telugu poetry

కాగితప్పండగల కారెడ్డం

నగరం ఎన్నిపండుగల్నాయినా
సంబురంగా జేసుకుంటది.
సంతోషమంటే కొనేటిదని
అమ్మెటొండ్లు ఎప్పటిసందో
యాదిల బెట్టిండ్లు.

అరే భాయ్
పండుగా ఒక సంతే
పండుగ ఒక ఈవెంటే
పండుగంట్నే అదొక సందర్భం
ఇగదియ్
అది జేబ్ల మీదకుర్కే కత్తెర

పండుగంటేనే అంగటి సరుకయినంక
అంగిట్లో ఏం మాటుంటది.
సందట్లో ఏం సరుకుంటది
సందిట్లో ఏం సుకముంటది.

ఛాల్తియ్
పోనియరా భయ్
పండుగంటే ఉచితార్ధం రికాంగొచ్చేటి నాగా.
బూసెన్నలు,బూందీలు, బోల్‌పేలాల కాలంగాదు
దావత్ చేద్దాం నడువ్

( కారెడ్డం : పరాచకం, బూసెన్నలు – పల్లీలు, బోల్‌పేలాలు – మరమరాలు )

కవిసంగమం

from Blogger http://bit.ly/1hgR42j
via IFTTT

Standard
History

మరో శివాజీ సర్ధార్ సర్వాయి పాపన్న

సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా జనగాం దగ్గర కైలాస్ పూర్ గ్రామంలో గౌడ కులంలో  ఆగష్టు 18, 1650  లో జన్మించారు, తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవారు.పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు, తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు, కాని అతని మనసులో మాత్రం తెలంగాణా లో అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని ఉండేది, అందుకోసం అతను గెరిల్ల సైన్యాన్ని తాయారు చేసాడు, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసే వాడు,1675 లో సర్వాయి పేట లో తన రాజ్యాన్ని స్థాపించాడు, తన సొంత ఊరు కైలాస్ పూర్ రాజధాని.
ఇతను శివాజీకి సమకాలికుడు, శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడాడు, 1687 – 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు, పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు, 1678 వరకు తాటికొండ, వేములకొందాలను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు, 1700 – 1705 మధ్య కలం లో షా పుర లో మరొక దుర్గం నిర్మించాడు, అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీం నగర్ జిల్లా లోని హుసనాబాద్, హుజురా బాద్ విస్తరించింది, భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.

పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు, అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు, ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు, పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు, అతని రాజ్యం లో సామజిక న్యాయం పాటించేవాడు, తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు, అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు, అది నేటికి రూపం మారిన అలానే ఉంది.

పాపన్న గెరిల్ల సైన్యం తో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబ్ కు తెలిసింది, అతడు రుస్తుం దిల్ ఖాన్ కు భాద్యతలు అప్పగించాడు, రుస్తుం దిల్ ఖాన్ యుద్దానికి ఖాసిం ఖాన్ ను పంపించాడు, శఃపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి, నెలలపాటు యుద్ధం జరిగింది, చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు, సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది, పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు, దాంతో ఆయన యుద్దాన్ని విరమించుకున్నాడు, అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి, అయితే పాపన్న తన సొంత ఊరు జనగామ కు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు, ఔరంగజేబ్ మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1 ఏప్రిల్ 1708 లో వరంగల్ కోటపై దాడి చేసాడు, అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు.

1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వెల్లడ దీసారు.ఆదిలాబాదు జిల్లా నిర్మల్ లో జూలై 30, 2012 నాడు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టించబడింది.ఆగష్టు 18, 2012 నాడుకరీంనగర్ జిల్లా సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహం కరీంనగర్ లోకసభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చే ఆవిష్కరించబడింది.

from Blogger http://bit.ly/1k7qrwv
via IFTTT

Standard
History
మహిళ కాళ్ళవద్ద దేన్నో గుంచుతున్న మర్కటాన్ని చూడొచ్చు

బహుశా చాలామందికి తెలిసిన విషయాలే అయ్యుంటాయి. కానీ ఆశ్చర్యంగా అనిపించినవి కొన్ని పంచుకుందాం అనిపిస్తోంది.

1) 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా వుంటుంది. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. 

2) శిల్పాలనుంచి ఏం తెలుస్తుంది అనుకుంటాం కానీ, ప్రధాన ఆలయానికి ఇరుపక్కలా వున్న శివతాండవం 60 చిత్రాల వరుసలను అర్ధం చేసుకుంటూ నశించి పోయిందనుకుంటున్న నాట్య విధానాన్ని నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతి పేరుతో పునం రూప కల్పనచేసారు. 

3) ఇక్కడి నంది విగ్రహం స్పష్టంగా ” reef knot ” రెండువైపులా కనిపిస్తుంది. తాళ్ళని ఉపయోగకరంగా శాస్త్రీయంగా ముడివేయడం, మెలికలు వేయడం ఎప్పటినుంచో వాడుకలో వుందనే విషయాన్ని 800 సంవత్సారాల క్రితం నిర్మించిన ఈ ఆలయ శిల్పి స్పష్టం చెక్కి చూపించి నిరూపించినట్లయ్యింది. బహుశా ఇటువంటి ఆధారాలే లేకపోతే ఇవ్వన్నీ ఏ ఎంగిలీసు పద్దతులనుంచో అరువు తెచ్చుకున్నాం అటుండే వాళ్ళేమో.

ఇదే నందికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లు అచ్చంగా చూస్తుంటుంది. అలాగే ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. దాని శరీరం నునుపు, అలంకరించిన ఆభరణాలలోని నిశితత్వం స్పష్టంగా గమనించవచ్చు.

4) ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యిందట అయినా ఇప్పటికీ చాలా దృఢంగా కనిపిస్తోంది. 

5) శిల్పకళ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. హైహీల్స్ అప్పుడే వాడినట్లు చూపుతున్న శిల్పం ఒకటయితే, మహిళ యుద్దానికి వెళ్ళి వచ్చినట్లు ఆమె కాలి ముల్లుని ఒక పురుషుడు తొలగిస్తున్నట్లు చూపిన శిల్పం, అంటే జండర్ వల్ల కాకుండా చేసే పనిలో చొరవ వల్ల గౌరవం దక్కుతోందని అప్పుడే చెప్పినట్లయ్యింది. 
ముగ్గురు నాట్య కత్తెలకు కేవలం నాలుగు కాళ్లతోనే చెక్కేయటం, సంగీతాన్ని పలికించే రాతి నిర్మాణం (మేం తాకి చూసి ఆశ్చర్య పడ్డాం) స్థంభాలలోని సన్నని చెక్కుళ్ళ మధ్య దారం ఆడించేంత రంద్రాలను సుతారంగా ఏర్పాటు చేసారు. ఆలయం చుట్టూతా, స్థంభాలలోనూ కాకుండా రూఫ్ లో సైతం ఎన్నో పౌరాణిక చారిత్రక గాథలను చెప్పే వరుస శిల్పాలున్నాయి. వాటిని ఒక్కొక్కటి తీసుకుని వాటి అలంకరణ నేపద్యం, భంగిమలకు భాష్యం, సందర్భశిల్పాలలోని కథలు, చర్చించిన శాస్త్రీయ కళాత్మక అంశాలను పేర్చుకుంటూ వెళ్లే పనికి ఎవరన్నా పూనుకుంటే అదే పెద్ద పుస్తకం అయ్యేలాగా వుంది.

6) జాయప సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో కనిపిస్తుంటుందట, త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్నిచేసేంతలా ఫోటోలు లాంటి ఆధునిక ప్రక్రియలు లేని ఆ రోజుల్లోనే చెక్కారు.

7) ఇక్కడ వాడిన ఇటుకల గురించి కూడా ప్రత్యేకంగా చెపుతారు. అవికేవలం మట్టి కాకుండా ఏనుగు లద్దెతో మరికొన్ని పదార్ధాలు కలిపి తయారు చేసారట దాంతో గట్టితనం తగ్గకుండానే తేలికగా వుండే లక్షణాన్ని కలిగివుంటాయట. ఎంత తేలిక అంటే ఆ ఇటుకను నీటిలో వేస్తే తేలేంతగా.

8) దగ్గరలోనే కోట గుళ్ళు, రామప్ప చెరుపు, లక్నవరం వగైరా వున్నాయి.

9) ఒక ప్పుడు దాడులూ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఈ ఆలయసంపద ఇప్పుడు నిర్లక్ష్యపు దాడికి గురవుతోంది. నంబర్లు వేసి పీకేసిన భాగాలు చిందరవందరగా పడేసి వున్నాయి. ఎటువంటి ప్రత్యేక భద్రత ఆదరణ లేదు. మరింత శిధిలమయ్యే పరిస్థితులను నివారించి వాటికి భద్రత కల్పించే పనులు లేవు. కనీసం శాసనాలను శిల్ప సంపదను డిజిటైజ్ చేసి అధికారికంగా అందుబాటులోకి వుంచిన ధాఖలాలు లేవు.

ఈ రోజు పర్యటనలో తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

http://bit.ly/1e7kX4i

from Blogger http://bit.ly/1e7kX4k
via IFTTT

Standard
telugu poetry, Translation

కవితలు వాలిన చెట్టు

కవిత్వపు చెట్టుకింద
కొద్దిసేపు కూర్చుందాం రా.
పదాల వీచికలను గమనిస్తూ
కథలు చెప్పే ఆకుల నీడల్లోసేదదీరుతూ
సముద్రపు లోతులనుంచీ కొండకొనల వరకూ చూసొద్దాం.
రా కలలు కందాం రా
పైకి పాకుదాం రా
రాలుతున్న పద్యాలకు తగలకుండా వెళదాం రా.

మూలం : Shel Silverstein
తెలుగు : కట్టా శ్రీనివాస్

from Blogger http://bit.ly/1nVhJ4O
via IFTTT

Standard
telugu poetry

నిన్నే పిలుస్తున్నారు


1

ఎవరో నీ సహాయం కోరుతున్నారు

ఎక్కడో అగాధపు అంచుల్లో
కష్టాల సుడిగుండాల అల్లకల్లోలంలో
ప్రశాంతతకు మొహంవాచి, నిరంతరంకారే రక్తపు ఛారికలనడకల్లో
ఎవరో నీ సహాయం కోరుతున్నారు.

నీవు బెసకకుండా రోజువారీ తాటిపై నడుస్తూనే వున్నావు.

2

ఎవరో నీకోసం చేయి చాచారు.

దారపు తీగంత బలంతోనైనా పైకి లాగుతావని
కనీసపు ఔదార్యపు చూపుతో ధైర్యమైనా నింపుతావని
వడలి పోయే ఆశకు ఆఖరిచుక్కగా కన్నీరైనా పోస్తావని
ఎవరో నీకోసం చేయి చాస్తున్నారు.

నీవసలే తలచుట్టూ అరికంట్లం కట్టావు.

3

ఎవరో నీవైపే చూస్తున్నారు

రెప్పవాల్చకుండా, దృష్టిమరల్చకుండా
నీ నిర్ణయమే తమ తరువాతి జీవితానకి భరోసా అన్నట్లు
ఒక్కో క్షణం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
అవును
ఎవరో నీవైపే చూస్తున్నారు

నీవెప్పటిలా అలవోకగా రోడ్డుపక్క ఖాళీడబ్బాలను తన్నుకుంటూ
ఈలవేస్తూ కాలక్షేపం చేస్తున్నావు.

4

ఎవరో నీకై ఆక్రోశిస్తున్నారు

ప్రమాదపు ఒడిలో రక్తం కార్చుకుంటూ
కనీస ప్రథమచికిత్స చేస్తావేమోనని
గొంతుఎండిపోయేలా కేకలేసి పిలుస్తున్నారు.
ఒక్కో రక్తపు బొట్టూ ఒడిసి పట్టే ఓపిక లేక
మరో చేయి సాయం కోసం నిను చూస్తూ దీనంగా పెడబొబ్బలు పెడుతున్నారు.
ఎవరో నీకోసమే ఆక్రోశిస్తున్నారు.

నీవసలే కొత్త హెడ్ సెట్ పాటల ఆల్బంలో మునిగి లేవకున్నావు

5

నీ బలం నీకేం తెలియదంటూ
నాది ఒక్క నట్టు వదులైతే యంత్రానికేమంటూ
వదులు వదులు మాటల్ని విదుల్చుకుంటూ వెళ్తున్నావు.

పూర్ణసత్యమేదో ఎరగనే లేదంటూ
తెలియని తనాన్ని గర్వంగా నెమరేసుకునేందుకు
డబ్బాలూ, డప్పులూ బాది బాది అలసావు.

వాడక్కడ నీకోసం అరుస్తునే వున్నాడు

6

అంతు చిక్కని చిక్కుముళ్ళని తలచుట్టూ కంపలా అల్లుకుని
మసక చేతుల్తో కళ్ళ అద్దాల్ని పదే పదే తడుచుకుంటావు
అసలే మంచు పొరల మధ్యన దీపాన్ని ఆపేసి
పాదం కదపకుండానే పాటలందుకున్నావు.

వాడొక్కడే ఒక్క అడుగు దూరంలో వగచి వగచి చూస్తున్నాడు.

7

ఎవరో నీ సహాయం కోరుతున్నారు.
ఎవరో నీ వైపే చూస్తున్నారు.
ఎవరో ఆక్రందన చేస్తున్నారు.
ఎవరో ఆక్రోశంతో నీ వైపే చేయి చాస్తున్నారు.
ఎవరో
… ఎవరో
….. ఎవరో

8

బ హు శా
అది నీవాళ్లే కావచ్చు

బహుశా
అది నీ రక్తపు వారసత్వ బంధమే కావచ్చు

బహుశా బహుశా
అదసలు మరోలాంటి నీ మరో రూపమే కావచ్చు
బహుశా
అచ్చంగా నీవేనూ కావచ్చు.

9

అయినా
పర్వాలేదు
నీరోజుని నువ్వు నీలాగే గడిపేస్తుంటావు.

► 18-02-2014

from Blogger http://bit.ly/1oLyq5R
via IFTTT

Standard
History

అలంపురం ఆలయాల కథలు

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె ప్రాణత్యాగం చేసింది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది.

ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావింపబడినది. (సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరం లు దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా భావింపబడినాయి).

జోగులాంబ (ఐదవ శక్తిపీఠం) అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. – ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ – కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగ’, ‘భద్ర’ నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా అభివర్ణిస్తూ ఉంటారు.

ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.పాతకాలం నాటి జోగులాంబ గుడి 14 వ శతాబ్దంలో బహమని సుల్తాన్ల దాడిలో శిధిలమయినది. కాగా, అమ్మవారి విగ్రహాన్ని మరియు అమ్మవారి శక్తులయిన చండి మరియు ముండి విగ్రహాలను బాల బ్రహ్మేశ్వర స్వామి గుడిలో 2005 వరకు భద్రపరిచి ఉంచారు. ప్రస్తుతము శిథిలం కావించబడిన ప్రదేశంలోనే తిరిగి అమ్మవారి గుడిని పునర్నిర్మించారు. క్రొత్త గుడి చాల చక్కగా, అందంగా నిర్మించారు. అమ్మవారి గుడి చుట్టూ ఒక నీటి కోనేరు కట్టారు. ఆ గ్రామస్తులు చెప్పేదాని ప్రకారం జోగులాంబ అమ్మవారు చాలా ఉగ్రమయిన శక్తి స్వరూపిణి. కాబట్టి ఆ కోనేరు ఆమెను శాంత పరుస్తూంటుంది.
అలంపురం జోగులాంబ విగ్రహం చాలా విచిత్రం గా ఉంటుంది. ఈమె కుర్చోని ఉంటుంది. తలలో చాలా జుట్టు ఉంటుంది. ఆ జుట్టులో బల్లి, తేలు, గబ్బిలం మరియు మనిషి పుఱ్ఱె ఉంటాయి.

నవబ్రహ్మ దేవాలయములు

నవబ్రహ్మ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు.

తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనేవి ఆ తొమ్మిది దేవాలయములు.వీటిలో బాల బ్రహ్మ పెద్దది, ఇక్కడి శాసనాల ఆధారంగా దీనిని క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా గుర్తించినారు.

తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలాలలో ఉన్నది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు! దీనియందు ఆరు, ఏడవ శతాబ్దాలకు చెందిన తెలుగు శాసనాలు కలవు.
స్వర్గ బ్రహ్మ దేవాలయం అలంపూర్ నందలి దేవాయలములలో సుందరమైనదిగా చెప్పబడుతున్నది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందులో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలు కలవు.
పద్మ బ్రహ్మ దేవాలయం. ఇది కూడా పాక్షికంగా శిథిలమైపోయినది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం కలదు.
విశ్వబ్రహ్మ దేవాలయం చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారతాలనుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కినారు.

ఆలయాల పట్టణం

పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి . 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో కలవు. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

పురావస్తు ప్రదర్శనశాల

ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉన్నది. దీనిని 1952 లో ఏర్పాటుచేశారు. ఇందులో క్రీ.శ.6 వ శతాబ్దము నుంచి క్రీ.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి.

సప్త మాతృకలు

ప్రాచీన కాలంనాటి ఇటువంటి ఆలయాలను దర్శించినప్పుడు, సప్త మాతృకల ప్రతిమలను మలచడంలో వాళ్లు తీసుకున్న శ్రద్ధాసక్తులు స్పష్టమవుతాయి. ఒకే వరుసలో పద్మాసనంలో కూర్చున్నట్లుగా కనిపించే ఈ సప్త మాతృకలు ఆనాటి శిల్పకళా వైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి

బ్రహ్మణి’ … ‘మహేశ్వరీ ‘ … ‘కౌమారి’ … ‘వైష్ణవి’ … ‘వారాహి’ … ‘ఇంద్రాణి’ … ‘చాముండి’ దేవతలను సప్త మాతృకలు అంటారు.

దేవీ పురాణం … బ్రహ్మవైవర్త పురాణం … స్కంద పురాణం … సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి.

పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో, వాడిని సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అంధకాసురుడితో రుద్రుడు పోరాడుతూ వుండగా ఆ రాక్షసుడి నుంచి చిందిన రక్త బిందువులు రాక్షసులుగా మారేవి. విషయాన్ని గ్రహించిన శివుడు … మహేశ్వరిని రంగంలోకి దింపాడు. ‘వృషభ’ వాహనంపై ఆమె యుద్ధభూమిలోకి ప్రవేశించింది.

దాంతో బ్రహ్మ పంపిన బ్రహ్మణి ‘హంస’ వాహనంపై … విష్ణుమూర్తి పంపిన వైష్ణవి ‘గరుడ’ వాహనం పై … కుమార స్వామి పంపిన కౌమారీ ‘నెమలి’ వాహనం పై … వరాహమూర్తి పంపిన వారాహి ‘మహిష’ వాహనం పై … ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ‘ఐరావతం’ పై … యముడు పంపిన చాముండి ‘శవ’ వాహనం పై యుద్ధభూమికి చేరుకున్నాయి. ఈ శక్తి స్వరూపాల సాయంతో అంధకాసురుడిని శివుడు సంహరించాడు.

కూడలి సంగమేశ్వరాలయం

మరోకటి కూడలి సంగమేశ్వరాలయం ఇది 1980 కి పూర్వం కృష్ణా తుంగభద్రల సంగమప్రాంతమైన కూడలిలో వుండేది.

తుంగభద్రానది కృష్ణతో కలిసే కూడలి లేక కూడవల్లిలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని, శిలాలయాలకు మరింత కొత్త సొబగులను రంగరించి నిర్మించారు. పదడుగుల ఎత్తైన వేదిక పై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణా? అన్నట్లు నిర్మించారు. వేదికపైన ఆలయ ద్వారం పక్కగా శంఖనిధి, పద్మనిధి, విగ్రహాలు, గంగ, యమున, అర్ధనారీశ్వర , హరిహర, గజలక్ష్మి, అష్ట దిక్పాలకుల విగ్రహాలే కాక, ఎన్నో లతలను, హంసలను చెక్కారు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ అవస్థలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిలం అశ్చర్యాన్ని గొల్పుతుంది.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ప్రాజెక్టు ముంపుప్రాంతంలో వున్నందున. మొత్తం ఆలయాన్ని అలంపురానికి తరలించి పునర్నిర్మించారు. ఒక కట్టడం మొత్తాన్నీ అవే ఆధారాలతో నిర్మించటం దేశంలో ఇది తొలిసారి. ప్రపంచంలో ఇది రెండవది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులలో రెండవ పులకేశీ సమయంలో నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి అంచనాకు వచ్చారు కానీ ఇది 5200 ఏళ్ళకు పూర్వపు గుడి అని ద్వాపర యుగంలో ధర్మరాజు నింబదారు శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పౌరాణికంగా నమ్ముతారు.ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి, లింగాల కోసం భీముడిని కాశికి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉన్నది
ఇక్కడ అపురూపమైన శిల్ప సంపదా దేవతా విగ్రహాలూ వున్నాయి.కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కాని వరద సమయాల్లో ఆలయంలోనికి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్రానది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం ఉండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవ గ్రహాల ఆలయాల సముదాయాన్ని నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణం వల్ల కర్నూలుకు ఆ పేరు వచ్చిందని చెప్పే ఒక ఆసక్తికరమైన కథ ఒకటి వుంది.

ఆలయ నిర్మాణాలకవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలంచే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారి కొక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలు గా మారింది.

శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర, అలంపుర ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా….. పురావస్తు శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని , పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవ గ్రహాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాధ గట్టు పై కట్టారు. కాని ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నంది కొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు. త్రివేణి సంగమ శిల్పం మాతం హైదరాబాదు లోని పురావస్తు శాఖ వారి ప్రదర్శన శాలలో ఉన్నది. ఇది పబ్లిక్ గార్డెన్ లో ఉన్నది. నివృత్తి సంగమేశ్వరాలయం అలాగే నీటిలోనే మునిగి ఉన్నది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు.

మొలక సీమ వైపు ‘నివృత్తి సంగమం’ కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని’ నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనదీ సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు.ప్రజల పాపా ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం.

నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు.

from Blogger http://bit.ly/Mi5kw0
via IFTTT

Standard
History

కదిరిలో ప్రేమకథ : 15 శతాబ్ధం నాటి చంద్రవదన, మొహియార్ లది

అది 15వ శతాబ్దం విజయనగర మహా సామ్రాజ్యంలో ఒకానొక సామంత రాజు శ్రీరంగరాయులు ఆయనగారికి ఏకైక గారాల పుత్రిక చంద్రవదన. ఆమె కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వచ్చి పూజలు చేసి వెళుతుండేది. ఒకనాడు పర్షియా వజ్రాల వ్యాపారి అయిన మొహియార్‌ దుకాణం ముందునుంచే వెళ్లింది. ఆమె దృష్టి వజ్రాలకన్నా వాటిని విక్రయిస్తున్న మొహియార్‌పైన పడింది. అతని ఠీవి, దర్పాన్ని చూస్తూ, ఆమె పులకితురాలైంది. అతను కూడా చంద్రవదన అందాన్ని చూసి , గుండెల్లో ముద్రవేసుకున్నాడు.పరస్పర ఆకర్షణల మధ్య మధుర ప్రేమలు పంచుకున్నారు. ఆమె బాహ్యప్రపంచంలోకి వచ్చి తనస్థితినీ,స్థాయినీ గుర్తుతెచ్చుకుని వేగంగా కదిలి తన నివాసమందిరానికి వెళ్లింది. కాని మనసు మొహియార్‌ చుట్టూ తిరుగుతూనే వుంది. కొన్ని నిముషాలు మెరుపులా మెరిసి తనమదిలో ముద్రపడిన చంద్రవదనని మొహియార్‌ మరవలేక పోయాడు. ఆ తరువాత రోజులన్నీ అతన్ని పిచ్చివాడిగా మార్చాయి. ప్రతీక్షణం చంద్రవదనే మదిలో తలపురేపుతూ. నిద్రాహారాలను దూరం చేసింది. అంతఃపురంలో చంద్రవదన పరిస్థితీ అలానే వుంది. కానీ తన స్థాయి వేరు మతం వేరు. తన ప్రేమకు అర్థం లేదని భావించింది. ప్రేమను మరిచిపోవడానికి మనసు రాక విలవిలలాడింది.

ఒకరోజు మొహియార్‌ చంద్రవదనని ఎలాగైనా చూడాలని గాఢమైన కోరికతో ఆమె అంతఃపుర భవనం ముందుకు వచ్చాడు. అక్కడ రాజభటులు అతన్ని అడ్డగించారు. అతను చంద్రవదన ప్రేమతో పిచ్చివాడిగా మారి ఆమెనే కలవరిస్తుండటంతో రాజభటులు అతని మాటలు విని పిచ్చివాడిగా భావించి బలవంతంగా అతన్ని తోసేస్తారు. అతను ప్రక్కనవున్న గోడకు తలపగిలి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.

గొడవంతా తెలిసిన శ్రీరంగనాయకులు స్వయంగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. మొహియార్‌ చనిపోయాడని తెలిసిన చంద్రవదన కూడా అక్కడికి వచ్చి మొహియార్‌ శరీరంపై పడిపోయి ప్రాణాలు విడిచింది. ఇదంతా చూసిన శ్రీరంగనాయకులు మొదట వారిద్దరి ప్రేమను అర్థం చేసుకుని తన కొలువులోని గురువులు, పెద్దలను సంప్రదించి అందరి ఆమోదంతో చంద్రవదన, మొహియార్‌ల శవాలను ఒకే ప్రదేశంలో ఖననం చేయించదలచి ముస్లింలతో హిందువుల సమైఖ్యతను చాటుతూ వారి సమాధులను అటు హిందూ, ఇటు ముస్లిం సంప్రదాయ ప్రకారం నిర్మించాడు. ఆనాటి పాతర్లపట్నమే నేటి కదిరిని అప్పుడు ఖాద్రి అనేవారు.

13వ శతాబ్దంలో శ్రీరంగరాయల పూర్వీకుడు రంగనాతిప్పానాయుడు శ్రీఖాద్రి అనే పేరుతో పట్టణం నిర్మించాడని చెపుతారు. శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం నాలుగు గోపురాలలో ఒక గోపురాన్ని టిప్పుసుల్తాన్‌ కాలంలో ముస్లిం పాలకులు నిర్మించారు.చంద్రవదన మొహియార్‌ల సమాథి మందిరాన్ని అటు ముస్లింలు ఇటు హిందువులు, అనేక మంది సందర్శించి తమ ప్రేమలు ఫలించాలని మొక్కుకుంటారు.

మొహియార్ శవాన్ని అంత్యక్రియలకోసం తీసుకెళదామని ఎంతమంది వచ్చి కదిపినా అది కదలలేదనీ చివరికి ఘోర దుఖంలోఉన్న చంద్రవదన వచ్చి ఆతని శవాన్ని తాకినమీదటనే దానిని లేపగలిగారనీ, చంద్రవదనకూడా మొహియార్ తో ఎడబాటును సహించలేక అతనితోపాటు సజీవసమాధి అయ్యిందనీ,వారిది దైవికమైన అమరప్రేమగా అక్కడి ప్రజలు భావించారనీ మరో కధ ప్రచారంలో ఉంది.

వీరి సమాధి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోని ముస్లిముల స్మశానస్థలంలో ఉంది.తాము ఆజన్మాంతమూ విడిపోకూడదనుకునే ప్రేమికులూ దంపతులు కూడా ఈ సమాధిపై ఉంచిన కుంకుమను నేటికీ భక్తిశ్రద్ధలతో తీసుకెళుతుంటారు”. చంద్రవదన మొహియార్ అమరప్రేమ గాధ కదిరిలో జరిగిన యధార్ద సంఘటన. వీరి ప్రేమ గాధ మతసామరస్యానికి ప్రతీక. వీరిప్రేమకు గుర్తుగా కదిరి పురపాలక సంఘం ఒక ప్రాధమిక పాఠశాలను నెలకొల్పినది.

from Blogger http://bit.ly/1iT3ihg
via IFTTT

Standard
telugu poetry

వీధుల్ని నింపే వాళ్ళు

ఈరోజు ప్రయాణంలో సాయంత్రం వేళ
ఊరిబయట పిట్టలగుంపులలాగా
ఊరిదారిలో ఆలమందలలాగా
ఊరున్నదన్న చోటో అదేమిటో
జనం గుంపులుగా కనిపిస్తున్నారు.

హడావిడీయేం లేదు
అలాగని ఖాలీగాకూడా లేరు.
లోపటి వెలితిని నింపుకునేందుకో
కావాలసిన ఖాళిని ఏర్పరచుకునేందుకో
బడ్డికొట్లూ, టీస్టాళ్ళూ, పచారీలూ, పలకరింపులూ

రోజుఒకటేలా తిరిగే జీవితానికి
బోరుకొట్టకుండా,
అసలా విషయమే తెలియకుండా
సినిమా చర్చలూ, రాజకీయ రంగులూ
బుల్లితెరబాగోతాలూ సమయం మీద చల్లుతున్నారు వాళ్ళు.
నే టీతాగేందుకు ఆగినందుకు వాళ్ళను చూస్తున్నాను.

చుట్టరికపు పిలుపులూ, ఆత్మీయ స్పర్శలూ
అలికిడి తరంగాల్లా అక్కడక్కడే తరకలు కొడుతున్నాయి.
నెత్తిమీద మోసుకొచ్చిన బరువుల్ని
తలాకొంచెం పంచేస్తున్నారు.
నవ్వేదయితే మతాబులా మోహాల్లో వెలుగైచిమ్ముతోంది.
కన్నీటి తడయితే చుట్టుముట్టిన ఆత్మీయపు వేడికి ఆవిరవుతోంది.

‘‘ ఇకరావయ్యో, వంటయ్యింది ’’
ఎప్పటికప్పుడే రడీమేడ్ పచారి కొనే ఇల్లాలు
ముచ్చట్ల మధ్యలో మహారాజుకి అలికిడి చేసింది.
‘‘ ఎంకట్రాముడు కూడా వత్తన్నాడు ఇంకో గుడ్డు ఉడకెయ్’’
ఎముకలేని నాలుకని ఆవిడపై ఎగరేసాడు.
వినెళ్ళిందో, వినకుండానే వెళతాందో.
విళ్ళసలు చూడాల్సిన అవసరం లేనట్లు
టీకొట్టు కూర్చిలపై పట్టాదారు హక్కుల్ని కాపాడుకుంటున్నారు.

అబ్బో నేనసలే
బస్తీవాడిని ఇవ్వన్ని చూస్తు కూర్చున్నానేంటి.
తొందరగా ఇంట్లోదూరి టీవి పెట్టుకుని చూస్తూ
మరో పక్క ఫేస్ బుక్ చాటింగ్ చేయాలిగా.
ఇంటికి చేరుకునేందుకు వాహనం తొందరగానే
ఆ దృశ్యానికి దూరంచేస్తూ దూసుకెళ్ళేందుకు సిద్దమయ్యింది.

కవిసంగమం

from Blogger http://bit.ly/1iT3f58
via IFTTT

Standard
గల్పిక

లవ్ @ 420 ప్లస్

నాట్యం కూడా తెలిసిన ఒక అచ్చమైన బంజారా అందగత్తె, గోల్కొండకు 10 మైళ్ళ దూరంలోని చించలం అనే చిన్న గ్రామంలో వుండేది. మహమద్ కులీ కుతుబ్‌షా మనసుకు నచ్చిందామె. ఆమెను కలవాలని ప్రతిరోజూ ప్రాణాలకు తెగించి పరవళ్లు తొక్కుతున్న ముచుకుందా నదిని దాటుకుంటూ వెళ్ళేవాడు. యువరాజు విషయం తెలిసిన తండ్రి ఇబ్రహిం చాలా బాధపడ్డాడు. ప్రేమిస్తున్నందుకు కాదు. ప్రమాదకరంగా నదిదాటుతున్నందుకు. ఆ నదిపై వంతెన (1578లో ) కట్టించాడు  ఇది బాటసారికే కాదు ప్రేమకు కూడా వారధికావటంతో ఒక ప్యార్ కాపూల్, ప్యారానా పూల్ (ద లవింగ్ బ్రిడ్జ్) అయ్యింది.మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ  అత్యంత పురాతనమైనది కావటంతో తర్వాత అది పురానా పూల్ (పాత వంతెన) పేరుబడింది.  ఆమె సహచరిగా మారిన తర్వాత కూడా ఆ ప్రేమ తగ్గలేదు. ఆమె పేరుతోనే భాగ్ నగరంగా పేరుపెట్టాడు. బహుశా దేశంలోనే తొలిగా కావచ్చు ఆమెపై రాసిన తన ప్రేమ కవితలను ‘‘ ఖుల్లియత్ ’’ పేరుతో ఒక కవిత సంపుటిగా తీసుకొచ్చాడు. 

తర్వాత ఏంజరిగింది ?

ఆమె ముస్లింగా మారిందట భాగ్ నగరం మళ్ళీ హైదర్ మహల్ అయ్యింది. చించలం శాలిబండ అయ్యింది. 56 మీటర్ల

ఎత్తుతో నాలుగు(చార్) మీనార్లతో, 1591 లో ఛార్మినార్ పేరుతో నాలుగు రోడ్ల కూడలిలో ఒక సున్నపు కట్టడం నిర్మించాడు. ఈ కట్టడంలో ఒక్కో మినార్‌ ఎత్తు 30 మీటర్లు, వలయాకారంలో 148 మెట్లు అంతర్భాగంలో రెండవ అంతస్తులో మసీదు నిర్మాణం చేపట్టారు.. ఇందులో ఒకేసారి 240 మంది నమాజ్‌ చేసుకునే సౌకర్యంతో కంటికి ఇంపుగా హైదరాబాద్ అంటే ఈ కట్టడమే అనేలా నిలచిపోయేట్లు కట్టించాడు. చార్‌మినార్‌ని భాగమతికి ప్రేమ కానుకగా నిర్మించారని కొందరు, 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశా డు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడనీ మరికొందరు చెపుతున్నారు.

 ఏదేమైనా బాగమతి గురించి ఇంతకంటే తెలిసిందేమీ లేదు. అయితే ఆ ప్రేమ కథ తర్వాత ఈ ఫోర్ ట్వంటీ ఈయర్స్ పైగా నగరం రాజధానిగానే వుంటూ వస్తోంది. ఇటాలి యన్ యాత్రికుడు టావెర్నియర్ నుండి మొన్నీ మధ్యన వచ్చిన జీవవైవిధ్య శాస్త్రవేత్తల వరకూ ఎందరినో మంత్రముగ్ధుల్ని చేస్తూనే వుంది నగరం. చార్మినార్ మీద 4.12.1889 నాటి నుండీ ఆడుతున్న గడియారాల సాక్షిగా ముందుకు వెళుతూనే వుంది. భారత దేశము లో ఐదవ అతిపెద్ద మహానగరము. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మునిసిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో వుంటుంది. 1948లో హైదరాబాదు రాజ్యము, న్యూఢిల్లీ యొక్క సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారత దేశము లో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది. 

ఇసుకలో ఆడుకుంటున్న పిల్లలందరూ కలిసి తలో చెయ్యివేసి ఒకే కోట కట్టారు. పువ్వులతోనూ నవ్వులతోనూ అలంకరించారు. ఇప్పుడది ఎవరిదని కట్టబెట్టాలి మొదటి నుంచి కాలు పెట్టినవాడా, ఎక్కడెక్కడిదో ఇసుక చేరవేసిన వారా, దాన్ని పువ్వులతో, రంగురాళ్ళతో, ఆల్చిప్పలతో అలంకరించినవారా?

అమ్మ ఇంటిపనులు బాగా చేస్తోంది నా దగ్గరుంటుందంటే నాదగ్గరంటున్నారు పిల్లలు. సాయం కోసం దీనంగా చూస్తున్న అమ్మలెవరికీ వద్దా. రాష్ట్ర తలసరి ఆదాయంలో సింహ భాగాన్నిచ్చే నగరం. గ్లోబల్ ట్రేడ్ సెంటర్, మొత్తం అపురూపమైన వస్తువులనీ పాతపుస్తకంలో నెమలీకల్లా దాచుకున్న నగరం. మిగిలిన రాష్ట్రాలు ముక్కున వేలేసుకునేలా అభివృద్ధి చెందిన మానవ వనరులు వారి నైపుణ్యపు స్థాయిలూ. ఇప్పుడు భాగమతి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు నగరాన్ని, ఎన్ని రాజకీయ ముచుకుంద్ లు వురవళ్ళు తొక్కినా దాటుకుంటూ వస్తామంటున్నారు. రోమియో,జూలియట్, పార్వతీ, దేవదాసు, షాజహన్, ముంతాజ్ బేగం ల ప్రేమ కన్నా ఇది మరీ ముదురుగా వుంది

లక లక లక లకా…

from Blogger http://bit.ly/1kFh4Y1
via IFTTT

Standard
సమాచారం

మాటలు నేర్చిన సినిమా : భక్త ప్రహ్లద ఎప్పుడు రిలీజయ్యింది?

మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’. తెలుగు నాట టాకీ వేళ్లూనుకోవడానికి ఈ సినిమానే శ్రీకారం చుట్టింది. అందుకే ఈ చిత్రం విడుదలైన రోజుని తెలుగు సినీ ప్రియులందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. నిన్న మొన్నటివరకూ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందనే అనుకున్నారు. అయితే సీనియర్ పాత్రికేయుడు రెంటాల జయదేవ నాలుగేళ్లు శ్రమించి, ఎంతగానో పరిశోధించి విడుదల తేదీపై వాస్తవ చరిత్రను వెలికి తీశారు. ఆయన పరిశోధన ప్రకారం తెలుగు సినిమా అసలు సిసలు పుట్టినరోజు 1932 ఫిబ్రవరి 6. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సంపాదించారు. మొత్తం 9,762 అడుగుల నిడివి గల పది రీళ్ల ‘భక్తప్రహ్లాద’ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది.ఆ సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్-11032. ‘తొలి 100% తెలుగు టాకీ’గా సగర్వంగా ప్రకటించుకున్న ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో తొలుత విడుదలైంది. ఆ లెక్క ప్రకారం ఈ సినిమాకు నేటికి 82 ఏళ్లు నిండాయి. అప్పటి వరకూ సినిమా అంటే బొమ్మలు కదులుతాయి కానీ మాటలేమీ వినబడని స్థితినుంచి హిందిలో తొలి టాకీ అర్దేషిర్‌ ఇరానీ ‘‘అలం ఆరా’’ తర్వాత తెలుగులో దీన్ని నిర్మించారు. Continue reading

Standard