుల మీద, తాటాకుల మీద, కాగితాల మీద( ప్రత్తి కాయితాల మీద ) రాపాడగా, రాపాడగా ఇప్పటి స్వరూపం తీర్చుకున్నది మన వర్ణమాల. ఈ పరిణామానికి రెండు వేల యేండ్ల సమయం పట్టింది.

భాష అంటే కొన్ని ధ్వనుల గుంపు. ఈ ధ్వనులకు సాంకేతాలే లిపులు. ఈ లిపికి లిఖి, వర్ణం, లేఖ అక్షర అనే పర్యాయ పదాలున్నాయి. లేఖన సాధనలను బట్టి ఈ పేర్లు ఏర్పడ్డాయి. మాటా పలుకు గాలిలో కలిసిపోతాయి. దీనికి సంకేతమయిన అక్షరం చెరగనిది. రాతిపైన లోహపు రేకులమీద గీచిన గీత చెరగదు గదా! రంగుతో వ్రాయడాన్ని బట్టి వర్ణమయింది.కలంతోనో కుంచెతోనో పూయడాన్ని బట్టి లిపి,లిఖి అయింది. ఉలితోనో, గంటంతోనో గీకడం వల్ల లేఖ అయింది.

మన ఈ లిపి ప్రాచీన మయినదని, స్వతంత్రమైనదని, పలువురు ప్రాచ్య పాశ్చాత్య పండితుల అభిప్రాయం. మనకు అశోకుని కాలం నుండి శాసనాలు కనిపిస్తున్నాయి. అందుకు ముందు ఏదో విధమయిన లేఖన పద్ధతి లేకపోతే అకస్మాత్తుగా లిపి ఊడిపడదు కదా !

మిగిలిన భాగం ఇక్కడ నుండి చూడండి….

Standard