telugu poetry

బొమ్మలాట

శ్రద్దలేనితనం చెరబట్టి చంపేస్తున్నారా ?

అభిమానం నిర్లక్ష్యంగా చెదబట్టి చనిపోతున్నారా ??

ఏదేమైనా ఒక్కసారి చేజారాక తిరిగిరానిదే పోయింది.

కొడగడ్డిన దీపాన్ని గొప్పవైన నక్షత్రాలు వెలిగించలేవు.

గుడిసెలో అన్నంముద్దను అందరాని పుంగరాల వేళ్లు తినిపించలేవు.

ఎవరేమన్నా తెరమీదిబొమ్మ నిజజీవితాన్ని దోచింది

ఇక ఫ్యానుకే ఊపిరాడక పోతే

ఉక్కిరిబిక్కిరయ్యేది ఎవరో తెలిస్తే చాలు.

బాదుషాలు మదిలో పాతుకున్నా

విషాదాల చీకట్లని తొలగించే ఆయుధమే లేదు

నాజండా కర్రమాత్రం వుంది.

నీ సమాధి మెట్టెక్కి ఎగరేసేందుకు.

కొన్ని నోట్ల కట్టలున్నయి.

తెరుచుకున్న నోళ్ళకు ఎరవేసేందుకు.

మరణానంతర జ్ఞానమంటూ వుంటే

తరవాతి వాళ్ళకైనా చెప్పు

ఈ రంగులెంట పరుగెత్తొద్దని.

కాలినకడుపుకు బర్నాల్ లేదు.

వెలిగే చితులకు టర్నింగ్ రాదు.

Standard
తత్వం

దేవుడు కనిపిస్తాడా ?

దీనిపై మన సాధారణ చర్చలకంటే చాలా లోతైన, శాస్త్రబద్దమైన చర్చే జరిగినట్లు ఉపనిషద్ సారాలలో తెలుస్తోంది.
కేనోపనిషత్తు ద్వితీయఖండంలో శిష్యుని ప్రశ్నకు సమాధానంగా గురువు చెప్పిన బ్రహ్మసాక్షాత్కార రహస్యం ఇలా వుంది.

అస్య బ్రహ్మణ: యద్ రూపం(తత్)
త్వం సువేదేతి యది మన్యసే
నూనం దభ్రమేవ వేత్థ. అథను దేవేషు
అస్య యద్ (రూపం) విదితం తదపి త్వం నున్యసే
సువేదేతి తే మీమాంస్యమేవ మన్యే

(పదపదార్ధాన్ని కాదు కానీ విశ్లేషణ ఏమిచ్చారో కొంచెం వివరణాత్మకంగా చూస్తే)
ప్రత్యక్షం కావడం అంటే సినిమాల్లో ఎన్టీవోడు డింగ్ మని కెమేరా ముందుకొచ్చి ‘ భక్తా ఏమి నీ కోరిక’ అని అడగటం కాదు. లేకపోతే ‘నరుడా ఓ నరుడా ఏమి కోరికా ’అని గంతులేయడమూ కాదు.
ఇంద్రియాల ద్వారా తెలియటం లో ఆలోచిస్తే రూపం మాత్రమే కంటికి కనిపిస్తుంది. మీకు తీపిని తెలుసుకున్నారా? అని అడిగితే అవును నా కంటికి కనిపించింది అని చెప్పరు. దానిని గుర్తించే సాధనానికి తెలియాల్సిన పద్దతిలో తెలిసిందో లేదో చూస్తారు. అంటే తీపి తెలియటం అంటే నాలుకకు ప్రత్యక్షం గా తాకించటం ద్వారా తెలియడమే కదా. అలాగే చక్కటి సంగీతమో, వీనుల విందైనా శబ్దమో మీకు తెలిసిందా? అంటే అది కూడా కళ్ళముందు కదలాడటం కాదు. నునుపో చల్లదనమో తెలియడం అంటే అదికూడా మరేదో ఇంద్రియ గోచరం కావడమే కానీ కేవలం కంటికి సంభందించిన గొడవ మాత్రమే కాదు. ఇది ఇంద్రియాలకు తెలియటం గొడవ.

ఇక పోతే రేడియో తరంగాలు వున్నాయని మీరెరుగుదురా? అంటే సమాధానం చెప్పేందుకు ఇంద్రియసామర్ధ్యం మాత్రమే సరిపోదు ఇంద్రియానికి అతీతమైన రేడియో తరంగాలు, పరారుణ కిరణాలు ( Infra Red), అతినీలలోహిత కిరణాలు ( Ultra violet) లాంటి వాటిని గుర్తెరగాలంటే మరేదో సాధనం సహాయాన్ని తీసుకుని ఇంద్రియాల శక్తికి అందేలా చేసుకుని గుర్తిస్తున్నాం.

కరుణ,ప్రేమ, వాత్సల్యం లాంటి అభౌతికాంశాలను, అబ్ స్ట్రాక్ట్ అంశాలనూ మనో విశ్లేషణలతో గర్తించామని చెపుతున్నాం. ఏదో సినిమాలో బ్రహ్మనందం అడిగినట్లు ‘‘ ఏదే నా మీద ప్రేమను చూపించు, ఇప్పుడు చూపించు ’’ అని రోడ్డు మీద వీరంగం ఆడితే గబుక్కున జేబులోంచో, సంచీలోంచో తీసి దడాలున చూపించేది కూడా కాదు.

మరి భగవంతుడు / సృష్టికర్త / సృష్టికారకుడు / ఇంకా… వగైరా వగైరా వున్నాడనో (నిశ్చయం), వున్నాడేమోననో ( అనుమానం), ఖచ్చితంగా లేడనో అనుకోవాలంటే ఏం తెలియాలి ??

ఏ లక్షణము లేదా ధర్మము ద్యారా తనని గుర్తించే వీలుందో ఆ లక్షణాన్ని గుర్తించటమే తన రూపాన్ని తెలుసుకోవటం అని చెపుతుంది. పై సమాధానం అతడు ఇంద్రియాలకు అలభ్యుడని (కేవలం మహద్ వాచకంగా సౌలభ్యం కోసం వాడుతున్నాను) ఇతర సాధనాలకు దొరకడనీ చెపుతున్నారు.

డామిట్ మాకు అర్ధం కానిదే మేం గుర్తించం. కుదిరితే ప్రెండ్ రిక్వెస్ట్ పంపమనండి చాట్ చేసి తేల్చుకుంటాం. ఫేక్ ఐడీ నో ఒరిజినలో నని అంతే దట్సాల్..
Standard
Uncategorized

పెనవేసుకుంటున్నాయో, మెలిపెడుతున్నాయో మరిన్ని అంకెలు.

చిన్నప్పుడు వీడు నా మొదటోడని నాన్న చెపతే

నేనే నంబర్ వన్నేమోనని సంబరపడ్డాను.

కానీ నాకో అంకె కేటాయించబడిందని అప్పుడర్ధం కాలేదు.

నిన్నరాత్రి అంకెల పాము వంటినిండా చుట్టుకు పోతున్నాట్లు కలేనేమో వచ్చింది.

అంకెల తేనేటీగలు తలచుట్టూ గయ్యిమని గిరికీలు కొడుతున్నట్లేవుంది.

ఆర్ధికసంవత్పరం చివర్లో నేను పాన్ కార్డునంబరయిపోతున్నాను.

సంవత్సరపు బ్యాంకు నంబరునుండీ, అంకెలనుండీ సంఖ్యలనుండీ సంకెళ్లను వేసుకుంటూ.

గరళకంఠుని మొడలో నాగరాజులా ఎప్పుడూ నా కంఠానికై చుట్టుకునే ఓ పదంకెల నంబరు నాకీరోజు పేరుబదులు కేటాయించిన ప్రదేశమయ్యింది వాటెన్ ఐడియా సర్ జీ.

మల్బరీపైనకూడా ఈ నంబర్లలా పురుగులు కూడా పాకవేమో.

సినిమాకో, బస్సులోకో, ట్రైనో,మరోటో కావాలనివెళితే నాకు అక్కడ కేటాయించిన ఓ అంకె మళ్లీ మళ్లీ జపిస్తూ తరిస్తుంటాను.

ఏ కార్యలయంలో వేచివున్నా చేతిలోని నంబరు తెరపై మెరిసేవరకూ మేరా నంబరు ఆయేగా అని ఊపిరితో పాటు అన్నీ బిగబట్టి ఆశగా ఎదురు చూస్తుంటా.

ఇకఇప్పుడు ఆధారంట ఈ నంబరు మరికొన్ని నంబర్లతో అంటుకట్టాలంట.

అబ్బా దేవుడా నీవు గనుకా వుంటే త్వరగా వచ్చి బయోమిట్రిక్ ఇచ్చేసి వెళ్లిపో

లేకుంటే నీ ఉనికికీ ప్రమాదమే సుమా.

Standard
telugu poetry

మధ్యవర్తి మద హాసం.

నేను రూపాయికి వందపైసలన్నాను.
వాడెవడో కాదు అవి యనభైయ్యేనని వాదనకోచ్చాడు.
బుద్దితక్కువై ఓ మధ్యవర్తిదగ్గర మోకరిల్లాము.
అనవసరపు అజ్ఞానాన్ని మోకాళ్లముందు గుమ్మరించాం.
ఏందుకోయ్ అనవసరపు వాదనా వేదనలు.
‘‘ తొంబై పైసలదగ్గర స్థిరం చేసుకోండి’’ పోమ్మని ఓ మందహాసం చేసాడు.

(ఇంకావుంటుంది….. రాస్తే)

Standard