telugu poetry

దాహంపై వ్యాపారం

దాహాన్ని కూడా వ్యాపారంగా పిండుకుంటుంటే
దేశమిలానే ఎండిపోతుంది.
దేహాన్ని కూడా వాణిజ్యంలో రంగరిస్తుంటే
దోషమంతటా నిండిపోతుంది.

స్వంతజేబులే సమస్తమయితే
చొక్కా దొరకని కథొకటుంటుంది
చిక్కుముడులల్లుకుంటూ కూచుంటే
చిక్కుకుని విలవిల్లాడే రోజొస్తుంది.

హ్రస్వదృష్టితో పరిగెడితే
దురదృష్టం చూడకముందే గద్దుకుంటుంది.
నాలుగు కాలాలు నిలబడాలంటే
చీమకథ తెలిస్తేనే చాలదు.
చేవ చేతల్లోకి దిగబడాలి.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/562992153753541/

Standard
telugu poetry

బీజాంకురం

ఏదో భావం స్పురించేసమయానికి
లక్షల అక్షరాలు విడివిడిగా పడుంటాయి ఆ గదిలో,
ఒక్కోక్కటే ఏరుకుని
కొంచెం అర్ధమనే మైనాన్ని పూసి పదాలుగా పేరుస్తాను. పదాల జిగ్ సా ఫజిల్ ను రకరకాలుగా పేర్చుకుంటూ మార్చుకుంటూ
క్రమాన్ని గుచ్చుకుంటూ వాక్యాన్ని దండ కడతాను.

వాక్యాలను భావంలో మగ్గబెట్టి ఓ ద్రావకాన్ని కాస్తాను.
వేడిచేసి, ఆవిరి చేసి మరింత చిక్కగా మొలాసిన్ తీస్తాను.
ఈ అమృతాన్ని చల్లేద్దామని
ఉరుక్కుంటూ పొలానికొస్తే,
‘‘ ఓరి మూర్ఖుడా ముందు పొలంలో విత్తనాలు చల్లాలి’’
వెనకనుంచి నాన్న కేకలేస్తున్నాడు.

మరింకేం చల్లుదాం పట్టు మొండిగా నేనంటాను
‘‘కొంచెం తడితగలాలి, పదును దిగి చీల్చితే గుల్లబారాలి.
తర్వాతే విత్తనానికి చోటు సిద్దమవుతుంది’’
విసుగేమీ కనపడలేదు నాన్న చెపుతున్నపుడు.
క్రమత్వాలు తెలియకనే
ప్రవాహంలో కలిపేవి వ్యర్ధాలుగా కొట్టుకుపోతున్నాయి.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/560630977322992/

Standard
telugu poetry

నందనుడు

కళ్ళముందు ఒక ఆశ్చర్యం తనే స్వయంగా భుజాలపై చేతులేసి నిలుచుంటే,
తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది.
బాల్యం వాసనలు వీడని ఓ కలం నుంచి,
అమృతం కురుస్తుంటే తడిసే మనసుకు తట్టేదేమీ వుండదు.
నందూ ఒక ఆప్యాయతల సమీరం.
నందూ పదాలతో నిండిన ఓ నిఘంటువు.
ప్రవహించినా లయతప్పని బావ ప్రవాహం.
యాసలోకి వెళ్లినా,భాషని చిత్రిక పట్టినా తప్పటడుగు లేని నిర్భీతినడక.
ఓక్క అవకాశం తలుపు తడితే బావుండు మూసుకున్న జీవితానికి వెలుతురు తగిలేందుకు
తలే లేని తనాలకు కిరీటాలు తొడిగే ఈ రోజుల్లో
తలెత్తుకునే తిరిగే ఆధారం అందింతే బావుండు.
ఒక సానబట్టని వజ్రం ముడిపదార్ధంగానే మిగలకుండా సమాజపు ఒడిలో చేరితే బావుండు.
ట్రావెన్ కోర్ సంపదలు ముందుగానే కనిపించాయి.
ప్రపంచానికి అలారం మోగితే ఆరోగదికి తాళమేసేస్తారేమో
పిట్టకు రెక్కలొస్తే నాక్కూడా దూరంగా ఎగిరిపోతుందేమో మిణుకు మిణుకు మంటుంది భయం.
అయినా పిట్టలెప్పుడూ అనంతమైన ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిందే అన్న
నిశ్చయం ముందు అదిదిగదుడుపే.
తెలుగుకీ, తెగువకీ, తెలివికీ తలమానికమవ్వాలని కోరుకుంటూ…


Standard
తత్వం, వివరణ

మౌనమా ? నిశ్శబ్దమా ??

గతం లో జరిగిన ఫేస్ బుక్ లో నావాల్ పై జరిగిన  చర్చకు నావివరణ కూడా ఇద్దామనే ఉద్దేశ్యంతో రాసిందే ఇది

చలనమంటూ లేకుంటే ప్రపంచమే లేదు.

శబ్దం పుట్టాలంటే ప్రకంపన స్థితిలోకి ఒక వస్తువు మారాలి. ఆ వస్తువు గాలిలో కలిగించే సంపీడనాలూ, విరళీకరణలూ చెవికి చేరగా తెలుస్తున్న స్పందనను శబ్ధం అంటున్నాం.( Vibrations that travel through the air or another medium and can be heard when they reach a person’s or animal’s ear.)

స్వరపేటికలోపలి కంపనాల నుండి పుట్టే శబ్దాలు బావప్రసరణకు వినియోగ పడితే వాటిని మాటలంటున్నాం. స్వరపేటికనుండే వెలువడినా సరే ప్రతిశబ్ధం మాట కాదు. 

► అంటే మాటలన్నీ శబ్దాలే కానీ శబ్దాలన్నీ మాటలు కాదు.

మాటలు లేవీ ప్రయత్నపూర్వకంగా వెలువరచకపోతే మౌనం అంటున్నాం. మాటలేవీ వెలువరచటం లేదు అనేందుకూ మౌనంగా వున్నారు. మౌనాన్ని ఆశ్రయించారు అనిచెపుతున్నాం. ఇక్కడ నిశ్శబ్దంగా వున్నారు అన్నా తప్పులేదు. అందుకే సినిమా హాళ్ళలో నిశ్శబ్ధాన్ని పాటించండి(వుండండి కాదు) అంటుంటారు. మీరు మాట్లాడకుండా వుండటమే కాదు మరేవిధమైన శబ్దంకూడా కానివ్వకండి అని చెప్పకనే చెప్పినట్లవుతోంది.

చుట్టూ గందరగోళంగా శబ్దాలున్నా వాటి మద్య ఎవరన్నా మాట్లాడకుండా కూర్చుంటే వారు మౌనంగా వున్నారంటాము కానీ అక్కడ నిశ్శబ్దంగా వుందని అనం. వస్తువులనుండి శబ్దం రాకుండా నిశ్చలంగా వుంటే మౌనంగా వున్నాయని అనం.అక్కడి వాతా వరణం నిశ్శబ్దంగా వుందనే అంటాం.

ఇంగ్లీషు భాషలోని పదాలతో వీటిని అర్ధంచేసుకోవాలంటే కొన్నిపదాలను చూద్దాం
hush – quiet – still – quietness – calm – stillness – hush – shush – shut up –
quiet – tranquil – still – placid – serene – peaceful – – calmness – quietness – tranquillity – serenity – pacify – appease – soothe – lull – quieten.

నాకయితే ఈరెండింటి మధ్య తేడా బాగానే తెలుస్తున్నట్లుగా నే వుంది . నేను వాడిన మాటలు మీకు ఆభావాన్ని సరిగా చేరవేసేలా ఎన్నుకున్నానో లేదో కానీ. ఏ ప్రతిపాదన మీద ప్రశ్నవున్నా, మీ వైపునుంచి మరికొంత సవరణ, వివరణ పూరణ వున్నా దయచేసి శబ్దంగా వుండండి. స్ధబ్దంగా వద్దు.

కవిసమయాలలో భాషచేరవేయలేని చాలాభావాలను మౌనం చేరవేస్తుందని కవులు రాస్తుంటారు. భాష నిజానికి శబ్దంతోనో, సంకేతాలతోనో మాత్రమే ఏర్పడి లేదు. దానిలో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కూడా ఒక భాగమే చిరునవ్వు కావచ్చు, దయాపూరిత చూపులు కావచ్చు, ప్రేమగా దగ్గరకు తీసుకున్న ఒక హగ్ కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు ఇవ్వన్నీ కూడా కొన్ని భావాలను చేరవేస్తాయి. భాషలో చెప్పలేని అనుభూతులను కూడా భాషలో పదాలకందని అభినివేశాలను కూడా నాన్ వెర్బల్ ఒక్కోసారిచేరవే
స్తుంది. అందుకే మౌనం మిన్న అనుంటారు. ప్రతిదానికీ దాని శక్తి వుంటుంది. పరిమితీ వుంటుంది వాటిని ఎంతబాగా తెలుసుకుంటుంటే అంతబాగా వినియోగించుకోగలుగుతాము.

Standard
telugu poetry

ప్రయత్న వైరాగ్యం

విరామంలో మగ్గే నిశ్శబ్దం కంటే
నిండుదనం కోసం పొదగబడే మౌనమే మేలు
వేచివుంటూ గడిపినా కాలం కాలి పోతుంటుంది.
కదలికలే ఆగిపోతే ఎదురుచూపులేగా మిగిలేది.
పూర్ణత్వానికి పుల్ స్టాప్ వుండదని తెలిస్తే చాలు
పని పూర్తవ్వక పోయినా ప్రయత్నం నాన్ స్టాప్ గా పరిగెడుతుంది.

Standard
telugu poetry

బ్రాండ్ ఇమేజ్

నిన్నే నువ్వు బ్రాడింగ్ చేసుకోవడం అంటే
ప్రపంచానికి నీ పటాన్ని ఆడించే దారాన్నివ్వడం.
కొలతలకందే నిర్మాణంగా నిలువెత్తు నిరూపణనివ్వడం
అడవిలా విశాలమై, విస్తృతంగా విస్తరించుకుంటే మార్కులుండవు
అద్దాల మధ్య మరుగుజ్జు వృక్షాలపై ఆపేక్షలకూ అంతూ వుండదు.
నేటి నవీన సౌందర్యశాస్త్ర నిర్వచనాలకు అదే చెపుతున్నాయి మరి.
ఉద్యాన వనాలను హత్తుకునే వేళ చిట్టడివిగా మారి చిరాకు పరచకు.
ఆలోచనలకు సైతం పెళుసుగా చిట్లే చట్రాల గుండా సాగే పయనం చేస్తున్నాం

తల్లిపాలతో ఎదిగిన బిడ్డలా,
కొమ్మ ఒడినుండీ పండువై పలకరించాలని చూడకు.
రంగులేబుళ్ళ గందరగోళం లేనిదే పంటికేమాత్రం రుచించవు.
శవాల గుట్టా సద్దిపెట్టెల మాటున రసాయన సెగల ధూపం తాకనదే
నీకసలు రూపమే పిండంలో ప్రాణంపోసుకోలేదంటున్నారు.
కొన్ని ప్లేవర్స్ ఇప్పటకే ఇల్లుకట్టుకున్నాయి.
వాటిని చల్లుకోకుండానే చెల్లుబాటవుదామని చూడకు.

నదివై ప్రవహిస్తూ నాలుకలను తాకాలనుకోకు,
రుచిమొగ్గల చివర్లుకూడా స్పృశించేందుకు సంకోచిస్తాయి.
ఒదిగుంటే వ్యర్ద ద్రవానివైనా, సీసాల ఆవాసం నుంచీ పలకరిస్తేనే
గొంతులోకి ఒంపుకుంటామంటున్నారు.
బిరుసుదనం నీ తలలో వుంటే తగ్గించుకో,
పాత్రలలో ఒదిగిపోతేనే పరిశీలిస్తారట జనం

మట్టిగొళానిదేముందని చుట్టూ ఆక్రమించి
గొలుసులేవీ అంటుకోలేని గాలి జీవితం గడుపుతున్నావా ?
లోహ కచ్చడాల మద్యనుంచీ రబ్బరు ద్వారాలలోకి ప్రవహిస్తేనే
ఆబగా హత్తుకుంటారనే నిజాన్ని మరపులోకి పోనీయకు.
వెన్నుముక నిటారుగానే వుండాలని మొండిపట్టుదలలకు పోకు
మడిచుకుని విపణిలోకెళ్లే మార్గం మూసుకుపోతుంది.

విశ్వవిస్తరించేది కృష్ణబిలాలుగా మారేందుకే అన్నట్లు
స్వార్ధం విస్తృతమయ్యేది తృష్ణజలాలతో తడిసేందుకే.
సాంద్రత స్థాయిదాటితే వెన్వెంటనే మరో మహా విస్పోటనం
స్వార్ధం హద్దుమీరితే ఒంటరి పయనపు విరళీకరణం.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/557571620962261/

Standard
telugu poetry

సంవత్సరానికి ఒక్కరోజు పాటకావద్దు

కొకిల మొన్న వసంతానికి ఓసారోచ్చి కూసిపోయింది.
చింత చిగురు నిన్నటి వరకూ పలకరిస్తూనే వుంది.

 పండుగలలా ఓసారి మొరిసి
గుండెను ఒక్కరోజన్నా తట్టమంటున్నాయి.

గూగుల్ ఇమేజెస్ ని గాలించాను
అమ్మ కాన్సెప్ట్ మీద అందమైన పోటోలకోసం

యూట్యూబ్ లో హైరేటింగ్ విడియోలు వెతికాను.
మనసుకు హత్తుకునే దృశ్యాలున్నాయేమో నని,

క్లౌడ్ స్లోరేజిని కుదిపి చూసాను, హర్డ్డ్ డిస్కంతా వెతుకులాడాను.
కొంచెం కదిలించే ఓ మంచి విషయం దొరకాలని,

మిత్రుల అప్డేట్స్ అన్నీ చూస్తున్నాను,
కొన్ని కనెక్టవుతున్నట్లున్నాయి.

చివరికి హర్ట్ డిస్క్ సరిచేసుకుని,
ముందు రెండు లెన్సులు తెరుచుకుంటే
కనిపించింది.
ఏమీ కోరుకోకుండానే అన్నీ యిచ్చిన తనం
అన్నీతానై ఇంకా నావెనకే నిలుచున్న తను

మీతో పంచుకునేందుకు
అక్షరాలుగా ఏమీ మిగల్లేదు.
ఇది నా కళ్ళలోని తడి అంతే.

► 12-05-2013

Standard